టెక్ ఇండస్ట్రీలో పనిచేయాలంటే డిగ్రీ తప్పనిసరిగా ఉండాలా?

ఫొటో సోర్స్, BAE SYSTEMS
- రచయిత, సీన్ మెక్‌మానస్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
‘‘యూనివర్సిటీకి వెళ్లమని చాలా మంది నాకు చెప్పారు, కానీ నేర్చుకునే నా విధానం, టెక్నాలజీతో కలిసి పనిచేయడం నాకు దీని గురించి మరింత అర్థమయ్యేలా చేసింది’’ అని ట్రావిస్ విలియన్స్ చెప్పారు.
6,37,000 మంది లాగానే, తాను కూడా ఒక అప్రెంటీస్. స్కూల్ తర్వాత యూనివర్సిటీకి వెళ్లడం ఇష్టం లేని వారికి టెక్ కంపెనీల్లో స్థిరపడేందుకు అప్రెంటీస్‌షిప్ అనేది ప్రత్యామ్నాయ మార్గంగా ఉంది.
ఏడాదిన్నర క్రితం వర్జిన్ మీడియా ఓ2 కంపెనీలో సైబర్ సెక్యూరిటీ అప్రెంటీస్‌గా విలియమ్స్ చేరారు.
అంతకుముందు, కాలేజీలో ఐటీ, సైబర్ సెక్యూరిటీలో ‘ఏ’ లెవల్స్ ఆయన పొందారు. ఆ తర్వాత, ఐటీ ఇండస్ట్రీలోనే మరో కాలేజీలో హెల్ప్‌డెస్క్ సపోర్ట్ అందించారు.
ప్రస్తుతం విలియమ్స్ వర్జిన్ మీడియా ఓ2లో నెట్‌వర్క్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిర్వహించడం, పర్యవేక్షించడం చేస్తున్నారు.
అనధికారిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించే నెట్‌వర్క్ చొరబాటు నివారణ వ్యవస్థలో ఏదైనా సమస్య ఉంటే ఆయనే చూసుకుంటారు.
‘‘ఆ నివారణ వ్యవస్థలో ఏదైనా సమస్య ఉంటే, కంపెనీలో పనిచేసే వారు నా వద్దకు లేదా నా సహోద్యోగుల వద్దకు వస్తారు. ఇది చాలా పెద్ద బాధ్యత. కానీ, ఈ అనుభవం ఉండటం నాకెంతో సంతోషానిస్తోంది’’ అని విలియమ్స్ చెప్పారు.
ఆయనలో కంపెనీ ఏం చూసిందనే ప్రశ్నపై కూడా విలియమ్స్ స్పందించారు.
‘‘పెద్దగా ఏం లేదు, ఒకరి వద్ద అన్నింటికీ సమాధానాలు ఉండొచ్చు, కానీ ఒకరు ఎంత వీలైతే అంత నేర్చుకోవడానికి ఆసక్తిని, సమర్థతను చూపించొచ్చు’’ అని విలియన్స్ చెప్పారు.
ఆ ఆసక్తిని చూపించేందుకు నెట్‌వర్క్ అనాలసిస్ టూల్స్‌తో ఇంట్లో కూడా తాను 24 గంటల పాటు కుస్తీలు పడటమే సాయం చేసింది.
‘‘అప్రెంటీస్‌షిప్‌లో మంచి విషయం ఏంటంటే, మీకు అవసరమైన నైపుణ్యాలను మీరు నేర్చుకుంటారు. కొన్నిసార్లు ఆ నైపుణ్యాలను అదే రోజు అమలు చేస్తుంటారు.’’ అని చెప్పారు.
యూనివర్సిటీ చాలా ఉన్నతమైనదని, కానీ, పని అనుభవాన్ని అది అందించలేదని అన్నారు.

ఫొటో సోర్స్, VIRGIN MEDIA O2
బీఏఈ సిస్టమ్స్ ఈ ఏడాది 1,400 మంది అప్రెంటీస్‌లను నియమించుకోవాలని చూస్తోంది.
తన జీసీఎస్‌ఈ(14 నుంచి 16 ఏళ్ల లోపున్న విద్యార్థులు ఒక నిర్దిష్ట సబ్జెట్‌పై అర్హత పొందడం) విద్యాభ్యాసం తర్వాత స్కూల్ నుంచి బయటికి వచ్చిన హోలీ కీనన్, 2019లో బీఏఈ సిస్టమ్స్ అడ్వాన్స్డ్ అప్రెంటీస్‌షిప్‌లో చేరారు.
బారో-ఇన్-ఫర్నెస్ పట్టణంలో సబ్‌మెరైన్ షిప్‌యార్డులో పనిచేస్తున్నారు.
సబ్‌మెరైన్ నీటిలోకి వెళ్లి తన పనిని ప్రారంభించే ముందు దానిలో ఉన్న సమస్యలను పరిశీలించేందుకు ఆమె వర్చ్యువల్ రియాల్టీ హెడ్‌సెట్‌ను వాడుతుంటారు.
అసోసియేట్ మానుఫాక్చరింగ్ ఇంజనీర్‌గా ఆమె కంపెనీలో పనిచేస్తున్నారు.
తను ఎప్పుడూ యూనివర్సిటీకి వెళ్లాలనుకోలేదు. ‘‘ఎల్లప్పుడూ అప్రెంటీస్‌షిప్‌ల గురించి మాట్లాడే దగ్గరే నేను నివసించాను. నా కుటుంబమంతా అప్రెంటీస్‌షిప్ స్కీమ్ ద్వారానే బీఏఈలో చేరింది. ’’ అని తెలిపారు.
అప్రెంటీస్‌షిప్ అనేది మూడున్నరేళ్ల ప్రొగ్రామ్. కీనన్ తన తొలి ఏడాదంతా పూర్తిగా కాలేజీలోనే గడిపారు.
ఎలక్ట్రిక్, మెకానికల్, పైప్స్ వర్క్‌షాపులలో టూల్ స్కిల్స్ నేర్చుకున్నారు.
రెండో ఏడాది వారంలో ఒక రోజు కాలేజీకి వెళ్లేవారు. మెటీరియల్స్, హెల్త్, సేఫ్టీ వంటి అంశాల గురించి చదువుకున్నారు.
ఐబీఎం కూడా డిగ్రీ చదువుకోని వారిని తమ కంపెనీలో నియమించుకుంటోంది. వైవిధ్యభరితమైన ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు ఇది సాయపడుతుంది.
‘‘ప్రతి దగ్గర తెలివైన వ్యక్తులున్నారు. కానీ, ప్రతి ఒక్కరికీ అవకాశం ఒకే విధంగా ఉండదు’’ అని కంపెనీలో ఎర్లీ ప్రొఫెషనల్ ప్రొగ్రామ్స్‌ను నిర్వహించే జెన్నీ టేలర్ ఎంబీఈ చెప్పారు.
‘‘మా క్లయింట్స్ చాలా వైవిధ్యభరితంగా ఉంటారు. ప్రతి దగ్గర్నుంచి ఎందుకు టాలెంట్‌ను మీరు కోరుకోవడం లేదు?’’అని అన్నారు.
ఎంట్రీ లెవల్ టెక్ ఉద్యోగాలను భర్తీ చేయడంలో తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లు 52 శాతం మంది కంపెనీలు చెప్పినట్లు స్కిల్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ జనరేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది.
అప్రెంటీస్‌గా ఐబీఎంలో చేరినా లేదా గ్రాడ్యుయేట్లు అయినా కంపెనీ మాత్రం ట్రాన్స్‌ఫరబుల్ స్కిల్స్ అంటే ప్రతి ఉద్యోగంలో ఉపయోగపడే నైపుణ్యాలు ఉన్న వ్యక్తుల కోసమే చూస్తోంది.
‘‘ఒకవేళ మీరు బార్‌లో పనిచేసుంటే, మీకు టీమ్‌వర్క్, క్లయింట్ ఫోకస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి’’ అని టేలర్ అన్నారు.
‘‘కష్టమైన వ్యక్తులతో మీరు మాట్లాడి ఉంటారు. ఆ సమయంలో మేం విద్యార్హతలతో పోలిస్తే వ్యక్తిపైనే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తాం’’ అని ఐబీఎంకు చెందిన జెన్నీ టేలర్ చెప్పారు.
ఎంట్రీ లెవల్ ప్రొగ్రామ్స్‌తో పాటు చాలా ఇతర ఉద్యోగాలకు కూడా ఐబీఎం డిగ్రీ అర్హతను తీసేసింది.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అస్యూరెన్స్(క్యూఏ) కోసం ఐబీఎం లిస్ట్ చేసిన ఉద్యోగాల్లో కేవలం 29 శాతానికి మాత్రమే డిగ్రీ అవసరం ఉందని బర్నింగ్ గ్లాస్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ గుర్తించింది.
ఇతర నాలుగు పెద్ద టెక్ కంపెనీలలో ఇది 90 శాతం నుంచి 100 శాతంగా ఉంది.
ప్రస్తుత ఆలోచనలకు లేదా ట్రెండ్స్‌కు వీరు చాలా వెనుకబడి ఉన్నారని టెక్ రిక్రూట్‌మెంట్ సంస్థ హార్వే నాష్ డైరెక్టర్ రాబిన్ మాక్‌డొనాల్డ్ అన్నారు.
ఇంకా వారు తమ విధానానాలను మార్చుకోలేదని, వారు మార్చుకోవాల్సి ఉందని చెప్పారు.
క్వాలిటీ అస్యూరెన్స్ వ్యక్తికి తన ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని అన్నారు. నెలల వ్యవధిలో వారికి తాము శిక్షణ ఇవ్వగలమని అన్నారు.
‘‘ఎంట్రీ లెవల్‌లో ప్రొగ్రామర్స్‌ను మీరు నియమించుకోవాలనుకుంటే, కంప్యూటర్ సైన్స్ డిగ్రీలున్న వ్యక్తులను మాత్రమే మీరు చూస్తున్నారు. జెండర్‌ను మీరు చూడటం లేదు. 90 శాతం కోర్సులు దాదాపు పురుషులతో నిండిపోతున్నాయి.’’ అని కూడా తెలిపారు.

ఫొటో సోర్స్, REBECCA NOONAN
‘‘కంప్యూటర్ సైన్స్(సీఎస్50)ను ప్రతి ఒక్కరూ ఉచితంగా ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు హార్వర్డ్ ఇచ్చిన ప్రవేశ ప్రకటనను చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను’’ అని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఫిఫ్టీ డాట్ ఐఓ టెక్నాలజీ డైరెక్టర్ వెస్కో ట్రాకివ్స్కీ చెప్పారు.
15 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన స్కూల్ మానేశారు. ఆ తర్వాత రెండేళ్లలో తనకు తానే వెబ్ డిజైన్, టెక్నాలజీ నైపుణ్యాలను నేర్చుకున్నారు.
ఇదే సమయంలో హార్వర్డ్ కోర్సును పూర్తి చేశారు. 17 ఏళ్ల వయసప్పుడే, ఎంట్రీ లెవల్ వెబ్ డెవలపర్‌గా తనకు తొలి ఉద్యోగం వచ్చింది.
ఆ తర్వాత రెండేళ్లకు, స్టార్టప్ కంపెనీ ఫిఫ్టీ డాట్ ఐఓలో జూనియర్ డెవలపర్‌గా చేరారు. ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన తర్వాత, తన కంపెనీ పదింతలు అయింది. ఈయన టెక్నాలజీ డైరెక్టర్ అయ్యారు.
‘‘యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభిస్తే నా కెరీర్‌లో నేనింత స్థాయికి చేరుకుంటానని నేను అనుకోవడం లేదు’’ అని అన్నారు.
ఉద్యోగం చేసేందుకు, కెరీర్ స్థిరపరుచుకునేందుకు మీకు డిగ్రీ అవసరం లేని పరిశ్రమల్లో టెక్నాలజీ ఒకటని ఆయన చెప్పారు.
‘‘ఇది పూర్తిగా అసంప్రదాయమైనది. ఇబ్బందులతో కూడుకున్నది. మీరు ఏర్పాటుచేసుకున్న పయనం నుంచి మీరు కిందకి పడిపోకూడదు. కానీ, మీరు ఒక నిర్దిష్టమైన బాధ్యతల్లో పనిచేయాలనుకుంటే, కొన్ని కేసుల్లో భిన్నమైన మార్గం మీకోసం తెరిచే ఉంటుంది’’ అని తెలిపారు.
వెస్కో ట్రాకివ్స్కీ లాగానే, డానీల్ సర్వాదీ కూడా తనకు తానే కోడింగ్ నేర్చుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేసి, ఆ తర్వాత సొంతంగా ఆన్‌లైన్ వ్యాపారం పెట్టుకున్నప్పటికీ ఆయన కోడింగ్‌పై నేర్చుకున్నారు.
2021లో ఆయన సెల్లిక్స్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. డిజిటల్ ప్రొడక్ట్‌ల కోసం ప్రజలు చెల్లింపులు చేసుకునేలా ఈ కంపెనీ సాయపడుతుంది.
2,80,000 వ్యాపారుల కోసం 80 మిలియన్ డాలర్ల పేమెంట్లను ఇది ప్రాసెస్ చేస్తుంది.
‘‘మీకు ఆలోచన వచ్చినప్పుడు, వెంటనే దానిపై పనిచేయడం ప్రారంభించాలి’’ అని ఆయన చెప్పారు.
ఆ ఆలోచనను తుది రూపుదిద్దులు వచ్చేంత వరకు వేచిచూడకూడదన్నారు. తాము సెల్లిక్స్ లాంచ్ చేసినప్పుడు, తమ వద్ద కొన్ని ఫీచర్లు మాత్రమే ఉన్నాయన్నారు.
కంప్యూటర్ సైన్స్‌లో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయని ఆయన గుర్తించారు.
కానీ, తాను యూనివర్సిటీకి వెళ్లిన ప్రధాన కారణం కాంటాక్ట్‌లను అభివృద్ధి చేసుకోవడమేనని తెలిపారు.

ఫొటో సోర్స్, SELLIX
‘‘నేర్చుకోవడానికి వచ్చిన వారు యూనివర్సిటీలో చాలా మంది ఉంటారు. నాలాగే వారి వద్ద కూడా చాలా ఐడియాలుంటాయి’’ అని చెప్పారు.
అయితే, తనకు నచ్చిన విషయం యూనివర్సిటీ వాతావరణమని తెలిపారు.
సొంతంగా నేర్చుకోవడం కంటే ట్యూషన్‌కి వెళ్లడం ద్వారా ప్రయోజనాలుంటాయని సర్వాదీ చెప్పారు.
‘‘మీకు మీరు నేర్చుకున్నప్పుడు, మీరు పనిచేసే దానిపైనే ప్రొగ్రామ్స్ రాస్తారు. అది అంత సరైన విధానం కాదు. టీచర్ మీరు నేర్చుకునే విధానాన్ని గుర్తించి, మీకు సాయం చేయగలరు.
యూనివర్సిటీ కోర్సులు నిర్మాణాత్మకంగా ఉండి, లాజికల్ ఆర్డర్‌లో మీరు నేర్చుకోవడానికి మార్గనిర్దేశం చేస్తాయి. ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్ అలా చేయదు’’ అని అన్నారు.
విద్యార్థులు తమ సొంత అభ్యసనతో పాటు చదువులను కూడా పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ఆయన సీ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. కానీ, జావాస్క్రిప్ట్, పైథాన్ వంటి లాంగ్వేజ్‌లు కూడా నేడు చాలా ఉద్యోగాలకు అవసరం ఉంది.
‘‘మార్కెట్ మీ నుంచి ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలి. దాన్ని నేర్చుకోవాలి. అయితే, కంప్యూటర్ సైన్స్ ప్రపంచంలో ప్రతీది టీచర్‌కి తెలుసని మీరు నమ్మొద్దు’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కారు వాడుతున్నారా? ఈ 9 టిప్స్ మీకోసమే
- 'రింగ్' కెమెరా రికార్డ్ చేసిన మహిళల బెడ్రూమ్ వీడియోలను చూసిన ఉద్యోగి.. రూ.47 కోట్ల పరిహారం చెల్లిస్తున్న అమెజాన్
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- ఏఐ మారథాన్‌లో అమెరికాను చైనా అందుకోగలదా? సెమీకండక్టర్ ఎగుమతులపై యూఎస్ ఆంక్షల ప్రభావం ఏమిటి?
- గూగుల్‌లో ఉద్యోగానికి XYZ ఫార్ములా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














