దక్షిణ కొరియాపై నల్లుల దండయాత్ర... ఆస్పత్రులకు జనం పరుగులు

నల్లుల సమస్య
ఫొటో క్యాప్షన్, మంచం మూలల్లో దాక్కునే నల్లులు కుడితే తీవ్రమైన దురద వస్తుంది

దక్షిణ కొరియాను నల్లులు ముట్టడించాయి.

నల్లుల ముట్టడితో దేశమంతటా నెలకొన్న భయాందోళనలను తగ్గించేందుకు దక్షిణ కొరియా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నల్లులపై యుద్ధానికి దక్షిణ కొరియా 500 మిలియన్ వాన్ (సుమారు రూ.3,19,125 ) కేటాయించింది. దీంతో పాటు ఓ ప్రత్యేక రెస్పాన్స్ బృందాన్నీ ఏర్పాటు చేసింది.

దక్షిణ కొరియా కంటే ముందు ఫ్రాన్స్, యూకేలలోనూ నల్లులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.

దక్షిణ కొరియాలో డేగు నగరంలోని ఓ యూనివర్సిటీలో తొలిసారిగా ఈ నల్లుల సమస్య వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఇవి పర్యాటక వసతులు, బహిరంగ ఆవిరి స్నానఘట్టాల వద్ద కనిపించాయి.

దక్షిణ కొరియా రాజధాని సియోల్, బుసాన్, ఇన్చియోన్ నగరాలలో నవంబరు 5 నాటికి నల్లుల బారినపడిన 17 కేసులు వెలుగులోకి వచ్చాయని స్థానిక మీడియా తెలిపింది.

వీటి భయంతో చాలా మంది ప్రజలు సినిమాలకు వెళ్ళడం, ప్రజారవాణా వాడకాన్ని మానుకుంటున్నారు.

నల్లులు కుడతాయనే భయంతో సియోల్‌కు చెందిన ఓ 34 ఏళ్ళ చోయ్ సబ్‌వే ట్రైన్లలో ప్రయాణాన్ని మానుకున్నట్టు సౌత్ కొరియాకు చెందిన ‘ఈడైలీ’ తెలిపింది.

ఇక ఇంట్లో కూడా హఠాత్తుగా ఈ నల్లులు ఎక్కడ ప్రత్యక్షమవుతాయోననే భయంతో చోయ్ తన ఇల్లంతా క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు.

మరో స్థానికుడు సియోగురించి కూడా ఈడైలీ తెలిపింది. ఈయన తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఇంట్లోనే ఉంటున్నాడని, నల్లుల భయంతో గడప దాటేందుకు భయపడుతున్నట్టు పేర్కొంది.

నిజానికి 1960లో జాతీయస్థాయి కార్యక్రమంతో నల్లులను పూర్తిగా నిర్మూలించినట్టు దక్షిణ కొరియా ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. కానీ తాజా నల్లుల ముట్టడితో తమ పని పూర్తి కాలేదని ప్రభుత్వానికి అర్థమైంది.

నల్లులతో భయం భయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియాలో నల్లుల దండయాత్ర మొదలైంది

నల్లులు వ్యాధులను వ్యాపింపచేయవు కాని, అవి కుడితే తీవ్రమైన దురద వస్తుంది. అది కుట్టిన చోట అదే పనిగా గీరడం వల్ల చర్మం లేచిపోయి గాయాలై, ఇన్ఫెక్షన్స్‌కు కారణమవుతుందనే ఆందోళన ఉంది.

ఈ నల్లలు మంచాలు, పగుళ్ళ వద్ద కనిపిస్తుంటాయి. వీటిని చూసి చాలా మంది ఆందోళన చెందుతుంటారు. నల్లుల కారణంగా అసౌకర్యం, ఇబ్బంది కలగడంతోపాటు నిద్రలేని రాత్రులకు కూడా అవి కారణమవుతాయి.

సియోల్ ప్రజలు ప్రజారోగ్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. నల్లులు తమను కుట్టిన ప్రాంతాన్ని చూపుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను కనుక్కొంటున్నారని స్థానిక కథనాలు చెపుతున్నాయి.

సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం నగరంలోని హోటళ్ళు, స్నానాల గదులు సహా 3,200 ప్రభుత్వ వసతి కేంద్రాలలోని పారిశుద్ధ్య పరిస్థితి గురించి ఆరా తీసేందుకు తనిఖీలు చేయడానికి సిద్ధమవుతోంది.

నల్లుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ప్రైవేటు నిపుణులతోనూ మాట్లాడుతోంది.

సబ్ వే లో ఫాబ్రిక్ సీట్లను తరచూ ఆవిరితో శుభ్రం చేయాలని సియోల్ అధికారవర్గం తలపోస్తోంది. అలాగే సీట్లను వస్త్రాలతో కాకుండా ఇతర మెటీరియల్స్ తో తయారు చేయించాలనే ఆలోచనలలో ఉంది.

నల్లుల నిర్మూలనకు అధికారులు ఇటీవల సిఫార్సు చేసిన రసాయన మందులపై వివాదం రాజుకుంది. అవి ప్రభావవంతంగా లేవని సౌత్ కొరియా జాతీయ దినపత్రిక జూంగాంగ్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)