‘చిన్నచిన్న మార్పులతో మెరుగైన ఆరోగ్యం’

రేఖా చిత్రం

ఫొటో సోర్స్, María Medem

    • రచయిత, మెలిస్సా హోగెన్‌బూమ్
    • హోదా, బీబీసీ గ్లోబల్స్ సీనియర్ హెల్త్ కరస్పాండెంట్
  • చదివే సమయం: 9 నిమిషాలు

భవిష్యత్తులో మీరు మరింత ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో చేసుకోదగిన కొన్ని శాస్త్రీయ ఆధారాలతో సులభమైన మార్పులు ఉన్నాయి.

మీ ఇంటివో, వాహనానివో తాళం చెవులను ఎక్కడో పెట్టి తరచుగా మరచిపోతున్నారా?

అలా జరుగుతుండటం మీ ఒక్కరి విషయంలోనే కాదు, వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు రావడం సహజమే.

వయసుతో పాటు మన మెదడు పనితీరు, జ్ఞాపక శక్తి తగ్గుతాయనేదీ అందరరూ నమ్ముతుంటారు.

కానీ, వయసు పెరగడం వల్ల మేధోపరమైన సమస్యలు తలెత్తడమనేది తప్పనిసరేమీ కాదు.

మన మెదడును కాపాడుకుంటూ, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి మనమందరం తీసుకోదగిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మెదడు పనితీరే కీలకం

మన శైశవ దశలో మెదడు నిరంతరం నాడీ కణాల మధ్య కొత్త సంబంధాలను ఏర్పరుస్తుంది లేదా ఉన్నవాటిని మరింత బలోపేతం చేస్తుంది. పిల్లలుగా ఉన్నప్పుడు, మొదట కొన్ని సంవత్సరాలలో ప్రతి సెకనుకు పది లక్షలకు పైగా కొత్త నాడీ సంబంధాలు ఏర్పడతాయి.

కానీ వయసు పెరిగేకొద్దీ, ముఖ్యంగా కొన్ని సంబంధాల అవసరం లేనప్పుడు, వాటి ప్రక్రియ నెమ్మదించడం ప్రారంభిస్తుంది.

ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం, మన జీవితకాలంలో మెదడు ఐదు ప్రధాన దశలు దాటుతుంది.

ఇందులో సగటున 9, 32, 66, 83 ఏళ్ల వయసులో కీలకమైన మార్పులు సంభవిస్తాయి.

మన మెదడులోని విభాగాలు ప్రత్యేక విధులను నిర్వహించే సామర్థ్యం పొందాక, అంటే మన 30వ ఏట మాత్రమే మెదడు 'వయోజన' దశకు చేరుకుంటుంది. అలాగే, మన 60 ఏళ్ల మధ్య కాలం నుంచి మెదడు నిర్మాణంలో వృద్ధాప్య సంకేతాలు కనిపించడం మొదలవుతుంది.

అయితే, మన మెదడు పనితీరులో వచ్చే ఈ మార్పులు అందరికీ ఒకేలా ఉండవు. అలాగే ఇవి మార్చలేనంత కఠినమైనవేమీ కావు.

మన కండరాలు బలంగా ఉండటానికి మనం వ్యాయామం ఎలా చేస్తామో, మెదడులోని కనెక్షన్స్ పదిలంగా ఉంచుకోవడానికి మన మనసును కూడా అంతే చురుగ్గా ఉంచాలి.

ఒక అధ్యయనం ప్రకారం.. చురుకైన జీవనశైలి వల్ల మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశాలను చాలావరకు వాయిదా వేయవచ్చు లేదా పూర్తిగా నివారించవచ్చు.

చదువుకోవడం, నలుగురితో కలవడం, పని చేయడం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి 'కాగ్నిటివ్ రిజర్వ్'ను పెంపొందించడానికి సహాయపడతాయని పరిశోధకులు వెల్లడించారు.

ఈ 'కాగ్నిటివ్ రిజర్వ్' అనేది వయసు వల్ల మెదడుకు జరిగే నష్టాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది.

మెదడు దెబ్బతిన్న మార్గాలకు బదులుగా కొత్త మార్గాలను వెతుక్కుని సర్దుబాటు చేసుకుంటుంది, తద్వారా వయసుతో పాటు వచ్చే మార్పులను తట్టుకునే శక్తిని మెదడు పొందుతుంది.

వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చనే అంశంపై గత కొన్ని నెలలుగా శాస్త్రీయ పరిశోధనలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాను.

అలాగే, 2026, జనవరి 17న ప్రారంభమైన మా సరికొత్త న్యూస్‌లెటర్ కోర్స్ 'లైవ్ వెల్ ఫర్ లాంగర్' కోసం పలువురు నిపుణులతో కూడా మాట్లాడాను.

మీకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందించేలా, సరళమైన, శాస్త్రీయ ఆధారిత వ్యాయామాలతో దీనిని రూపొందించాం.

మనం చేసే చిన్న చిన్న మార్పులు నిలకడగా కొనసాగించడం ద్వారా మన ఆయుష్షును పెంచుకోవచ్చని పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

ఉదాహరణకు, శారీరక శ్రమతో చురుగ్గా ఉన్నప్పుడు అది మన మెదడు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో మేలు చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది.

దీనిని దృష్టిలో ఉంచుకుని, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూనే మెదడును యవ్వనంగా ఉంచుకోవడానికి సహాయపడే 5 మార్గాలను కింద వివరించాం.

రేఖా చిత్రం

ఫొటో సోర్స్, María Medem

నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు...

మొదటగా, మేధోపరమైన ఆరోగ్యాన్ని మనం రోజువారీగా ఉపయోగించే విస్తృత నైపుణ్యాలు (బ్రాడ్ సెట్ ఆఫ్ స్కిల్స్)గా భావించడం ముఖ్యం. ఇందులో తర్కించడం, సమస్యలను పరిష్కరించడం, ఏకాగ్రత వహించడం, సమాచారాన్ని ఎంత త్వరగా గ్రహిస్తామనే సామర్థ్యాలు ఉంటాయి.

ఈ నైపుణ్యాలు రకరకాలుగా ఉంటాయి, మన జీవనశైలిని బట్టి ఇవి వృద్ధి చెందవచ్చు లేదా మారవచ్చు. ముఖ్యంగా, ఏ వయసులోనైనా వీటిని కాపాడుకోవచ్చు, మరింత మెరుగుపరుచుకోవచ్చు.

ఎడిన్‌బరో హెరియట్-వాట్ యూనివర్శిటీకి చెందిన మనస్తత్వవేత్త అలన్ గౌ చెప్పినట్లుగా, వయసుతో పాటు ఈ ప్రక్రియలు కొన్ని నెమ్మదించినప్పటికీ, మేధోశక్తి గణనీయంగా తగ్గిపోవడం అనేది వృద్ధాప్యంలో కచ్చితంగా జరుగుతుందని లేదు.

జీవితంలోని ప్రతి దశలోనూ మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రోత్సహించడానికి మనకు అవకాశాలు ఉన్నాయని అలన్ గౌ చెబుతున్నారు.

నిజానికి, భవిష్యత్తులో మన ఆలోచనా సామర్థ్యం దెబ్బతినకుండా ఉండటానికి, మన మేధో నైపుణ్యాలకు ఇప్పుడే ఒక కొత్త ఉత్తేజాన్ని ఇవ్వవచ్చు.

సమాచారాన్ని గ్రహించే వేగం వంటి కొన్ని సామర్థ్యాలు వయసుతో పాటు మారే అవకాశం ఉన్నప్పటికీ, దానిని ఒక సమస్యగా భావించాల్సిన అవసరం లేదని గౌ చెబుతున్నారు. ఇలాంటి మార్పులు మనం పని ఒత్తిడి ఎదుర్కొనే యవ్వన దశలోనే ప్రారంభం కావచ్చు. 'అల్జీమర్స్ రీసెర్చ్' అవగాహన ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఒక శక్తిమంతమైన సందేశం ఏమిటంటే, మనం చర్య తీసుకోవడానికి 'ఎప్పుడూ మరీ ముందు కాదు, అలాగని ఎప్పుడూ ఆలస్యం కూడా కాదు'.

మన మేధోశక్తిని పెంపొందించుకోవడానికి, మతిమరుపు వ్యాధి ముప్పును తగ్గించుకోవడానికి ఒక సులభమైన మార్గం 'కొత్త విషయాలను ప్రయత్నించడం'.

మొక్కల పట్ల ఆసక్తి ఉన్నవారు గార్డెనింగ్ ప్రయత్నించవచ్చు, ఎందుకంటే అది మేధో సామర్థ్యాన్ని కాపాడుతుందని, తద్వారా మీరు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

వైద్యులు ఇప్పుడు తోటపనిని ఆరోగ్య సంరక్షణలో భాగంగా కూడా చేర్చుతున్నారు.

వయసు పెరుగుతున్న కొద్దీ తోటపని చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మొక్కల గురించి తెలుసుకోవడం, వాటిని బతికించుకోవడం వంటి ప్రక్రియలు మన మెదడులోని సాధారణంగా ఉపయోగించని భాగాలను ఉత్తేజపరుస్తాయి.

ఇదేకాదు.. ఏదైనా కొత్త భాషను నేర్చుకోవడం మెదడులోని వివిధ భాగాలను ఏకం చేస్తుంది, వాటి మధ్య సంబంధాలను బలపరుస్తుంది.

ఇలా చేయడం వల్ల అల్జీమర్స్ ప్రమాదాన్ని దాదాపు ఐదేళ్ల వరకు వాయిదా వేయవచ్చని పరిశోధనలో కనుగొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మీ మెదడుకు సరైన ఇంధనం అవసరం

మనం సమతుల, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని దశాబ్దాల పరిశోధనలు చెబుతున్నాయి. ఆ విషయం స్పష్టమే అయినప్పటికీ, మన ముందు ఉన్న అనేక రకాల ఆహార ఎంపికలలో దేనిపై దృష్టి పెట్టాలో అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది.

దీనికోసం ఒక సులభమైన మార్గం ఏమిటంటే, మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం.

అలా చేస్తే, మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం (ఫైబర్) అందుతాయి. దానివల్ల మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

ఉదాహరణకు, రోజుకు ఒక కాస్త అదనంగా పండు లేదా కూరగాయలు తీసుకోవడం వల్ల మన మానసిక ఉల్లాసం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం మన మెదడు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని న్యూట్రిషన్ సైన్స్ ద్వారా నిరూపితమవుతోంది.

''మేధో ఆరోగ్యానికి సంబంధించి ఆహారంలో మనం చేయగలిగే అతిపెద్ద మార్పు పీచు పదార్థాన్ని పెంచడం. ప్రతిరోజూ ఫైబర్ సప్లిమెంట్ తీసుకునే వారిలో కేవలం మూడు నెలల్లోనే మెదడు పనితీరు మెరుగుపడిందని ఇటీవలి ఒక అధ్యయనం కనుగొంది. మనకు నట్స్, పండ్లు, కూరగాయల వంటి అనేక వనరుల నుంచి ఫైబర్ సులభంగా లభిస్తుంది'' అని యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ అబెర్డీన్‌కు చెందిన గట్ బయాలజీ ప్రొఫెసర్ కరెన్ స్కాట్ చెప్పారు.

అలాగే, మనం సరైన రకమైన కొవ్వులను తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సాల్మన్, ట్రౌట్ వంటి చేపలు, వాల్‌నట్స్‌లో ఉండే పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మతిమరుపు వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తాయి.

అదే సమయంలో, ప్రాసెస్ చేసిన మాంసంలో ఉండే 'శాచురేటెడ్ ఫ్యాట్స్' తగ్గించడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇవి కాలేయం నుంచి 'సెరామైడ్స్' అనే హానికరమైన సమ్మేళనాలు విడుదల కావడానికి కారణమవుతాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులకు, అల్జీమర్స్ ముప్పు పెరగడానికి దారితీస్తాయి.

చివరగా, మన ఆహారంలో తగినంత కోలిన్ ఉండేలా చూసుకోవాలి. ఇది సాధారణంగా గుడ్లలో, ఇతర జంతు సంబంధిత ఆహారాలలో లభిస్తుంది.

కోలిన్ మన జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇది లోపిస్తే పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, కోలిన్ అధికంగా తీసుకోవడం వల్ల కుంగుబాటు (డిప్రెషన్) ముప్పు తగ్గుతుందని కూడా తేలింది.

రేఖా చిత్రం

ఫొటో సోర్స్, María Medem

ఉత్సాహంగా, మానసిక ఆరోగ్యంతో ఉంచడానికి వ్యాయామం...

మనం తగినంత వ్యాయామం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, కొన్నిసార్లు వారానికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా అనిపిస్తుంది.

అయితే, ప్రయోజనాలను పొందడానికి మీరు కచ్చితంగా కఠినమైన వ్యాయామాలు చేయనవసరం లేదని గ్రహించాలి.

నిత్యం చేసే సాధారణ నడక కూడా ఎంతో మేలు చేస్తుంది.

మీరు దుకాణాలకు వెళ్లినా లేదా పార్కుకు వెళ్లినా, మీరు ఎంత వేగంగా నడుస్తారనేది మీ మొత్తం ఆరోగ్యాన్ని, మీ మెదడు వయసును ప్రతిబింబిస్తుంది.

ఒకవేళ మీ కార్యాలయంలో ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉంటే, వాటికి బదులుగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి. రోజుకు కొన్ని మెట్లు ఎక్కడం కూడా మీ ఆరోగ్యానికి, మనస్సుకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.

మీరు ఏ రకమైన వ్యాయామం చేసినప్పటికీ, క్రమం తప్పకుండా కదలడం వల్ల మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది అల్జీమర్స్ బారినపడే అవకాశం ఉన్న మెదడు ప్రాంతాలను బలపరుస్తుంది. దాంతో వృద్ధాప్య ప్రభావాలను తట్టుకునే శక్తిని మెదడుకు ఇస్తుంది, మేధో సామర్థ్యం తగ్గడాన్ని నెమ్మదింపజేస్తుంది.

ఇటీవలి ఒక నివేదిక ప్రకారం, మధ్య వయస్సులో ఎక్కువగా వ్యాయామం చేసేవారికి, తక్కువగా చేసేవారితో పోలిస్తే మతిమరుపు వ్యాధి వచ్చే ముప్పు 45 శాతం తక్కువగా ఉంటుంది.

అన్నింటికంటే ముఖ్యంగా, వ్యాయామం మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, నైరాశ్యం (డిప్రెషన్) తగ్గిస్తుంది.

''ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అనేది బయట కనిపించే అంశాల కన్నా అంతర్గత అంశాలే చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు అంతర్గతంగా ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తే, బాహ్యంగానూ అలాగే కనిపిస్తారు" అని యూకేలోని లీడ్స్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ మెలానీ బుర్కే చెప్పారు.

ఆరోగ్యంగా ఉన్నామనే అనుభూతి మనం చురుగ్గా ఉండటానికి, మెరుగైన జీవన ప్రమాణాలను కలిగి ఉండటానికి చాలా కీలకమని ఆమె అన్నారు.

రేఖా చిత్రం

ఫొటో సోర్స్, María Medem

స్నేహితులకు ప్రాధాన్యం ఇవ్వండి...

'లైవ్ వెల్ ఫర్ లాంగర్' కోర్సు కోసం పరిశోధన చేస్తున్నప్పుడు నన్ను బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే, మన సామాజిక ప్రపంచం మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమనేది. ఇది కేవలం ప్రస్తుత జీవితానికే కాకుండా, వృద్ధాప్యంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని గ్రహించాను.

కొన్నిసార్లు రద్దీగా, సందడిగా ఉండే పబ్‌లకు వెళ్లడం కంటే హాయిగా ఇంట్లోనే గడపడానికే ఇష్టపడతాను. కానీ, స్నేహితులను కలిసిన తర్వాత మాత్రం నా మనసు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది.

స్నేహితులతో కలిసి రన్నింగ్ చేయడం లేదా కాసేపు కాఫీ తాగుతూ ముచ్చటించుకోవడం నా మూడ్‌ని ఎంతో మెరుగుపరుస్తుందని తెలుసుకున్నాను.

అయినప్పటికీ, చాలామంది ఇతరులను కలవడానికి కనీస ప్రయత్నం కూడా చేయడంలేదని గమనిస్తున్నాను.

ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనం పెరిగిపోతోందని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇతరులతో సామాజికంగా కలవడం మన ఆయుష్షును పెంచుతుంది.

ఒంటరిగా ఉండేవారి కంటే నలుగురితో కలిసి ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు.

నా సహోద్యోగి డేవిడ్ రాబ్సన్ నివేదించినట్లుగా, మన స్నేహబంధాలు మన రోగనిరోధక శక్తి నుంచి గుండె జబ్బుల వల్ల వచ్చే మరణాల ముప్పు వరకు ప్రతిదానిని ప్రభావితం చేస్తాయి". అవి మనం సుదీర్ఘ కాలం జీవించడానికి కూడా సహాయపడతాయి.

నిజానికి, మన సామాజిక సంబంధాలు మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతాయంటే, అది మనం చేసే వ్యాయామాలతో సమానం.

అందుకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు సంబంధించిన 'సోషల్ కనెక్షన్ కమిషన్' సామాజిక అనుబంధాన్ని ఒక 'ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యం'గా ప్రకటించింది.

ఎక్కువ మందితో కలవడానికి ఒక సులభమైన చిట్కా.. ఒకే తరహా ఆసక్తులు ఉన్నవారితో పరిచయాలు పెంచుకోవడం.

బహుశా ఒక కొత్త హాబీని అలవర్చుకోవడం, ఏదైనా భాష నేర్చుకొనే కోర్సులో చేరడం లేదా ఒక 'రన్నింగ్ గ్రూప్‌'లో సభ్యులుగా చేరడం వంటివి ఇందుకు సహాయపడతాయి.

నా సహోద్యోగి మోలీ గోర్మన్ స్వయంగా దీనిని ప్రయత్నించారు. ఆమె అనుభవం ఎలా ఉందో మీరు చదివి తెలుసుకోవచ్చు.

వ్యక్తిగతంగా నేను మాత్రం ప్రతి వారం మా ప్రాంతంలో జరిగే 5 కిలోమీటర్ల రన్నింగ్ ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతున్నాను.

అక్కడ రెగ్యులర్‌గా కనిపించే ముఖాలకు ఇచ్చే ఒక చిన్నపాటి 'హలో' కూడా నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. అలాగే ఆ వ్యాయామం కూడా నాలో ఉత్సాహాన్ని నింపుతుంది.

అపరిచితులతో లేదా పరిచయస్తులతో లోతైన బంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలో అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టమనిపించవచ్చు. కానీ, అందుకొక సులభమైన మార్గం ఉంది.

కేవలం సరైన ప్రశ్నలు అడగడం ద్వారా, అలాగే మన గురించి మనం వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ద్వారా ఇతరులతో మంచి స్నేహితులుగా మారవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. దీనినే 'పరస్పర వ్యక్తిగత విషయాల వెల్లడి' (రెసిప్రోకల్ సెల్ఫ్-డిస్‌క్లోజర్) అని అంటారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఆలోచనా దృక్పథంలో మార్పు

మనం మెరుగైన జీవనశైలి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, మన జీవితంలో భారీ మార్పులు చేసుకోవాలేమోనని అనుకుంటాం.

కానీ పైన పేర్కొన్నట్లుగా, జీవితాన్ని సమూలంగా మార్చేయడం కంటే చిన్న చిన్న మార్పులను క్రమం తప్పకుండా చేయడమే శారీరక, మానసిక ఆరోగ్యానికి అసలైన కీలకమని పరిశోధనలు చెబుతున్నాయి.

మనం స్వయంగా అర్థవంతమైన మార్పులను తీసుకురాగలమని గుర్తించడమే మొదటి అడుగు.

అలన్ గౌ చెప్పినట్లుగా, మార్పు సాధ్యమే అని ప్రజలు నమ్మకపోతే, వారు కొత్త ప్రయత్నాలకు అంగీకరించే అవకాశం చాలా తక్కువ.

వయసుతో సంబంధం లేకుండా మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి మనం ఏమి చేయగలమోననే అవగాహనను పెంచుకోవడం చాలా ముఖ్యం.

ఉదాహరణకు, ఒక కొత్త వ్యాయామం ప్రయత్నించడం, నూతన హాబీని వెతకడం లేదా ఏదైనా 'పుస్తక పఠన బృందం' (బుక్ గ్రూప్)లో చేరడం వంటి చిన్నపాటి పనులు కూడా ఇందుకెంతో సహాయపడతాయి.

ఈ దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నవారికొక ముఖ్య గమనిక... ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మేధోపరమైన శిక్షణ, గుండె ఆరోగ్యం వంటి అంశాలన్నీ సమన్వయం చేసుకున్నప్పుడు మతిమరుపు వ్యాధి (డిమెన్షియా) ముప్పు ఉన్న వృద్ధులలో మెదడు ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

ఇది 'ఫింగర్' (ఫినిష్ గెరియాట్రిక్ ఇంటర్వెన్షన్) అనే అధ్యయనంలో నిరూపితమైంది.

ఇందులో 60 నుంచి 77 ఏళ్ల మధ్య వయస్సున్న 1,260 మంది పాల్గొన్నారు.

వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులో వారికి రెండేళ్ల పాటు జీవనశైలిలో మార్పులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రెండో గ్రూపువారికి కేవలం సాధారణ ఆరోగ్య సలహాలు మాత్రమే ఇచ్చారు.

సాధారణ సలహాలు పొందిన వారితో పోలిస్తే, జీవనశైలిలో మార్పులు చేసుకున్న వారిలో మేధో సామర్థ్యం 25 శాతం మెరుగుపడటమే కాకుండా, జ్ఞాపకశక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా పెరిగాయని ఈ అధ్యయనం తేల్చింది.

చివరగా, జీవనశైలి మార్పుల గురించి మీ సలహా ఏమిటన్న ప్రశ్నకు అలన్ గౌ స్పందిస్తూ, ''ఇది ఇవాళ నుంచి మనం చేసే చిన్న చిన్న మార్పుల గురించి మాత్రమే. దీనికి మంత్రదండం లాంటి అద్భుత పరిష్కారాలేవీ లేవు. కాబట్టి, మన జీవితంలోని వివిధ రంగాలలో మనం చేసే ఈ చిన్న చిన్న మెరుగుదలలే కాలక్రమేణా ఒకదానికొకటి తోడై ప్రస్తుతం, భవిష్యత్తులో మనకు శాశ్వతమైన ప్రయోజనాలను అందిస్తాయని స్పష్టమవుతోంది'' అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)