చంద్ర సింగ్ గడ్వాలీ: భారతీయులపై కాల్పులు జరపాలన్న బ్రిటిష్ అధికారి ఆదేశాలను ధిక్కరించిన సైనికుడు

ఫొటో సోర్స్, National Book Trust
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 9 నిమిషాలు
మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ ప్రభావం 1930లో ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో స్పష్టంగా కనిపించేది.
'ఫ్రాంటియర్ గాంధీ'గా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసిన బ్రిటిష్ ప్రభుత్వం, ఆయన్ను, ఆయన అనుచరుల్లో కొందరిని 1930 ఏప్రిల్ 23న అరెస్ట్ చేసింది.
ఆ సమయంలో ఉత్మాన్‌జాయ్ నుంచి పెషావర్ వెళ్తున్నారు ఖాన్.
అరెస్ట్‌కు సంబంధించిన వార్తలు వినగానే.. ఆయన్ని ఉంచిన చర్సద్దా జైలును వేలమంది చుట్టుముట్టారు.
పెషావర్ నగరంలో వేలమంది గుమిగూడారు. కిస్సాఖ్వానీ బజార్‌లో 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ పఠాన్లు నినాదాలు చేశారు.

ఈ సమయంలోనే, ఒక బ్రిటిష్ అధికారి మోటార్‌సైకిల్‌పై వేగంగా వారి మధ్యలో నుంచి వెళ్లడంతో.. చాలామంది బైక్ చక్రాల కిందపడి నలిగిపోయారు. అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది.
కోపోద్రిక్తులైన ఆ గుంపులోని కొందరు వెంటనే మోటార్‌సైకిల్‌కు నిప్పంటించారు. దాంతో ఆ బ్రిటిష్ అధికారి మంటల్లో సజీవదహనమయ్యారు. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ, సైన్యాన్ని పిలిపించింది స్థానిక యంత్రాంగం.
తక్కువ సమయంలోనే నాలుగు ఆర్మీ బెటాలియన్లు అక్కడికి చేరుకున్నాయి. నగరమంతా సైనికులు మోహరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'కాల్పుల విరమణ'
వేలమంది పఠాన్లు కాబుల్ గేటు ముందు నిల్చున్నారు.
రాయల్ గడ్వాల్ రైఫిల్స్‌కు చెందిన సైనిక విభాగం వారి ఎదురుగా మోహరించి ఉంది.
ఆ గుంపు ఆగ్రహంగా ఉండడాన్ని గమనించిన సైనిక విభాగ కమాండర్ 'కుడివైపు, ఎడమవైపు వెళ్లి కవర్ చేయండి' అని సైనికులను ఆదేశించారు.
ప్రతి సైనికుడి రైఫిల్ ఐదు క్యాట్రిడ్జ్‌లతో లోడ్ చేసి ఉంది. రమేశ్ పోఖ్రియాల్ 'నిశంక్' రాసిన.. 'పెషావర్ కే నాయక్, వీర్ చంద్ర సింగ్ గడ్వాలీ'లో ఈ ఘటన గురించి వివరించారు.
''కెప్టెన్ రికెట్ అక్కడ నిలబడిన పఠాన్లను హెచ్చరిస్తూ.. 'పారిపోండి, లేదంటే మిమ్మల్ని షూట్ చేస్తాం' అని గట్టిగా అరిచారు. కానీ, పఠాన్లు అక్కడి నుంచి కదలలేదు. 'గడ్వాలీ సైనికులారా, మూడు రౌండ్ల కాల్పులు జరపండి' అని ఆదేశించారు రికెట్. అదే సమయంలో కెప్టెన్ రికెట్‌కు ఎడమ వైపు నిల్చున్న హవల్దార్ మేజర్ చంద్ర సింగ్ గడ్వాలీ, 'గడ్వాలీ సైనికులారా, సీజ్ ఫైర్' అని గట్టిగా అన్నారు. ఈ ఆదేశాలు విన్న తర్వాత, గడ్వాలీ సైనిక విభాగానికి చెందిన సైనికులు వారి గన్‌లను కిందకి దించేశారు. ఇది చూసిన కెప్టెన్ రికెట్ కోపోద్రిక్తులయ్యారు. కోపంతో చంద్ర సింగ్‌ను చూసి, 'ఏంటిది?' అని అడిగారు. 'వీళ్లందరూ నిరాయుధులు. వీళ్లపై మేమెలా కాల్పులు జరపగలం?' అని చంద్ర సింగ్ గడ్వాలీ బదులిచ్చారు'' అని రమేశ్ పోఖ్రియాల్ రాశారు.

ఫొటో సోర్స్, National Book Trust
కాల్పులు జరిపిన బ్రిటిష్ సైన్యం
ఈ సంఘటనతో షాకైన కెప్టెన్ రికెట్, వెంటనే కాబులీ గేటు పైన ఉన్న అధికారులకు తన ఆర్డర్లీ(అధికారులకు పనులు చేసిపెట్టే సైనికుడు)తో ఒక చీటీ పంపించారు. వెంటనే 30 మంది బ్రిటిష్ సైనికులతో కూడిన ప్లాటూన్ ఒకటి అక్కడికి చేరుకుంది. వారు కాల్పులు ప్రారంభించారు. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. వందల మంది చనిపోయారు.
ఆ తర్వాత, రెండు వైపుల ఉన్న ప్రజలు వారి ఇళ్ల పైకప్పులు ఎక్కి, రాళ్లు, బాటిళ్లు, గొడ్డళ్లు ఇలా వారికి దొరికిన వస్తువులన్నీ సైనికులపైకి విసిరారు. పలువురు పోలీసు అధికారులు, ప్లాటూన్ సైనికులు గాయపడ్డారు.
చంద్ర సింగ్ గడ్వాలీ, ఆయన సహచరులు కొందరు గాయాలు పాలయ్యారు. నగరమంతా మార్షల్ లా ప్రకటించారు.
''ఈ కాల్పుల్లో కేవలం 20 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా.. నిరసనకారులు చెప్పిన వివరాల ప్రకారం, పెషావర్, ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లోని ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారులు చేపట్టిన ఈ చర్యలో 200 మంది నుంచి 300 మంది చనిపోయినట్లు తెలిసింది.
యుద్ధ విమానాల సాయంతో ఎట్టకేలకు పెషావర్‌ను తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకుంది బ్రిటిష్ సైన్యం. ఆ తర్వాత, ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన గడ్వాల్ రైఫిల్స్‌కు చెందిన సైనికులకు కోర్టు విచారణలు జరిపి, సుదీర్ఘకాల జైలు శిక్షలు విధించింది'' అని 'గఫార్ ఖాన్, నాన్-వయొలెంట్ బాద్‌షా ఆఫ్ పష్తూన్స్' అనే పేరుతో రాసిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బయోగ్రఫీలో రాజ్‌మోహన్ గాంధీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Indian Post
గడ్వాలీ సైనిక జీవితం
గడ్వాల్‌లోని రౌణీసెరా మాసోలో 1891లో పుట్టిన చంద్ర సింగ్ గడ్వాలీ, 1914 సెప్టెంబర్ 3న భారత సైన్యంలో చేరారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన్ని తొలుత ఫ్రాన్స్‌కు పంపించారు.
ఆ తర్వాత బ్రిటిష్ వారి తరఫున మెసొపటోమియా యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటిష్ వారు ఆ యుద్ధంలో గెలుపొందారు.
ఆ తర్వాత 1918లో బాగ్దాద్ యుద్ధానికి కూడా పంపారు. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ను, 1920లో వజీరిస్తాన్ పంపారు.
పెషావర్‌లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైందని వార్తలు వచ్చినప్పుడు, ఆయన్ను అక్కడికి పంపారు.
ఈ సైనిక తిరుగుబాటు వార్త భారత్ అంతా ఒక దావానలంలా వ్యాపించింది.
ఏప్రిల్ 24న ఉదయం 8 గంటలకు, గడ్వాలీ సైనికులు తిరిగి నగరానికి వెళ్లాలని ఆదేశించారు. అయితే, ఆ ఆదేశాలను పాటించడానికి గడ్వాలీ సైనికులు తిరస్కరించారు.
''ప్రతి ఆదేశానికి కట్టుబడి ఉంటామని మీరు శిక్షణ సమయంలో వాగ్దానం చేసిన సంగతి మీకు తెలుసా?'' అని ఆ సైనిక విభాగ కెప్టెన్ చాపెల్ కోపంతో అన్నారు.
దీనికి సమాధానమిచ్చిన చంద్ర సింగ్ గడ్వాలీ.. ''శత్రు సైన్యానికి వ్యతిరేకంగా అయితే, మా ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధం. కానీ, నిరాయుధులైన దేశ ప్రజలపైకి మేం ఒక్క బుల్లెట్ కూడా కాల్చం'' అని తేల్చిచెప్పారు.

ఫొటో సోర్స్, National Book Trust
అరెస్ట్
ఏప్రిల్ 26 సాయంత్రం, కల్నల్ సాహిబ్ పిలుస్తారని ఆర్డర్లీ వచ్చి చంద్ర సింగ్ గడ్వాలీకి చెప్పారు.
''కల్నల్ సాహిబ్ ఒక్కరే ఉన్నారా లేదా ఆయనతో మరెవరైనా ఉన్నారా? అని ఆర్డర్లీని చంద్ర సింగ్ అడిగారు. అక్కడ చాలామంది ఉన్నారని ఆర్డర్లీ చెప్పారు. జనరల్ సాహిబ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ అబోటాబాద్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అక్కడున్నట్లు చెప్పారు. ఇది విన్న తర్వాత, అక్కడ్నుంచి మళ్లీ తిరిగి రానని చంద్ర సింగ్‌కు అర్థమైంది. వెంటనే తన వస్తువులన్నింటినీ సర్దుకున్నారు. యూనిఫామ్ వేసుకుని, బూట్లు, ఓవర్‌కోట్ ధరించి, గోర్ఖా క్యాప్ పెట్టుకున్నారు. ప్లాటూన్‌కు చెందిన సైనికులందర్ని కలిశారు. 'సోదరులా, మీతో ఇదే నా చివరి సమావేశం' అని చెప్పారు'' అని 'వీర్ చంద్ర సింగ్ గడ్వాలీ' అనే పుస్తకంలో రాహుల్ సాంకృత్యాయన్ రాశారు.
కల్నల్ సాహిబ్ పిలిచిన దగ్గరకి వచ్చిన చంద్ర సింగ్, అధికారులను కలిసి బయటికి వచ్చారు.
‘‘చంద్ర సింగ్, ఇప్పుడు మీరు కస్టడీలో ఉన్నారు’’ అని మేజర్ బ్రోన్సకిల్ చెప్పారు. వెంటనే గడ్వాలీని ఫోటో తీశారు.
ఆయన్ను కారులో కూర్చోబెట్టారు. మేజర్ బ్రోన్సకిల్ కారు నడిపారు. కాబుల్ తీసుకెళ్లి అక్కడొక సెల్‌లో ఇద్దరు గార్డుల పర్యవేక్షణలో ఉంచారు.

ఫొటో సోర్స్, Gyan Publishing House
జీవిత ఖైదు శిక్ష
1930 జూన్ 2న మిలటరీ కోర్టులో గడ్వాలీ సైనికుల విచారణ మొదలైంది. అదుపులోకి తీసుకున్న సైనికులను అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంచారు.
వారిలో, చంద్ర సింగ్‌ను ప్రత్యేక నిఘాలో ఉంచారు. చంద్ర సింగ్‌కు మాత్రమే సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు.
‘‘ 'జనరల్ సాహిబ్, నేను 60 మంది క్రిమినల్స్‌లో ఒకరిని. మరి, నాతో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు?' అని న్యాయమూర్తిని చంద్ర సింగ్ ప్రశ్నించారు. 'మీరు ప్రమాదకరమైన వ్యక్తి. మీరే తిరుగుబాటుకు ప్రేరేపించారని మీపై ఇంటెలిజెన్స్ పోలీసు నివేదిక ఉంది. అందుకే, మిమ్మల్ని నంబర్ వన్ నిందితుడిగా మార్చాం' అని జనరల్ సమాధానమిచ్చారు'' అని రమేశ్ పోఖ్రియాల్ రాశారు.
చంద్ర సింగ్ తరఫున బారిస్టర్ ముకుందీ లాల్ వాదించారు. ఆయన వాదనలు విన్న తర్వాత, రాయల్ గడ్వాల్ రైఫిల్స్‌ను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బెంచ్ కొట్టేసింది.
చంద్ర సింగ్‌కు మరణ శిక్ష విధించాలనే ప్రభుత్వ డిమాండ్‌ను తిరస్కరించింది న్యాయస్థానం. ఆయనకు జీవిత ఖైదు శిక్ష వేసింది. ఆయన ఇతర సహచరులకు ఏడాది నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధించారు.

ఫొటో సోర్స్, National Book Trust
''కాళ్లకు కూడా సంకెళ్లు వేశారు''
చంద్ర సింగ్ ఆస్తులన్నింటిన్నీ స్వాధీనం చేసుకుని, ఆయన్ని సైన్యం నుంచి డిస్మిస్ చేశారు.
''కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత, మొత్తం బెటాలియన్ ముందు చంద్ర సింగ్‌ను అవమానపరిచారు. ఆయన బ్యాడ్జీలను బలవంతంగా తీసేశారు. ఆయన యూనిఫామ్‌ను కత్తెరతో చించేశారు. ప్రజలందరూ ఈ దృశ్యాన్ని చూశారు'' అని రమేశ్ పోఖ్రియాల్ రాశారు.
చంద్ర సింగ్‌ను అబోటాబాద్ జైలులో ఆరేళ్ల పాటు ఉంచారు.
చంద్ర సింగ్‌ను ఉంచిన సెల్ పరిస్థితిని రాహుల్ సాంకృత్యాయన్ తన పుస్తకంలో వివరించారు. ''చంద్ర సింగ్‌ను ఆరున్నర అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉన్న ఒక చిన్న సెల్‌కు తీసుకెళ్లారు. పక్కనే ఒక విసురురాయి పెట్టి ఉంది. అక్కడొక నీటి కుండ, రెండు చిరిగిపోయిన దుప్పట్లు, మోకాలి వరకే ఉండే దుస్తులు, మోచేయి వరకే చేతులుండే చొక్కాలు, ఎర్ర క్యాప్, ఇనుప ప్లేట్, ఒక గిన్నె ఉన్నాయి. చంద్ర సింగ్ ఒక దుప్పటి కప్పుకుని పడుకోగానే, నల్లులు, ఈగలు, దోమలు, చీమలు ఇలా పలు రకాల పురుగులు ఆయనపై దాడి చేశాయి. ఆయన కాళ్లకు కూడా సంకెళ్లు వేశారు'' అని రాహుల్ రాశారు.

ఫొటో సోర్స్, Uttarakhand Government
పదకొండేళ్ల తర్వాత విడుదల
ఈ సంకెళ్లు ఆయన కాళ్లకు ఆరేళ్ల పాటు అలానే ఉన్నాయి. 1936 ఏప్రిల్ 20న బరేలీ జైలుకి పంపినప్పుడు ఈ సంకెళ్లను తొలగించారు.
కమ్యూనిస్ట్ విప్లవకారులు యశ్‌పాల్, శివ్ వర్మ, విజయ్ కుమార్ సింగ్‌లతో ఆయనకు ఇక్కడే పరిచయం ఏర్పడింది.
'వీర్ చంద్ర సింగ్ గడ్వాలీ: ది సోల్జర్ హూ రిఫ్యూజ్డ్ టూ ఫైర్ ఆన్ అన్‌ఆర్మ్‌డ్ సివిలియన్స్' అనే పేరుతో దేవేంద్ర సింగ్ ఓస్వాల్ రాసిన కథనంలో.. '' బరేలీ జైలులోని ఇతర ఖైదీలు ఆయను 'హవల్దార్' లేదా 'గడ్వాలీ' అని పిలిచేవారు. ఈ పేర్లు ఆయనకు నచ్చేవి కావు.
ఆ తర్వాత యశ్ పాల్ ఆయన్ను ''అన్న'' అని పిలవడం మొదలుపెట్టారు. నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్, గోవింద్ వల్లభ్ పంత్ అందరూ కూడా ఆయన్ను ''అన్న'' అని పిలిచేవారు. ఆయన్ను పండిట్ నెహ్రూ మొదటిసారి కలిసింది ఈ జైలులోనే.
చంద్ర సింగ్‌కు తప్ప పెషావర్ తిరుగుబాటు కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరికీ శిక్షలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను లఖ్‌నవూ జైలుకు పంపారు.
చంద్ర సింగ్‌ను కలిసేందుకు సుభాష్ చంద్ర బోస్ అక్కడికి వెళ్లారు. అరెస్ట్ తర్వాత, జవహర్‌లాల్ నెహ్రూను కూడా అక్కడకు తరలించారు. ఇద్దరూ జైలులో 42 రోజులు గడిపారు.
11 ఏళ్ల 3 నెలల 18 రోజుల పాటు పలు జైళ్లల్లో గడిపిన తర్వాత చంద్ర సింగ్ గడ్వాలీ చివరకు 1941 సెప్టెంబర్ 20న విడుదలయ్యారు.
1942 సెప్టెంబర్ ప్రారంభంలో రాయల్ గడ్వాల్ రైఫిల్స్‌కు చెందిన రెండు బెటాలియన్లు, సుభాష్ చంద్ర బోస్‌కు చెందిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాయి. బోస్‌తో కలిసి భారత స్వాతంత్య్రం కోసం వీరు పోరాడారు.

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images
గాంధీ వార్ధా ఆశ్రమానికి వెళ్లిన చంద్ర సింగ్
చంద్ర సింగ్ జైలు నుంచి విడుదలైన తర్వాత, గడ్వాల్ వెళ్లకుండా నిషేధం విధించారు. లఖ్‌నవూ నుంచి చంద్ర సింగ్ అలహాబాద్ చేరుకుని, అక్కడి నుంచి వార్ధాలోని మహాత్మా గాంధీ సేవాగ్రామ్ ఆశ్రమానికి చేరుకున్నారు.
గాంధీ విలువలు, సిద్ధాంతాలు, మతపరమైన విశ్వాసాలు ఆయన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత అక్కడి ఉండి, పనిచేయాలని చంద్ర సింగ్ నిర్ణయించుకున్నారు.
సేవాగ్రామ్‌లో చంద్ర సింగ్ ఉండే సమయంలోనే, మహాత్మా గాంధీ బయోగ్రాఫర్, అమెరికా జర్నలిస్టు లూయిస్ ఫిషర్ అక్కడకు వచ్చారు. చంద్ర సింగ్ గురించి మహాత్మా గాంధీ ప్రస్తావించగా, ఆయన్ను కలిశారు లూయిస్ ఫిషర్.
''రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ తరఫున భారత సైన్యం పోరాడుతుందా అని చంద్ర సింగ్‌ను ఫిషర్ అడిగారు. 'ఆర్మీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటుంది. ఒకవేళ ఆదేశిస్తే, యుద్ధంలో కచ్చితంగా పాల్గొంటుంది. కానీ, వారు దేశం పట్ల పూర్తి శ్రద్ధతో ఉంటారు. యుద్ధంలో మనస్ఫూర్తిగా చేరరు' అని చంద్ర సింగ్ సమాధానమిచ్చారు'' అని రాహుల్ సాంకృత్యాయన్ రాశారు.
''దేశంలో జరిగే ఉద్యమాన్ని అణచివేయాలని ఒకవేళ సైన్యాన్ని అడిగితే?'' అని ఫిషర్ ప్రశ్నించారు.
దానికి సమాధానంగా ''తోటి సోదరులపై సైన్యం ఎప్పటికీ తుపాకీ గురిపెట్టదు. మాకు వ్యతిరేకంగా సైన్యాన్ని బ్రిటిషర్లు వాడుకోలేరు'' అని పేర్కొన్నారు.
చంద్ర సింగ్‌తో జరిగిన ఈ సంభాషణను ఫిషర్ పలు అమెరికా వార్త పత్రికల్లో ప్రచురించారు. ఈ కాపీలు భారత్‌కు రాకుండా బ్రిటిష్ ప్రభుత్వం అడ్డుకుంది. వీటివల్ల, సైన్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని భయపడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల్లో పరాజయం
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనందుకు చంద్ర సింగ్‌ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. పలు జైళ్లల్లో మూడేళ్ల పాటు జైలు శిక్షలు గడిపిన తర్వాత 1945లో ఆయన విడుదల అయ్యారు.
అప్పటికి కూడా గడ్వాల్‌లో అడుగు పెట్టకుండా ఆయనపై నిషేధం అలానే ఉంది. చాలాకాలం ప్రయత్నాల తర్వాత, 1946 డిసెంబర్ 22న గడ్వాల్‌లోకి ప్రవేశించేందుకు ఆయనకు అనుమతి లభించింది.
1950లో చంద్ర సింగ్ తన కుటుంబంతో కలిసి కోట్‌ద్వార్‌లోని ధ్రువ్‌పూర్‌లో స్థిరపడ్డారు. 1952, 1957, 1962ల్లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయారు.

ఫొటో సోర్స్, National Book Trust
స్వతంత్ర భారత్‌లోనూ జైలు జీవితం ముగియలేదు
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా, చంద్ర సింగ్ గడ్వాలీకి జైలుతో ఉన్న బంధం ముగియలేదు. స్వతంత్ర భారత్‌లోనూ, జైలులో మరో రెండేళ్లు గడపాల్సి వచ్చింది. ‘తప్పుడు వారెంట్’పై 1948లో ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ జోక్యం, లిఖితపూర్వక క్షమాపణతో ఆయన్ను విడుదల చేశారు. మళ్లీ 1962 చైనా దురాక్రమణ సమయంలో ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఆయన భార్యకు చికిత్స చేయించేందుకు, ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకోవడంతో, పెరోల్‌పై చంద్ర సింగ్ విడుదలయ్యారు.
సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి 1979 అక్టోబర్ 1న మృతి చెందారు.
చంద్ర సింగ్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నివాళులర్పించేందుకు కోట్‌ద్వార్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు.
1994లో ఆయన జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














