'నాన్నా మేం కొరియా పోతాం అనేవారు, ఇండియన్ పేర్లతో పిలిచినా చిరాకు పడేవారు'

- రచయిత, శుభాంగి మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ శివారు, గాజియాబాద్‌లోని ఒక నివాస సముదాయంలో ముగ్గరు మైనర్ అమ్మాయిల మరణం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ టెక్నాలజీ యుగంలో పిల్లల పెంపకంపై చర్చను లేవనెత్తింది.
గాజియాబాద్‌లోని షాలీమార్ గార్డెన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో రకాల కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటన గురించి షాలీమార్ గార్డెన్ ఏసీపీ అతుల్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ''ఫిబ్రవరి 4వ తేదీ అర్ధరాత్రి సుమారు 2:15 గంటల సమయంలో, టీలా మోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భారత్ సిటీలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం అందింది'' అని చెప్పారు.
"వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనం పైనుంచి కిందపడి ముగ్గురు బాలికలు మరణించారు. వారిని 108 అంబులెన్స్‌లో లోనీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆ ముగ్గురూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విచారణ జరుగుతోంది" అని ఆయన వెల్లడించారు.
అయితే, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.


ఫొటో సోర్స్, ANI
పోలీసులు ఏం చెబుతున్నారు?
ట్రాన్స్ హిండన్ గాజియాబాద్ డిప్యూటీ కమిషనర్ నిమిష్ పాటిల్ 'బీబీసీ న్యూస్ హిందీ'తో మాట్లాడుతూ, ఇది ఆత్మహత్యేనా? మరేదైనా కోణం ఉందా అని విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
''ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఫోన్‌పై, కొరియన్ సంస్కృతిపై వ్యామోహమే ఈ ఘటనకు ప్రధాన కారణమై ఉండొచ్చని ప్రాథమిక విచారణను బట్టి తెలుస్తోంది'' అని నిమిష్ పాటిల్ అన్నారు.
"వారికి కొరియన్ మ్యూజిక్, డ్రామాలు, సెలబ్రిటీలు, జపనీస్ సినిమాలు, 'డోరెమాన్', 'షీన్-చాన్' వంటి కార్టూన్ షోలతో పాటు ఆన్‌లైన్ గేమ్స్ అంటే చాలా ఇష్టం.''
"కొరియన్ కల్చర్‌కి ఎంత ప్రభావితమయ్యారంటే, చివరికి వారు తమ పేర్లు కూడా మార్చేసుకున్నారు. కానీ, 'బ్లూ వేల్' వంటి టాస్క్-ఆధారిత గేమ్‌లు మాత్రమే ఈ ఘటనకు ప్రధాన కారణమని చెప్పలేం" అని నిమిష్ పాటిల్ అన్నారు.
తీవ్ర రక్తస్రావం, తీవ్రమైన గాయాలే ఆ ముగ్గురి మరణానికి కారణమని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. భవనం పైనుంచి పడడం వల్ల ఎముకలు కూడా విరిగిపోయాయి.
అయితే, తమను కొట్టినట్లు సూసైడ్ నోట్‌లో ఒక లైన్ రాసి ఉందని, కానీ పోస్టుమార్టం రిపోర్ట్‌లో అలాంటి గాయాలేవీ కనిపించలేదని డిప్యూటీ కమిషనర్ చెప్పారు.
''ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కోవిడ్ తర్వాత ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. అప్పుల్లో కూరుకుపోయింది. బాలికలను స్కూల్ కూడా మాన్పించారు'' అని వెల్లడించారు.
''కుటుంబంలో కూడా గొడవలు జరుగుతుండేవి. తండ్రి కూడా కూతుళ్లతో కఠినంగా వ్యవహరించేవారు. మొదట్లో ఈ అమ్మాయిల వద్ద రెండు ఫోన్లు ఉండేవి, వాటిని వారు ముగ్గురూ వాడుకునేవారు. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరు నెలల కిందట వాళ్ల నాన్న ఒక ఫోన్ అమ్మేశారు. ఈ ఘటన జరగడానికి 10 నుంచి 15 రోజుల ముందే ఆ రెండో ఫోన్‌ను కూడా అమ్మేశారు'' అని నిమిష్ పాటిల్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
బాలికల తండ్రి, ఇరుగుపొరుగు ఏమంటున్నారంటే..
ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగినప్పుడు వారి తండ్రి చేతన్ కుమార్ స్పందిస్తూ, ''నాకు 20 లక్షల నుంచి 30 లక్షలు నష్టపోయింది నిజమే. కానీ, దానివల్ల ఆత్మహత్య వంటి అఘాయిత్యానికి పాల్పడతారని అనుకోవడం లేదు. వాళ్లు తమ పేర్లు కూడా మార్చేసుకున్నారు'' అని అన్నారు.
'' నాన్నా, మేం కొరియా వెళ్తాం అంటుండేవారు. ఇండియన్ పేర్లతో పిలిచినా చిరాకు పడేవారు'' అని చేతన్ చెప్పారు.
''చేతన్ కుమార్ వృత్తిరీత్యా స్టాక్ బ్రోకర్. ఆయనకు ఇద్దరు భార్యలు. వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. అందరూ కలిసే ఉంటున్నారు. మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు'' అని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన గురించి అదే సొసైటీలో నివాసముంటున్న ఇరుగుపొరుగు వారితో బీబీసీ మాట్లాడింది.
ఆ బాలికల ఫ్లాట్‌కు రెండంతస్తుల కింద నివసించే ఆర్‌కే సింఘానియా మాట్లాడుతూ, ఏదో పెద్ద శబ్దం రావడంతో మెలకువ వచ్చిందని చెప్పారు.
ఆ తర్వాత సొసైటీలోని వాళ్లు బయటకు వచ్చి చూడగా, ముగ్గురు బాలికలు నేలపై పడి ఉన్నారని, వెంటనే పోలీసులకు సమాచారం అందించామని ఆయన అన్నారు.
సొసైటీ సెక్రటరీ రాహుల్ కుమార్ ఝా బీబీసీతో మాట్లాడుతూ, ''ఏం జరిగిందో ప్రాథమికంగా తెలుసుకునేందుకు పైకి వెళ్లిచూస్తే, ఆ గది లోపల నుంచి గడియపెట్టి ఉంది. ఆ గదిలో నుంచే బాలికలు దూకినట్లు చెబుతున్నారు. పోలీసులు ఆ తలుపు పగలగొట్టారు. లోపల కుటుంబ సభ్యుల ఫోటోలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో 'సారీ పాపా' అని రాసి ఉంది'' అని అన్నారు.
సొసైటీ నివాసి కుసుమ్ మాట్లాడుతూ, ''మా పిల్లలు రాత్రిపూట నిద్రపోలేకపోతున్నారు. అంతలా భయపడిపోయారు. పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారో కనీసం తల్లిదండ్రులకైనా తెలియాలి'' అని అన్నారు.
అలాగే, ఆ సొసైటీలోని వారు ఫోన్ వ్యసనం, ఫోన్ మేనేజ్‌మెంట్, కౌన్సెలింగ్ గురించి చర్చించుకుంటూ కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
ఫోన్ అడిక్షన్ అనేది మత్తుపదార్థాల వ్యసనం లాంటిదేనని పిల్లల మానసిక వైద్యులు నీలేశ్ దేశాయ్ అన్నారు.
"కౌమారం, యవ్వనం అనేది చాలా సున్నితమైన దశ. మారుతున్న సమాజంతో పాటు సాంకేతికత ప్రభావం కూడా పిల్లలపై పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, పిల్లల నుంచి ఫోన్ ఒక్కసారిగా లాగేసుకుంటే వారికి అదో పెద్ద విపత్తులా అనిపిస్తుంది. మత్తు పదార్థాలకు బానిస కావడం కంటే ఇది తక్కువేమీ కాదు'' అని వివరించారు.
''ఫోన్ వినియోగం వల్ల మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. ఇది మనకు సంతోషాన్ని ఇచ్చే శరీరంలోని ఒక హార్మోన్. మత్తుపదార్థమంత శక్తిమంతమైనది. తల్లిదండ్రులు ఒక్కసారిగా ఫోన్ లాక్కున్నప్పుడు, పిల్లలు 'కెమికల్ విత్‌డ్రావల్' (రసాయన ఉపసంహరణ వల్ల కలిగే మానసిక ఆందోళన)కు గురవుతారు'' అని ఆయన చెప్పారు.
దిల్లీకి చెందిన మానసిక వైద్యనిపుణులు డాక్టర్ భావనా బర్మీ మాట్లాడుతూ, ''చాలా కాలం పాటు స్కూల్‌కు వెళ్లకపోవడం అంటే, కేవలం చదువు కోల్పోవడం మాత్రమే కాదు. ఇది మానసిక బలహీనతలను సృష్టిస్తుంది. యవ్వన దశలో ఉన్న పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు స్కూల్ దోహదం చేస్తుంది" అని అన్నారు.
''నేను చాలామంది టీనేజర్లకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చాను. కే-పాప్, కే-డ్రామాలు, కొరియన్ బ్యూటీ ట్రెండ్స్, ఐడల్స్ పట్ల విపరీతమైన ఆకర్షణ ఒక వ్యసనంగా మారింది. అంతులేని కంటెంట్, ఏఐ చాట్‌బాట్‌లతో చేసే రోల్-ప్లే (కల్పిత పాత్రలుగా నటించడం) ఇంకా ఎక్కువ హాని కలిగిస్తాయి'' అని ఆమె వివరించారు.
''పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే సంవత్సరాల తరబడి స్కూలుకు వెళ్లకపోవడం వల్ల తోబుట్టువులు కలిసి ఒకే రకమైన కంటెంట్‌కు బానిసలయ్యే అవకాశం ఉంది. వారు కలిసి చూస్తారు, చర్చించుకుంటారు, తమకంటూ ఒక ఉమ్మడి కొరియన్ వ్యక్తిత్వాన్ని సృష్టించుకుంటారు. ఇది వారి చుట్టూ 'మనం వర్సెస్ ప్రపంచం' అనే ఒక భ్రమను సృష్టిస్తుంది. అప్పుడు ఆ కల్పనా ప్రపంచమే వారికి ఏకైక సురక్షితమైన, ఉత్తేజకరమైన ప్రదేశంగా కనిపిస్తుంది'' అని డాక్టర్ భావనా బర్మీ అన్నారు.

ఫొటో సోర్స్, Supplied
తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు....
పిల్లల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫోన్ వ్యసనాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు చేపట్టాలని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు:
- తల్లిదండ్రులు ఫోన్ వాడడం తగ్గించి పిల్లలకు ఆదర్శంగా నిలవాలి.
- పిల్లలు రోజుకు ఎన్ని గంటలు ఫోన్ లేదా ఐప్యాడ్ చూడాలో నిర్ణయించి, ఒక కాలపరిమితి విధించాలి.
- క్రీడలు, ఇతర ఆరోగ్యకరమైన హాబీల వైపు ప్రోత్సహించాలి.
- ఇతరులతో కలివిడిగా ఉండేలా చూడాలి.
(అదనపు రిపోర్టింగ్: శుభ్ రాణా, బీబీసీ ట్రైనీ)
(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాని నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వ జీవన్ సాథీ హెల్ప్ లైన్ నంబర్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000).
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








