చైనా ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఎందుకంత త్వరగా ఉరి తీసింది?

చైనా, మియన్మార్, స్కామ్ బిజినెస్, కంబోడియా, థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, CCTV

ఫొటో క్యాప్షన్, మింగ్ కుటుంబ సభ్యులకు సెప్టెంబర్‌లో కోర్టు ఉరిశిక్ష విధించింది.
    • రచయిత, జొనాథన్ హెడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన ఈశాన్య మియన్మార్‌‌కు చెందిన ఒకే కుటుంబంలోని 11 మందికి చైనా చాలా త్వరగా ఉరిశిక్ష అమలు చేసింది. వీరికి సెప్టెంబర్‌లో మరణశిక్ష విధించారు.

మానవ హక్కుల సంస్థల లెక్కల ప్రకారం, ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నింటికన్నా ఎక్కువగా ఉరిశిక్షలు వేసే దేశం చైనా.

ఇప్పటిదాకా ఎంతమందికి మరణశిక్ష అమలు చేసిందన్నది అధికారిక రహస్యం.

అవినీతి ఆరోపణలపై అధికారులను కూడా ఉరితీస్తుంది.

మింగ్ కుటుంబంపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్‌లైన్ మోసాల కేంద్రం

మింగ్, బా, వీ, లియు అనే నాలుగు వంశాలు 2009 నుంచి మియన్మార్‌లో మారుమూల పట్టణమైన లాక్కైంగ్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సరిహద్దుల్లో ఉండే లాక్కైంగ్ పేదరాష్ట్రం షాన్‌లో భాగం.

ఈ నాలుగు వంశాలు జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ తిరుగుబాటు తర్వాత అధికారంలోకి వచ్చాయి.

1980ల నుంచి లాక్కైంగ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతంపై ఆధిపత్యం ఉన్న తిరుగుబాటు సైన్యం మియన్మార్ నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ ఆర్మీ (ఎంఎన్‌డీఏఏ)ను అధికారం నుంచి తప్పించేందుకు మిన్ ఆంగ్ హ్లైంగ్ మిలిటరీ ఆపరేషన్ జరిపారు.

ఈ నాలుగు కుటుంబాలుగా గుర్తింపు పొందినవారు లాక్కైంగ్‌పై ఆధిపత్యం సాధించిన తర్వాత ఓపీయం, మెథాంఫిటామిన్‌పై ఆధారపడే పాత వ్యవ్యస్థను క్యాసినోలు, ఆన్‌లైన్ మోసాలపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థగా మార్చడం ప్రారంభించారు.

ఆ కుటుంబాలు మియన్మార్ సైనిక పాలనకు కూడా సన్నిహితంగా మెలిగేవి. 2021 డిసెంబర్‌లో తిరుగుబాటుతో అధికారం చేజిక్కించుకున్న తర్వాత లియు వంశపెద్ద లియు జెన్‌జియాంగ్‌ను మిన్ ఆంగ్ హ్లైంగ్‌ రాజధాని నైపిడాలో సత్కరించారు. ''దేశాభివృద్ధికి అసాధారణ సేవలు చేసినందుకు'' గౌరవనీయమైన బిరుదు ఇచ్చారు.

చైనా, మియన్మార్, స్కామ్ బిజినెస్, కంబోడియా, థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Chinese Ministry of Public Security

ఫొటో క్యాప్షన్, చైనా పోలీసుల కస్టడీలో మింగ్ వంశీయులు

స్కామ్‌ల కాంపౌండ్లలో బందీలుగా చైనీయులు

మియన్మార్ అంతటా వారికి వ్యాపారాలున్నాయి. నాలుగు కుటుంబాలకు చెందిన సభ్యులు మిలిటరీ మద్దతు ఉన్న యూఎస్‌డీపీ పార్టీ అభ్యర్థులుగా నిలిచారు.

లాక్కైంగ్‌లో వారి స్కామ్ కాంపౌండ్‌లు, ఆసియాలోని మిగిలిన వాటితో పోలిస్తే క్రూరమైనవి. అక్కడ చిత్రహింసలు నిత్యకృత్యం.

వేలమందిని ముఖ్యంగా చైనా కార్మికులను మంచి జీతాల పేరుతో అక్కడకు తీసుకొచ్చారు. కానీ అక్కడకు తీసుకొచ్చిన తర్వాత వారిని కాంపౌండ్లలో బందీలుగా చేశారు. వాళ్లతో ''పిగ్-బుచరింగ్''అనే స్కామ్‌లు చేయించారు. ఈ స్కామ్ బాధితుల్లో కూడా ఎక్కువ మంది చైనీయులే. బాధితులు, కాంపౌండ్లలో బందీలుగా చిక్కుకున్న వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదులు సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో కనిపించేవి.

లాక్కైంగ్‌లో అత్యంత క్రూరమైన కాంపౌండ్‌ను క్రౌచింగ్ టైగర్ విల్లా అని పిలిచేవారు. దీన్ని మింగ్ కుటుంబం నిర్వహించేది. 2023 అక్టోబర్‌లో అక్కడి భద్రతా సిబ్బంది అనేకమంది చైనీయులను హతమార్చారు. ఈ హత్యల తర్వాత చైనా అధికారులు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

చైనా, మియన్మార్, స్కామ్ బిజినెస్, కంబోడియా, థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Getty Images

చైనా అదుపులో నాలుగు వంశాలకు చెందినవారు

అంతర్యుద్ధంలో భాగంగా మియన్మార్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంఎన్‌డీఏఏ, దాని మిత్రపక్షాలు కలిసి చైనా నిశ్శబ్ద మద్దతుతో లాక్కైంగ్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. స్కామ్ బిజినెస్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని ఎంఎన్‌డీఏఏ తెలిపింది.

నాలుగు కుటుంబాల పెద్దలను, 60 మందికిపైగా వారి బంధువులను నిర్బంధించి చైనా పోలీసులకు అప్పగించింది. మింగ్ కుటుంబ పెద్ద మింగ్ షెచాంగ్ ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు చెప్పారు.

తన బలం ప్రదర్శించేందుకు ఎవరో ఒక వ్యక్తిని ఎన్నుకుని హతమార్చినట్టు ఆ నాలుగు కుటుంబాలకు చెందిన సభ్యుల్లో ఒకరు విచారణ సమయంలో చైనా పోలీసులకు చెప్పారు

ఆ కుటుంబాలతో తాను వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని సమర్థించుకునేందుకు ఈ వివరాలను చైనా బయటపెట్టింది. బా కుటుంబానికి చెందిన ఐదుగురికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. వీ, లియు కుటుంబాలపై విచారణ ఇంకా పూర్తికాలేదు.

చైనా, మియన్మార్, స్కామ్ బిజినెస్, కంబోడియా, థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాక్కైంగ్ పట్టణం

వేగంగా విస్తరిస్తున్న స్కామ్ బిజినెస్

ఈ నాలుగు కుటుంబాలు చైనా సంతతికి చెందినవారే. చైనా యున్నాన్ ప్రావిన్సులోని అధికారులతో దగ్గరి సంబంధాలున్నాయి. వారి నేరాలు కూడా చైనాకు దగ్గరలో జరిగాయి. దీంతో లాక్కైంగ్‌లో స్వామ్ వ్యాపారాలపై చైనా కఠిన చర్యలు తీసుకుంది.

స్కామ్ సామ్రాజ్యాలను నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు చైనా వ్యాపారులను అప్పగించాల్సిందిగా థాయ్‌లాండ్, కంబోడియాపై చైనా ఒత్తిడి తెచ్చింది కూడా.

మియన్మార్ యుద్ధంతో దెబ్బతిన్న కరేన్ రాష్ట్రంలో మొత్తం నగరాన్ని నిర్మించిన షె జిజియాంగ్ వారిలో ఒకరు. రెండో వ్యక్తి కంబోడియాలో ప్రిన్స్ గ్రూప్ ద్వారా అపార సంపద, అధికారం సాధించిన చెన్ జీ.

స్కామ్ కాంపౌండ్స్‌లో పనిచేస్తున్న వేలాది మంది చైనీయులను కూడా చైనా ప్రభుత్వం దేశానికి తీసుకొచ్చి విచారణ జరుపుతోంది.

అయినప్పటికీ స్కామ్ బిజినెస్ ఆగలేదు. రూపాంతరం చెందుతూ కొనసాగుతోంది. దీన్ని నిలిపివేయాలని అమెరికా, చైనా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కంబోడియాలో ఇప్పటికీ అదే అతిపెద్ద బిజినెస్ అని భావిస్తారు.

థాయ్‌లాండ్, మియన్మార్ సరిహద్దుల్లోని ప్రముఖ స్కామ్ కాంప్లెక్స్‌లు కేకే పార్క్, ష్వే కొక్కోను మూసివేసినప్పటికీ మియన్మార్‌లో అది కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)