నటరాజ స్వామి ఆలయం: వాన నీటిని చోళులు ఎగువకు ఎలా ప్రవహింపజేశారు? చిదంబర రహస్యం ఇదేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాయా కృష్ణన్. కె
- హోదా, బీబీసీ కోసం
చోళులు నీరు పవిత్రమైనదని భావించారు. నీటిని నిల్వ చెయ్యడమే కాకుండా, దానిని ఓ గుంత ద్వారా పైకి తీసుకు వచ్చే టెక్నాలజీని కూడా కనుక్కున్నారు.
చిదంబర రహస్యం అంటే.. చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయంలో నీరు కింద నుంచి పైకి ప్రవహించేలా నిర్మించిన కాలువేనని చరిత్రకారులు భావిస్తున్నారు. నీరు కాలువ ద్వారా కింద నుంచి పైకి వెళ్లడం ఎలా సాధ్యమైంది? ఆ రహస్యం ఏంటనే దాని గురించి ఈ కథనంలో వివరంగా చూద్దాం.
ఆ రహస్యం ఏంటో కనుక్కునే ప్రయత్నంలో బీబీసీకి కొంత మంది చరిత్రకారులు తోడయ్యారు. కడలూర్ జిల్లాలోని చిదంబరం బస్ స్టేషన్ నుంచి అందరం బయల్దేరాం.
తంజావూర్ కుందవై ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ శివరామకృష్ణన్, సండల్‌మెట్‌లోని గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చరిత్ర విభాగాధిపతి కళైచెల్వన్, ఉలందూర్ పేట్ ఔత్సాహిక చరిత్రకారుడు లలిత్ కుమార్ మాతో కలిసి చిదంబరంలోని పురాతన వీధుల గుండా నటరాజ స్వామి ఆలయానికి వచ్చారు.

ఆలయ ప్రాంగణంలో వాన నీరంతా ఈ కాలువలోకే
ప్రొఫెసర్ శివరామకృష్ణన్ మమ్మల్ని ఆలయంలోని దక్షిణం వైపు తీసుకెళ్లి అక్కడున్న ఇనుప కంచె మార్గం వెంట తీసుకెళ్లారు. దాని గురించి మాకు వివరించారు.
కడలూర్ జిల్లాలోని చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయం చోళులు నిర్మించిన పురాతన ఆలయాల్లో ఒకటి. చోళ రాజులు ఈ ఆలయానికి మరమ్మతులు, మార్పులు చేయించారు.
ప్రత్యేకించి మొదటి రాజరాజ చోళుడు, మొదటి రాజేంద్రుడు, మొదటి విక్రమ చోళుడు, మొదటి కుళోత్తుంగుడు ఆలయంలో భారీగా విస్తరణ పనులు చేశారు.
ఇక్కడి నీటి నిర్వహణ వ్యవస్థ నిర్మాణం కీలకమైనదిగా ప్రొఫెసర్ శివరామకృష్ణన్ వివరించారు.
51 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయ ప్రాంగణంలో వర్షం కురిసినప్పుడు నీరంతా నిలావరి కాలువ గుండా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
ఈ కాలువ ఆలయ దక్షిణం వైపున్న యనకల్ మండపం వద్ద ప్రారంభమై తిరుప్పళకడల్, తిళ్లే కాళీ ఆలయం ఎదుట ఉన్న శివప్రి సరస్సు వద్ద కలుస్తుంది. ఈ కాలువలోకి చెత్తా చెదారం చేరకుండా ఇనుప కంచెను అడ్డుగా నిర్మించారు.

దిగువ నుంచి ఎగువకు పారే కాలువ
కాలువ పొడవు 2,200 మీటర్లు. వెడల్పు 65 సెంటీమీటర్లు. లోతు 77 సెంటీమీటర్లు. దీన్ని ఇటుకలతో నిర్మించారు. కాలువ పైభాగం ఆంతా ఇటుకలతోనే నిర్మించారు.
కొన్ని చోట్ల కాలువ మీద దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న కాంక్రీట్ పలకల్ని అమర్చారు. కాలువలో ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడినా, ప్రవాహానికి ఏదైనా అడ్డు పడినా తొలగించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు శివరామకృష్ణన్ చెప్పారు.
నటరాజ ఆలయంలో కురిసిన వాన నీరు అంతా నిలవర కాలువ గుండా ప్రవహించి ఆలయంలో ఏర్పాటు చేసిన రెండు సరస్సులలోకి చేరుకుంటుంది. వాన నీరు ఒక్క చుక్క కూడా వృథాగా పోదు.
ఈ నిర్మాణ సాంకేతికత క్రీస్తు శకం 11-12 శతాబ్దాల నాటిది. భూగర్భ జలాలను కాపాడుకోవడానికి చోళులు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో చెప్పడానికి ఈ కట్టడం ప్రత్యక్ష సాక్ష్యమని శివరామకృష్ణన్ చెప్పారు.
సముద్ర తీరంలో ఉండే చిదంబరంలో భూగర్భ జలాలు తరిగిపోకుండా ఉండాలంటే వర్షపు నీటిని ఒడిసి పట్టడం ఒక్కటే మార్గం.
ఈ విషయాన్ని గుర్తించిన చోళులు చిదంబరం చుట్టూ తొమ్మిది రిజర్వాయర్లను నిర్మించారు. ఈ జలాశయాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే నగరంలోని భూగర్భజలాలు ఉప్పగా మారుతున్నాయని శివరామకృష్ణన్ తెలిపారు.
వర్షాకాలంలో చిదంబరం నగరానికి పశ్చిమ ప్రాంతంలో కురిసే వర్షం వల్ల నగరం వరద నీటితో నిండిపోతుంది. దీన్ని గుర్తించిన పరాంతక చోళుడు పశ్చిమం వైపున వీరనారాయణ రిజర్వాయర్ నిర్మించారు.
అందులో అదనపు నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉండటంతో వర్షాకాలంలో కూడా భక్తులు ఎలాంటి భయం లేకుండా నటరాజ ఆలయాన్ని సందర్శించుకునేవారు.
వర్షపు నీరు సముద్రంలో కలవకుండా నిల్వ చేసే అవకాశం ఉండటంతో ఈ రిజర్వాయర్‌లో నిల్వ చేసిన రెండు టీఎంసీలను ఈ ప్రాంతంలో వ్యవసాయానికి ఉపయోగించేవారు. దీని వల్ల ఈ ప్రాంతం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని శివరామకృష్ణన్ తెలిపారు.
2005లో ఈ కాలువను కనుక్కున్నారు.

నారలోక వీరన్ కాలంలో విస్తరించిన చిదంబరం
నారలోక వీరన్ కాలంలో చిదంబరం నగర విస్తరణ మొదలైందని డాక్టర్ పి.కళా చెల్వన్ తెలిపారు. 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకూ పాలించిన చోళుల కాలంలో సైన్యాధిపతులుగా పని చేసిన వారిలో నారలోక వీరన్ ఒకరు.
విక్రమ చోళుడు, కుళోత్తుంగ చోళుడి కాలంలో ఆయన కీలక అధికారిగా పని చేశారు.
ఆయన పర్యవేక్షణలో గుణ మేనకపురం, పేరుంబట్ట పురియూర్ ప్రాంతాలను విస్తరించి చిదంబరం నగరంగా మార్చారు. దీన్ని థిల్లాయ్ అని కూడా పిలిచేవారు.
మధ్య యుగంలో ఈ ప్రాంతంలో నివసించిన తమిళులు నీటి నిర్వహణ గురించి అర్థం చేసుకున్నారు. ప్రతి వీధి మధ్యలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కళాసెల్వన్ చెప్పారు.

900 ఏళ్లైనా దెబ్బతినని కాలువ
ప్రొఫెసర్ శివరామకృష్ణన్, తాను, మరి కొందరితో కూడిన బృందం ఈ కాలువ గురించి అధ్యయనం చేసినట్లు కళా సెల్వన్ చెప్పారు.
ఇది నిర్మించి 900 ఏళ్లైనా నేటికీ కాలువ లోపల ఎక్కడా దెబ్బతినలేదని తెలిపారు.
“చోళులు ఈ కాలువ నిర్మాణంలో ఎగువ భాగాన నల్ల రాళ్లు, అవి కూడా ఒకదానికొకటి ఇంటర్ లాకింగ్ విధానంలో అమర్చారు. దీని వల్ల పైన ఎంత వర్షం కురిసినా, ప్రకృతి విపత్తులు తలెత్తినా దాని ప్రభావం నేల కింద ఉండే ఈ కాలువపై పడేది కాదు” అని ఆయన వివరించారు.
ఈ కాలువ నిర్మాణం కోసం బాగా కాల్చిన ఇటుకలు, సమపాళ్లలో కలిపిన సున్నం, మట్టి మిశ్రమాన్ని వాడినట్లు ఆయన చెప్పారు.
ఈ కాలువ 1,250 మీటర్ల పొడవు, భూ ఉపరితలం నుంచి 119 సెంటీమీటర్ల లోతులో ఉంది.

దిగువ నుంచి కొండపైకి నీరును చేర్చే సాంకేతికత
నీరెప్పుడు పల్లానికి ప్రవహిస్తుంది. కానీ దీనికి మినహాయింపుగా గుంత నుంచి నీరు పై భాగానికి చేరేలా చిదంబరం ఆలయ నిర్మాణంలో అత్యుత్తమ శాస్త్రసాంకేతికతను ఉపయోగించారు.
ఉత్తర గోపురం దిగువ భాగంలో ఉన్న భూమికి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు నీటిని తీసుకువెళతారు. అంటే, ఇక్కడ నీరు పల్లం నుంచి పైకి ప్రవహిస్తుంది.
ప్రతి వీధి మూలలో దీర్ఘచతురస్రాకారంలో వెడల్పుగా లోతైన జలాశయం ఉండేది. దీనిని అనుసరిస్తూ ఓ కాలువను నిర్మించారు. ఈ కాలువ కొన్ని ప్రాంతాలలో వెడల్పుగాను, మరికొన్నిచోట్ల ఇరుకుగాను నిర్మించారు.
‘‘అక్కడక్కడ చతురస్ర ఆకారంలో నిర్మించిన జలాశయాలు అధిక నీటి ఒత్తిడిని కలిగించి, కాలువ గుండా నీరు సజావుగా సాగిపోయేలా చేసేవి’’ అని డాక్టర్ కళా సెల్వన్ వీటి నిర్మాణంలోని సాంకేతికత విశేషాలు వివరించారు.
ఇలా ఎందుకు చేశారంటే- కాలువ వెడల్పుగా ఉన్న చోట నీరు ఎక్కువగా ఉండేది, ఇరుకుగా ఉన్నచోట ఒత్తిడితో ప్రవహించేది అంటూ డాక్టర్ కళా సెల్వన్ చెప్పుకొచ్చారు.
చోళులు నీటి మార్గాలను పాము ఆకారంలో నిర్మించారు. నీటి ప్రవాహ సామర్థ్యాన్ని భూభాగం నిర్ణయిస్తుందనే విషయాన్ని తమిళులు అర్థం చేసుకున్నారు. అందుకే నది ఒడ్డున జీవించిన వీరి జనాభా పట్టణ విస్తరణకు దారితీయడమే కాక, ఆహారోత్పత్తి అవసరాన్నీ పెంచింది.
దీంతో, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు నీటివనరుల అనుసంధానాన్ని పెంపొందించారు. ఈ మేరకు నదుల నుంచి ప్రధాన కాలువలను తవ్వి, నీటి అవసరాలకు అనుగుణంగా ఉప కాలువలతో వాటిని అనుసంధానం చేసి, వ్యవసాయాన్ని పెంచి ఆహారోత్పత్తిలో ప్రగతి సాధించారు.
నీటిపారుదల వ్యవస్థలను తమిళులు అభివృద్ధి చేసుకున్నారు. పశ్చిమం నుంచి తూర్పుకు, ఉత్తరం నుంచి దక్షిణానికి మాత్రమే నీటిని రవాణా చేసే పరిస్థితిని మార్చడం ద్వారా జీవనోపాధిని మెరుగుపరచుకున్నారు.
ఇందుకు వీరాణం సరస్సు ఓ ఉదాహరణ. దాదాపు 1,100 సంవత్సరాల కిందట చోళుల కాలంలో చిదంబరం పశ్చిమ భాగాన వీరాణం చెరువులో కొంత భాగాన్ని జలాశయంగా మార్చారు.
కోలిడామ్ నది నుంచి తవ్విన ఉత్తర కాలువతో ఈ జలాశయాన్ని అనుసంధానించారు. ఇందులో ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసేవారు. దక్షిణం నుంచి ఉత్తరానికి నీటి ప్రవాహమనేది నీటి సరఫరా సూత్రానికి విరుద్దమైనప్పటికీ నేటికీ ఇది ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తోంది.
చిదంబరం నటరాజ స్వామి ఆలయంలోనూ ఈ పద్ధతే మనుగడలో ఉంది.

చిదంబర రహస్యం ఇదేనా?
ఆ కాలంలో రాజులు ప్రజల రక్షణ కోసం ఎన్నో మంచి ప్రాజెక్టులను అమలు చేసేవారు. చిదంబరంలో నీరు కింద నుంచి పై భాగానికి చేరుకునే ప్రాజెక్టు కూడా ఇలాంటి వాటిల్లో ఒకటి.
‘‘నాలాంటి చాలా మంది చరిత్రకారులు దీనిని చిదంబర రహస్యమని పిలుస్తారు. ఎందుకంటే ఇది నీరు పైనుంచి కిందకు కాకుండా, కింద నుంచి పైకి ప్రవహించే రహస్యం’’ అని ఉలుండర్‌పేటకు చెందిన చరిత్రకారుడు లలిత్ కుమార్ చెప్పారు.
ఇదే కాదు, పుదుకొట్టైలో నదీ నీటి వ్యవస్థ లేకుండా 5,128 చెరువులు, కుంటలు సృష్టించి గణనీయమైన ఆహార ఉత్పత్తి సాధిస్తున్నారని లలిత్ కుమార్ తెలిపారు.
‘‘పల్లవులు, పాండ్యా, చోళుల మధ్య వైరం ఉన్నప్పటికీ వారంతా నీటి యాజమాన్య విధానాలతో తమిళనాడును ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా చేశారు’’ అని చెప్పారు.
ఈ ఘనత జోర్డాన్‌లో నివసించిన నబాటేయన్ తెగకే చెందుతుంది. వారే నీటి యాజమాన్య పద్దతులను, వాననీటితో పంటల సాగును మొట్టమొదటగా ప్రపంచానికి పరిచయం చేసింది.
చిదంబరం ఆలయ పూజారి వెంకటేశన్ మాట్లాడుతూ- ఆలయంలోని నీటి నిర్వహణా వ్యవస్థ పురాతనమైనదని, ఒక్క వాన చుక్క కూడా బయటి నుంచి ఆలయంలోకి రాదని తెలిపారు.
‘‘బయటి నీరంతా అడుగు నుంచి ప్రవహిస్తుంది. అప్పట్లో చక్కని డిజైన్‌తో భౌతికశాస్త్ర సాంకేతికతతో దీనిని నిర్మించారు. అందుకే బయటి నీరు గుడిలోకి రాదు. ఇక్కడి నుంచి ఈ నీరు ఉత్తరం వైపున ఉన్న కాలువ ద్వారా చెరువులకు ప్రవహించి అక్కడ నిల్వ ఉంటుంది. ఇప్పటికీ ఇది ఇలాగే కొనసాగుతున్నా ఇప్పుడు స్వల్పంగా దారులు పెంచారు. వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. వీటిని మనం అనుసరిస్తే నీటి వృథాను అరికట్టవచ్చు’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
- పాకిస్తాన్: ‘భారత్‌లో ఉన్న మా ఆయన్ను కలుసుకోవాలని ఉంది’ అంటున్న పాకిస్తానీ యువతి, అసలు ఏం జరిగింది?
- మొర్రాయిపల్లె స్కూల్: ‘నాగలక్ష్మి మేడమ్ స్టూడెంట్స్‌కు లెక్కలంటే భయం లేదు’
- క్రిస్మస్: ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు..? ఆయన అసలు చిత్రం ఏది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














