అనకాపల్లి బెల్లం: జగన్ ‘పాదయాత్ర’ హామీ అమలైందా? చెరకు రైతులు ఏమంటున్నారు?

అనకాపల్లి బెల్లం మార్కెట్

ఫొటో సోర్స్, Ganesh

ఫొటో క్యాప్షన్, ముజఫర్‌నగర్ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్ అనకాపల్లి.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అనకాపల్లి జిల్లాలో చెరకు ఎక్కువగా పండిస్తారు. చెరకు పంట ద్వారా ఆర్థికంగా స్థిరపడిన గ్రామాల్లో మునగపాక ఒకటి. ఇక్కడ చెరకు గానుగలు కూడా ఎక్కువ. ఒకప్పుడు మునగపాకలోకి వెళ్లగానే ప్రతి ఇంటి నుంచి బెల్లం ఘుమఘుమలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.

“చెరకు రైతు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో చెప్పడానికి మా ఊరే మంచి ఉదాహరణ. మా గ్రామం మునగపాక. ఒకప్పుడు చెరకు రైతులకు, బెల్లం గానుగలకు బాగా ప్రసిద్ధి.

గిట్టుబాటు కాక ఐదేళ్లుగా క్రమంగా బెల్లం తయారీ నుంచి రైతులు తప్పుకుంటున్నారు. ఒకప్పుడు 1,650 ఎకరాల్లో సాగైన చెరకు, ఇప్పుడు 350 ఎకరాలకు పడిపోయింది.

రైతులు నష్టాలు భరించలేక చెరకు మీద ఆసక్తి చూపడం లేదు. గానుగలు కూడా 140 నుంచి 25‌కు పడిపోయాయి” అని మునగపాక చెరకు రైతు గణేష్ బీబీసీతో చెప్పారు.

చెరకు రైతులకు, చెరకు పంటకు పేరు పొందిన మునగపాకలోనే ఇలా ఉందంటే, మిగతా గ్రామాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.

ఆర్థిక పరిస్థితుల వల్ల గణేష్ కూడా బెల్లం గానుగ నిర్వహణ నుంచి తప్పుకున్నారు.

గిట్టుబాటు ధర లేక రైతులు చెరకు పంటపై ఆసక్తి చూపడం లేదు. బెల్లం తయారీ కూడా పెద్దగా జరగడం లేదు.

దీంతో దేశంలోనే బెల్లం విక్రయాల్లో రెండో అతి పెద్దదైన అనకాపల్లి బెల్లం మార్కెట్‌ కళ తప్పింది. ఇక్కడ ఏటా అమ్మకాలు తగ్గిపోతున్నాయి. గత ఆరేళ్లలో రూ.100 కోట్ల వరకు తగ్గాయి.

2016-17 సంవత్సరంలో రూ.147 కోట్ల విలువైన అమ్మకాలు నమోదవ్వగా, 2022-23లో ఇవి రూ.47.51 కోట్లకు పడిపోయాయి.

బెల్లం విక్రయాల తీరు
ఫొటో క్యాప్షన్, 2019-20 సంవత్సరంలో అనకాపల్లి మార్కెట్‌లో 2.59 లక్షల క్వింటాళ్ల బెల్లం విక్రయాలు జరిగాయి. అదే 2022-23లో ఇవి 1.54 లక్షల క్వింటాళ్లకు పడిపోయాయి.
జగన్

ఫొటో సోర్స్, FB/Andhra Pradesh CM

ఫొటో క్యాప్షన్, బెల్లానికి గిట్టుబాటు ధరపై జగన్ 2018లో పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని అనకాపల్లి చెరకు రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ ఏమిటి?

గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని చెరకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బెల్లానికి గిట్టుబాటు ధరపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2018లో పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని అనకాపల్లి చెరకు రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

పాదయాత్ర సందర్భంగా 2018 ఆగస్టు 29న అనకాపల్లి నెహ్రూ చౌక్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ- “అనకాపల్లి అంటే తియ్యటి బెల్లం గుర్తుకొస్తుంది. అటువంటి బెల్లానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్రలో రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నాను. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్లం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుంది” అని హామీ ఇచ్చారు.

గిట్టుబాటు లేక చెరకు సాగు నుంచి రైతులు దూరం జరుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు బీబీసీతో చెప్పారు.

“ఆంధ్రప్రదేశ్‌లో పది సహకార షుగర్‌ ఫ్యాక్టరీలు సహా 29 షుగర్‌ ఫ్యాక్టరీలు ఉండేవి. అందులో 24 ఫ్యాక్టరీలను మూసేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో చెరకు సాగు అయ్యేది. గిట్టుబాటు లేక సాగు 1.4 లక్షల ఎకరాలకు పడిపోయింది. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు అడిగితే కేసులు పెడుతున్నారు. దీంతో చెరకు రైతులు ఈ పంటపై ఆసక్తి కోల్పోతున్నారు” అని ఆయన తెలిపారు.

అనకాపల్లి చెరకు రైతులకు ఇచ్చిన హామీని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిలబెట్టుకోలేదని అప్పారావు చెప్పారు.

అధికారంలోకి వస్తే చెరకు రైతులను ఆదుకుంటామన్న జగన్ హామీ విషయమై అనకాపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ప్రశ్నించేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఈ కథనం పబ్లిష్ చేసే సమయానికి ఆయనఅందుబాటులోకి రాలేదు.

చెరకు పంట

ఫొటో సోర్స్, Ganesh

ఫొటో క్యాప్షన్, బెల్లానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో చెరకు సాగుపై రైతుల్లో ఆసక్తి తగ్గిపోతోంది.

మద్దతు ధర: రైతులు ఎంత అడుగుతున్నారు?

క్వింటాలుకు రూ. 5 వేల మద్దతు ధర ఇస్తే తమకు నష్టాలు తగ్గి, కాస్త ఊరట లభిస్తుందని అనకాపల్లి జిల్లా కొత్తూరుకు చెందిన చెరకు రైతు రాంబాబు బీబీసీతో అన్నారు.

నిరుడు అక్టోబరులో మార్కెటింగ్, సహకార శాఖ అధికారులు క్వింటాలుకు రూ.5 వేలు ఉండాలని సిఫారసు చేశారు. కానీ దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

ప్రస్తుతం ధరలు పెరిగిన నేపథ్యంలో రూ. 6 వేలు ఇస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.

“గత నాలుగేళ్లుగా రైతుకు మద్ధతు ధర లభించకపోవడంతో ఇతర పంటల వైపు రైతులు మళ్లుతున్నారు. దాంతో పంట విస్తీర్ణం కూడా తగ్గిపోతోంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బెల్లం పొడి రూపంలో పోటీ ఎదురవుతోంది. మహారాష్ట్ర నుంచి కేజీ బెల్లం పొడి రూ.28 నుంచి రూ.30 ధరకు లభిస్తోంది.

అక్కడ అధిక దిగుబడినిచ్చే రకాల కారణంగా వ్యయం తక్కువ. మన రాష్ట్రంలో చెరకు దిగుబడులు ఎకరాకు 35 టన్నుల నుంచి 20 టన్నులకు పడిపోయాయి. దీంతో మన బెల్లం ధర కేజీ రూ. 41 ఉంటుంది” అని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం అధ్యక్షుడు అప్పారావు చెప్పారు.

‘‘మహారాష్ట్ర ధరకు మనం ఇవ్వలేం. ఇవ్వకపోతే వ్యాపారులు కొనడం లేదు. దీంతో చెరకు రైతులు వారి వద్దనున్న సరకును అమ్ముకునేందుకు దళారులను నమ్ముకోవాల్సి వస్తోంది’’ అని ఆయన తెలిపారు.

చెరకు రైతులు

చెరకు రైతుకు గిట్టుబాటు రాకపోవడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక ధరలు ఇస్తున్నాయని అప్పారావు ప్రస్తావించారు.

‘‘ప్రోత్సాహక ధర అంటే మార్కెట్‌లో రైతుకు లభిస్తున్న ధరపై రాష్ట్ర ప్రభుత్వం కొంత అదనపు ధరను అంటే ఉదాహరణకు రూ.400 నుంచి రూ. 600 వరకు అందించడం. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 2002 తర్వాత చెరకు రైతులకు ప్రోత్సాహక ధరను ఇవ్వడం ఆపేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్‌కు విన్నవించుకున్నా ఎలాంటి స్పందనా లేదు’’ అని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు.

బెల్లం తయారీ సీజన్ మొదలవ్వగానే అనకాపల్లి పరిసరాల్లో బెల్లం గానుగలు తిరుగుతూనే ఉండేవి. కానీ ఇప్పుడు సీజన్‌లో కూడా పెద్దగా గానుగలు తిరగడం లేదు.

గత ఐదేళ్లుగా గానుగలు ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. ఈ ప్రభావంతో బెల్లం మార్కెట్ వెలవెలబోతోంది.

అనకాపల్లి బెల్లం

ఫొటో సోర్స్, Ganesh

ఖర్చులు పెరిగి నష్టాలు

చెరకు పంట వేసి బెల్లం దిమ్మెలుగా మార్చి మార్కెట్‌కు తరలించే వరకు ప్రతి దశలోనూ ఖర్చులు పెరిగిపోయాయని యలమంచిలికి చెందిన రైతు బంగార్రాజు బీబీసీతో చెప్పారు.

ఈయన నష్టాలు, లాభాలతో సంబంధం లేకుండా గత 18 ఏళ్లుగా తనకున్న ఆరు ఎకరాల్లో చెరుకు పంట వేస్తున్నారు.

రానున్న రోజుల్లో చెరకు పంట వేసే విషయంలో ఆలోచనలో పడ్డానని, వేరే పంట వేద్దామని అనుకుంటున్నానని చెప్పారు.

ఇలా ఒక్కో రైతు చెరకు పంట నుంచి తప్పుకోవడంతో, పంట విస్తీర్ణం తగ్గిపోతోంది.

ఇంకా చెరకుని నమ్ముకుని బెల్లం తయారు చేస్తున్న రైతులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి.

వంద కేజీల బెల్లం తయారు చేయాలంటే రూ. 4100 నుంచి రూ. 4,500 అవుతుంది.

కానీ, మార్కెట్‌లో దీని ధర గత నాలుగేళ్లుగా ఏనాడు రూ.3,500 వరకు రాలేదు.

చెరకు సాగుతో పాటు, గానుగ, రవాణా రూపంలో క్వింటాలు రూ. 4,100కు పైగా వ్యయమవుతోంది.

బెల్లం ధరల పట్టిక
ఫొటో క్యాప్షన్, అనకాపల్లి మార్కెట్‌లో క్వింటాల్ బెల్లం ధర గత నాలుగేళ్లలో ఎప్పుడూ రూ.3,500 కూడా దాటలేదు.
బెల్లం మార్కెట

ఫొటో సోర్స్, Ganesh

దిమ్మెల కంటే బెల్లం పొడికే ప్రాధాన్యం

అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు ఈ పరిస్థితి రావడానికి కారణాలు చాలా ఉన్నాయని మార్కెట్ కమిటీ సభ్యుడు రవి బీబీసీతో చెప్పారు.

‘‘జిల్లాలో 45 వేల హెక్టార్లుండే చెరకు విస్తీర్ణం క్రమంగా ఐదేళ్లలో 30 వేలకు పడిపోయింది. దీనికి కారణం గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు చెరకు పంటపై ఆసక్తి చూపడం లేదు’’ అని ఆయన తెలిపారు.

రవి చెప్పిన ఇతర కారణాలు:

  • అనకాపల్లి బెల్లం మార్కెట్ తెచ్చే దిమ్మెలపై సెస్ వసూలు చేయడం. లక్ష రూపాయలు వ్యాపారం చేస్తే మార్కెట్‌కు రూ.1000 సెస్ రూపంలో చెల్లించాలి. ఇది తప్పించుకునేందుకు మార్కెట్ వద్ద కాకుండా రైతుల వద్దకు వెళ్లి వ్యాపారులు కొంటున్నారు. దీంతో మార్కెట్‌కు వచ్చే బెల్లం తగ్గుతోంది.
  • వ్యాపారులు సిండికేట్‌గా మారి ఒకే ధర నిర్ణయించడం వల్ల బెల్లం తయారీదారు నష్టపోకుండా తన సరకును ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితులుండటం.
  • దిమ్మెల కంటే ధర ఎక్కువైనా నిల్వ సామర్థ్యం ఉండటంతో బెల్లం పొడికే వ్యాపారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. బెల్లం పొడి మహారాష్ట్ర నుంచి బాగా దిగుమతి అవుతోంది.
  • అనకాపల్లి బెల్లం ఉత్పత్తుల పరిశోధన కేంద్రంలో బెల్లం పొడి తయారు చేస్తున్నప్పటికీ ధర ఎక్కువగా ఉండటం, సరైన మార్కెటింగ్‌ సదుపాయాలు లేకపోవడంతో బయట నుంచి వచ్చే బెల్లం పొడికే ఎక్కువ డిమాండ్‌ ఉంటోంది.
  • ప్రస్తుతం 14, 12, 10 కేజీల సైజుల్లో బెల్లం దిమ్మెలు తయారవుతున్నాయి. వీటి కంటే చిన్నవి వినియోగదారులు కోరుకుంటున్నారు. కానీ బెల్లం రైతులు ఆ సైజులో తయారు చేయలేకపోతున్నారు. ఒకవేళ చేసినా ఖర్చులు బాగా పెరిగిపోతుండటంతో రైతులు తయారు చేయడం లేదు.
  • బెల్లానికి మంచి రంగు కోసం రసాయనాలు కలుపుతుండటం వల్ల నిల్వ సామర్ధ్యం ఉండదు. దీంతో ఈ రకం బెల్లం దిమ్మెలను విదేశాలకు ఎగుమతి చేయలేకపోతున్నారు.

వీటన్నింటి ప్రభావంతో అనకాపల్లి బెల్లం మార్కెట్ క్రమంగా తన ప్రభను కోల్పోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)