You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా జెట్ ఫైటర్‌లు ఎందుకు కూలాయి? కువైట్‌లో ఏం జరిగింది..
కువైట్‌లో మూడు అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడానికి 'ఫ్రెండ్లీ ఫైర్'' కారణమని అమెరికా చెప్పింది.
ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి మద్దతుగా బయలుదేరిన మూడు ఎఫ్ -15 జెట్లు ఫ్రెండ్లీ ఫైర్ ఘటనలో కూలిపోయాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
మూడు ఫైటర్ జెట్లలోని ఆరుగురు పైలట్లు క్షేమంగా బయటకు వచ్చారని, వారిని రక్షించారని తెలిపింది.
''అనేక అమెరికా యుద్ధవిమానాలు ఈ ఉదయం కువైట్‌లో కూలిపోయాయి'' అని అంతకుముందు కువైట్ రక్షణ శాఖ తెలిపింది.
''యుద్ధవిమానాల సిబ్బంది క్షేమంగా ఉన్నారు. వైద్యపరీక్షల కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది'' అని తెలిపింది.
ఏం జరిగిందో తెలుసుకునేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని కువైట్ రక్షణ శాఖ తెలిపింది. విమానాలు కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతోందని చెప్పింది.
వీడియోలో విమానం కూలిపోయిన దృశ్యాలు
కువైట్ నగరానికి దగ్గరలో అమెరికా ఫైటర్ జెట్ ఆకాశం నుంచి కూలిపోయి నేలమీద పడడం ఓ వీడియోలో కనిపించింది. బీబీసీ ఆ వీడియోను వెరిఫై చేసి దాన్ని ధ్రువీకరించింది.
అల్ జహ్రా ప్రాంతం దగ్గర కువైట్ పశ్చిమంవైపు నుంచి వీడియోను రికార్డు చేశారు.
''అనేక అమెరికా యుద్ధ విమానాలు కువైట్‌లో కూలిపోయాయని, సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేద''ని అంతకుముందు కువైటీ మిలిటరీ ప్రకటించింది.
అమెరికా విమానాలు కూలిపోవడాన్ని ఎలా చూడాలి?
ఒక తీవ్రమైన సాంకేతిక వైఫల్యం తర్వాత ఎఫ్-1 15ఈ స్ట్రైక్ ఈగల్ లేదా వేరియంట్ నియంత్రణ కోల్పోయి గాల్లో సమాంతరంగా తిరుగుతూ కూలిపోతున్నట్టు వీడియో ఫుటేజ్‌లో కనిపిస్తోంది. అలా ఎందుకు జరిగిందో కారణం తెలియదు.
ఇరాన్ తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్న సమయంలో కువైట్‌లో అనేక అమెరికా జెట్‌లు కూలిపోయినట్టు అంతకుముందు కువైట్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది
ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్స్ గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి నేలమీద లక్ష్యాలపై దాడులు చేయగలవు. ఈ సంక్షోభంలో అవి ఎలాంటి పాత్ర పోషించాయనేదానిపై ఇంకా కచ్చితమైన సమాచారం లేదు. అయితే గగనతల రక్షణలో భాగంగా ఇరాన్ క్షిపణులను, డ్రోన్లను అడ్డుకోవడంలో అవి కీలకపాత్ర పోషించినున్నట్టు కనిపిస్తోంది.
అవి హీట్ సీకింగ్ క్షిపణులను, దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించగలవు. శత్రువు దగ్గరలో ఉంటే గన్‌లను సైతం ఉపయోగించగలవు. అందుబాటులో ఉంటే లేజర్-గైడెడ్ రాకెట్లు వంటి ఇతర ఆయుధాలను కూడా ఉపయోగించగలవు.
ఇరాక్ సరిహద్దుల దగ్గర ఈ విమానాలు కూలిపోవడానికి మిత్ర లేదా శత్రుదేశాల కాల్పులా అనేదానిపై మొదట స్పష్టత రాలేదు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అనేక క్షిపణులు గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశముంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)