అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయా?

నెతన్యాహు, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్

ఫొటో సోర్స్, Ronen Zvulun / POOL / AFP via Getty Images

చదివే సమయం: 4 నిమిషాలు

ప్రస్తుత ఇరాన్ యుద్ధంలోకి అమెరికాను ఇజ్రాయెల్ 'బలవంతంగా' నెట్టిందన్న ఆరోపణలను బెంజమిన్ నెతన్యాహు ఖండించారు.

ఒక పత్రికా సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మాట్లాడారు.

"ఏం చేయాలో అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పాలనే ఆలోచన నిజంగా ఎవరికైనా వస్తుందా? '' అని నెతన్యాహు ప్రశ్నించారు.

అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఉమ్మడి దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో సహా పలువురు ఇరాన్ అగ్ర నాయకులు, సైనిక అధికారులు మరణించారు.

ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ దాడులు జరిగాయి.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నెతన్యాహు, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ గ్యాస్ ఫీల్డ్స్‌పై ఇజ్రాయెల్ దాడి సంగతి తనకు తెలియదని ట్రంప్ అన్నారు.

మమ్మల్నెవరూ బలవంతం చేయలేదు - ట్రంప్

'యుద్ధంలో చేరమని ఇజ్రాయెల్ తనను బలవంతం చేసిందన్న' ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా నిరంతరం ఖండిస్తూ వచ్చారు.

"నేనే వారిని బలవంతం చేసి ఉండవచ్చు" అని ఈ నెల ప్రారంభంలో వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో ట్రంప్ అన్నారు.

"చూడండి, మేం వాళ్లతో చర్చలు జరుపుతున్నాం, వారే ముందు దాడి చేస్తారని నేను అనుకున్నాను'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికీ ఒకే అభిప్రాయంతో ఉన్నాయా అనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి గురించి తనకు "ఏమీ తెలియదని" బుధవారం(మార్చి 18) ట్రంప్ పరోక్షంగా విమర్శించిన తర్వాత ఈ ప్రశ్నలు మరింత బలపడ్డాయి.

ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇటీవల జరిగిన దాడి గురించి ఇజ్రాయెల్ ట్రంప్‌కు తెలియజేసిందా అని నెతన్యాహును అడిగినప్పుడు ఆయన "ఇజ్రాయెల్ ఒంటరిగా ఈ దాడులు చేసింది'' అని సమాధానమిచ్చారు.

"మరిన్ని దాడులు చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ మమ్మల్ని కోరారు. మేం అందుకు అంగీకరించాం" అని కూడా ఆయన అన్నారు.

అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, ATTA KENARE/AFP via Getty Images

'ఇరాన్ అగ్ర నాయకత్వంలో చీలిక'

లెబనాన్‌లోని హెజ్బొల్లా విషయంలో ఇజ్రాయెల్ ప్రణాళికల గురించి నెతన్యాహుని ప్రశ్నించగా, హెజ్బొల్లా వ్యక్తులు చొరబడకుండా నిరోధించే ఒక "భద్రతా కారిడార్"ను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిందని నెతన్యాహు బదులిచ్చారు.

"మాకు భవిష్యత్తు కోసం కూడా ప్రణాళికలు ఉన్నాయి" అని ఆయన అన్నారు.

"మా అతిపెద్ద లక్ష్యం ఇరాన్ ప్రభుత్వం. అది కూలిపోతే హెజ్బొల్లా కూడా అంతమైపోతుంది" అని ఆయన అన్నారు.

ఇరాన్ అగ్ర నాయకత్వంలో చీలికలు, అంతర్గత ఉద్రిక్తతలు ఉన్నాయని, మాజీ సుప్రీంలీడర్‌కు ఉన్న 'పట్టు, అధికారం' ఎప్పటికీ ఎవరికీ ఉండదని నెతన్యాహు వ్యాఖ్యానించారు.

ఇరాన్ ప్రభుత్వంలో చీలికలు కనిపిస్తున్నాయని, "ఈ చీలికలు ఎక్కువయితే ప్రభుత్వం మారవచ్చు" అని ఆయన అన్నారు.

"ఇరాన్ ప్రభుత్వం బలహీనపడుతోందనడానికి అనేక సంకేతాలు ఉన్నాయి" అని ఆయన అన్నారు.

"ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులను సృష్టించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. అది నిలబడొచ్చు, నిలబడకపోవచ్చు" అని ఆయన అన్నారు.

ప్రభుత్వం మనుగడ సాగించినా కూడా "అది అత్యంత బలహీన స్థితిలో ఉంటుంది" అని ఆయన అన్నారు.

"ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడం ఇప్పుడు ఇరాన్ ప్రజల చేతిలో ఉంది" అని ఆయన అన్నారు.

నెతన్యాహు, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్

ఫొటో సోర్స్, Joe Raedle/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే అమెరికా యుద్ధంలోకి దిగిందని కొందరు ఆరోపిస్తున్నారు.

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయా?

ఇరాన్‌పై డోనల్డ్ ట్రంప్ ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో ఇజ్రాయెల్‌కు ఎలాంటి పాత్ర లేదని చూపించడానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని బీబీసీ న్యూస్ వైట్ హౌస్ రిపోర్టర్ బెర్ండ్ డిబ్ష్మాన్ జూనియర్ చెప్పారు.

యుద్ధంలోకి అమెరికా ఎందుకు ప్రవేశించింది, అందులో ఇజ్రాయెల్ పోషించిన పాత్రేంటి అనే విషయాలపై అమెరికాలో చర్చ జరిగింది.

జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ రాజీనామా చేయడంతో ఈ వారం చర్చ మరింత తీవ్రమైంది.

జో కెంట్ ట్రంప్‌కు చాలా కాలంగా సన్నిహితుడు. అమెరికా స్పెషల్ ఆపరేషన్స్‌తో సంబంధం ఉంది.

"ఇజ్రాయెల్, దాని శక్తివంతమైన అమెరికన్ లాబీ ఒత్తిడితోనే మనం ఈ యుద్ధాన్ని ప్రారంభించామని స్పష్టమవుతోంది" అని ఆయన తన రాజీనామా లేఖలో రాశారు.

ఆ తర్వాత ఆయన కామెంటేటర్ టక్కర్ కార్ల్‌సన్‌తో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఇంటర్వ్యూలో ఈ అభిప్రాయాలను విపులంగా వివరించారు.

"ఈ నిర్ణయం ఇజ్రాయెల్ ఒత్తిడితో తీసుకున్నదని", అమెరికా చట్టసభ సభ్యులను యుద్ధానికి ఒప్పించేందుకు ఇజ్రాయెల్ అధికారులు సాధారణ ప్రక్రియలను పక్కన పెడుతున్నారని ఆయన అన్నారు.

ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన మార్చి 18నే ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి గురించి అమెరికాకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని ట్రంప్ 'ట్రూత్‌సోషల్' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ రాశారు.

కొంతమంది దీనిని అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి సంకేతంగా భావించారు.

అయితే తన ప్రకటనల ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలు ఒకదానికొకటి భిన్నమైనవనే భావనను నెతన్యాహు స్పష్టంగా తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)