లికోలా: ఐదుగురు ఉండే ఈ చిన్న పట్టణాన్ని అమ్మకానికి పెడితే 8,000 మందికి పైగా వ్యతిరేకించారు..

లీన్ ఓ'డొన్నెల్, లికోలా

ఫొటో సోర్స్, Leanne O'Donnell

ఫొటో క్యాప్షన్, లికోలాలోని తన దుకాణం బయట (ఎడమ నుంచి రెండవ స్థానంలో) నిల్చున్న లీన్ ఓడొన్నెల్.
    • రచయిత, క్లైర్ కీనన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

విక్టోరియాలోని లికోలా ఆస్ట్రేలియాలోని అతి చిన్న పట్టణాలలో ఒకటి. అక్కడ కేవలం ఐదుగురు మాత్రమే నివసిస్తున్నారు. ఈ చిన్న పట్టణంలో కొన్ని భవనాలు మాత్రమే ఉన్నాయి - ఒక జనరల్ స్టోర్, ఒక కారవాన్ పార్క్, ఒక పెట్రోల్ స్టేషన్, చిన్న ప్రధాన వీధి వెంబడి చెక్కలతో చేసిన కొన్ని నిర్మాణాలు.

ఇప్పుడు, ఈ మొత్తం పట్టణం అమ్మకానికి వచ్చింది.

మెల్‌బోర్న్ నుంచి దాదాపు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న లికోలా, స్థానిక లయన్స్ క్లబ్ కమ్యూనిటీ సంస్థకు చెందినది. దశాబ్దాలుగా ఆల్పైన్ నేషనల్ పార్క్‌కు వెళ్లే వారికి ఇంధనం, ఆహారం కోసం ఆగేందుకు, విశ్రాంతి తీసుకోవడానికి ఇదొక ముఖ్యమైన స్టాప్‌. ఈ పట్టణంలో దాదాపు 50 ఏళ్లుగా యువత కోసం అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

గత సంవత్సరం చివర్లో, లికోలా పట్టణాన్ని లయన్స్ క్లబ్ స్థానిక శాఖ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. దీని ధర 6 -10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ( సుమారు రూ. 38 - 63 కోట్లు)గా నిర్ణయించింది.

ఈ చర్య స్థానికులను, చుట్టుపక్కల ప్రాంతాల వారిని, ఇతర లయన్స్ క్లబ్ సభ్యులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. బోర్డు తమను సంప్రదించలేదని, లికోలా భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు వారు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లికోలా, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లికోలా విక్టోరియా గిప్స్‌ల్యాండ్ ప్రాంతంలోని మెకాలిస్టర్ నది ఒడ్డున ఉంది.

1950లలో కలప మిల్లు

విక్టోరియాలోని ఎత్తైన పర్వత ప్రాంతంలో, మెకాలిస్టర్ నది ఒడ్డున ఉన్న లికోలాలో మొదట 1950లలో కలప మిల్లు నిర్మించారు. కార్మికుల కోసం కొన్ని భవనాలు కట్టారు.

1968లో మిల్లు మూసివేసిన తర్వాత, లయన్స్ క్లబ్ ఆ స్థలాన్ని కొనుగోలు చేసి యువకుల కోసం శిబిరంగా మార్చింది. తర్వాత, అక్కడ జనరల్ స్టోర్, కారవాన్ పార్క్‌ను కూడా అభివృద్ధి చేసింది.

నేడు, ఆ జనరల్ స్టోర్‌ను నడుపుతున్నది లీన్ ఓడొన్నెల్. ఆమె తన బిడ్డ, తన ప్రాణ స్నేహితురాలు, ఆమె ఇద్దరు పిల్లలతో అక్కడ నివసిస్తున్నారు.

ఓడొన్నెల్ 2022లో స్టోర్ బిజినెస్ కొన్నారు. కానీ, భవనం ఆమె సొంతం కాదు. తన లీజును మరో 15 సంవత్సరాలకు పొడిగించాలని కోరుతున్నట్లు చెప్పారామె.

లికోలా, విక్టోరియా, అమ్మకం, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Licola Wilderness Village/Google Maps

ఫొటో క్యాప్షన్, వెనుకబడిన యువత కోసం లికోలాలో లయన్స్ క్లబ్ శిబిరాలను నిర్వహిస్తోంది.

దుకాణం కోసం ఆన్‌లైన్ పిటిషన్

లికోలాను ప్రజలకు "ఇంటికి దూరంగా ఉన్న మరో ఇల్లు"గా మార్చాలని ఓడొన్నెల్ కోరుకున్నారు.

ఈ పట్టణం మీదుగా ప్రయాణించే ట్రక్ డ్రైవర్లు, అత్యవసర సేవలతో సహా దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర తన ఫోన్ నంబర్ ఉందని ఓడొన్నెల్ చెప్పారు. రాత్రైనా, పగలైనా తనను సంప్రదిస్తుంటారని చెప్పారామె.

పట్టణం అమ్మకానికి సిద్ధమవుతోందని 2025 జనవరిలో ఓడొన్నెల్ తెలుసుకున్నారు.

గత ఐదారేళ్లుగా వ్యాపారం నష్టాల్లో నడుస్తోందని లయన్స్ బోర్డు చెప్పిందని ఆమె అన్నారు. దీంతో, నిధులను సేకరణకు సహాయం చేస్తానన్నారామె.

కానీ, కనీసం "కొన్ని మిలియన్ డాలర్లు" లేకుండా ఏమీ చేయలేమని బోర్డు తనకు చెప్పిందని ఓడొన్నెల్ అన్నారు.

ఆమె లీజు పునరుద్ధరణ కాదని, జనవరి 31 నాటికి వెళ్లిపోవాలని ఆమెకు తరువాత సమాచారం అందింది. లికోలాలో ఇతర భవనాలు లేనందున, ఆమె తన వ్యాపారాన్ని మరోచోటికీ తరలించలేరు.

బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించిందని ఓడొన్నెల్ చెప్పారు.

అయితే, "మీరు నా బిజినెస్‌ను కొనుగోలు చేయబోతున్నారా? అని బోర్డును అడిగితే, '' లేదు, మేం మీ దానిని స్వాధీనం చేసుకోబోతున్నాం. ఎందుకంటే, భూమి, భవనాలు మావి'' అన్నారు.

"మీరు అంతా సర్దుకుని వెళ్లిపోవాలి" అన్నారు.

ఈ నిర్ణయం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దుకాణాన్ని కాపాడటానికి ఒక ఆన్‌లైన్ పిటిషన్ 8,000కు పైగా సంతకాలను సేకరించింది. బోర్డు సరైన సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకుందని కొంతమంది లయన్స్ క్లబ్ సభ్యులు ఆరోపించారు.

పెరుగుతున్న ఖర్చులు, బీమా ధరలు, పాత భవనాలు, శిబిరాల్లో హాజరు తగ్గడం వల్ల గ్రామం ఆర్థికంగా నిలకడలేనిదిగా మారిందని బోర్డు బీబీసీకి ఒక ప్రకటనలో తెలిపింది.

వెనుకబడిన యువతకు మద్దతు ఇవ్వడమనే లయన్స్ లక్ష్యాన్ని కాపాడటానికి ఈ అమ్మకం అవసరమని బోర్డు చైర్మన్ డెనిస్ కార్రుథర్స్ తెలిపారు.

లికోలాకు తర్వాత ఏం జరుగుతుంది, దానిని ఎవరు కొంటారు, ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)