భారత్‌కు చమురు సరఫరా విషయంలో ట్రంప్ ఆశలను వెనెజ్వెలా ఎందుకు నెరవేర్చలేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
రష్యా నుంచి కాకుండా.. అమెరికా, వెనెజ్వెలా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు.
వెనెజ్వెలా పరోక్షంగా ప్రస్తుతం అమెరికా నియంత్రణలో ఉంది. అక్కడ చమురు రంగంలో అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి.
రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ పూర్తిగా నిలిపివేస్తే.. దాన్ని వెనెజ్వెలా భర్తీ చేయగలదా?
దీనికి వెనెజ్వెలా పాక్షికంగానే సాయపడగలదని ఎనర్జీ ఇంటెలిజెన్స్ రిపోర్టు సూచిస్తోంది.
ఎనర్జీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం.. భారత్‌లో కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ మాత్రమే వెనెజ్వెలా ముడి చమురును పెద్ద మొత్తంలో శుద్ధి చేయగలదు.
ఇతర భారత రిఫైనరీలకు వెనెజ్వెలా ముడి చమురును శుద్ధి చేయడం చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియ.

ఎనర్జీ ఇంటెలిజన్స్ రిపోర్టు ప్రకారం.. ''వెనెజ్వెలా ముడి చమురు నాణ్యత తక్కువ కావడంతో.. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ 'పెట్రోలియోస్ డి వెనెజ్వెలా' అంతర్జాతీయ మార్కెట్లో డెలివరీ ప్రాతిపదికన ఒక్కో బ్యారెల్‌ను 13 డాలర్ల నుంచి 15 డాలర్ల (రూ.1,100 నుంచి రూ.1300 మధ్య) డిస్కౌంట్‌తో అందిస్తోంది.''
అమెరికా ఆంక్షలకు ముందు, 2015లో వెనెజ్వెలా నుంచి భారత్ చమురు దిగుమతులు 4 లక్షల 41 వేల బ్యారెళ్లకు చేరుకున్నాయని ఎనర్జీ ఇంటెలిజెన్స్ రిపోర్టు పేర్కొంది. అందులో దాదాపు మూడొంతుల ముడి చమురు రిలయన్స్‌కు వెళ్లగా.. మిగిలింది నయారా ఎనర్జీ రిఫైనరీకి సరఫరా అయింది.
నయారా రిఫైనరీని రష్యా ప్రభుత్వ ఆధీనంలోని రోస్నెఫ్ట్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇది ఆంక్షలను ఎదుర్కొంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
వెనెజ్వెలా సామర్థ్యం ఎంత?
చమురు సరఫరాలో రష్యాను వెనెజ్వెలా భర్తీ చేయలేదని ఇంధన రంగ నిపుణులు నరేంద్ర తనేజా చెప్పారు.
తనేజా మాట్లాడుతూ, ''భారత్ ప్రతిరోజూ 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. వెనెజ్వెలా మొత్తం చమురు ఉత్పత్తే రోజుకు 8 లక్షల బ్యారెళ్లు. వెనెజ్వెలా వద్ద భారీగా చమురు నిల్వలు ఉన్నప్పటికీ.. కేవలం 8 లక్షల బ్యారెళ్లను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. దీన్ని క్యూబా, అమెరికా, చైనాకు విక్రయిస్తోంది. వెనెజ్వెలా ప్రస్తుతం ఉత్పత్తిని పెంచాల్సి ఉంది. ప్రపంచ చమురు సరఫరాల్లో ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు. సమస్యంతా ధరల విషయంలోనే..'' అన్నారు.
''వెనెజ్వెలా గతంలో రోజూ 40 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేసేది. కానీ, ప్రస్తుతం అంతస్థాయిలో మౌలిక సదుపాయాలు లేవు. ఆ స్థాయిని మళ్లీ అందుకోవాలంటే.. చాలా ఏళ్లు పడుతుంది. రోజుకు 30 లక్షల నుంచి 40 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయాలంటే, వెనెజ్వెలాకు కనీసం ఐదేళ్లు పట్టొచ్చని అనుకుంటున్నా.''
''నాణ్యతలో వెనెజ్వెలా చమురుకు, రష్యా చమురుకు పెద్ద తేడా ఉండదు. భారత రిఫైనరీలు ఇప్పటికే దీన్ని శుద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి'' అని టార్టాయిజ్ క్యాపిటల్ సీనియర్ పోర్టుఫోలియో మేనేజర్ రాబ్ థమ్మెల్ అమెరికా న్యూస్ నెట్‌వర్క్ సీఎన్‌ఎన్‌కు చెప్పారు.
''వెనెజ్వెలా చమురు వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్థంగా ఉంది. దేశంలో(1999లో) సోషలిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందున్న రోజుకు 30 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలంటే సుమారు దశాబ్ద కాలం పనిచేయడంతో పాటు బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం'' అని సీఎన్‌ఎన్ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
చమురు నాణ్యత..
వెనెజ్వెలా ముడి చమురు గాఢత ఎక్కువని, దీని నుంచి డీజిల్‌ను తేలికగా తయారు చేయొచ్చని నరేంద్ర తనేజా అంటున్నారు.
''రష్యా చమురును వెనెజ్వెలా లేదా అమెరికా చమురుతో భర్తీ చేసేందుకు భారీమొత్తంలో పెట్టుబడులు అవసరం. కానీ, కాలక్రమేణా ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు అదనపు సవాళ్లను తీసుకురావొచ్చు'' అని యూఎస్ బ్యాంక్ అసెట్ మేనేజ్‌మెంట్ సీనియర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్ రాబ్ హోవర్త్ సీఎన్‌ఎన్‌తో అన్నారు.
''భారత్ మొత్తం చమురులో మూడో వంతు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. వెనెజ్వెలా అంత చమురును ఉత్పత్తి చేయలేదు. ట్రంప్ కేవలం భారత్‌పై మాత్రమే కాకుండా యూరప్‌పై కూడా ఇలాంటి అసాధ్యమైన విషయాల గురించి ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ట్రంప్ ఆశించిన స్థాయిలో ఆ వ్యవస్థ సిద్ధంగా లేదు'' అని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్(జీటీఆర్ఐ) వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
రియల్ టైమ్ ఇంధన డేటాను అందించే కెప్లర్ సంస్థ ప్రకారం.. జనవరి 13 నాటికి భారత్ సగటున రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల రష్యా ముడి చమురు దిగుమతి చేసుకుంది. 2025లో రోజుకు 1.73 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది.
''ఆసియాలోని అత్యంత అధునాతన బ్లెండింగ్ స్ట్రక్చర్లలో రిలయన్స్ ఒకటి. అలాగే, భారీ సామర్థ్యం గల కోకర్ (ఆయిల్ రిఫైనరీ ప్రాసెసింగ్ యూనిట్) కూడా ఉంది'' అని భారత్ పెట్రోలియం కంపెనీ మాజీ రిఫైనింగ్ డైరెక్టర్, ఆయిల్ ఇండస్ట్రీ కన్సల్టెంట్ ఆర్ రామచంద్రన్ ఎనర్జీ ఇంటెలిజెన్స్‌కు చెప్పారు.
''ఇండియన్ ఆయిల్‌కు చెందిన పారాదీప్ ప్లాంట్, రెసిడ్యూ అప్‌గ్రేడర్ యూనిట్ ఉన్న విశాఖపట్నంలోని హిందూస్తాన్ పెట్రోలియం అడ్వాన్స్‌డ్ రిఫైనరీలు మాత్రమే అప్పుడప్పుడు వెనెజ్వెలా నుంచి చమురును తెప్పించుకోగలవు.
కానీ, వెనెజ్వెలా హెవీ క్రూడ్‌ను నిరంతరం కొనుగోలు చేసేందుకు అవసరమైన బ్లెండింగ్ సౌకర్యాలు అంతగా లేవు. భారీ స్థాయి రెసిడ్యూ అప్‌గ్రేడర్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం రష్యా చమురును నయారా మాత్రమే శుద్ధి చేస్తోంది. రిలయన్స్ మాత్రమే వెనెజ్వెలా చమురు ఏకైక కొనుగోలుదారుగా ఉంది'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
వెనెజ్వెలా చమురు దిగుమతులకు ఖర్చు ఎక్కువా?
''అమెరికా ఆంక్షలకు ముందు, భారత తన మొత్తం దిగుమతుల్లో 10 శాతం వెనెజ్వెలా నుంచి దిగుమతి చేసుకునేది. వెనెజ్వెలా చమురు చాలా హెవీ చమురు. ప్రపంచంలో అన్నిచోట్లా దీన్ని శుద్ధి చేయలేరు. దీన్ని శుద్ధి చేసేందుకు కేవలం చైనా, అమెరికా, భారత్‌లోనే మెషినరీ ఉంది. అయితే, దీని నుంచి మంచి డీజిల్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని శుద్ధి చేసేందుకు నాఫ్తా (ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఉపయోగించే మండే స్వభావం గల ద్రవ హైడ్రోకార్బన్ మిశ్రమం) కూడా అవసరం" అని నరేంద్ర తనేజా అన్నారు.
అయితే, వెనెజ్వెలా నుంచి చమురును దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్నదా? అనే ప్రశ్నకు స్పందించిన తనేజా.. ''ఎంత ఎక్కువ దూరం నుంచి చమురును తీసుకొస్తే, అంత ఎక్కువ రవాణా ఖర్చులు పడతాయి. సరకు రవాణా సమయం పెరిగితే, ఇన్సూరెన్స్ మొత్తం కూడా పెరుగుతుంది. ఇన్సూరెన్స్ రోజుల లెక్కన ఉంటుంది. వెనెజ్వెలా నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు రావాలంటే కనీసం 22 నుంచి 27 రోజులు పడుతుంది. అమెరికా నుంచి అయితే, మరింత సమయం పడుతుంది. రష్యా నుంచి అయితే, 26 రోజుల సమయం తీసుకుంటుంది. అయితే, రష్యానే సొంతంగా భారత్‌కు ముడి చమురును సరఫరా చేస్తుంది'' అని వివరించారు.
గల్ఫ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడం తేలిక. ఎందుకంటే, ఇవి భారత్‌కు దగ్గరగా ఉంటాయి. ఈ దేశాల నుంచి రవాణా అయ్యే నౌకలు మూడు నుంచి నాలుగు రోజుల్లో భారత్‌కు చేరుకుంటాయి. దీంతో రవాణా ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఇన్సూరెన్స్ ఖర్చులూ తక్కువే.
''రష్యా నుంచి భారత్‌కు చమురు వచ్చేందుకు, వెనెజ్వెలా కంటే కూడా రెండు మూడు రోజులు ఎక్కువ సమయం పడుతుంది. వెనెజ్వెలా నుంచి నౌకలు దక్షిణాఫ్రికా మీదుగా అరేబియా సముద్రం గుండా గుజరాత్‌కు చేరుకుంటాయి. సూయిజ్ మ్యాక్స్ (సూయిజ్ కాలువ గుండా ప్రయాణించగలిగే నౌకలు) చమురు అయితే తక్కువ సమయంలోనే వస్తుంది. హెవీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్‌సీసీలు) సూయిజ్ కాలువ గుండా ప్రయాణించలేవు. అవి తప్పనిసరిగా ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సిందే'' అని తనేజా చెప్పారు.
''రష్యా నుంచి వచ్చే నౌకలు చాలా వరకు వీఎల్‌సీసీలు. తూర్పు రష్యా నుంచి మరో మార్గం ఉంది. దక్షిణ చైనా సముద్రం, సింగపూర్, బంగాళాఖాతం గుండా, ఆ తర్వాత శ్రీలంక, హిందూ మహా సముద్రం మీదుగా ప్రయాణించి పశ్చిమ తీరానికి చేరుకోవాలి. వీటికి కూడా అంతే సమయం పడుతుంది. లాజిస్టిక్స్ పరంగా చూసుకుంటే వెనెజ్వెలా, రష్యా నుంచి పెద్దగా తేడా ఉండదు. భారత చమురు వినియోగంలో 45 శాతం వరకు డీజిల్ ఉంటుంది. వెనెజ్వెలా చమురు భారత్‌కు అంత ప్రతికూలమేమీ కాదు. భారత్ ప్రస్తుతం 41 దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది'' అని నరేంద్ర తనేజా వివరించారు.
వెనెజ్వెలా ఇప్పటికే విదేశీ అప్పులతో సతమతమవుతుందని ఎనర్జీ ఇంటెలిజెన్స్‌కు చెందిన మరో రిపోర్టు పేర్కొంది. ఇప్పుడు చమురు కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం అంత తేలిక కాదని తెలిపింది.
ఈ రిపోర్టు ప్రకారం.. వెనెజ్వెలా కట్టాల్సిన విదేశీ అప్పు 150 బిలియన్ డాలర్లకు పైగానే (రూ.13 లక్షల కోట్లకు పైగా) ఉంది. ఇది దెబ్బతిన్న ఆ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రెట్టింపు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














