You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భానుకా రాజపక్సే: భారత క్రికెటర్ల బ్యాట్లపై అనుమానం వ్యక్తం చేశాడా, వివరణలో ఏం చెప్పాడు?
ఓ ఇంటర్వ్యూలో భారత బ్యాటర్ల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో శ్రీలంక క్రికెటర్ భానుకా రాజపక్సే స్పష్టత ఇచ్చాడు.
"భారత క్రికెటర్లు ఉపయోగించే బ్యాట్లు ఇతర క్రికెటర్లు ఉపయోగించే వాటి కంటే మెరుగైన నాణ్యతతో ఉంటాయి. వాటిపై రబ్బరు పొర ఉన్నట్టు కనిపిస్తాయి" అని భానుకా రాజపక్సే చెప్పినట్టు న్యూస్ వైర్ తెలిపింది.
దీనిపై భానుకా 'ఎక్స్'లో వివరణ ఇచ్చాడు.
"నేను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. నేను చెప్పింది తప్పుడు అర్థంతో వచ్చింది. బహుశా అనువాద లోపం కారణంగా ఈ పొరపాటు జరిగి ఉంటుంది. భారత బ్యాట్స్‌మెన్‌ను ప్రశంసించడం నా ఉద్దేశ్యం.
భారత క్రికెట్ చాలా అధునాతనమైంది. వాళ్ల వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరికరాలు అన్నీ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. వాళ్ల బ్యాట్‌లను అంతర్జాతీయ స్థాయి సంస్థలు తయారుచేస్తాయి. నా అభిప్రాయాన్ని మరింత మెరుగ్గా వ్యక్తపరిచి ఉండాల్సింది. నాకు భారత క్రికెటర్లంటే గౌరవం తప్ప మరేమీ లేదు" అని భానుకా పోస్టు చేశాడు.
‘నేను చెప్పదలచుకుంది ఏంటంటే’
ఈ ఇంటర్వ్యూ తర్వాత భానుకా ఇచ్చిన వివరణ కూడా న్యూస్‌వైర్ రాసింది.
భారత క్రికెట్‌ను 'అధునాతనమైనది' అని భానుకా అభివర్ణించాడని, దాని వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరికరాల ప్రమాణాలను ప్రస్తావించాడని న్యూస్‌వైర్ రాసింది.
భారత ఆటగాళ్ల పవర్ హిట్టింగ్ సామర్థ్యం, వాళ్లు ఉపయోగించే బ్యాట్‌ల గురించి భానుకా మాట్లాడిన మాటలు గతంలో కూడా చర్చనీయాంశమయ్యాయి.
భారత బ్యాటర్ల బ్యాట్‌లు సాధారణంగా ఇతరచోట్ల కనిపించే బ్యాట్‌ల కంటే భిన్నంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు.
"భారత బ్యాటర్లు బలంగా కొట్టగలిగే బ్యాట్‌లను ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తోంది. వాటిపై అదనపు రబ్బరు పొర ఉన్నట్టు అనిపిస్తుంది" అని హరి టీవీ జర్నలిస్ట్ లాహిరు ముదాలిగేతో మాట్లాడుతూ భానుకా అభిప్రాయపడ్డాడు.
"ఇవి ఏదో ప్రత్యేక రకానికి చెందిన వెదురు చెక్కతో తయారవుతుందనుకుంటా" అని ఆయన అన్నాడు.
"మా దగ్గర ఉన్న అత్యుత్తమ బ్యాట్ల కంటే భారత ఆటగాళ్ల బ్యాట్లు చాలా బాగున్నాయి. ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. ఇతరులు ఈ బ్యాట్లను కొనలేరు. ఆటగాళ్లందరికీ ఈ విషయం తెలుసు" అని అతను చెప్పాడు.
"ఇది వినడానికి నమ్మశక్యంగా అనిపించదు కానీ, నాకు అలాగే అనిపిస్తుంది'' అని అన్నాడు.
ఐపీఎల్‌పై ప్రశంసలు
బలమైన బ్యాటింగ్ సంస్కృతి కలిగిన భారత క్రికెట్‌ను, అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను భానుకా అదే ఇంటర్వ్యూలో ప్రశంసించాడు.
ఐపీఎల్ కారణంగానే భారత క్రికెట్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు నిత్యం పుట్టుకొస్తున్నారని ఆయన పేర్కొన్నాడు
భానుకా గతంలో ఐపీఎల్ ఆడాడు.
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, రైట్-ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ అయిన భానుకా, 2022లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.
ఐదు వన్డే మ్యాచ్‌ల్లో 17.80 సగటుతో 89 పరుగులు చేశాడు.
45 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 22.54 సగటు, 130.52 స్ట్రైక్ రేట్‌తో 744 పరుగులు చేశాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)