‘సవాళ్లున్నాయి కానీ.. ఇథనాల్ బ్లెండింగ్‌తో 20 శాతం పెట్రోల్ ఆదా చేస్తున్నాం, ఎలక్ట్రిక్ మొబిలిటీతో ఇంధన అవసరాలు తగ్గించాం.. ఎరువుల కొరత రానివ్వం’

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
చదివే సమయం: 6 నిమిషాలు

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధంపై సోమవారం లోక్‌సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారత్ కూడా 'ఊహించని సవాళ్లను' ఎదుర్కొంటోందని అన్నారు.

ఈ సంఘర్షణ ప్రభావం సుదీర్ఘకాలం ఉండనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా సమయంలోనూ సప్లయి చెయిన్‌లో సంక్షోభం తలెత్తిందని, అయితే దేశం ఆ సవాలును కలసికట్టుగా ఎదుర్కొందని చెప్పారు.

''మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూడు వారాలకు పైగా ఈ సంక్షోభం కొనసాగుతోంది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోంది'' అని ప్రధాని మోదీ అన్నారు.

''ఈ యుద్ధం భారత్‌కు ఊహించని సవాళ్లను కూడా తీసుకొచ్చింది. ఈ సవాళ్లు ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతకు సంబంధించినవి. మానవతా సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని తెలిపారు.

ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత.. ఈ మొత్తం అంశంపై పార్లమెంట్ లోపల చర్చ జరగాలనే తన డిమాండ్‌ను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంట్ వెలుపల పునరుద్ఘాటించారు.

''ఆయన దేశానికి సంబంధించిన పరిస్థితులను తెలిపారు. కొత్తగా చెప్పిందేమీ లేదు. మేమిచ్చిన నోటీసుపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. అప్పుడైతేనే మేం కూడా స్పందించి, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలియజేస్తాం. అదే మంచిదని నేను అనుకుంటున్నా'' అని ప్రియాంక గాంధీ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రధాని మోదీ తన ప్రసంగంలో మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుత పరిస్థితి, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు, హార్ముజ్ జలసంధి మీదుగా రాకపోకలకు అంతరాయం గురించి మాట్లాడారు.

అలాగే దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల నిల్వలు, సరఫరా గురించిన సమాచారాన్ని అందించారు.

''ఈ సమయంలో పశ్చిమాసియా దేశాల నేతలతో రెండుసార్లు చర్చలు జరిపాను. ఆ దేశాల నాయకులు భారతీయుల భద్రతకు హామీ ఇచ్చారు. అయితే, దురదృష్టవశాత్తు కొంతమంది భారతీయులు మరణించారు'' అని మోదీ అన్నారు.

''ప్రభావిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు భారత పర్యటకులతో, అక్కడ ఉంటున్న ప్రజలతో 24 గంటల పాటు సంప్రదింపులు జరుపుతూ, వారికి అవసరమైన సహాయం అందిస్తున్నాయి'' అని చెప్పారు.

''యుద్ధం మొదలైనప్పటి నుంచి 3,75,000 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇరాన్ నుంచి వెయ్యి మంది భారతీయులు సురక్షితంగా వచ్చారు. వారిలో 700 మందికి పైగా వైద్య విద్యను అభ్యసించే యువత ఉన్నారు. ఈ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది'' అని ప్రధాని మోదీ తెలిపారు.

గ్యాస్ సిలిండర్లు, ఇరాన్ యుద్ధం, గ్యాస్ సరఫరా

ఫొటో సోర్స్, AFP via Getty Images

చమురు, గ్యాస్ పరిస్థితేంటి?

''భారత్ పెద్ద మొత్తంలో క్రూడాయిల్, గ్యాస్, ఎరువులు వంటి ఎన్నో నిత్యావసరాలను హార్ముజ్ జలసంధి మీదుగానే పొందుతుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి, హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలు పెద్దగా ప్రభావం పడకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది'' అని మోదీ తెలిపారు.

''భారత్ వద్ద క్రూడాయిల్‌కు సంబంధించి 53 లక్షల టన్నుల వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. అదనంగా 65 లక్షల టన్నుల నిల్వలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయిల్ కంపెనీల వద్ద ప్రత్యేక నిల్వలు ఉన్నాయి'' అని చెప్పారు.

''చమురు, గ్యాస్, ఎరువులను తీసుకొస్తోన్న నౌకలు సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా మేం ప్రయత్నిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా భాగస్వాములందరితో చర్చలు జరుపుతున్నాం. ఈ ప్రయత్నాలతోనే హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన అనేక నౌకలు భారత్‌కు చేరుకున్నాయి'' అని వెల్లడించారు.

''ఈ సంక్షోభ సమయంలోనే దేశం చేపట్టిన మరో కార్యక్రమం చాలా ఉపయోగకరంగా నిలిచింది. గత పదేళ్లలో ఇథనాల్ ఉత్పత్తి, బ్లెండింగ్ (పెట్రోల్‌లో కలపడం) పెరిగింది. నేడు, పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నాం. దీనివల్ల, 4.5 కోట్ల బ్యారెళ్ల చమురు దిగుమతులు తగ్గాయి. రైల్వేలను విద్యుద్దీకరించడంతో, ఏటా 180 కోట్ల లీటర్ల డీజిల్‌ ఆదా అవుతోంది'' అని చెప్పారు.

''నేడు మెట్రో నెట్‌వర్క్ 1100 కిలోమీటర్లకు చేరుకుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీకి మేం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రాలకు కేంద్రం 15 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందించింది. ప్రత్యామ్నాయ ఇంధనం కోసం పని చేస్తున్నాం. ఇది భారత భవిష్యత్‌ను మరింత సురక్షితంగా మార్చుతుంది'' అని ఆశాభావం వ్యక్తం చేశారు.

''ఈ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం ఒక వ్యూహంతో పనిచేస్తోంది. ప్రతి రంగంలోని వారితో మేం చర్చిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇంటర్-మినిస్టీరియల్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇది ప్రతిరోజూ సమావేశమవుతూ... అవసరమైన పరిష్కారాల కోసం పనిచేస్తోంది'' అని వెల్లడించారు.

ప్రభుత్వం, పరిశ్రమ ఉమ్మడి ప్రయత్నాలతోనే ఈ పరిస్థితిని భారత్ ఎదుర్కోగలదని మోదీ చెప్పారు.

ఎల్‌పీజీ సరఫరా

మధ్య ప్రాచ్యంలోని పరిస్థితిపై లోక్‌సభలో మాట్లాడుతూ.. దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

''దేశం ఎల్‌పీజీ అవసరాల్లో 60 శాతం ఉత్పత్తి చేసుకుంటుందని మనందరికీ తెలిసిందే. దేశంలో ఈ ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాం. పెట్రోల్, డీజిల్ సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేలా పనులు జరుగుతున్నాయి'' అని తెలిపారు.

దేశీయ ఎల్‌పీజీ వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.

హార్ముజ్ జలసంధి

‘హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం సరైనది కాదు’

''మొదట్నుంచీ ఈ సంఘర్షణ విషయంలో మేం శాంతిని కోరుతున్నాం. ఉద్రిక్తతలను తగ్గించి, ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని కోరాం. ఇంధనం, రవాణా, పౌరులు లక్ష్యంగా దాడులు జరగకూడదని చెప్పాం. వాణిజ్యనౌకలపై దాడులు, హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ఆమోదయోగ్యం కాదు'' అని మోదీ అన్నారు.

''ఈ సమస్యకు చర్చలు, దౌత్యం మాత్రమే ఏకైక పరిష్కారం. మేం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఉద్రిక్తతలను తగ్గించి, సంక్షోభానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే చేపడుతున్నాం'' అని చెప్పారు.

సైబర్, తీర ప్రాంతం, సరిహద్దు భద్రత వంటి అన్ని శాంతి భద్రత సంస్థలను అప్రమత్తం చేసినట్లు మోదీ తెలిపారు.

''ఈ సంక్షోభ ప్రభావం సుదీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది. మనం చాలా జాగ్రత్తగా, అప్రమత్తతో ఉండాలి. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకునేవారు అబద్ధాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తారు. వారిని అడ్డుకోవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ మార్కెటర్లు, నిల్వదారులపై ఒక కన్నేసి ఉంచాలి. అవసరమైతే తక్షణమే చర్యలు తీసుకోవాలి'' అని సూచించారు.

ఎరువులు

ఫొటో సోర్స్, Getty Images

'రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుంది'

మధ్య ప్రాచ్యంలోని ప్రస్తుత సంక్షోభం వల్ల, ఎరువుల సరఫరా ప్రభావితమయ్యే అవకాశముందని అంటున్నారు.

ఎరువుల సరఫరా విషయంలో రైతులకు మోదీ భరోసా ఇచ్చారు.

''దేశంలో సరిపడా ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో పంటను సరిగ్గా వేయడం చాలా ముఖ్యం. ఇదే ప్రభుత్వ ప్రాధాన్యం. ప్రపంచ సంక్షోభ భారాన్ని ప్రభుత్వం రైతులపై పడనీయలేదు'' అని అన్నారు.

''కరోనా సమయంలోనూ సప్లయి చెయిన్‌కు అంతరాయం ఏర్పడింది. యురియా బ్యాగు ధర రూ.3000కు చేరుకుంది. కానీ, భారత్ ఈ బస్తాను రూ.300కే అందించింది'' అని తెలిపారు.

''గత పదేళ్లలో దేశంలో ఆరు యురియా ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్లు అదనంగా 76 లక్షల టన్నుల ఉత్పత్తిని అందించాయి. డీఏపీ ఉత్పత్తి 50 లక్షల టన్నుల మేర పెరిగింది. అంతేకాక, మేడిన్ ఇండియా నానో యూరియా ఆప్షన్‌ను కూడా రైతులకు అందించింది. పీఎం కిసాన్ యోజన కింద 22 లక్షలకు పైగా సోలార్ పంపులను కూడా అందించింది ప్రభుత్వం'' అని అన్నారు.

''దేశంలోని రైతులకందరికీ నేను భరోసా ఇస్తున్నా. అవసరమైన సాయమంతా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూనే ఉంటుంది'' అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)