రేర్‌‌ ఎర్త్ మినరల్స్, డేటా సెంటర్స్, సీఫుడ్స్‌కు ప్రత్యేక మినహాయింపులు, కేంద్ర బడ్జెట్‌లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే..

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనపై వ్యయాన్ని పెంచడంతో పాటు దేశీయ తయారీకి ఊతమిచ్చేలా చర్యలను ఆదివారంనాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించారు ఆర్ధికమంత్రి.

దేశ ఆర్థిక సర్వే ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరాన్ని 7.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో ముగిస్తామని భారత్ అంచనావేస్తోంది.

కానీ, భారత ఎగుమతులపై డోనల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు తీవ్రమైన ప్రభావం చూపుతుండటంతో వచ్చే ఏడాది ఆర్థికాభివృద్ధి కాస్త నెమ్మదించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును తగ్గించే లక్ష్యంతో పాటు ఆర్థిక నియంత్రణ చర్యలకు బలమైన పునాదులు వేసింది. ప్రభుత్వ మొత్తం ఆదాయాలకు, వ్యయాలకు మధ్య ఉండే వ్యత్యాసమే ద్రవ్య లోటుగా చెబుతుంటారు.

బడ్జెట్‌ ప్రకటనలోని ఐదు కీలక అంశాలేంటో మనం ఈ కథనంలో చూద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బడ్జెట్ 2026-27

ఫొటో సోర్స్, EPA

భారీగా పెరిగిన రక్షణ బడ్జెట్

గత దశాబ్ద కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రోడ్డు, పోర్టు, రైల్వే ప్రాజెక్టులపైనే ప్రధానంగా దృష్టిపెట్టింది. ఈ బడ్జెట్‌లో కూడా ఈ రంగాలకు కేటాయింపులను పెంచడాన్ని కొనసాగించింది ప్రభుత్వం.

ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కాబోయే తదుపరి ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయ లక్ష్యాన్ని దాదాపు 9 శాతం వరకు పెంచి, రూ.11.1 లక్షల కోట్ల నుంచి రూ.12.2 లక్షల కోట్లకు చేర్చింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయంగా పెరుగుతుండటంతో రక్షణ రంగానికి బడ్జెట్‌ను సుమారు 15 శాతం పెంచింది కేంద్ర ప్రభుత్వం.

బడ్జెట్

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

రేర్‌‌ఎర్త్స్, సెమీకండక్టర్లు వంటి రంగాలకు ఊతం

ప్రైవేట్ పెట్టుబడులు నెమ్మదించడంతో పాటు, భారత్ నుంచి విదేశీ మూలధనం తరలిపోతున్న నేపథ్యంలో సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, టెక్స్‌టైల్స్, రేర్ ఎర్త్స్ వంటి ఏడు వ్యూహాత్మక రంగాల్లో తయారీని పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలను ప్రతిపాదించింది.

దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళతో పాటు, తూర్పున ఒడిశాలో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం డెడికేటెడ్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

నవంబర్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన రూ.7,300 కోట్ల రేర్ ఎర్త్స్ స్కీమ్‌కు కొనసాగింపుగా బడ్జెట్‌లో ఈ ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి.

పరికరాలు, సామగ్రి ఉత్పత్తికి, ఫుల్ స్టాక్ ఇండియన్ ఇంటెలెక్చవల్ ప్రాపర్టీని (ఐపీ) రూపొందించడానికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్) 2.0ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనికోసం 436 మిలియన్ డాలర్ల( సుమారు రూ.3,997 కోట్లు)ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.

అలాగే, దేశంలో డేటా సెంటర్ పెట్టుబడులను పెడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు క్లౌడ్ సేవలను అందించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడేను ప్రభుత్వం ప్రతిపాదించింది.

గూగుల్ గతేడాది రూ.1.37 లక్షల కోట్ల పెట్టుబడితో ఏపీలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇలాంటి పెట్టుబడులకు మరింత ఊతమిచ్చేలా బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేయడంతో బిలియన్ డాలర్ల డేటా పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తోంది.

‘‘అత్యధిక మూలధనం అవసరయ్యే ఈ రంగానికి దీర్ఘకాల ఆర్థిక భరోసాను ఇది అందిస్తుంది. దీనివల్ల పెట్టుబడుల లాభదాయకత గణనీయంగా పెరుగుతుంది. సామర్థ్య కల్పన వేగవంతం అవుతుంది'' అని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పని చేసే రితికా లోగనీ గుప్తా తెలిపారు.

కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే వస్త్ర పరిశ్రమలో భారత ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచేందుకు కొత్తగా మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రకటించింది.

గత వారం భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత ప్రపంచ మార్కెట్లలో పెరగనున్న అవకాశాల నుంచి మరింత ప్రయోజనం పొందడమే ఈ పార్కుల ఏర్పాటు ఉద్దేశ్యం.

పన్నులు

ఫొటో సోర్స్, Getty Images

కొత్తగా ఎటువంటి పన్ను రాయితీలు లేవు

అమెరికా సుంకాల వల్ల ఎగుమతులు నెమ్మదించడంతో.. ప్రధాన ఎగుమతి రంగాలైన సీఫుడ్ వంటి పరిశ్రమలకు డ్యూటీ-ఫ్రీ ఇన్‌పుట్స్‌పై పరిమితులను పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

లిథియం అయాన్ బ్యాక్టరీల తయారీకి వాడే ఇన్‌పుట్‌లకు కూడా కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

వ్యక్తిగత ఆదాయాలపై ఎలాంటి పన్ను కోతలను చేపట్టలేదు ప్రభుత్వం. గతేడాదే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితులు మోదీ ప్రభుత్వం పెంచడంతో, ఈసారి కూడా ఏదైనా ఉంటాయని పన్ను చెల్లింపుదారులు ఆశించారు.

గతేడాది బడ్జెట్‌లోనే రూ. 12 లక్షల వరకు ఆదాయం ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. దీనికి అదనంగా రూ. 75 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని అందించారు.

కానీ, ఈసారి వస్తువులు, సేవల పన్నును (జీఎస్టీ) ఇటీవలే హేతుబద్ధీకరించడంతో, తాజాగా పన్ను కోతలు చేపట్టేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది.

ఖనిజాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రేర్ ఎర్త్స్ ( ప్రతీకాత్మక చిత్రం)

ఆర్థిక నియంత్రణ చర్యలు

2026 ఏప్రిల్ నుంచి వార్షిక ద్రవ్య లోటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడానికి బదులుగా మొత్తంగా డెట్-టూ-జీడీపీ రేషియోను తగ్గించుకోవాలని ప్రభుత్వం దృష్టి పెట్టింది. డెట్-టూ-జీడీపీ రేషియో అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ప్రభుత్వానికి ఉండే మొత్తం అప్పు నిష్పత్తి.

ప్రస్తుతం ప్రభుత్వం ఈ రేషియోను 2030-31 నాటికి 56 శాతం నుంచి 50 శాతానికి (+/-1%) తీసుకురావాలని చూస్తోంది.

దీనివల్ల, మూలధన వ్యయాలపై ఎక్కువగా వెచ్చించేందుకు, అవసరాలకు తగిన విధంగా ఖర్చు చేసేందుకు మరింత సౌలభ్యం పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

రాబోయే ఆర్థిక సంవత్సరంలో డెట్-టూ-జీడీపీ రేషియో 55.6 శాతానికి, ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనావేస్తోంది.

మార్కెట్లు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెంపుతో పడిన మార్కెట్లు

మార్కెట్లకు రుచించని బడ్జెట్

ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి బలమైన సంకేతాలు ఇచ్చినప్పటికీ, స్టాక్ మార్కెట్లు మాత్రం కుప్పకూలాయి. బడ్జెట్ కావడంతో ఆదివారం స్టాక్ మార్కెట్లు ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించాయి.

ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీ పన్ను (ఎస్‌టీటీ) పెంచడంతో ఆర్థిక మంత్రి ప్రసంగం ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్లు గణనీయమైన క్షీణతను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఒక దశలో 2300 పాయింట్లు పడిపోయింది.

''పోయినేడాది పెంపుకు తోడు ప్రస్తుత పన్ను పెంపుతో ట్రేడర్లకు, హెడ్జర్లకు, ఆర్బిట్రేజర్లకు ఖర్చుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల డెరివేటివ్ లావాదేవీలు నెమ్మదించవచ్చు. వాల్యూమ్‌లలో తగ్గుదలకు దారితీస్తుంది'' అని కొటక్ సెక్యూరిటీస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీపాల్ షా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)