కాన్‌సెన్సువల్ నాన్ మోనోగమీ: ‘ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుందామా?’ అని పెళ్లయిన పదేళ్ల తరువాత నా భర్తను ఎందుకు అడిగానంటే..

    • రచయిత, మరినా రోస్సీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు
ఇలానా ఎలియా, బ్రెజిల్, సెక్సాలజిస్టు, వివాహేతర సంబంధాలు, రిలేషన్ షిప్

ఫొటో సోర్స్, Ilana Eleá - Personal Archive

ఫొటో క్యాప్షన్, సెక్సాలజిస్టు డాక్టర్ ఇలానా ఎలియా తన భర్తకు విచిత్రమైన ప్రతిపాదన చేశారు.

రచయిత, విద్యావేత్త, సెక్సాలజిస్ట్ అయిన డాక్టర్ ఇలానా ఎలియా తమ పదో పెళ్లి రోజున భర్త ముందు ఒక ప్రతిపాదన పెట్టారు.

‘వైవాహిక జీవితం కొనసాగిస్తూనే ఇతరులతో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకుందామా’ అనేది ఆ ప్రతిపాదన.

కాంటెంపరరీ ఇనిస్టిట్‌ట్యూట్ ఆఫ్ క్లినికల్ సెక్సాలజీలో సెక్స్ థెరపీ కోర్సులో గ్రాడ్యుయేషన్ చేశారు ఎలియా.

బ్రెజిల్‌లో పుట్టిన ఆమె 2011 నుంచి స్వీడన్‌లో ఉంటున్నారు.

శృంగార జీవితానికి సంబంధించి ఒక పుస్తకాల సిరీస్ రాస్తున్నారామె.

అందులో ‘ఎమ్మా అండ్ సెక్స్’ అనే తొలి పుస్తకం రాసేందుకు ఎలియా కొంతకాలంగా ఓపెన్ రిలేషన్‌షిప్స్‌ను అధ్యయనం చేస్తున్నారు.

ఈ పుస్తకంలో టైటిల్ క్యారెక్టర్ ఎమ్మా ద్వారా ఎలియా తాను చాలా కాలంగా పరిశోధిస్తున్న ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారు.

ఎలియా ప్రతిపాదనను ఆమె భర్త అంగీకరించారు. వాళ్లిద్దరూ టోస్ట్, షాంపేన్‌తో వేడుక చేసుకున్నారు.

ఇది జరిగి అయిదేళ్లు గడిచాయి.. ఇప్పుడు తమ బంధం "మిశ్రమం"గా ఉందని.. ఇది చాలావరకు విజయవంతమైందని దంపతులిద్దరూ చెప్పారు.

అయితే ఎలియా ఈ పద్ధతి గురించి మరీ అంత గొప్పగా ఏమీ చెప్పడం లేదు.

‘ఇలా వివాహానికి బయట ఏర్పరుచుకున్న బంధాలలో మూడోవంతు తరువాత కాలంలో ముగిసిపోతాయి. వైవాహిక బంధాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మరో మాటలో చెప్పాలంటే, దీని వల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు. మీకు ఏది అనుకూలమో అదే ఎంచుకోండి" అని సూచించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇలానా ఎలియా, బ్రెజిల్, సెక్సాలజిస్టు, వివాహేతర సంబంధాలు, రిలేషన్ షిప్

ఫొటో సోర్స్, Erdark via Getty Images

ఫొటో క్యాప్షన్, వివాహ బంధాన్ని కొనసాగిస్తూనే నచ్చిన ఇతర వ్యక్తులతో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోవడంపై ఎలియా అధ్యయనం చేస్తున్నారు.

భార్యాభర్తలే అయినా పరస్పర అంగీకారంతో ఇతరులతో లైంగిక సంబంధాలు

‘కాన్‌సెన్సువల్ నాన్ మోనోగమీ’ అనే ఈ విధానాన్ని ఎలియా ఎంచుకున్నారు.

దంపతులిద్దరూ పరస్పర అంగీకారంతో ఇతరులతో వివిధ రకాల లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోవడం లేదా లైంగిక భాగస్వాములను కలిగి ఉండటానికి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.

తమతో రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులందరితోనూ "నచ్చినట్లుగా జీవించడం" ద్వారా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ బంధాన్ని "నైతిక లేదా బాధ్యతాయుతమైన వివాహేతర సంబంధం" అని.. భార్యాభర్తలు ఒకరికొకరు ద్రోహం చేసుకోవడం కాదని నిపుణులు చెబుతున్నారు.

"ఈ విధానంలో సంబంధిత వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారం ఆ బంధాన్ని సరళతరం చేస్తుంది. అది భావోద్వేగాలు, శృంగారం, లైంగిక సంబంధం ఏదైనా, ఏ స్థాయిదైనా కావచ్చు" అని ఎలియా చెప్పారు.

అయితే ‌పరస్పర అంగీకారంతో స్వేచ్చాయుతమైన లైంగిక సంబంధాలు, ఒక వ్యక్తి అనేక మందితో శృంగార సంబంధాలను కలిగి ఉండటం(పాలిమరీ) మధ్య తేడా ఉందని ఆమె చెబుతున్నారు.

"ఓపెన్ రిలేషన్‌షిప్ అనేది ప్రేమతో సంబంధం లేకుండా లైంగిక స్వేచ్ఛను అనుమతిస్తుంది. పాలిమరీలో ప్రేమ, అనుభూతి ఉంటాయి. ఇందులో కొత్త కొత్త సంబంధాల వల్ల వచ్చే ఉత్సాహం ఉంటుంది. మళ్లీ మళ్లీ ప్రేమలో పడాలని అనిపిస్తుంది" అని ఆమె వివరించారు.

తన సంబంధం గురించి ఎలియా "మిశ్రమమైన, సున్నిత, అనుభూతితో కూడిన ఒప్పందం" అని చెప్పారు.

"నాకు అనేక మందితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం పట్ల ఆసక్తి ఉంది. పూర్తిగా కాకున్నా ఒకరి కంటే ఎక్కువ మందిని ప్రేమించడం వారితో లైంగిక సంబంధం పెట్టుకోవడం సాధ్యమే అని నాకు తెలుసు. నా భర్తకు సాధారణ పరిచయాలు ఇష్టం. వాటి గురించి మేం మాట్లాడుకుంటాం" అని ఎలియా చెప్పారు.

ఇలానా ఎలియా, బ్రెజిల్, సెక్సాలజిస్టు, వివాహేతర సంబంధాలు, రిలేషన్ షిప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిలేషన్ షిప్ ప్రారంభించడానికి ముందు ఒకరితో ఒకరు సంభాషించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

మీ బంధం గురించి ఆలోచించండి

ఎలియా అనుభవంలో రిలేషన్‌షిప్‌లోకి వచ్చే జంటలు తమ బంధాన్ని ప్రారంభించే సమయంలో "అడగద్దు- చెప్పద్దు" తరహా పద్దతిని అనుసరిస్తున్నాయి.

"అంటే, 'మన ఇద్దరి మధ్య ప్రత్యేకమైన సంబంధం సాధ్యం కాకపపోవచ్చు లేదా అదంత మంచిది కాకపోవచ్చని నేను అనుకుంటున్నాను. నాకు దాని గురించి తెలుసుకోవాలని లేదు. దాని గురించి నాకు చెప్పకండి, నేను కూడా అడగను అన్నట్లుగా" అని ఎలియా వివరించారు.

ఇలాంటి బంధాల్లో నిజాయితీ, సమాచార మార్పిడి లేకపోవడం వల్ల ఇవి విఫలమవుతాయని ఆమె సూచించారు.

"వ్యక్తులను దగ్గర చేయాల్సినవే, వారి మధ్య దూరాన్ని సృష్టిస్తాయి" అని ఆమె హెచ్చరించారు.

ఒక వ్యక్తితో సంబంధాన్ని మరింత స్వేచ్ఛాయుతంగా మార్చుకునే అవకాశం గురించి భాగస్వామితో మాట్లాడే ముందు "భావోద్వేగాల" గురించి తెలుసుకోవాలని ఎలియా సూచించారు.

ఒకరితో రిలేషన్‌షిప్ కావాలంటే ముందు వారి మధ్య సంభాషణ, సానుభూతి అవసరం.

"అది చాలా కష్టమైన సందర్భం. ముఖ్యంగా వైవాహిక జీవితమే ప్రేమకు ఉత్తమ మార్గమని, వివాహేతర సంబంధాలు తప్పు అనే సమాజంలో పెరిగిన వారికి ఇంకా కష్టమైనది" అని ఎలియా చెప్పారు.

"చర్చల ద్వారానే ఒప్పందాలు కుదురుతాయి. ఎవరితో ఎంత దూరం వెళతారు? అనేది తెలుసుకోవడం, హద్దులు దాటకుండా వాటిని అర్థం చేసుకోవడం ముఖ్యం" అని ఎలియా అన్నారు.

ఇలాంటి రిలేషన్‌షిప్స్‌కు అర్థం చేసుకునే వ్యక్తుల సమూహం కూడా ముఖ్యమనేది ఆమె అభిప్రాయం "దీని గురించి చదవండి. సంభాషణల్ని వినండి. మీ ఆసక్తికి తగిన గ్రూపుల్ని వెతుక్కోండి" అని డాక్టర్ ఎలియా సూచించారు.

"సమాజం దీన్ని తప్పుగా చూస్తుందనేది నిజం. ప్రేమను పొందడానికి ఇవి కూడా సరైన మార్గాలే అని తెలుసుకున్న నిపుణుల నుంచి గైడెన్స్ తీసుకోండి" అని సలహా ఇచ్చారు.

ముక్కలైన రిలేషన్‌షిప్‌ను తిరిగి దారికి తెచ్చుకుని కొనసాగించడం చాలా అరుదుగా జరుగుతుందని ఆమె చెప్పారు.

"దాన్ని మర్చిపోండి. ఇదేమీ చికిత్స కాదు లేదా ఆఖరి ప్రయత్నం కాదు. వ్యక్తుల మధ్య సంబంధం బాగున్నప్పుడు, దాన్ని బలోపేతం చేసుకోవాలని భావించినప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవడం సహజంగా జరుగుతుంది" అని ఎలియా చెప్పారు.

ఇలానా ఎలియా, బ్రెజిల్, సెక్సాలజిస్టు, వివాహేతర సంబంధాలు, రిలేషన్ షిప్

ఫొటో సోర్స్, Erik Thor/Personal archive

ఫొటో క్యాప్షన్, ఎలియా

భర్తకు తన ప్రతిపాదన చెప్పడం గురించి ఎలియా మొదటి సారి మాట్లాడినప్పుడు ఆమెకు వ్యతిరేకంగా వేల కొద్దీ కామెంట్లు వచ్చాయి.

"అందులో కొన్ని మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. నీ భర్తను వదిలి పెట్టలేక నువ్వు ఇలా చేస్తున్నావు" అని అన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు.

అయితే ఆమెకు మద్దతు కూడా లభించింది. భార్యాభర్తలు ఇలాంటి అంశం గురించి సంభాషించుకునేందుకు అధికారం లభించిందని భావించిన జంటల నుంచి ఆమెకు ఉత్తరాలు అందాయి.

"పుట్టుకతోనే ఎవరూ ఒకే భార్య లేదా ఒకే భర్తతో ఉండాలని అనుకోరు కదా. మీరు అలా ఉండాలని అనుకుంటున్నారా అని కూడా ఎవరూ అడగరు. చట్టాలు, నమ్మకాలు, అద్భుత కథలు, కుటుంబ అంచనాలు.. జీవితంలో ప్రతిదీ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ప్రత్యేకమైనదని చెబుతుంది. పురుషులకు స్వేచ్ఛ ఉండగా, స్త్రీలు శిక్షను అనుభవిస్తున్నారు" అనేది ఎలియా వాదన.

ఈ వ్యవస్థ వారసత్వం, మతం, వంశపారంపర్యంతో ముడిపడి ఉందనేది ఆమె అభిప్రాయం

"వివాహ బంధంలో భార్యాభర్తలిద్దరూ పరస్పరం నమ్మకంతో ఉండాలని, ఆ బంధం నుంచి దారి తప్పడం అంటే తప్పు చేయడమే అని సమాజం చెబుతుంది"

ఇలానా ఎలియా, బ్రెజిల్, సెక్సాలజిస్టు, వివాహేతర సంబంధాలు, రిలేషన్ షిప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓపెన్ రిలేషన్స్ షిప్స్‌లో లైంగిక స్వేచ్ఛ కూడా ఉంటుంది.

అయితే ఎలియా మీరిప్పుడు సంతోషంగా ఉన్నారా? అని అడిగితే.. "నిస్సందేహంగా" అని సమాధానమిచ్చారు.

"15 ఏళ్ల క్రితం నాటి గాయం, మోసం తర్వాత ఈ రోజు నేను ఎలా ఉన్నానో అనేది కూడా చూడాలి. నేనసలు మామూలు మనిషి అవుతాననుకోలేదు. పెళ్లయిన తర్వాత నేను భద్రంగా ఉన్నానని అనిపించేది. రోజులు గడిచే కొద్దీ కోరిక చచ్చిపోయింది. అది సహజం కూడా. దీర్ఘకాలిక బంధాల్లో 40 శాతం సెక్స్ లేని పెళ్లిళ్లుగా మిగులుతాయి"

ఆమెకు ఓపెన్ మ్యారేజ్ అంటే నిజాయితీ, స్వేచ్ఛకు సంబంధించిన విషయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)