హర్రర్ మూవీలు చూస్తే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చా? క్లిష్ట పరిస్థితులను తట్టుకునే 9 మార్గాలు

హర్రర్ మూవీ చూడటం ఒక ఆటలాంటిదే.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోఫాపై కూర్చుని భయానక చిత్రాన్ని చూడటం కూడా ఒకరకమైన ఆట లాంటిదే. ఇది మీకు ప్రమాదకరమైన పరిస్థితులను అన్వేషించే విధానాన్ని అందిస్తుంది.
    • రచయిత, బీబీసీ సైన్స్ ఫీచర్స్ టీమ్
  • చదివే సమయం: 8 నిమిషాలు

నేటి అస్తవ్యస్థమైన, అనిశ్చిత ప్రపంచంలో.. ప్రజలు ఆందోళనకు గురి కావడం లేదా మానసికంగా ఉద్వేగానికి లోనవ్వడం సహజమే.

అయితే శాస్త్రీయ పరిశోధనలు ఈ క్లిష్ట పరిస్థితులను తట్టుకునే శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి మనసుకు ప్రశాంతత కలిగేందుకు కొన్ని సులభమైన చిట్కాలను సూచిస్తున్నాయి.

కొన్నిసార్లు మీ చుట్టూ జరిగే పరిణామాలు మిమ్మల్ని తీవ్ర ఉద్వేగానికి గురి చేయచ్చు.

తరచూ బ్యాడ్‌న్యూస్‌లను వినడం, ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులు చోటు చేసుకోవడం, ఇంట్లో ఊహించని సంఘటన లేదా రోజువారీ పనులతో సతమతమవ్వడం వల్ల ఈ పరిణామాలు ఏర్పడవచ్చు.

వీటన్నింటి వల్ల ఏర్పడే అనిశ్చితి మిమ్మల్ని తీవ్ర ఆందోళనకు, ఒత్తిడికి గురి చేయచ్చు.

ఇలాంటి పరిణామాలను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడేందుకు బీబీసీ సైన్స్ టీమ్ ఇటీవల పరిశోధనల్లో కనుగొన్న కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను సూచిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1.భావోద్వేగాలను అర్థం చేసుకోండి

భావోద్వేగాలను వర్ణించేందుకు మీరు వాడే పదాలే మీ అంతర్గత జీవితం ఒక రూపు దిద్దుకోవడానికి అత్యంత శక్తిమంతమైన సాధనంగా పనిచేస్తాయి.

మీభావాలను వ్యక్తపరిచేందుకు ఉపయోగించే కచ్చితమైన పదాలు, జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాయపడతాయని పలు అధ్యయనాలలో వెల్లడైంది.

ఉదాహరణకు.. మీరు ఒత్తిడిలో ఉన్నారు చెప్పడానికంటే .. మీరు నిరాశగా ఉన్నారా? ఆందోళనగా ఉన్నారా? కంగారు, భయం వంటి భావోద్వేగాలను ఎదుర్కొంటున్నారా? అనేది కచ్చితంగా గుర్తించాలి. అంటే ఏరకమైన ఒత్తిడికి గురవుతున్నారో అర్ధం చేసుకోవాలి.

మీలోని భావాలు ఏ రకమైనవో గుర్తించే ఈ సామర్థ్యాన్నే ''ఎమోషనల్ గ్రాన్యులారిటీ'' అని అంటారు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం.

ఇతర సంస్కృతులవారు తమ భావోద్వేగాలను వర్ణించేందుకు ఎలాంటి పదాలను వాడుతున్నారో తెలుసుకోవడం ద్వారా కూడా ప్రజలు ప్రయోజనం పొందుతుండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

చాలా భావాలకు నేరుగా ఇంగ్లీష్ అనువాదం లేదు. ఫినిష్‌కు చెందిన 'సిసు' విధానాన్ని తీసుకుంటే, 'ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనేందుకు అసాధారణమైన సంకల్పం'గా దీన్ని వర్ణిస్తారు.

భావోద్వేగంతో వ్యక్తపరిచే పదాలే ప్రజల జీవితానికి ఒక ఉపయోగకరమైన సాధనం అంటారు నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ న్యూరోసైంటిస్ట్ లిసా ఫెల్డ్‌మ్యాన్ బారెట్.

2. ఒత్తిడిని అనుకూలంగా మార్చుకోండి

యాంగ్జైటీ అటాక్‌కు గురయ్యేవారు, ఈ పదాలు ఎందుకు ఉపయోగించారో తెలుసుకోవడం తేలికే.

కానీ, ఆ అనుభవం మీకూ ప్రయోజనకరంగా ఉంటుందనుకోవడం పొరపాటే.

అయితే, కొన్ని పరిస్థితుల్లో యాంగ్జైటీ సాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

యాంగ్జైటీ డిజార్డర్లు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే.. సాధారణంగా యాంగ్జైటీ అనే భావోద్వేగం ప్రజలను ఉత్సాహపరిచేందుకు ఉపయోగపడుతుందని ఒక పరిశోధనలో తెలిసింది.

సామాజిక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు, మరింత కష్టించి పనిచేయడానికి, ప్రతిఫలం పొందాలనే తపనకు ఇదొక ఒక స్ఫూర్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని తెలిసింది.

ఆందోళనకరంగా ఉన్నప్పుడు, మరింత వినూత్నంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తాం. మన మెదడు అత్యంత సానుకూల దృష్టితో, సమర్థవంతంగా పనిచేస్తుంది.

''ప్రతికూల'' భావోద్వేగాలు తరచూ క్లిష్టమైన పరిస్థితులకు ఒక సహజ స్పందనగా పనిచేస్తుంటాయి.

మానవ భావోద్వేగాలను అన్ని కోణాలలో అర్థం చేసుకుని, అంగీకరించే వ్యక్తులు మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు.

యాంగ్జైటీని ఒక హెచ్చరిక సంకేతంగా చూస్తూ.. దాన్నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూసే బదులు, ముఖ్యమైన సమాచారాన్ని చేరవేసే సాధనంగా దీన్ని చూడటం ప్రయత్నించాలి.

ఉదాహరణకు.. యాంగ్జైటీని ఒక బాధాకరమైన అంశంగా కాకుండా, సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసే సాధనంగా చూస్తే.. ఒత్తిడిలో కూడా మంచి పనితీరు కనబర్చవచ్చు.

యాంగ్జైటీ

ఫొటో సోర్స్, Getty Images

3. ఆందోళనను నిర్మాణాత్మక ఆలోచనగా మార్చుకోండి

ప్రజలు సాధారణంగా భవిష్యత్ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఫలితంగా యాంగ్జైటీ కొన్నిసార్లు సమస్యలను ఎదుర్కొనేలా మనల్ని సిద్ధం చేస్తూ.. వాటికి పరిష్కారం కనుగొనేలా చేస్తుంది.

ఆందోళన చెందడం కూడా కొన్నిసార్లు చాలా ఉపయోగకరమని పరిశోధనలు చెబుతున్నాయి.

అయితే, కొన్నిసార్లు మన చేతులో లేని విషయాల గురించి కూడా ఆందోళన చెందుతాం. ఆ పరిస్థితులను అర్థం చేసుకుని, మనం చేయగలిగేది అక్కడ కొద్దిగే ఉందని తెలుసుకున్నప్పుడు, ఆందోళన కాస్త తగ్గుతుంది.

రివర్‌సైడ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిపోర్నియాలో పనిచేసే హెల్త్ సైకాలజిస్ట్ కేట్ స్వీనీ మాట్లాడుతూ.. ఆందోళనను తగ్గించే ప్రక్రియను వివరించారు..

  • మీరు దేని గురించి ఆందోళన చెందుతున్నారో దాని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి.
  • ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల జాబితాను సిద్ధం చేసుకోవాలి.
  • అవసరమైన చర్యలన్నీ తీసుకున్న తర్వాత కూడా ఆందోళన ఉంటే, ఫ్లో (మీకు ఇష్టమైన పనిలో మునిగిపోవడం), మైండ్‌ఫుల్‌నెస్ (ప్రస్తుత క్షణంలో జీవించడం) వంటి ఆందోళనను తగ్గించే చర్యలను ప్రయత్నించాలి.
పుస్తకం

ఫొటో సోర్స్, Getty Images

4. పుస్తకాలు,సంగీతంతో పరిస్థితులు మార్చుకోండి

ఒక సరైన పుస్తకం మీ జీవితాన్ని మెరుగ్గా మార్చేయగలదు. మీరు ఆ పుస్తకంలోని పేజీలను తెరిచినప్పుడు, అది పూర్తిగా మిమ్మల్ని ఇతర ప్రపంచంలోకి తీసుకెళ్లగలదు.

నిత్యం పుస్తకాలు చదివే వారు తక్కువ ఒత్తిడిని, నిరాశను, ఒంటరితనాన్ని అనుభవిస్తారు. వారు ఎక్కువగా సమాజంతో అనుసంధానమై, కాన్ఫిడెంట్‌గా ఉంటారని తాజా పరిశోధనలో తేలింది.

పెరుగుతోన్న ''బిబ్లియోథెరపీ'' విధానంలో ఒక వ్యక్తి మానసిక స్థితి, వారి మానసిక ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా పుస్తకాలను సూచిస్తున్నారు.

తీవ్ర ఆందోళనకరంగా ఉన్న మనసును శాంతింపజేసి, దాన్ని పునరుద్ధరించి, ఉత్తేజపర్చడమే దీని ఉద్దేశ్యం. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

అయితే, పుస్తకమే పూర్తిగా బాగు చేయదు. ఇతర థెరపీలతో పాటు దీన్ని వాడినప్పుడు ఇది చాలా బాగా పని చేస్తుంది.

ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తప్పుడు సమయంలో తప్పుడు పుస్తకాన్ని చదవడం ద్వారా మీ మానసిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

పుస్తకాన్ని చదివే సమయం లేకపోతే, మీకు ఇష్టమైన పాటల్లో ఒకదాన్ని వినండి. సంగీతానికి మీ భావోద్వేగాలను పెంచే సామర్థ్యం ఉంది.

ఇది వెంటనే మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. సరైన, మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే సంగీతాన్ని వినడం ద్వారా మీకు మంచిగా అనిపించవచ్చు.

మీకు నచ్చని సంగీతం వినడం ద్వారా మీరు మరింత అసహనానికి లోనుకావొచ్చు. ఏదీ మీకు సరైనదో గుర్తించాలి.

మీచుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా మీ భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు జాగ్రత్తగా మీ చుట్టూ వాతావరణాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి.

ఉదాహరణకు.. మొక్కలను పెంచుకోవడం లేదా పచ్చని ప్రదేశాల చిత్రాలు, మీరు అమితంగా ప్రేమించే వారి ఫోటోలను చూడటం ద్వారా కూడా మీలో మార్పును చూడొచ్చు.

హర్రర్ మూవీ

ఫొటో సోర్స్, Getty Images

5. హర్రర్ మూవీ చూడటం

మీరు అప్పటికే ఆందోళనగా ఉన్నప్పుడు... భయపెట్టే దృశ్యాలను చూడటం, వికృతమైన జాంబీ ఆకారాలు, నీడల్లో కనిపించే దెయ్యాలు మీకు సరైనవి కావు. కానీ, హర్రర్ మూవీని చూడటం మీ ఆందోళనలకు కాస్త విరుగుడు మందు కాగలదు.

సోఫాపై కూర్చుని భయానక చిత్రాన్ని చూడటం కూడా ఒకరకమైన ఆట లాంటిదే. ఇది మీకు ప్రమాదకరమైన పరిస్థితులను అన్వేషించే విధానాన్ని అందిస్తుంది.

వాస్తవిక ప్రపంచంలో మనం ఎదుర్కోబోయే ప్రమాదాలకు మనల్ని మానసికంగా సిద్ధం చేస్తుంది. నిజ జీవితంలో మనం ఎదుర్కొనే ముప్పులకు సిద్ధమయ్యేలా మానసికంగా మనల్ని సిద్ధం చేస్తుంది.

భయంకరమైన కథనాలను చదివే ప్రజలు, క్లిష్ట సమయాలను బాగా ఎదుర్కొంటారని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. వారి దైనందిన జీవితంలో తక్కువ ఆందోళనను అనుభవిస్తారని పరిశోధనలు తెలిపాయి.

మీకు వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ మూవీని చూసినా లేదా భయంతో దిండు వెనుక దాక్కున్నా.. అది ఒత్తిడి సమయాల్లో ఒత్తిడిని ఎలా తగ్గించాలనే దానిపై మెదడుకు ఒక రకమైన వ్యాయామంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి.

కృతజ్ఞతా భావం

ఫొటో సోర్స్, Getty Images

6. కృతజ్ఞతా భావం

కొన్ని ఉత్తమమైన సలహాలు కాలక్రమేణా బాగా ప్రాచుర్యం పొంది, వాడుకలో జాతీయాలుగా మారాయి. దానిలో ఒకటే ''కౌంట్ యువర్ బ్లెసింగ్స్''.

దీన్ని మీరు ''మూడు మంచి విషయాలు'' లేదా ''కృతజ్ఞతా జాబితా'' అని కూడా పిలవవచ్చు. అయితే, ఈ విధానం ఏంటంటే.. ఒక రోజులో మీకు జరిగిన మూడు మంచి విషయాలను ప్రతిరోజూ సాయంత్రం పూట కొద్దిసేపు కూర్చుని రాసుకోండి.

ఇది చాలా చిన్నదే. కానీ, అత్యంత శక్తివంతమైన ప్రభావాలను కలిగించే సానుకూల అంశం. దీని వెనుకాల మంచి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి.

మూడు మంచి విషయాలను ప్రతిరోజూ రాసుకునే అలవాటును కొనసాగించిన వారు నెల తర్వాత ఎక్కువ సంతోషంగా ఉన్నారని, వారిలో కుంగుబాటుకు గురయ్యే అంశాలు చాలా తక్కువగా కనిపించాయని 2005లో ఓ అధ్యయనం పేర్కొంది.

ఈ సానుకూల ప్రభావాలు ఆరు నెలల పాటు చేపట్టిన అధ్యయనమంతా కనిపించాయని తెలిపింది.

7. మీ నియంత్రణలో లేనివాటిని గుర్తించండి

ఆందోళనకర పరిస్థితుల్లో మనం నివసిస్తున్నప్పుడు, పురాతన తత్త్వ శాస్త్రవేత్తలు చెప్పిన సలహాలను మనం పాటించాలి. అవి ఇప్పటికీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

సుమారు క్రీస్తు శకం 55లో పుట్టిన ఎపిక్టెటస్ తీవ్ర గడ్డు జీవితాన్ని అనుభవించారు. ప్రారంభ కాలంలో ఎదుర్కొన్న ఈ అనుభవాలే, ఆ తర్వాత కాలంలో స్టోయిసిజం పాఠశాలలో ఆయన తత్త్వ బోధనలు చేసేందుకు దోహదపడ్డాయి.

మన జీవితంలో అతి ప్రధాన కర్తవ్యం.. ఏవి మన నియంత్రణలో ఉన్నాయి, ఏవి లేవో తెలుసుకోవడమని ఆయన చెప్పారు.

అనివార్యమైన వాటిని అడ్డుకోవాలని చూడటం లేదా పూర్తిగా మన నియంత్రణలో లేని ఫలితాలపై ఎక్కువగా ఆశపెట్టుకోవడమే మన నిరాశకు కారణమని ఆయన వాదించారు.

చిన్న విషయాలలో కూడా మనం ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని ఎపిక్టెటస్ సూచించారు.

అప్పుడు మన జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వాటికి మనం సన్నద్ధంగా ఉంటామని చెప్పారు.

మార్పులు, ప్రతికూలతలు సహజమని మనం గుర్తిస్తే.. ఎదుర్కొనే ప్రతి కష్టమైన పని అంటే యుద్ధం, మహమ్మారి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోగలం. వాటి నుంచి మనం మరింత స్ట్రాంగ్‌గా మారతాం.

8. తగిన విధంగా ఆశ పడటం

పరిస్థితులు వాటికవే సర్దుకుంటాయని ఆశించడం వల్ల కొందరు ఏమీ చేయకుండా తమ చుట్టూ ఉన్న అనిశ్చితి, భయానక పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

పర్యావరణ మార్పు వంటి విషయాల్లో ఆశ పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై పరిశోధన చేసిన బీబీసీ రిపోర్టర్ డియెగో ఆర్గ్యుడాస్ ఆర్టిజ్ సరైన కోణంలో ఆశను కలిగి ఉండటం చాలా ముఖ్యమని అన్నారు.

ఇతరులపై ఆశ పెట్టుకుని ఉండటం లేదా పాజిటివ్ వార్తల కోసం వేచిచూస్తూ కూర్చోవడం కంటే.. సొంతంగా కానీ, ఇతరులతో కలిసి కానీ ఏదైనా పని చేసినప్పుడు, ఆశ అనేది అత్యంత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు.

వ్యక్తిగతంగా నిర్ణయించుకున్న లక్ష్యాలు, వాటిని చేరుకునేందుకు చేసే ప్రయాణం నుంచి ఆశ ఉద్భవిస్తుందని సైకాలజిస్టులు భావిస్తున్నారు.

పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

9. ప్రతికూల పరిస్థితుల్లో పిల్లలతో ఎలా మాట్లాడాలి

క్లిష్ట సమయాలు కేవలం మనల్నే ప్రభావితం చేయవు. మనం ప్రేమించే మనుషులపై కూడా ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపుతాయి.

ఈ బాధాకరమైన అనుభవాల గురించి పిల్లలతో మాట్లాడటం చాలా కష్టమే. అయితే, వారితో ఎలా మాట్లాడతాం అనే దాన్ని బట్టి వారి మానసిక శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు వారితో మాట్లాడే విధానం బట్టి, వారి జ్ఞాపకాలు, ప్రవర్తన రూపుదిద్దుకుంటుంది.

పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి అనుభవాల గురించి ఎక్కువగా తెలుసుకునే తల్లిదండ్రులు, పిల్లల్లో శ్రద్ధను, వారి సెల్ఫ్ కంట్రోల్‌ను మెరుగుపరిచేందుకు సాయపడ్డారని ఒక అధ్యయనం గుర్తించింది.

పిల్లల క్లిష్టమైన భావాలను తెలుసుకోవడం అనేది చాలా శక్తివంతంగా అనిపించింది. పిల్లల భావోద్వేగాల నియంత్రణకు, అర్థం చేసుకునే స్వభావానికి ఇది సాయపడింది. దీన్నే ''ఎమోషన్ కోచింగ్'' అని కూడా అంటున్నారు.

వారి భావనలను గుర్తించడం, తెలుసుకోవడం, వాటి గురించి ఓపెన్‌గా చర్చించడం ద్వారా ఇబ్బందులను సమర్థవంతంగా తట్టుకునేలా పిల్లలకి మార్గనిర్దేశం చేయొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)