You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అస్సాం ఎలక్షన్స్: 40 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 9 వేల చొప్పున జమ.. ఈ ‘అరుణోదయ పథకం’పై విపక్షాల విమర్శలేమిటి?
- రచయిత, ప్రేరణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
గువాహాటి నుంచి సుమారు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న కామరూప్ గ్రామీణ జిల్లాలో రంగియా పట్టణం ఉంది. ఆ పట్టణంలోని ఒక చిన్న ఇంట్లో 55 ఏళ్ల మామోనీ దాస్ ఉంటున్నారు.
మామోని భర్త బ్యాటరీ రిక్షా నడుడపుతారు. వారానికి ఆయన 500 నుంచి 600 రూపాయలు సంపాదిస్తారు. ఆ కుటుంబం రోజువారీ ఖర్చుల కోసం ఎంతో కష్టపడాల్సివస్తుంది.
అయితే, ఈసారి బిహూ పండుగ ఆమెలో ఉత్సాహాన్ని పెంచింది.
‘ఈసారి కొంచెం బాగా షాపింగ్ చేస్తాం. మార్కెట్‌కు వెళ్తాం. పిల్లలు, మనవలు, మనవరాళ్లకు దుస్తులు కొంటాం. ఈసారి కొంచెం బాగా ఖర్చుపెట్టుకోగలం’ అని ఆమె చెప్పారు.
మామోనీ ఇలా చెప్పడానికి కారణం ఈ నెల 10న ఆమెకు ప్రభుత్వం నుంచి 9 వేల రూపాయలు అందడమే.
ఆమె ఒక్కరికే కాదు. 'అరుణోదయ యోజన' కింద మార్చి 10న అంటే అస్సాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అయిదు రోజుల ముందు రాష్ట్రంలోని 40 లక్షల మంది మహిళల ఖాతాల్లో మొత్తం రూ. 3,600 కోట్లు జమ చేశారు.
లబ్ధిదారులు ఏమంటున్నారు?
గువాహటిలో ఒక కూరగాయల మార్కెట్‌లో ‘బీబీసీ’ కొందరు మహిళలతో మాట్లాడింది.
రెండు వారాల కిందట ఈ పథకంలో 9వేల రూపాయలు వచ్చాయని ఓ మహిళ చెప్పారు.
''ఆ డబ్బుతో ఇంటి పనులు చేయించాం. కోళ్లు, పందులు కొనుక్కుని వాటిని పెంచుతున్నాం'' అని ఆమె తెలిపారు.
ఆ డబ్బుతో ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసినట్లు మరో మహిళ తెలిపారు.
ఈ పథకం గురించి మామోనీ మాట్లాడుతూ.. ''మహిళల దగ్గర మామూలుగా డబ్బు ఉండేది కాదు. ఈ పథకం వల్ల చేతిలో కాస్త డబ్బులున్నాయి. కావాల్సినవి కొనుక్కోగలుగుతున్నా. చిన్న అలంకరణ వస్తువు కావాలన్నా ఇంతకుముందు మా ఆయన్ను అడగాల్సివచ్చేది. ఇప్పుడు నేను కొనుక్కోగలుగుతున్నా'' అని ఆమె చెప్పారు.
ఈ 9 వేల రూపాయల్లో కొంత భాగం 'బిహూ బహుమతి' అని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం చెప్పింది.
మహిళలు బీజేపీకి ఓటు వేయాలని హిమంత బిశ్వ శర్మ కోరారు.
''ఈ సారి బిహూ పండుగను మరింత బాగా చేసుకోవాలని రూ. 9 వేలు ఇచ్చాం. మీరు ఎవరికి ఓటువేస్తారు? కచ్చితంగా బీజేపీకే కదా'' అని ఆయన లబ్ధిదారులైన మహిళలను ఉద్దేశించి అడిగారు.
అయితే.. ఎన్నికలకు ముందు అస్సాంలోని 40 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 3,600 కోట్లు వేయడం ఎన్నికల్లో ప్రయోజనం కోసమేనని విపక్షం ఆరోపిస్తోంది.
''బిహార్‌లో కూడా ఎన్నికలకు ముందు మహిళలకు రూ. 10 వేల చొప్పున ఇచ్చారు. ఇది ఓట్లు గెలుచుకోవడానికి ఉపయోగిస్తున్న పద్ధతి. ప్రభుత్వం డబ్బు ఇచ్చి ఓట్లు కొనాలని చూస్తోంది. ఇది ప్రజలకు అర్ధమవుతోంది. ఈ సారి వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు'' అని అస్సాంలోని కాంగ్రెస్ నాయకురాలు మీరా బోర్తాకూర్ గోస్వామి అంటున్నారు.
అరుణోదయ పథకం ఎన్నికల వ్యూహమా?
ఈ పథకం 2020లో మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్. ఆ సమయంలో మహిళలకు నెలకు 830 రూపాయలు ఇచ్చేవారు.
2021లో హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అయ్యాక ఈ మొత్తాని రూ. 830 నుంచి రూ. 1250కి పెంచారు. కొత్తగా మరికొంతమంది మహిళలను లబ్ధిదారులుగా చేర్చారు.
ఈ పథకంలో 40 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు.
కానీ నెలకు రూ. 1,250 ఇచ్చే ఈ పథకంలో ఎన్నికలకు ముందు రూ. 9 వేలు ఇవ్వడం అనేది ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
సెంట్రల్ గువాహటి బీజేపీ అభ్యర్థి, పార్టీ సీనియర్ నేత విజయ్ గుప్తా ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు.
''అరుణోదయ కొత్త స్కీమ్ కాదు. 2020 నుంచి రాష్ట్రంలో దీన్ని అమలుచేస్తున్నాం. మొదట దీని లబ్ధిదారులు 24 లక్షలమంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు దీన్ని 40 లక్షల మందికి పెంచాం. కొత్తవారిని చేర్చడానికి సమయం పడుతుంది.. అందుకే రెండు నెలలు డబ్బులివ్వలేదు.. ఆ బకాయిలు, పండుగ అడ్వాన్స్ కలిపి 9 వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చాం'' అని బీబీసీతో చెప్పారు.
అరుణోదయ పథకం ఇప్పుడు అస్సాం రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది.
ఇది తమ ప్రభుత్వ అతిపెద్ద విజయమని మఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. మహిళలకు నేరుగా లాభం కలిగించే ఈ మోడల్ అస్సాం నుంచే ప్రారంభమైందని అన్నారు.
అస్సాంలో ఇతర పథకాలు ఏమున్నాయి?
మహిళల కోసం అస్సాం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అరుణోదయ ఒకటి. దీంతో పాటు మరికొన్ని పథకాలున్నాయి.
ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినుల కోసం ప్రభుత్వం నిజుత్ మొయినా, జిమోన్ ప్రేరణ వంటి పథకుల అమలుచేస్తోంది.
ఈ పథకం కింద హై స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివే అమ్మాయిలకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తారు.
హైస్కూల్ విద్యార్థినులకు నెలకు వెయ్యి రూపాయలు, గ్రాడ్యుయేషన్‌లో నెలకు 1,250 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో నెలకు రూ. 2,500 ఇస్తారు.
ఈ నగదు పథకాల వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పెరుగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
గత కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాలలో మహిళలను లక్ష్యంగా చేసుకుని నగదు ఇచ్చే పథకాలు ఎన్నికల అంశాలుగా మారుతున్నాయి.
అయితే, ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ గృహలక్ష్మి పథకం అమలుచేస్తోంది.
''అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత ఈ పథకం కొంతవరకు ఇది లాభిస్తుంది. ఎందుకంటే వారి చేతికి డబ్బు వస్తోంది కాబట్టి గ్రామీణ మహిళలు దీనిపై సంతోషంగా ఉన్నారు. ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుంది. అయితే మహిళల కోణంనుంచి చూస్తే దీర్ఘకాలిక ప్రభావం కనిపించడంలేదు'' అని సీనియర్ జర్నలిస్ట్ రత్నా భరాలి తాలూక్దార్ అభిప్రాయపడ్డారు.
''అరుణోదయ పథకంలో వచ్చే డబ్బు పూర్తిగా ఉత్పాదకమైనది కాదు. అంటే ఈ డబ్బు కోసం మహిళలు ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు. తరుణ్ గొగోయి కాలంలో కూడా మహిళల కోసం పథకాలుండేవి. కానీ వాటిలో డబ్బు బదులు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేవారు. అవి దీర్ఘకాలానికి ఉపయోగపడేవి'' అన్నారు రత్నా భరాలి.
''అస్సాం వంటి పేదరాష్ట్రంలో వరుసగా ఇలా నగదు పథకాలు అమలుచేయడం మంచిది కాదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. చాలా పని అప్పులతో జరుగుతోంది'' అని ఆమె చెప్పారు.
కాంగ్రెస్ ఏం ప్రకటించనుంది?
ఈ పథకాల వల్ల ఎన్నికల్లో హిమంతకు లాభం ఉంటుందని మరో సీనియర్ జర్నలిస్ట్ పరేశ్ మాలాకర్ చెప్పారు.
''కాంగ్రెస్ ఏం ప్రకటిస్తుందో చూడాలి. ఈ పథకాలకు వాళ్లు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపిస్తారో కూడా ముఖ్యం. అందువల్ల ప్రభావం ఎంత ఉంటుందనేది ప్రత్యర్థిపార్టీ చర్యలపై కూడా ఆధారపడిఉంటుంది''
మహిళల పథకాలను తమ మేనిఫెస్టోలో చేర్చాలని అస్సాం కాంగ్రెస్ కూడా ఆలోచిస్తోంది. కానీ అవి ఎలా ఉంటాయి, మహిళలకు ఏం ఇస్తారు అనేది తర్వాత తెలుస్తుంది.
ఈ నగదు పథకాల ప్రభావం చూస్తే ఇవి మహిళలకు, యువతకు తక్షణ ఉపశమనం ఇచ్చాయి. కానీ ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కొరత, ధరల పెరుగుదల వంటి సమస్యలపై అసంతృప్తి కూడా ఉంది.
అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది. మే 4న ఫలితాలు ప్రకటిస్తారు.
ఇంతకుముందు 2021అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ 2 కోట్ల 33 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో ఒక కోటి 16 లక్షల మంది మహిళా ఓటర్లు.
చాలా దశల్లో మహిళల ఓటింగ్ శాతం పురుషులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా నమోదైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)