You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'సిగ్నల్స్ ఆఫ్' - ఆ రెండు భారత గ్యాస్ నౌకలు హార్ముజ్ జలసంధిని ఎలా దాటాయంటే..
భారత్‌లో రిజిస్టరైన రెండు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) నౌకలు నందాదేవి, శివాలిక్ శనివారం హార్ముజ్ జలసంధిని దాటాయి.
మెరైన్ ట్రాఫిక్ అనే షిప్ ట్రాఫికింగ్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఈ రెండు నౌకలు గుజరాత్‌లోని ఒక పోర్టు దిశగా వెళ్లాయి.
ఈ నౌకల ప్రయాణ సమాచారం ప్రకారం.. నందాదేవి, శివాలిక్ నౌకలు ఖతార్‌లోని ఒక పోర్టులో గ్యాస్ నింపుకున్నాయి.
'సిగ్నల్స్ ఆఫ్'
అయితే, హార్మూజ్ జలసంధిని దాటే సమయంలో ఈ నౌకలు తమ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్) సిగ్నల్స్‌ను ఆఫ్ చేశాయి.
ఏఐఎస్ అనేది, నౌకలు తమ స్థానాన్ని తెలియజేయడానికి ఉపయోగించే ఒక సిగ్నల్, దీని ద్వారా అవి ఎక్కడున్నాయో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.
పైన మ్యాప్‌లో గీతలతో సూచిస్తున్న మార్గాల్లో ఈ రెండు నౌకలు ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు.
మార్చి 14న, గ్యాస్ ట్యాంకర్లు తమ ఏఐఎస్ సిగ్నల్స్‌ను ఆఫ్ చేసినప్పుడు.. అదే ప్రాంతంలో రెండు భారతీయ యుద్ధనౌకలు కూడా కనిపించాయి.
శివాలిక్ నౌక సోమవారం ఉదయం భారత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. కొద్దిరోజుల పాటు ఇరాన్‌లోని కెషం ఐలాండ్‌లో నిలిచివున్న నందాదేవి నౌక మంగళవారానికి గుజరాత్‌లోని వాడీనార్ పోర్టుకు చేరుకుంది.
విదేశాంగ మంత్రి ఏమన్నారు?
దీనికిముందు ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ "ఇరాన్‌తో నేరుగా జరిపిన చర్చల వల్ల భారత్ నౌకలు హార్ముజ్ జలసంధిని దాటేందుకు మార్గం సుగమమైంది" అని తెలిపారు.
భారత నౌకల రాకపోకలకు సంబంధించి తాత్కాలిక లేదా శాశ్వత ఒప్పందం ఏదీ లేదన్నారు. అలాగే, ప్రతిఫలంగా ఇరాన్‌కు ఇచ్చిందేమీ కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.
"ప్రస్తుతం నేను వారి(ఇరాన్)తో మాట్లాడుతున్నాను. ఈ చర్చలు కొంత ఫలితాన్నిచ్చాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ చర్చలు ప్రయోజనకరంగా ఉంటే, కచ్చితంగా కొనసాగిస్తాం" అని ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)