బెజవాడ పాత బస్‌స్టాండ్: ‘లులుకు ఆర్టీసీ స్థలం ఇవ్వడం లేదు.. వేరే చోట ఇస్తాం’

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 6 నిమిషాలు
విజయవాడలో లులు ప్రాజెక్టుకు ఆర్టీసీ స్థలం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి, ఏపీ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ యువరాజ్ బీబీసీతో చెప్పారు. ఆ మేరకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారని ఆయన వివరించారు.
లులు మాల్ ప్రాజెక్టుకు విజయవాడ గవర్నర్ పేటలోని పాత బస్‌స్టాండ్ స్థలాన్ని అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025 జులైలో నిర్ణయం తీసుకుంది.
దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని యువరాజ్ తెలిపారు.
అయితే లులు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఆర్టీసీ స్థలానికి బదులుగా మరొకచోట స్థలం కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికే రెండు స్థలాలు గుర్తించామని, ఆ రెండింటిలో వారికి అనువైన చోట కేటాయిస్తామని బీబీసీతో అన్నారు.
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి భరత్ దీనిపై బీబీసీతో మాట్లాడారు. ఆర్టీసీ స్థలం వివాదం నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
ప్రభుత్వం తాజా నిర్ణయంపై ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్టీసీ వర్గాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.


ఫొటో సోర్స్, UGC
అప్పటి జీవోలో ఏముందంటే...
లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌ఐఎస్‌ఎం) రూ.156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ త్రీ విధానంలో షాపింగ్ మాల్ నిర్మించాలని భావించింది. 120 రిటైల్ దుకాణాలు, 200 వాహనాలకు సరిపడా పార్కింగ్ ప్రదేశంతో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంది.
అందులోని 1.34 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని బయటి వ్యక్తులకు లీజుకు ఇవ్వవచ్చు.
65 సంవత్సరాల లీజును మరో 33 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 3 సంవత్సరాల అద్దె మినహాయింపు లేదా షాపింగ్ మాల్ ప్రారంభ తేదీ వరకు ఏది ముందుగా అయితే అమల్లోకి వస్తుంది.
ఈ స్థలానికి బదులుగా ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని కేటాయించాల్సిందిగా అప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పుడు మార్చుకుంది.

ఫొటో సోర్స్, X/Chandrababu Naidu
విజయవాడలో పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ (పీఎన్‌బీఎస్) సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్దనున్న 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను లులు గ్రూప్‌కు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఆ స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ అభిషిక్త్ కిశోర్ 2025 జులైలో లేఖ రాశారు.
కాగా, ఏపీఐఐసీ లేఖ రాసిన ఆ విషయం బయటకు రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఫొటో సోర్స్, UGC
‘ఇంత విలువైన భూమి ఎలా ఇస్తారు?’
విజయవాడ నగరానికి ఒకప్పుడు ఇదే బస్‌స్టాండ్.. ఎన్టీఆర్ హయాంలో మొదలై చెన్నారెడ్డి హయాంలో ప్రారంభమైన పీఎన్‌బీఎస్ తర్వాత ఇది పాత బస్‌స్టాండ్‌గా ప్రాచుర్యంలో ఉంది. కాలక్రమంలో గవర్నర్‌పేట–2 ఆర్టీసీ డిపోగా మారిన ఈ బస్‌స్టాండ్ ప్రాంగణం ప్రస్తుతం 4.15 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ గవర్నర్‌పేట–1,2 డిపోల బస్సులను నిలుపుతారు. 1, 2 ఆర్టీసీ డిపోల మేనేజర్ల ఆఫీసులు ఇక్కడే ఉంటాయి.
''నగరం మధ్యలో ఉన్న ఇవి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయి. అలానే ఈ బస్‌స్టాండ్‌లోని 30సెంట్ల స్థలంలో పదేళ్ల కిందట మున్సిపల్ కార్పొరేషన్ ఐరన్ స్క్రాప్ మెటీరియల్‌తో రూపొందించిన బొమ్మలతో పార్క్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే ప్రతిపాదనలపై రోజువారీ ధర్నాలతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాం. ఇప్పుడు జీవో విడుదలైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం’’ అని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్.. 2025 జులైలో బీబీసీ మాట్లాడినప్పుడు చెప్పారు.

ఫొటో సోర్స్, Lulu Group
2025 జులైలో ఏం జరిగింది?
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం 2025 జూలై 17న అమరావతిలో జరగగా, అందులో లులు గ్రూప్ సంస్థ చేపట్టే ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని ఏపీఐఐసీ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.
విజయవాడ నగరంలో పెద్ద మాల్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు లులు ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2024–2029 ప్రకారం షాపింగ్ మాల్ అభివృద్ధి కోసం లీజు అద్దె ప్రాతిపదికన నగరంలోని ఆర్డీసీకికి చెందిన 4.15 ఎకరాల భూమిని కేటాయించడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఉంది.
ప్రస్తుతం లులు మాల్ ఏర్పాటుకు సూచించిన పాత బస్‌స్టాండ్‌లోని ఆర్టీసీ నిర్మాణాలను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆ జీవో పేర్కొంది. అదేవిధంగా ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు అవసరమైన భూమిని చూడాలని స్పష్టం చేసింది.
విశాఖ బీచ్‌రోడ్‌లో 13.74 ఎకరాలు కేటాయింపు
విశాఖపట్నంలో లులు గ్రూప్ నిర్మించనున్న మెగా షాపింగ్ మాల్ నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ మేరకు విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలను ద్వారా ఏపీఐఐసీ ద్వారా కేటాయించినట్టు 2025లో విడుదల చేసిన జీవో 137లో పేర్కొన్నారు.
మొదటి మూడేళ్లు ఎటువంటి లీజు లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత లీజు వసూలు చేస్తారనీ, చదరపు అడుగుకి నెలకు రూపాయిన్నర చొప్పున ఏడాదికి రూ.4.51 కోట్లు ప్రభుత్వానికి లులు చెల్లిస్తుందని జీవోలో పేర్కొన్నారు.
ప్రతి పదేళ్లకి 10% అద్దె పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ.1066కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ మెగా షాపింగ్ మాల్ 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
2017లోనే విశాఖలో లులుకి కేటాయింపులు..
2014-19మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో 2017లోనే విశాఖ బీచ్ రోడ్ లోని హార్బర్ పార్కులో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లులు గ్రూప్ ముందుకు వచ్చింది. ఆ మేరకు విశాఖలో రూ.2200 కోట్ల పెట్టుబడితో షాపింగ్ మాల్, 5 వేల సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్, ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణం ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2018 సంవత్సరంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో లులు గ్రూప్‌తో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఇందుకోసం ఏపీఐఐసీకి చెందిన 11.23 ఎకరాలు, సీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉన్న ప్రాంతం 2.60 ఎకరాలు, మొత్తంగా 13.83 ఎకరాల భూమిని ఆనాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించగా, ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేసింది.

ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే
2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లులు మాల్‌కు భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రివర్స్ టెండరింగ్ పేరిట, 2018లో టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఆ భూముల ఒప్పందాన్ని 2023లో రద్దు చేసింది. దీంతో లులు గ్రూప్ రాష్ట్రం నుంచి తరలిపోయింది.
అప్పట్లో వైసీపీ నిర్ణయాన్ని విశాఖ టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. పెట్టుబడులు, ఉపాధికల్పన లక్ష్యంగా తమ ప్రభుత్వం లులును తీసుకువస్తే వైసీపీ దురుద్దేశపూర్వకంగా పంపించివేసిందని నాటి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. దీనిపై వైసీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడుతూ.. భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే తమ ప్రభుత్వం ఆనాడు రద్దు చేసిందని చెప్పారు.
విశాఖలో కేటాయింపులపై కోర్టుకి
కాగా, విశాఖలో బీచ్ సమీపంలో విలువైన స్థలాన్ని లులుకి కట్టబెట్టారంటూ న్యాయవాది పాకా సత్యనారాయణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఫొటో సోర్స్, luluretail.com
అసలేంటీ లులు మాల్?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని అబుదాబి ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న వ్యాపార సంస్థ లులు గ్రూప్ ఇంటర్నేషనల్.
ఎం.ఎ. యూసఫ్ అలీ దీని వ్యవస్థాపకులు. ఈయన కేరళకు చెందినవారు.
1995లో ప్రారంభం అయిన ఈ సంస్థలో సుమారు 57 వేల మంది పనిచేస్తున్నారు.
వివిధ రకాల కిరాణా వస్తువులు, పండ్లు, కూరగాయలు, మాంసం.. సహా అన్నీ ఒకచోట అమ్మే హైపర్ మార్కెట్ వ్యాపారంలో ప్రపంచంలోనే పెద్ద సంస్థల్లో లులు ఒకటి.
ప్రపంచ వ్యాప్తంగా 116 హైపర్ మార్కెట్లు, 102 ఎక్స్‌ప్రెస్ స్టోర్లను నడుపుతున్నట్లు ఆ సంస్థ తమ వైబ్‌సైట్‌లో పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































