వరల్డ్ క్యాన్సర్ డే: ‘ఏటా 70 లక్షల కేసులు ఆపగలిగినవే’- వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో నివేదిక

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
- రచయిత, జేమ్స్ గలాఘర్
- హోదా, హెల్త్, సైన్స్ కరస్పాండెంట్
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్రతి ఏటా 70 లక్షల మందికి క్యాన్సర్ రాకుండా అడ్డుకునే అవకాశం ఉందన్నది ఒక అంతర్జాతీయ విశ్లేషణ.
ఇన్‌ఫెక్షన్లు, జీవనశైలి మార్పులు, పర్యావరణ కాలుష్య కారకాల వల్ల 37 శాతం క్యాన్సర్లు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది.
ఇలాంటి కారణాలతో వస్తున్న క్యాన్సర్‌ను నివారించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టీకా ద్వారా నివారించగల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, అలాగే సిగరెట్ పొగ పీల్చడం లేదా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే అనేక రకాల ట్యూమర్లు కూడా వీటిలో ఉన్నాయని వారు తమ నివేదికలో పేర్కొన్నారు.
లక్షల మంది ప్రజల జీవితాలను మార్చడానికి ఇదొక 'అద్భుతమైన అవకాశం' అని ఈ నివేదిక స్పష్టం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
‘ప్రతి 10 క్యాన్సర్లలో 4 నివారించదగినవే.. ’
కొన్ని రకాల క్యాన్సర్లు అనివార్యమైనవి. వయసు పెరిగే కొద్దీ డీఎన్ఏలో జరిగే మార్పుల వల్ల కానీ, లేదా వంశపారంపర్యంగా వచ్చే జన్యువుల వల్ల కానీ ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది.
కానీ, ప్రతి పది క్యాన్సర్లలో దాదాపు నాలుగు నివారించదగినవేనని, ఈ విషయం తెలిస్తే ప్రజలు ఆశ్చర్యపోతారని పరిశోధకురాలు డాక్టర్ ఇసాబెల్లె సోర్జోమాతరం అన్నారు.
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే 30 నివారించదగిన కారకాలను డబ్ల్యూహెచ్‌వోలో భాగమైన 'ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్' విశ్లేషించింది. వీటిలో ఇవి కూడా ఉన్నాయి....
- నేరుగా డీఎన్ఏను దెబ్బతీసే ధూమపానం,
- అతినీలలోహిత కిరణాలు,
- శరీరంలో వాపు, హార్మోన్ల మార్పులకు కారణమై క్యాన్సర్ ముప్పును పెంచే అధిక బరువు (స్థూలకాయం),
- శారీరక శ్రమ లేకపోవడం,
- నిద్రాణంగా ఉన్న క్యాన్సర్ కణాలను ఉత్తేజితం చేసే వాయు కాలుష్యం.
ఈ సంస్థ తన నివేదికలో క్యాన్సర్‌కు కారణమయ్యే తొమ్మిది రకాల ఇన్‌ఫెక్షన్లను కూడా పరిశీలించింది. వీటిలో హెచ్‌పీవీ, కాలేయ క్యాన్సర్‌కు దారితీసే హెపటైటిస్ వైరస్‌లు, కడుపులో సమస్యలను కలిగించే హెచ్.పైలోరీ బ్యాక్టీరియా ఉన్నాయి.
185 దేశాల నుంచి 2022 నాటి క్యాన్సర్ కేసులను, అందుకు దశాబ్ద క్రితం నాటి నుంచి 30 రకాల ప్రమాద కారకాలకు సంబంధించిన డేటాను పరిశోధనా బృందం తమ గణాంక విశ్లేషణ కోసం ఉపయోగించింది.
ప్రపంచవ్యాప్తంగా నమోదైన 1.8 కోట్లకు పైగా క్యాన్సర్ కేసులకు ప్రధానంగా ధూమపానం, ఇన్‌ఫెక్షన్లు, మద్యపానం అనే మూడు కారణాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్సర్ ముప్పులోనూ వ్యత్యాసాలు...
అయితే, ఈ మొత్తం గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ ముప్పులోని వ్యత్యాసాలను స్పష్టం చేస్తున్నాయి.
స్త్రీ, పురుషుల మధ్య స్పష్టమైన తేడా ఉంది. పురుషులలో 45 శాతం క్యాన్సర్లను నివారించవచ్చు. అదే మహిళల్లో ఇది 30 శాతం మాత్రమే.
పురుషులలో ధూమపానం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
యూరప్‌లో నివసించే మహిళల్లో నివారించగల మొదటి మూడు ప్రధాన కారణాలు... ధూమపానం, ఇన్‌ఫెక్షన్లు, స్థూలకాయం.
అదే సమయంలో, సబ్-సహారన్ ఆఫ్రికాలోని మహిళల్లో నివారించదగిన క్యాన్సర్లలో దాదాపు 80 శాతం ఇన్‌ఫెక్షన్ల వల్లే సంభవిస్తున్నాయి. అంటే, ఈ క్యాన్సర్లను అరికట్టడానికి తీసుకునే చర్యలు ఆయా ప్రాంతాలు లేదా దేశాలకు అనుగుణంగా ఉండాలి.
''ప్రపంచవ్యాప్తంగా నివారించదగిన క్యాన్సర్ల గురించి సమగ్రమైన అంచనాను మైలురాయి వంటి ఈ అధ్యయనం ఇస్తుంది. మొదటిసారిగా ప్రవర్తనా, పర్యావరణ, వృత్తిపరమైన రిస్క్‌లతో పాటు ఇన్‌ఫెక్షన్ల వల్ల కలిగే క్యాన్సర్లను కూడా ఇందులో చేర్చాం'' అని ఐఏఆర్‌సీ నిఘా విభాగం డిప్యూటీ హెడ్ సోర్జోమాతరం అన్నారు.
''ఈ నివారించదగిన కారణాలపై దృష్టి సారించడమనేది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ భారాన్ని తగ్గించడానికి లభించిన అత్యంత శక్తిమంతమైన అవకాశాలలో ఒకటి'' అని చెప్పారు.
'నేచర్ మెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం... ఊపిరితిత్తుల క్యాన్సర్ (కారకాలు: ధూమపానం, వాయు కాలుష్యం), కడుపు క్యాన్సర్ (హెచ్.పైలోరీ ఇన్‌ఫెక్షన్), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్) వంటివి నివారించదగిన మొత్తం కేసులలో దాదాపు సగభాగం ఉన్నాయి.
డబ్ల్యూహెచ్‌వో క్యాన్సర్ నియంత్రణ విభాగం లీడ్ డాక్టర్ ఆండ్రీ ఇల్బావి మాట్లాడుతూ, ఈ అధ్యయనం ఒక శుభవార్త అని, ఎందుకంటే ఏదైనా చేయగలమనే ఆశను ఇది కల్పిస్తోందని అన్నారు. ధూమపానాన్ని అరికట్టడానికి లేదా హెచ్‌పీవీ నివారణకు టీకాలు వేసే విధానాలను ప్రవేశపెట్టిన దేశాల విజయాన్ని అందుకు ఉదాహరణగా చూపించారు.
‘‘నివారించదగిన క్యాన్సర్ల శాతాన్ని కాలక్రమేణా మార్చవచ్చు. దానిని వీలైనంత వరకు సున్నా శాతానికి తీసుకురావడమే మా లక్ష్యం'' అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














