ప్రశాంతమైన 'పోలీస్ పట్టణం'లో.. ఒక సీరియల్ కిల్లర్

    • రచయిత, షీలా ఫ్లిన్
  • చదివే సమయం: 7 నిమిషాలు

మసపీక్వా... "పోలీస్ పట్టణం" అని స్థానికులు గర్వంగా చెబుతారు.

లాంగ్ ఐలాండ్‌లోని ప్రశాంతమైన తీరప్రాంతంలో ఉండే ఈ ప్రాంతానికి మాన్‌హట్టన్ నుంచి రైలులో కేవలం ఒక గంటలో చేరుకోవచ్చు.

ఇక్కడ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎన్‌వైపీడీ) డిటెక్టివ్‌లు, తరతరాలుగా పోలీసు శాఖలో ఉన్న కుటుంబాలు, నసావ్, సఫోల్క్ కౌంటీలకు చెందిన అధికారులు, ఇంకా అనేక ఇతర చట్ట సంస్థల సభ్యులు నివసిస్తున్నారు.

2010 సంవత్సరంలో గిల్గో బీచ్‌ వద్ద మానవ శరీర భాగాలు వరుసగా బయటపడటం సంచలనం సృష్టించింది. ఆ తర్వాతే, లాంగ్ ఐలాండ్‌లో ఒక సీరియల్ కిల్లర్ కొన్నేళ్లుగా సంచరిస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఆ కిల్లర్ స్థానికుడేనా? ఇంకా అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడా? ఇన్నేళ్లుగా పట్టుబడకుండా తప్పించుకుంటున్నాడంటే, ఒక పోలీసు అధికారి అయివుంటాడా? ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి.

ఆ ఊహాగానాలన్నింటికీ 2023 సంవత్సరంలో ఆర్కిటెక్ట్ రెక్స్ హ్యూర్‌మాన్ అరెస్టుతో తెరపడింది.

ఎనిమిది మంది మహిళలను హత్య చేసినట్లు ఈవారం కోర్టులో ఆయన అంగీకరించడం తమకు గొప్ప ఊరటనిచ్చిందని లాంగ్ ఐలాండ్ పోలీసులు చెప్పారు.

''ఇది భారీ ఉపశమనం. ఈ నేరాలను ఒక పోలీసు మీద నెట్టాలని ప్రయత్నించినవారూ ఉన్నారు. కానీ, ఈ సీరియల్ కిల్లర్ పోలీసు కాదని తేలడం అధికార వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది" అని రిటైర్డ్ ఎన్‌వైపీడీ డిటెక్టివ్, మసపీక్వా నివాసి క్రెయిగ్ గార్లండ్ అన్నారు.

పోలీసుల మధ్యనే సంచారం...

వివాహితుడైన 62 ఏళ్ల హ్యూర్‌మాన్‌కు ఇద్దరు పిల్లలు. మాన్‌హట్టన్‌లోని ఆయన కార్యాలయం వెలుపల పడేసిన ఒక పిజ్జా ముక్క ద్వారా ఆయన డీఎన్‌ఏను సేకరించి, దాని ఆధారంగా అధికారులు 2023, జూలైలో ఆయనను అరెస్టు చేశారు.

హ్యూర్‌మాన్ ప్రతిరోజూ మసపీక్వా పార్క్ నుంచి న్యూయార్క్ సిటీకి వెళ్లేవారు. స్థానిక పోలీస్ బార్ 'జానీ మెక్‌గోరీస్' మీదుగానే వెళ్లేవాడు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఈ పాపులర్ పబ్‌లో పోలీసులు కూర్చుని కిల్లర్ కోసం సాగుతున్న వేట గురించి చర్చించుకునేవారు. అలాగే, కొన్ని వీధుల అవతల ఉన్న తన ఇంటికి వెళ్లొస్తుండేవారు.

మృతదేహాలు వెలుగులోకి రావడం మొదలైనప్పుడు, హోమిసైడ్ విభాగం సభ్యులు "ప్రతి శుక్రవారం రాత్రి తమ వద్దకు క్రమం తప్పకుండా వచ్చేవారని" మెక్‌గోరీస్ యజమాని జోవాన్ ఫౌంటైన్ తెలిపారు. ఆ భయంకరమైన సంఘటనల తర్వాత వారు "తీవ్ర దిగ్భ్రాంతికి" గురైనట్లు చెప్పారు.

"వారు లోపలికి రాగానే, 'అసలు ఆ ఓషన్ పార్క్‌వే బీచ్ దగ్గర ఏం జరుగుతోంది?' అని అడిగేవాళ్లం.

అలా అది రోజంతా, నిత్యం వార్తల్లో నిలిచేది" అని గుర్తుచేసుకున్నారు.

అయితే, అక్కడ వారు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ హంతకుడు తమకు సమీపంలో ఉన్నాడనే విషయం వారికి తెలీదు. తరతరాలుగా పోలీసు వృత్తిలో ఉన్నవారు కూడా ఆయన ఆచూకీ పసిగట్టలేకపోయారు. ఆఖరికి కొందరు అధికారులు, ఆ కిల్లర్ తమలో ఒకడే అయి ఉంటాడా? అని అనుమానించడం మొదలుపెట్టారు.

"ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తగా చేస్తున్నాడు. కాబట్టి కిల్లర్ ఒక పోలీసోడు కూడా కావొచ్చు కదా? అని జనం అనుకునేవారు" అని గార్లండ్ గుర్తు చేసుకున్నారు.

"అయితే, ఒక విషయం. అది ఎవరైనా కావొచ్చు" అని అన్నారు.

పోలీసు శాఖను కుదిపేసిన కేసులు

"లాంగ్ ఐలాండ్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే, బహుశా మసపీక్వా, మసపీక్వా పార్క్ ఏరియాలోనే ఎక్కువ మంది పోలీసులు నివసిస్తుంటారు. లాంగ్ ఐలాండ్‌లో పోలీసు జనాభాకు ఇది కేంద్రబిందువు లాంటిది'' అని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబ్ లివోటి చెప్పారు.

మసపీక్వాలోని కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్న ఈ పోలీసు వృత్తి నేపథ్యాన్ని వివరిస్తూ, తన బార్ సిబ్బందిలో ఒకరిని ఫౌంటైన్ ఉదాహరణగా చూపించారు.

''ఆయన తండ్రి ఒక పోలీసు, తాత కూడా పోలీసు, ఇప్పుడు ఆయన కూడా ఎన్‌వైపీడీలో ఉద్యోగం సంపాదించారు. మసపీక్వాలోని పోలీసు కుటుంబాలు ఆ వృత్తిలోనే బతుకుతాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ వారసత్వం కేవలం పోలీసులకే పరిమితం కాలేదు. మసపీక్వాలో అనేకమంది అగ్నిమాపక సిబ్బంది, వైద్యులు, ఇతర అత్యవసర సేవా సంస్థల అధికారులు నివసిస్తున్నారు.

సెప్టెంబర్ 11 (9/11) దాడుల సమయంలో ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. చుట్టుపక్కల ఉన్న నసావ్ కౌంటీ సుమారు 350 మందిని కోల్పోయింది. వారిలో చాలామంది అత్యవసర సేవల సిబ్బంది ఉన్నారు.

గిల్గో బీచ్ కేసుతో పోలీసుల నిరాశ

అయితే, గిల్గో బీచ్ కేసు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేసింది.

నసావ్ కౌంటీ రిటైర్డ్ హోమిసైడ్ హెడ్ జాన్ అజ్జాటా మాట్లాడుతూ, "ఈ హత్యలు చేసిందెవరో తెలసుకోవడానికి ఇంత సమయం పట్టడం ఒక మాజీ అధికారిగా, మాజీ పోలీసుగా చాలా నిరాశ కలిగించింది" అని అన్నారు.

గిల్గో బీచ్ దర్యాప్తుకు అప్పట్లో ఇన్‌చార్జ్‌గా ఉన్న సఫోల్క్ కౌంటీ పోలీస్ చీఫ్ జిమ్మీ బర్క్, 2013లో అరెస్టు కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. సెక్స్ టాయ్స్, పోర్నోగ్రఫీ, సాక్షులపై ఒత్తిడి తేవడం, నిజాలను తొక్కిపెట్టడం వంటి సంచలన ఆరోపణలు వచ్చాయి.

అమెరికా అటార్నీ కార్యాలయం ప్రకారం, నిబంధనల ఉల్లంఘన కేసులో అరెస్టైన క్రిస్టోఫర్ లోబ్ అనే వ్యక్తి ఇంటికి బర్క్ వెళ్లారు. బర్క్ అధికారిక ఎస్‌యూవీ నుంచి లోబ్ దొంగిలించిన సెక్స్ టాయ్స్, పోర్నోగ్రఫీ ఉన్న బ్యాగును తిరిగి తెచ్చుకోవడమే ఆయన ఉద్దేశం.

ఆ తర్వాత, పోలీస్ కస్టడీలో ఉన్న లోబ్‌ను బర్క్ చితకబాదారు. ఆ విషయాన్ని దాచిపెట్టడానికి ఇతరులను ఒప్పించే ప్రయత్నం చేశారు.

2016లో ఆయన తన నేరాలను అంగీకరించారు. దీనితో ఆయనకు 46 నెలల జైలుశిక్ష పడింది.

'నేనసలు నమ్మలేకపోయాను'

ఈ వైఫల్యం మరిన్ని అనుబంధ కేసులకు దారితీసింది

మాజీ సఫోల్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ థామస్ జె.స్పోటా, జిల్లా అటార్నీ కార్యాలయ మాజీ ఇన్వెస్టిగేషన్స్ చీఫ్ క్రిస్టోఫర్ మెక్‌పార్ట్‌ల్యాండ్‌లకు ఐదేళ్ల జైలు శిక్షలు పడ్డాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, మెక్‌పార్ట్‌ల్యాండ్ ప్రభుత్వ అవినీతి నిరోధక విభాగానికి చీఫ్‌గా ఉండేవారు.

సెక్స్ వర్కర్‌ల హత్యలపై దర్యాప్తు చేయాల్సిన సఫోల్క్ అధికారులే అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడంతో, ఈ సీరియల్ కిల్లర్‌కు పోలీసులతో సంబంధాలు ఉండవచ్చనే ఆరోపణలకు మరింత బలం చేకూరింది.

దీనికి తోడు, అప్పట్లో బర్క్ ఈ దర్యాప్తులో ఎఫ్‌బీఐ సహకారాన్ని నిరాకరించడం లాంగ్ ఐలాండ్ పోలీసు అధికారుల ఆగ్రహానికి కారణమైంది.

ఏఆర్‌పీవో ప్రెసిడెంట్ లివోటి మాట్లాడుతూ, "నేనసలు నమ్మలేకపోయాను, ఈ వ్యక్తి ఇన్ని ఘోరాలు చేసి ఎలా తప్పించుకున్నాడో. నమ్మశక్యం కాని విషయమది. కొన్ని సంకేతాలు కనిపిస్తున్నా, ఎవరూ ఏమీ చేయలేదు" అని చెప్పారు.

అయితే, 2023 జులై 13న హ్యూర్‌మాన్ అరెస్ట్ అయ్యేంత వరకు.. ఈ కేసు ఇంట్లో కూర్చుని శల్యశోధన చేసేవారికి, కుట్ర సిద్ధాంతాలు సృష్టించేవారికి ఆయుధంగా మారింది.

‘పక్కనే ఉన్నాడని ఎవరూ ఊహించలేదు’

హంతకుడు ఒక ఆర్కిటెక్ట్ అని తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకోగా, మసపీక్వా వాసులు మాత్రం విస్తుపోయారు.

"అతను పక్కనే ఉంటున్నాడని ఎవరు ఊహిస్తారు?" అని లివోటి అన్నారు.

హ్యూర్‌మాన్ బిడ్డ తాను నిర్వహించే లిటిల్ లీగ్ ప్రోగ్రామ్‌లలో ఒకదానిలో పాల్గొన్నట్లు గుర్తించిన గార్లండ్ మాట్లాడుతూ, "అందరూ షాక్‌కు గురయ్యారని నేననుకుంటున్నా. ఆ వ్యక్తితో సంబంధం ఉన్న ఎవరికైనా ఇది ఒక పెద్ద షాక్" అని అన్నారు.

'బాధితులకు తీరని ఆవేదన'

మసపీక్వాలోని సెయింట్ రోజ్ ఆఫ్ లిమా రోమన్ క్యాథలిక్ చర్చిలో పోలీసు అధికారులు, అత్యవసర సేవా సిబ్బంది అధిక సంఖ్యలో సభ్యులుగా ఉంటారు. ఆ చర్చి పాస్టర్ రెవరెండ్ గెరార్డ్ జెంటిల్‌మన్ మాట్లాడుతూ, ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైనప్పటికీ, ఈ కమ్యూనిటీ వెంటనే ఉదారతను, సానుభూతిని చాటుకుందని పేర్కొన్నారు.

"ప్రజలు ముందుకొచ్చి, 'హ్యూర్‌మాన్ కుటుంబం కోసం మనం ఏం చేస్తున్నాం? ఏదైనా చేయగలమా?' అని అడిగారు" అని పాస్టర్ చెప్పారు.

"మేం వారికి కొన్ని కానుకలు అందించాం. మా సిబ్బందిలో ఒకరు వెళ్లి ఆయన భార్యకు ధైర్యం చెప్పారు" అని వెల్లడించారు.

"అదే సమయంలో ఆందోళన కూడా వ్యక్తమైంది. 'దేవుడా, ఇది మన పట్టణంలోనే జరుగుతోందా? ఆయన మన మధ్యే ఉన్నాడా?' అని జనం చర్చించుకున్నారు" అని జెంటిల్‌మన్ గుర్తుచేసుకున్నారు.

ఈ కేసు ముగిసిపోతున్నందుకు ఒకవైపు "పెద్ద ఊరట" ఉన్నప్పటికీ, మరోవైపు "తీవ్రమైన విషాదం" కూడా నెలకొందని ఆయన అన్నారు.

"మసపీక్వా వాసులు చాలా కలుపుగోలుగా ఉండేవారు. ఈ ఉదంతం దానిని అతలాకుతలం చేసి, విచ్ఛిన్నం చేసింది" అని వ్యాఖ్యానించారు.

"ఎవరికి ఏ కష్టమొచ్చినా స్పందించే కమ్యూనిటీ ఇది. ఒకరికొకరు తోడుగా ఉండటంలోనే వీరు బలాన్ని వెతుక్కుంటారు" అని ఆయన అన్నారు.

హ్యూర్‌మాన్ తన నేరాలను అంగీకరించిన తర్వాత, ఇప్పుడు ఆ తత్వమే ఈ కమ్యూనిటీకి అండగా నిలుస్తోంది.

గార్లండ్ మాట్లాడుతూ, "ఆయన జైలు పాలవ్వడం అందరికీ పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. హంతకుడు ఆయనే అని స్పష్టమైంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

రిటైర్డ్ హోమిసైడ్ హెడ్ అజ్జాటా కూడా హ్యూర్‌మాన్ అరెస్టుపై హర్షం వ్యక్తం చేశారు.

''ప్రజలు దీనిని ఒక ముగింపుగా భావిస్తారు. కానీ, నిజానికి అలాంటిదేమీ ఉండదు. మీకు న్యాయం జరగవచ్చు, కానీ బాధితుల కుటుంబాలకు ఆ బాధ నుంచి ఎప్పటికీ పూర్తి విముక్తి దొరకదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)