You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: సీఎం రేవంత్ సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు, భారీగా ఆయుధాల అప్పగింత
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 7 నిమిషాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు మావోయిస్టులు స్వయంగా తమ తుపాకులను సీఎం చేతికి అందించారు. తమతో పాటు 124 తుపాకులను పోలీసులకు అప్పగించారు.
ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
"మావోయిస్టులు అప్పగించిన తుపాకుల్లో ఒక ఇన్సాస్ ఎల్ఎంజీ రైఫిల్, ఏకే-47 రైఫిళ్లు 31, ఇన్సాస్ రైఫిళ్లు 21, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు 20, 303 రైఫిళ్లు 18, ఇతర తుపాకులు 33 ఉన్నాయి. వారిలో ఎక్కువ మంతి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు" అని పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
లొంగిపోయిన తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెక్కులు అందజేశారు. ఇతర రాష్ట్రాల వారికి డీజీపీ అందించారు.
గణపతితో సహా ఇతరులు కూడా లొంగిపోవాలి: రేవంత్
''శాంతియుత పోరాటంతో మహాత్మా గాంధీ ఒక యుద్ధాన్ని జయించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చలే పరిష్కారం. అజ్ఞాతంలో ఉన్న గణపతితో సహా ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిలుపునిస్తున్నా. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. ఇటీవల లొంగిపోయిన దేవ్ జీ, దామోదర్, ఇతర కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమైనప్పుడు కొన్ని ప్రతిపాదనలు వారు నా ముందుంచారు. సెంట్రల్ కమిటీ ప్రతిపాదనలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాను'' అని రేవంత్ చెప్పారు.
2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రకటించారు.
''గతంలో ఒకేసారి ఇంతమంది ఆయుధాలతో లొంగిపోయిన దాఖలాలు లేవు. లొంగిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. నక్సలైట్ల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంది, సానుకూలంగా ఉంది. చట్టపరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసుల పరిశీలనకు అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం'' అని రేవంత్ ప్రకటించారు.
గత నెలలో దేవ్ జీ సహా కీలక నేతలు..
ఫిబ్రవరి 24న, మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలు ఫిబ్రవరి 24న తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు.
వీరిలో తిరుపతి మావోయిస్టు పార్టీలో కీలక నేత. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.
మల్ల రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, నూనె నర్సింహారెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
"మావోయిస్టు పార్టీలో ఆకులు రాలిపోయి చాలాసార్లు వచ్చాయి. ఈసారి మాత్రం మావోయిస్టు పార్టీ చెట్టు వాడిపోయినట్లు అనిపిస్తోంది" అని ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'ఇక మిగిలింది ఏడుగురే'
మొత్తం తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో అండర్‌గ్రౌండ్‌లో 11 మందే ఉన్నారని, ప్రస్తుతం లొంగిపోయిన నలుగురు మినహా ఇంకా ఏడుగురే ఉన్నారని డీజీపీ శివధరరెడ్డి ప్రకటించారు.
అయితే, ఈ సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.
మావోయిస్టు పార్టీలో చివరిసారిగా 2019లో రిక్రూట్‌మెంట్ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత కొందరు నేరుగా వెళ్లి చేరినా.. పార్టీ తరఫున రిక్రూట్‌మెంట్ జరగలేదు.
"తర్వాత ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లినప్పటికీ వారు తిరిగి వచ్చేశారు. 2019లో రిక్రూట్ అయినవారిలో ఒక్కరే ఉన్నారు" అని డీజీపీ శివధర్ రెడ్డి గత నెలలో చెప్పారు.
మిగిలిన వారిలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి, ఆయన భార్య సహా పలువురు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 24న, మావోయిస్టు పార్టీలో ఉన్నారని చెబుతున్న వారి పేర్లు, వివరాలను డీజీపీ వెల్లడించారు.
- ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి - కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి.
- పసునూరి నరహరి అలియాస్ సంతోష్ - ఈస్ట్ డివిజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఇంచార్జ్ (ఝార్ఖండ్‌లో పనిచేస్తున్నారు.)
- ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ - ఒడిశా రాష్ట్ర కమిటీ మెంబర్.
- వార్దా శేఖర్ అలియాస్ మంతు - దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఇంజినీరింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ విభాగం ఇంచార్జ్‌గా ఉన్నారు.
- జోడే రత్నాబాయి అలియాస్ సుజాత - గణపతి భార్య, స్టేట్ జోనల్ కమిటీ మెంబర్.
- నక్కా సుశీల అలియాస్ రేలా - జిల్లా కమిటీ స్థాయి దండకారణ్య జోనల్ కమిటీ
- పుతిని అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ - డివిజనల్ కమిటీ మెంబర్, కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశారు.
- రంగబోయిన భాగ్య అలియాస్ రూపి - ఏరియా కమిటీ సభ్యురాలు.
- మడావి అడిమె అలియాస్ సంగీత - ఏరియా కమిటీ సభ్యురాలు (చర్ల విభాగం.)
- కాశపోగు భవాని అలియాస్ సుగుణ - ఏరియా కమిటీ సభ్యురాలు.
- కుంజం ఎడావల్ - ఇల్లెందు కమాండర్.
"గణపతి అడవులలో లేరు, బయట షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం ఉంది. మాకున్న సమాచారం ప్రకారం ముప్పిడి సాంబయ్య ఒక్కరే యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన వారు చిన్న స్థాయిల్లో ఉన్నారు."
లొంగిపోయినవారు ఇప్పుడేం చేయబోతున్నారు?
గత నెలలో, లొంగిపోయిన తర్వాత దేవ్‌జీ మీడియా ముందు మాట్లాడారు.
"అనారోగ్యం కారణంగా రహస్య జీవితం వదిలి బహిరంగ జీవితంలోకి వచ్చాను. అది వ్యక్తిగత జీవితం కొనసాగించడానికి కాదు, ప్రజల సమస్యలపై చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేయాలని నిర్ణయించాం. అంటే నా రాజకీయ జీవితం కొనసాగించాలనుకుంటున్నా" అని దేవ్‌జీ వివరించారు.
ఇదే అంశంపై మల్ల రాజిరెడ్డి మాట్లాడారు.
"ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి, వాటన్నింటినీ సంఘటితం చేయడానికి ప్రజాస్వామికంగా, చట్టపరిధిలో పనిచేస్తాం" అని చెప్పారు.
అయితే, ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా? పార్టీ పెడతారా? ప్రజాసంఘాన్ని ప్రారంభిస్తారా? అన్నది వారు స్పష్టం చేయలేదు.
కానీ, తమ సిద్ధాంతాన్ని వదలకుండా ప్రజా సమస్యలపై పోరాడతామని చెబుతున్నారు.
అయితే, మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయిన లేదా అరెస్టు అయి బయటకు వచ్చిన ఎందరో తమ వ్యక్తిగత జీవితాల్లో మునిగిపోయారని, దేవ్‌జీ, రాజిరెడ్డి పంథా ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉందని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ బీబీసీతో చెప్పారు.
"సమాజం అందర్నీ ఆహ్వానిస్తుంది. రాజకీయంగా ముందుకు వెళ్తామంటే పార్టీ పెట్టడమో, ఏదైనా రాజకీయ పార్టీలో చేరడమో చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన పార్టీ ఆవిర్భావానికి చోటు (స్పేస్) లేదని చెప్పాలి" అని అన్నారు.
సహజంగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన వారి మాటలు ముక్కుసూటిగా ఉంటాయని, వేరే పార్టీలో చేరితే ఆ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా పనిచేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ వివరించారు.
"ఇప్పటికిప్పుడు వారి నిర్ణయాలు చెప్పలేకపోవచ్చు. మూడు లేదా ఆరు నెలలపాటు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటారు కనుక ఆ తర్వాత వారి వ్యూహాలు వెల్లడించే వీలుంది" అని చెప్పారాయన
'దేవ్‌జీ కార్యదర్శిగా ఎన్నికవ్వలేదు'
తిపిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికవ్వలేదని పోలీసులు గుర్తించారు.
గణపతి తర్వాత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. బసవరాజ్ మరణం తర్వాత దేవ్‌జీ ఆ స్థానంలో ఉన్నారనే ప్రచారం జరిగింది.
అయితే, దేవ్‌జీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికవ్వలేదని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెబుతున్నారు. ఆయన సెంట్రల్ కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడిగానే ఉన్నారని చెబుతున్నారు.
"ఇప్పుడున్న మావోయిస్టు పార్టీ పరిస్థితి నేపథ్యంలో సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగే పరిస్థితి లేదు కాబట్టి దేవ్‌జీ కార్యదర్శి అయ్యారని చెప్పలేం. కానీ, మీటింగ్ జరిగి ఉంటే, ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది" అని డీజీపీ చెప్పారు.
అలాగే పోలీసుల సమక్షంలో ఫిబ్రవరి 24న దేవ్‌జీ మాట్లాడిన సమయంలోనూ పార్టీలో తన హోదాపై ఆయన కూడా స్పష్టత ఇవ్వలేదు.
అభయ్ పేరుతో లేఖలు
గత కొంతకాలంగా సీపీఐ (మావోయిస్టు) పార్టీ పేరుతో లేఖలు విడుదలవుతూ వచ్చాయి. ఇవి 'అభయ్' పేరుతో విడుదలయ్యాయి.
అయితే, ఈ అభయ్ ఎవరనే విషయంపై బాగా చర్చ జరిగింది.
ముఖ్యంగా మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగిపోయిన తర్వాత అభయ్ పేరుతో లేఖలు విడుదలయ్యాయి.
అయితే, దేవ్‌జీనే అభయ్ పేరుతో లేఖలు రాసినట్లు పోలీసులు వెల్లడించారు.
మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ, 'అభయ్' పేరుతో దేవ్‌జీ లేఖలు రాశారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)