వెలిగొండ: అదిగో ఇదిగో అంటూ 30 ఏళ్లు.. ప్రారంభోత్సవమైనా నీళ్లు రాలేదు

వెలిగొండ ప్రాజెక్టు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 11 నిమిషాలు

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని 4 లక్షల 47 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 16 లక్షల మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి ముప్పై ఏళ్లు.

ప్రాజెక్టు ప్రారంభిస్తామంటూ ఈ మూడు దశాబ్దాల్లో ఎన్నిసార్లు ఇదిగో అదిగో అంటూ సీఎంలు, మంత్రుల నుంచి ప్రకటనలు వచ్చాయో ఒక్కసారి చూద్దాం..

  • ప్రాజెక్టుకి 1996 మార్చి 5న అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. వీలైనంత త్వరగానే ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటన
  • 2004 అక్టోబర్‌ 27న నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మళ్లీ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన
  • 2018 జూన్‌లో అప్పటి సీఎం చంద్రబాబు ఒంగోలుకి వచ్చి 2019 సంక్రాంతికల్లా ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రకటన.
  • 2020 ఫిబ్రవరిలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రాజెక్టును సందర్శించి అదే ఏడాది ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని ప్రకటన
  • 2021 అక్టోబర్‌లో ఒంగోలు వచ్చిన వైఎస్‌ జగన్‌.. అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ.. మరుసటి ఏడాది ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని హామీ
  • 2022 ఆగస్టులో ప్రకాశం జిల్లా చీమకుర్తికి వచ్చిన జగన్‌ అక్కడి బహిరంగ సభలో, ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు ఈసారి ప్రకటించిన సమయం 2023 సెప్టెంబర్‌.
  • 2023 ఏప్రిల్‌లో మార్కాపురం బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఆ ఏడాది అక్టోబర్‌ నెలాఖరుకల్లా ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని హామీ
  • 2024 మార్చి 6న ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన రెండు టన్నెల్స్‌ పూర్తయ్యాయంటూ జాతికి అంకితం చేస్తున్నట్టు అప్పటి సీఎం జగన్‌ ప్రకటన
  • 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పనులు పూర్తి కాకుండానే వైఎస్‌ జగన్‌ వెలిగొండను ప్రారంభించారంటూ సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు.. భూసేకరణ సహా అన్ని పనులూ పూర్తి చేసి త్వరలో ప్రాజెక్టును ప్రారంభిస్తామని హామీ.
  • 2025 నవంబర్‌ 7, నవంబర్‌ 12, డిసెంబర్‌ 10.. ఇలా మూడుసార్లు ప్రాజెక్టు పనుల వద్దకు వచ్చిన మంత్రి నిమ్మల, 2026 జులై కల్లా ప్రాజెక్టు తొలిదశను పూర్తి చేస్తామని ప్రకటన

ఇలా... సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట మొదలై.. ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులతో రెండుసార్లు శంకుస్థాపన చేసుకుని, ఓ ముఖ్యమంత్రితో దాదాపు రెండేళ్ల కిందట లాంఛనంగా ప్రారంభోత్సవం కూడా చేసుకున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిస్థితి ఇది. నేటికీ ఇది కార్యరూపంలోకి రాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఏడాది జులై నెలాఖరు లేదా ఆగస్ట్ నాటికి కనీసం ప్రాజెక్ట్‌ తొలిదశ పూర్తి చేసి నీళ్లు విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

ఈ నేపథ్యంలో అసలు అక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటి? క్షేత్ర స్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి? ప్రభుత్వం పెట్టుకున్న ఫేజ్‌–1 లక్ష్యసాధనకు మరో ఆరు నెలలే గడువు ఉన్న నేపథ్యంలో ఇంకా చేపట్టాల్సిన పనులు ఏమిటి?

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, వాస్తవ పరిస్థితులను విశదీకరిస్తూ ‘బీబీసీ తెలుగు’ గతంలో కథనాలను ప్రచురించింది.

ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో రెండో టన్నెల్‌ నిర్మాణ పనుల పరిస్థితిపై 2021 ఫిబ్రవరిలో బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్‌ ప్రచురించింది. అప్పటికీ రెండో టన్నెల్‌ నిర్మాణ పనులు కొలిక్కి రాలేదు.

ఆ తర్వాత, వెలిగొండ మొదటి టన్నెల్‌లోకి కృష్ణా నీరు చేరినప్పుడు, టన్నెల్‌లోకి నీరు ఎలా వచ్చింది? దీనిపై అధికారులు ఏం చెబుతున్నారు? అంటూ 2021 జులైలో మరో కథనాన్ని బీబీసీ ప్రచురించింది.

ఒక టన్నెల్ అందుబాటులోకి వచ్చినా.. ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే ప్రయత్నం ఎందుకు జరగడం లేదు? వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చేది ఎప్పుడు? ఎందుకు ఆలస్యమవుతోంది? అంటూ 2022 మార్చిలో మరో కథనాన్ని బీబీసీ గ్రౌండ్ రిపోర్టుగా అందించింది. అయితే, దీనికి ప్రధాన సమస్య నిర్వాసితులకు అందించాల్సిన ప్యాకేజీనేనని బీబీసీ తన కథనంలో పేర్కొంది.

'పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి, రైతులకు నీళ్లు అందిస్తామని 2020లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత, 2022 ఆగస్టు నాటికి అంటూ పొడిగించారు. చివరకు 2023 ఖరీఫ్ సమయానికి వెలిగొండ కాలువల్లో నీళ్లు పారిస్తామని చెప్పారు. ఇన్ని గడువులు ముగిసినా 2024 నాటికి కూడా ఇచ్చిన మాట నెరవేరలేదు...' అంటూ బీబీసీ మరో కథనాన్ని 2024 మార్చిలో ప్రచురించింది.

వెలిగొండ ప్రాజెక్టు స్వరూపం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వెలిగొండ ప్రాజెక్టు మ్యాప్

అసలు ఈ ప్రాజెక్టు స్వరూపం ఏంటి?

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద వర్షాకాలంలో 52 అడుగుల వరకు.. అంటే ఫుల్‌ కెపాసిటీ వరకు నీళ్లు వస్తే.. ఆ అదనపు జలాలను రిజర్వాయర్‌ వద్ద గ్రావిటీ ద్వారా రెండు భారీ టన్నెల్స్‌ నుంచి బయటకు తెచ్చి... అక్కడి నుంచి 18.88 కిలోమీటర్ల దూరంలో ఉన్న 54 టీఎంసీల కెపాసిటీ గల నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌లో స్టోరేజ్‌ చేస్తారు.

నల్లమల సాగర్‌ మూడు గేట్ల నుంచి.. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ ద్వారా సాగునీరు, తాగునీరు పంపిణీ చేయాలి.

కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలోని 21 మండలాలతో పాటు ప్రకాశంలో 2, నెల్లూరులో 5, కడపలో 2 మండలాలు.. మొత్తంగా 30 మండలాల్లోని 4 లక్షల 47 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

ఈ 30 మండలాల్లోని 15.25 లక్షల మంది ప్రజలకు కూడా తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

30 ఏళ్లలో ఏం జరిగిందంటే...

1994లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు తెరపైకి రాగా... 1996 మార్చి 5న అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ వద్ద దాదాపు రూ. 980 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

మార్కాపురం నుంచి గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన సీపీఐ నేత పూల సుబ్బయ్య పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టారు.

అయితే, చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు అనుమతులు జాప్యం కావడంతో పనులు అనుకున్నంతగా ముందుకు సాగలేదు.

ఆ తర్వాత 2004లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఏడాది అక్టోబర్‌ 27న గొట్టిపడియ వద్దనే మళ్లీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.

రెండు టన్నెల్స్‌ను తవ్వాలని నిర్ణయించగా... వైఎస్‌ హయాంలో ఓ టన్నెల్‌ నిర్మాణం మొదలైంది.

2007లో మొదలైన మొదటి టన్నెల్‌ నిర్మాణ పనులు 2021లో అంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత పూర్తయ్యాయి.

2008లో మొదలైన టన్నెల్‌–2 పనులు 2024 మార్చి 5 నాటికి పూర్తి చేసినట్టు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు మార్చి 6న ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన టన్నెల్స్‌ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఆర్‌ అండ్‌ ఆర్‌ను కూడా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలం సీజన్‌లో నల్లమల సాగర్‌ను నీటితో నింపుతామని అప్పటి వైసీపీ పాలకులు ప్రకటించారు.

 వెలిగొండ ప్రాజెక్టు, చంద్రబాబు

ఫొటో సోర్స్, Facebook/Nara Chandrababu Naidu

ఫొటో క్యాప్షన్, వెలిగొండ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు (ఫైల్‌ఫొటో)

ఆ తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి, రెండో టన్నెల్‌ పనులు పూర్తి కాకుండానే హడావుడిగా గత వైసీపీ సర్కారు ప్రారంభోత్సవం చేసిందని ఆరోపించింది.

పెండింగ్‌ పనులు చేపట్టి 2026 జులై నెలాఖరు లేదా ఆగస్టు నాటికి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

టన్నెల్‌–1

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, టన్నెల్‌–1

ఈ 19 నెలల్లో ఏం జరిగిందంటే..

ప్రాజెక్టు నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం రెండు ఫేజ్‌లుగా విభజించింది.

ముందుగా ఆగస్టు 2026 నాటికి ఒక లక్షా 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మార్కాపురం జిల్లా, పశ్చిమ ప్రకాశం జిల్లాలోని 4 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు బీబీసీకి వెల్లడించారు.

దీన్నే ఫేజ్‌ 1 (తొలిదశ పనులు)గా భావించి ఆ మేరకు పనులు చేస్తున్నామని అధికారులు వివరించారు.

తొలి దశ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత రెండో దశలో మిగిలిన 3 లక్షల 27 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడంతో పాటు, 12 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంగా పనులు నిర్దేశించుకుంటామని తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Facebook/Nara Chandrababu Naidu

ఫొటో క్యాప్షన్, ప్రాజెక్టు పనులపై అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్ష (ఫైల్ ఫోటో)

ఫేజ్‌–1లో ఇంకా పూర్తికాని 1924 ఎకరాల భూసేకరణ

ఈ ప్రాజెక్టు ఫేజ్‌–1కి మొత్తం 24 వేల 931 ఎకరాల భూమి కావాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం 23 వేల 7 ఎకరాలను మాత్రమే సేకరించింది ప్రభుత్వం.

ఇంకా 1924 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది.

పెండింగ్‌లో ఉన్న ఈ భూసేకరణకు రంగం సిద్ధం చేశామని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

7,225మందికి అందని ప్యాకేజీ

ఇక రీహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ (ఆర్‌ అండ్‌ ఆర్‌) పనులు ఎంతవరకు వచ్చాయని పరిశీలిస్తే..

ఈ ప్రాజెక్టు ప్రభావంతో 11 గ్రామాలు ముంపుకు గురవుతాయి.

సుంకేశుల, కన్నూతల, గుండంచర్ల, గొట్టిపడియ, చింతలముడిపి, కాటంరాజుతండా, అక్కచెరువు తండా, లక్ష్మీపురం, సాయినగర్, కృష్ణానగర్, రామలింగేశ్వరం గ్రామాలను తరలించాలని అధికారులు నిర్ణయించారు.

మొత్తంగా ఈ 11 గ్రామాలకు సంబంధించి 7321 మందిని ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి అర్హులుగా గుర్తించారు.

ఇప్పటివరకు కేవలం 96 మందికి మాత్రమే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి సంబంధించి డబ్బులు పంపిణీ చేశారు.

మిగిలిన 7,225 మందికి నిధుల పంపిణీ జరగాల్సి ఉంది.

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2

రూ. 880 కోట్లకు బడ్జెట్‌లో 80 కోట్లు మాత్రమే విడుదల

పునరావాస ప్యాకేజీ కింద ఇంకా 7,225 మందికి డబ్బుల పంపిణీకి రూ. 880 కోట్లు కావాల్సి ఉండగా, వార్షిక బడ్డెట్‌లో రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేశారు.

ఆ నిధులతో 637 మంది నిర్వాసితులకు డబ్బులు ఇచ్చేందుకు ఇప్పటికే బిల్లులు అప్‌లోడ్‌ చేశారు.

మిగిలిన రూ. 800 కోట్లు జులై నెలాఖరులోగా వస్తేనే వారిని ఖాళీ చేయించడం కుదురుతుంది.

మూడు చోట్ల 7 పునరావాస కాలనీలు

పునరావాసానికి సంబంధించి పెద్దారవీడు, మార్కాపురం, అర్ధవీడు.. ఈ మూడు ప్రాంతాల్లో ఏడు పునరావాస కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తోంది.

ఇప్పటికి నాలుగు కాలనీల నిర్మాణం పూర్తి కాగా... మరో మూడు కాలనీల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అన్ని సౌకర్యాలతో త్వరలోనే పూర్తవుతాయనీ అధికారులు తెలిపారు.

ఈ మేరకు ఇప్పటికే అర్హులందరికీ పట్టాల పంపిణీ చేశామని అధికారులు వివరించారు.

'' ఆర్‌ అండ్‌ ఆర్‌కి సంబంధించిన భూసేకరణ పనులు, పునరావాస కాలనీల్లో ఏర్పాట్లు, అక్కడికి నిర్వాసితుల తరలింపు.. అన్నింటినీ జూన్‌ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌ ఇచ్చింది. లక్ష్యసాధనకు కృషి చేస్తున్నాం'' అని వెలిగొండ ప్రాజెక్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ స్పెషల్‌ కలెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి బీబీసీకి వెల్లడించారు.

ప్రాజెక్ట్‌ పనులు ఎంత వరకు వచ్చాయంటే..

ఇక ప్రధాన ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే.. రెండు టన్నెళ్ల పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి.

రెండో టన్నెల్‌ పనులకు సంబంధించి లైనింగ్‌ వర్క్‌ పెండింగ్‌ ఉందని.. త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ వద్ద ఉండే మూడు గేట్లలో రెండు గేట్లు పూర్తి అయ్యాయి. మూడో గేట్‌ పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి.

ఇక నల్లమల సాగర్‌ వరకు వచ్చే ఫీడర్‌ కెనాల్‌ పనులు కొనసాగుతున్నాయి.

ఈ ఫీడర్‌ కెనాల్‌ పనులకు ప్రభుత్వం రూ.456 కోట్లు విడుదల చేసింది.

త్వరలో ఈ పనులు పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తారని అధికారులు చెబుతున్నారు.

రోణంకి గోపాలకృష్ణ ఐఎఎస్‌

ఫొటో సోర్స్, Facebook/Gopalakrishna Ronanki

ఫొటో క్యాప్షన్, రోణంకి గోపాలకృష్ణ, ఐఎఎస్‌

‘ఫేజ్‌–1 పూర్తికి ఇంకా 1372 కోట్లు కావాలి’

ఫేజ్‌–1 పూర్తయ్యేందుకు ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులకు కానీ, భూసేకరణకు కానీ, ప్రాజెక్టు పనులకు కానీ, ఇంకా 1372 కోట్లు కావాల్సి ఉందని అధికారులు బీబీసీకి వెల్లడించారు.

ఇప్పటివరకు ఫేజ్‌–1 కోసం రూ.528 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, మిగిలిన 1372 కోట్లు వస్తే నిర్దేశించిన కాలపరిమితిలోగా అంటే జూలై నెలాఖరుకల్లా పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఫేజ్‌–1 పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తోందని ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు స్పెషల్‌ కలెక్టర్‌ (పూర్తి అదనపు బాధ్యతలు)గా పనిచేసిన ఐఎఎస్‌ అధికారి రోణంకి గోపాలకృష్ణ బీబీసీకి తెలిపారు.

‘ఆరు నెలల్లోగా పనులు పూర్తవుతాయి’

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు ఫస్టుకల్లా ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ ఉంచి కాలువలకు విడుదల చేసేలా పనులు చేస్తున్నామని వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పర్యవేక్షిస్తున్న ఇరిగేషన్‌ ఎస్‌ఈ అబుతలీమ్‌ సౌదాగర్‌ బీబీసీకి చెప్పారు.

వాస్తవ పరిస్థితులు అలా లేవు కదా.. అటు భూసేకరణ పనులు, పరిహారం చెల్లింపు పనులు పెండింగ్‌లో ఉన్నాయని బీబీసీ ప్రస్తావిస్తే.. ''ఆరు నెలల్లో అన్నీ పూర్తవుతాయి. ఫస్ట్‌ ఫేజ్‌ ఎలాగైనా ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు సీరియస్‌గా పనులు చేస్తున్నాం'' అని సౌదాగర్‌ చెప్పారు.

ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిస్థితిపై మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది.

రెండు రోజుల వ్యవధిలో ఐదు సార్లు ఫోన్‌‌ కాల్, వాట్సాప్‌ మెసేజ్‌ చేసింది ‘బీబీసీ తెలుగు’. ఆయన స్పందించగానే కథనంలో అప్‌డేట్‌ చేస్తాం.

ప్రకాశం జిల్లా కలెక్టర్‌ రాజాబాబుతో ఫోన్‌‌‌లో మాట్లాడేందుకు ప్రయత్నించింది. స్పందన రాగానే ఇక్కడ అప్డేట్ చేస్తాం.

 మంత్రి డోలా బాల శ్రీ వీరాంజనేయస్వామి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మంత్రి డోలా బాల శ్రీ వీరాంజనేయస్వామి

'వాళ్లు పూర్తి కాకుండానే ప్రారంభించారు... మేం అలా కాదు'

''వైసీపీ హయాంలో కీలకమైన భూసేకరణ, ఆర్‌ అండ్ ఆర్‌ పనులు, కాలువ పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. మేం అలా కాదు. పక్కాగా ప్రాజెక్టులోకి నీళ్లు వదిలిన తర్వాతే ప్రారంభోత్సవం చేస్తాం. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి'' అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బీబీసీతో అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు

‘ఆ ఆరోపణలు సరికాదు’

ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి డోలా వీరాంజనేయ స్వామి చేసిన వాదనను అదే జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు.

''2019–24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులో కీలకమైన రెండు టన్నెల్స్‌ పూర్తయిన సందర్భంగా జాతికి అంకితం చేశాం. మార్చిలో మేం కార్యక్రమం చేశాం. వాస్తవానికి ఆ తర్వాత వర్షాకాలంలో నీళ్లు రావాలి. ఆలోగా భూసేకరణ పనులు, రెగ్యులేటర్‌ వర్క్స్‌ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వర్షాకాలంలోగా ఆ పనులు పూర్తి చేయాలని భావించాం. ఈలోగా ప్రభుత్వం మారింది. కీలకమైన పనులన్నీ మేం చేశాం. కూటమి ప్రభుత్వం మాపై విమర్శలు చేసే బదులు వేగంగా పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తే మేమూ ఆనందపడతాం'' అని సుబ్బారెడ్డి అన్నారు.

నీటిపారుదల రంగ నిపుణులు లక్ష్మీనారాయణ

ఫొటో సోర్స్, LaxmiNarayana

ఫొటో క్యాప్షన్, లక్ష్మీనారాయణ

‘ఆ ఫేజ్‌–1 అయినా మొదలైతే సంతోషమే...’

ప్రభుత్వం చెబుతున్న విధంగా ఆరు నెలల్లో ముందుగా ఫేజ్‌–1 మొదలైనా సంతోషమే అని నీటిపారుదల రంగ నిపుణులు టి. లక్ష్మీనారాయణ బీబీసీతో అన్నారు.

''ఇంకా పనులు జరుగుతున్నాయి. కీలకమైన అప్రోచ్‌ కెనాల్‌ పనులు ఇంకా అవ్వలేదు. డిస్ట్రిబ్యూటింగ్‌ కెనాల్స్‌ మీద దృష్టి పెట్టడం లేదు. ఈ పనులన్నీ పూర్తి చేసినా.. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు అయ్యే అవకాశం కనిపించడం లేదు. పరిహారం డబ్బులు ఇస్తే కదా.. నిర్వాసితులు అక్కడి నుంచి ఖాళీ చేసేది. ముందు ఈ పనే కీలకం. నిర్వాసితులు ఖాళీ చేయకుండా సాగర్‌లో నీళ్లు నింపి ఏం ప్రయోజనం. ఇవన్నీ చేసేందుకు కనీసంగా 4 వేల నుంచి 5 వేల కోట్లు అవసరం. ఇన్ని నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందా.. ఏమో చూద్దాం'' అని లక్ష్మీనారాయణ అన్నారు.

 శ్యాంప్రసాద్‌

ఫొటో సోర్స్, ShyamPrasad

ఫొటో క్యాప్షన్, వెలిగొండ సాధన సమితి నాయకులు డాక్టర్‌ శ్యాంప్రసాద్‌

'ఇంకా ఫేజ్‌–1 అనడం అన్యాయం'

30 ఏళ్ల కిందట మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుపై పాలకులు సీరియస్‌ దృష్టి లేదనీ, ఇప్పటి కూటమి పాలకులేమో ఇంకా ఫేజ్‌–1 అంటూ కాలయాపన చేయాలని చూస్తున్నారని వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి నాయకులు డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆరోపించారు.

మొత్తం ప్రాజెక్టు పనులను చేపట్టి ఆ మేరకు నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని రూ.10.50 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచి వెంటనే పరిహారం చెల్లించాలని ప్రకాశం జిల్లా రైతు సంఘం నాయకుడు హనుమారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. కట్‌ ఆఫ్‌ తేదీని ఎత్తివేసి, వెలిగొండ నీటిని విడుదల చేసే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

సుంకేశుల గ్రామం, వెలిగొండ ప్రాజెక్టు

ఫొటో సోర్స్, Ramesh

ఫొటో క్యాప్షన్, ఖాళీ చేయాల్సిన ముంపు గ్రామం సుంకేశుల

పరిహారం కోసం ఎదురుచూపులు

పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపుగా పాతికేళ్లుగా వేచి చూస్తున్నామని ఖాళీ చేయాల్సిన గ్రామాల్లో పెద్ద పంచాయతీ సుంకేశుల సర్పంచ్‌ సురేష్‌ అన్నారు.

మరోవైపు పరిహారం అర్హుల జాబితాల్లో తప్పులు దొర్లాయనీ, తమ కుటుంబ సభ్యులకు పొలానికి, ఇంటికి సంబంధించి పరిహారం ఇచ్చిన అధికారులు, ఇప్పుడు పునరావాస కాలనీలో మాత్రం ఇల్లు మంజూరు చేయలేదనీ పెద్దారవీడుకి చెందిన ఏడుకొండలు చెప్పారు.

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ తమకు వర్తించదని అంటున్నారని, అదేమని అడిగితే సరైన కారణాలు చెప్పడం లేదని, ఇలాంటి తప్పుల తడకలను సరి చేయాలని కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)