తిరుమల లడ్డూ: ‘కల్తీ చేసిన నెయ్యి’లో ఏమేం కలిపారు? దర్యాప్తులో సీబీఐ సిట్ ఏం తేల్చింది?

- రచయిత, అల్లు సూరిబాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో, దర్యాప్తు చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జనవరి 22న తుది చార్జిషీట్‌ను నెల్లూరులోని ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది.
ఆ చార్జిషీట్ ప్రకారం.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో 'వెజిటబుల్ ఆయిల్' కల్తీ జరిగిందని, నాణ్యతా పరీక్షల్లో అది బయటపడకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలను కలిపారని దర్యాప్తులో సిట్ గుర్తించింది.
జంతువుల కొవ్వు, చేప నూనె వంటివి ఉండే అవకాశాలు దాదాపు లేవని ల్యాబ్ నివేదికలను పేర్కొంటూ సిట్ అందులో ప్రస్తావించింది.
2019 నుంచి 2024 మధ్యకాలంలో నెయ్యి కల్తీ ద్వారా రూ.234 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడినట్లు పేర్కొంటూ, అందుకు బాధ్యులుగా కొందరు వ్యక్తులు, సంస్థలు కలిపి మొత్తం 36 మందిపై పలు కేసులు నమోదుచేసింది సిట్.


ఫొటో సోర్స్, RAJESH
ల్యాబ్ పరీక్షల్లో ఏం తేలిందంటే..
తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీపై వివాదాల నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక విచారణ బృందం(సిట్) దర్యాప్తు పూర్తి చేసింది.
చార్జిషీట్‌ను జనవరి 22వ తేదీన నెల్లూరులోని ఏసీబీ కేసుల స్పెషల్ జడ్జి కోర్టులో సమర్పించింది.
ఈ చార్జిషీట్‌లో పేర్కొన్న నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్(ఎన్‌డీడీబీ) నివేదిక ప్రకారం... ‘ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన నాలుగు ట్యాంకర్ల నుంచి తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) సేకరించిన నెయ్యి నమూనాలను పరీక్షలు, విశ్లేషణ కోసం గుజరాత్ రాష్ట్రం, ఆనంద్‌లోని 'నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు చెందిన సెంటర్ ఫర్ అనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (ఎన్‌డీడీబీ సీఏఎల్ఎఫ్)కు పంపించారు.
ఆ సంస్థ 2025 మార్చి 27న నివేదిక ఇచ్చింది.
ఆ నివేదిక ప్రకారం...
‘నమూనాలలో బ్యూటోరిక్ యాసిడ్ స్థాయి ఉండాల్సిన కన్నా తక్కువగా ఉండటం, కొలెస్ట్రాల్ అస్సలు కనిపించకపోవడాన్ని బట్టి అసలైన నెయ్యి శాతం తక్కువగా ఉందని నిర్ధరణ అయింది.
ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్, ఈ నెయ్యి నమూనాలలో బీటా సిటోస్టెరాల్ ఉండటాన్ని బట్టి అవి కొబ్బరినూనె, పామాయిల్ లేదా పామ్‌స్టెరిన్‌తో కూడిన పామ్ కెర్నల్ ఆయిల్ మిశ్రమాలతో కల్తీ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాలకు అనుగుణంగా ఆర్ఎం విలువను సరిచేయడానికి కొన్ని రసాయనాలను కలిపారని గుర్తించారు.
నెయ్యి నమూనాల ఫ్యాటీ యాసిడ్ విశ్లేషణ, ట్రైగ్లిజరైడ్స్ తాలూకా జీసీ క్రోమాటోగ్రామ్‌లలో పీక్స్ కనిపించడం బట్టి టాలో, లార్డ్ వంటి జంతువుల కొవ్వులు, చేపనూనె ఉండే అవకాశాలు చాలా అరుదుగా ఉన్నాయి’ అని ఆ నివేదికలో ఉంది.
అలాగే పంది కొవ్వు (లార్డ్), ఇతర జంతువుల కొవ్వుల ఉనికి ఏమైనా ఉందో పరీక్షించడానికి నెయ్యి నమూనాలను హరియాణా రాష్ట్రంలోని కర్నాల్‌లో ఉన్న ఐసీఏఆర్-ఎన్‌డీఆర్‌ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)కి పంపించారు.
పీసీఆర్ ఆధారిత పద్ధతిలో నమూనాలను విశ్లేషించిన ఆ సంస్థ 2025 మే 16న నివేదిక ఇచ్చింది.
ఆ నివేదిక ప్రకారం... ఈ పరీక్షలో లిమిట్ ఆఫ్ డిటెక్షన్ (ఎల్వోడీ) 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ నెయ్యి నమూనాలలో లార్డ్ ఉన్నట్లు కనిపించలేదు.

ఫొటో సోర్స్, Sridhr Raju
కల్తీ వెనుక ఎవరెవరున్నారంటే..
దర్యాప్తులో తేలిన వివరాలను సీబీఐ సిట్ చార్జిషీట్‌లో వెల్లడించింది. ఆ చార్జిషీట్ ప్రకారం...
‘ఉత్తరప్రదేశ్‌లోని భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పోమిల్ జైన్, విపిన్ జైన్, సారికా జైన్, పూనమ్ జైన్ ఈ కేసులో ప్రధాన నిందితులు. వారు ఫేక్ అగ్‌మార్క్‌తో నెయ్యి కల్తీ చేసి, టీటీడీకి 2019 నుంచి 2024 మధ్యకాలంలో సరఫరా చేయడానికి కుట్రకు పాల్పడ్డారు.
వారు పాలు, వెన్నను సేకరించకుండానే నెయ్యిని కల్తీ చేసే ఉద్దేశంతో తమ సంస్థలైన హర్ష్ ట్రేడింగ్ కంపెనీ, హర్ష్ ఫ్రెష్ డెయిరీ ఫుడ్స్ లిమిటెడ్ ద్వారా కోల్‌కతాలోని కొన్ని సంస్థల నుంచి రిఫైన్డ్ పామ్ కెర్నల్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్‌ను కొనుగోలు చేశారు. అలాగే ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, మోనోగ్లిజరైడ్స్ వంటి రసాయనాలను, బీటా కెరోటిన్, నెయ్యి ఫ్లేవర్‌ను సేకరించారు.
తమ కీలక ఉద్యోగులైన హరిమోహన్ రాణా, సంజయ్ చౌహాన్, ఆశిష్ రోహిలాలతో కలిసి భగవాన్‌పూర్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కల్తీ నెయ్యిని సిద్ధం చేశారు.
రిఫైన్డ్ పామ్ కెర్నల్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ కలిపిన ఆ నెయ్యికి సంబంధించి ల్యాబ్ పరీక్షల్లో కల్తీ గుట్టు రట్టుగాకుండా విలువలను సరిచేయడానికి, నెయ్యి సువాసన వచ్చేలా చేయడానికి బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ వంటి రసాయనాలను కలిపారు.
తమ సంస్థలకు టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొనే అర్హత లేనప్పటికీ, కల్తీ నెయ్యి సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రధాన నిందితులైన పోమిల్ జైన్, విపిన్ జైన్, సారికా జైన్, పూనమ్ జైన్ తప్పుడు పత్రాలతో టెండర్లలో పాల్గొన్నట్లు నిర్ధరణ అయ్యింది.
శ్రీవైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ సంస్థ సీఈవో అపూర్వ చావ్డా, శ్రీవైష్ణవి డెయిరీ డైరెక్టర్ రాజేష్ మన్సుఖ్‌లాల్ చావ్డా, మల్లంగా ఆగ్రో ఫుడ్స్ సంస్థ డైరెక్టర్ మచింద్ర శాంతారామ్ లంకే, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్‌లతో కలిసి వారు ఈ క్రిమినల్ కుట్ర పన్నారు.
ఈ కల్తీ నెయ్యి టీటీడీ ల్యాబ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు చూపించడానికి రవీందర్ శర్మ అనే మరో నిందితుడు ఫోర్జరీ చేసిన ల్యాబ్ నివేదికలను సృష్టించారు.
టీటీడీకి చెందిన ప్లాంట్ తనిఖీ బృందంలో సభ్యులైన పేరూరు జగదీశ్వరరెడ్డి, ఆర్ఎస్ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం, పి.మురళీకృష్ణలకు ఈ కుట్రతో సంబంధం ఉన్నట్లు నిర్ధరణ అయింది.
ఈ ప్లాంట్ తనిఖీ బృందంలోనే సభ్యులైన డెయిరీ నిపుణులు డాక్టర్ కసిరెడ్డి హరనాథ్‌రెడ్డి, డాక్టర్ మల్లం మహేందర్, డాక్టర్ వి.వెంకటసుబ్రహ్మణ్యన్, ఎం.విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ కులకర్ణి జయరాజ్ రావు ఉద్దేశపూర్వకంగానే భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీవైష్ణవి డెయిరీ, మల్లంగా ఆగ్రో ఫుడ్స్, ఏఆర్ డెయిర్ ఫుడ్స్ సంస్థల డెయిరీ ప్లాంట్లను సరిగ్గా తనిఖీ చేయలేదు.
టీటీడీకి ఆవు నెయ్యి సరఫరా చేసే అర్హత ఆయా సంస్థలకు లేదని తెలిసినప్పటికీ, వాటికి అనుకూలంగా తనిఖీ నివేదికలను ఇచ్చారు. అందుకుగాను పోమిల్ జైన్ నుంచి అక్రమంగా లబ్ది పొందారు.
జూనియర్ అసిస్టెంట్ పల్లి ఈశ్వర్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ముద్దు వెంకట అనిల్ కుమార్, డిప్యూటీ ఈవో (రిటైర్డ్) పోలేపల్లి వెంకట నటేష్ బాబులు కూడా పోమిల్ జైన్ నుంచి కమీషన్ ఏజెంట్ పీపీ శ్రీనివాసన్ ద్వారా ప్రయోజనాలు పాందారు. అందుకు ప్రతిఫలంగా కల్తీ నెయ్యిని అంగీకరిస్తూ, అన్‌లోడ్ చేస్తూ, బిల్లులు పంపిస్తూ వారికి సహకరించారు.
ఇలా అర్హతలేని డెయిరీలు అధికారుల సహకారంతో టీటీడీ నెయ్యి టెండర్ల ఫైనాన్సియల్ బిడ్‌లో పాల్గొని, సప్లై ఆర్డర్లు సంపాదించాయి. టీటీడీతో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధంగా భోలేబాబా ఆర్గానిక్ డెయిరీలో తయారైన కల్తీ నెయ్యిని 'అగ్‌మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి' పేరుతో సరఫరా చేశాయి.
2019 నుంచి 2024 మధ్యకాలంలో ఈ డెయిరీలు దాదాపు 59,71,781 కిలోల నెయ్యి సరఫరా చేశాయి. సుమారు రూ.234 కోట్లు (రూ.234,51,32,625) మేర టీటీడీ నిధులను అక్రమంగా కాజేశాయి.
ఈ కల్తీ నెయ్యిని టీటీడీలో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి ఉపయోగించడం వల్ల కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి’ అని సీబీఐ సిట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, FACEBOOK
‘ఈ కేసులో 24వ నిందితుడిగా ఉన్న కడూరు చిన్నప్పన్న వాస్తవానికి ఏపీ భవన్ ఉద్యోగి. ఆయన అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి పీఏగా వ్యవహరించారు. ఆ సమయంలో నెయ్యి టెండర్ల సహా టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు’ అని సీబీఐ సిట్ చార్జిషీట్‌లో పేర్కొంది.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ‘టీటీడీకి సరఫరా చేసే నెయ్యిపై కిలోకు రూ.25 చొప్పున కమీషన్ ఇవ్వాలని చిన్నప్పన్న తన అధికార హోదాను ఉపయోగించుకొని పోమిల్ జైన్‌ను డిమాండు చేశారు.
అందుకు పోమిల్ జైన్ నిరాకరించడంతో, అప్పటి ప్రొక్యూర్‌మెంట్ జీఎం ఆర్ఎస్ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యంను ప్రభావితం చేసి, డెయిరీ ప్లాంట్ తనిఖీ సమయంలో భోలే బాబా ఆర్గానికి డెయిరీ బిడ్‌ను అనర్హమైందిగా ప్రకటించేలా చేశారు.
ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 24.50 లక్షల కిలోల నెయ్యి టెండర్‌లో 35 శాతం సరఫరా ఆర్డర్‌ను కిలోకు రూ.467.86 చొప్పున సరఫరా చేయడానికి పొందింది. ఇది అప్పటి సరఫరాదారు ఇస్తున్న ధర కంటే 42 శాతం అధికం. అందుకుగాను ఆ సంస్థ ఎండీ జగ్‌మోహన్ గుప్తాను రూ.50 లక్షలు డిమాండు చేసి, నగదు రూపంలో చిన్నప్పన్న తీసుకున్నారు.
భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీవైష్ణవి డెయిరీ, ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి కల్తీ అని సీఎఫ్‌టీఆర్ఐ ల్యాబ్ నివేదికలు స్పష్టం చేసినా, నిందితులు ఆర్ఎస్ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం, నటేష్ బాబు, అనిల్ కుమార్, ఈశ్వర్ రెడ్డి ఆ నివేదికలను నోట్ ఫైల్‌లో చేర్చలేదు. పై అధికారులకు తెలియకుండా మరుగునపర్చేశారు.
అంతేకాదు, భోలే బాబా డెయిరీకి అదనంగా 15 శాతం సరఫరా ఆర్డర్‌ను ఇచ్చారు.
ఈ సంస్థలు 2024 వరకు టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా కొనసాగించాయి’ అని సీబీఐ సిట్ చార్జిషీట్‌లో పేర్కొంది.
నిందితులపై పెట్టిన కేసులు
ఈ కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో భాగస్వామం ఉన్న, ప్రమేయం ఉన్న 36 మంది నిందితులు, సంస్థలపై భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. (2024 జూలైలో బీఎన్ఎస్ అమల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు సంబంధించి)
- క్రిమినల్ కుట్ర
- ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడటం
- సాక్ష్యాలను మరుగునపర్చడం
- నెయ్యిని కల్తీ చేయడం
- హానికరమైన కల్తీ నెయ్యి విక్రయించడం
- నమ్మకద్రోహం
- టీటీడీకి నష్టమని తెలిసీ మోసం చేయడం
- నకిలీ పత్రాలు సృష్టించి, అవే అసలైనవిగా సమర్పించడం
- భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో వ్యవహరించడం
- లంచాలు, అక్రమ ఆర్థిక ప్రయోజనాలు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














