10 కాదు, 15 శాతం.. ప్రపంచదేశాలపై సుంకాలను మరోసారి పెంచేసిన డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాలీ షెర్మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్రపంచ దేశాల నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై 15 శాతం కొత్త సుంకాలను విధిస్తానని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాను గతంలో విధించిన దిగుమతి పన్నులను రద్దు చేసిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని విమర్శిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు.
అమెరికాలోకి వచ్చే అన్ని వస్తువులపై 10 శాతం పన్ను విధిస్తున్నట్లు శుక్రవారం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరుసటి రోజే(శనివారం), గతంలో ఎన్నడూ ఉపయోగించని ఒక వాణిజ్య చట్టం ప్రకారం అనుమతి ఉన్న గరిష్ట స్థాయికి పన్నును పెంచనున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
ప్రభుత్వం కొత్త సుంకాలను దాదాపు ఐదు నెలల పాటు కొనసాగించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. ఆ తర్వాత, పాలనాయంత్రాగం వాటిని కొనసాగించడానికి కాంగ్రెస్ నుంచి ఆమోదం పొందాలి.
డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన పదిశాతం సుంకాలు ఫిబ్రవరి 24 మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే పెంచిన 15 శాతం సుంకాలు కూడా ఆ తేదీ నుంచే అమల్లోకి వస్తాయా అనే విషయంలో స్పష్టత లేదు. దీనిపై బీబీసీ శ్వేతసౌధాన్ని సంప్రదించింది.
ఈ కొత్త 15 శాతం సుంకాలను 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122 కింద తాత్కాలిక చర్యగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాతో 10 శాతం సుంకాల ఒప్పందం కుదుర్చుకున్న యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల భవిష్యత్ వాణిజ్యంపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోంది.
టారిఫ్‌లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించిన తరువాత సుంకాలను పెంచాలని నిర్ణయించామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆ తీర్పును ఆయన "అసంబద్ధం , అమెరికాకు అత్యంత వ్యతిరేకమైనది" అని విమర్శించారు.
అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టం (ఐఈఈపీఏ) -1977 ను ఉపయోగించి గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుంకాలు విధించినప్పుడు అధ్యక్షుడు తన అధికారాలను అతిక్రమించారని 6-3 తేడాతో వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.
తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఐఈఈపీఏ చట్టాన్ని ఉపయోగించి అమెరికా ఇప్పటికే కనీసం 130 బిలియన్ డాలర్ల సుంకాలను వసూలు చేసింది.

'ప్రత్యామ్నాయాలు ఉన్నాయి'
అమెరికాకు మరిన్ని పెట్టుబడులు, తయారీ రంగానికి ఊతమివ్వడానికి సుంకాలను కొనసాగించేందుకు ఇతర చట్టాలను ఉపయోగిస్తానని శుక్రవారం వైట్‌హౌస్‌లో డోనల్డ్ ట్రంప్ అన్నారు.
"మా దగ్గర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి - చాలా మంచి ప్రత్యామ్నాయాలు, వాటి కారణంగా మేం బలంగా మారతాం" అన్నారు ట్రంప్.
ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ గత సంవత్సరం ప్రకటించిన దిగుమతి పన్నులపై కోర్టులో కేసులున్నాయి. మొదట్లో మెక్సికో, కెనడా, చైనాలపై ట్రంప్ సుంకాలు విధించారు.
తరువాత, 2025 ఏప్రిల్‌లో "లిబరేషన్ డే" పేరుతో అనేక ఇతర వాణిజ్య భాగస్వాములకు సుంకాలు విస్తరించారు. దీనికోసం, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఐఈఈపీఏ-1977) వైట్‌హౌస్ ఉపయోగించింది. ఈ చట్టం జాతీయ అత్యవసర పరిస్థితిలో వాణిజ్యాన్ని నియంత్రించడానికి అధ్యక్షుడికి అనుమతిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ అధికారమది..
ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా, ఇతర దేశాలలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. అమెరికాలోకి వచ్చే వస్తువులపై అకస్మాత్తుగా అధిక పన్నులు చెల్లించాల్సి రావడంతో చాలా కంపెనీలు ఆందోళన చెందాయి. వినియోగదారుల్లో ధరలు పెరుగుతాయన్న భయాలు మొదలయ్యాయి.
దీంతో, పలు అమెరికా రాష్ట్రాలు, చిన్న వ్యాపారాల తరపు న్యాయవాదులు సుంకాలపై గత సంవత్సరం సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అధ్యక్షుడు ఉపయోగించిన చట్టంలో "సుంకాలు" అనే పదాన్ని కూడా ప్రస్తావించలేదని వాదించారు. పన్నులు నిర్ణయించే అధికారాన్ని కాంగ్రెస్ వదులుకోలేదని వారు చెప్పారు. ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలు, సుంకాల నియమాలను రద్దు చేయడానికి లేదా విస్మరించడానికి అధ్యక్షుడికి అపరిమిత అధికారం ఇవ్వలేదని వాదించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. అధ్యక్షుడికి సుంకాలపై కాంగ్రెస్ అధికారం ఇవ్వాలనుకుంటే, అది స్పష్టంగా, కఠినమైన పరిమితులతో ఉండేదని తీర్పులో చెప్పారాయన.
సుంకాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని కోర్టులోని ముగ్గురు లిబరల్ న్యాయమూర్తులు, ట్రంప్ నామినేట్ చేసిన మరో ఇద్దరు న్యాయమూర్తులు (అమీ కోనీ బారెట్, నీల్ గోర్సుచ్) సమర్థించారు. మరో ముగ్గురు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు (క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాగ్, సామ్యూల్ అలిటో) ఈ నిర్ణయంతో విభేదించారు.
రిపబ్లికన్లు ఎంపిక చేసిన న్యాయమూర్తులు కూడా తన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, వారి పట్ల "చాలా సిగ్గుపడుతున్నట్లు" ట్రంప్ చెప్పారు. వారు 'మూర్ఖులు' అని, రాజ్యాంగానికి విధేయులుగా లేరని ఆరోపించారు.
సుప్రీం తీర్పుతో, అమెరికన్ స్టాక్ మార్కెట్లు లాభల బాటలో పయనించాయి. ఎస్ అండ్ పీ 500 దాదాపు 0.7 శాతం పెరిగింది. అనేక అమెరికా వ్యాపారాలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని జాగ్రత్తగా స్వాగతించాయి.
తన ఛాతీ నుంచి 'భారీ బరువు' దించినట్టు ఉందని మిన్నెసోటాలోని బిజీ బేబీ యజమాని బెత్ బెనికే అన్నారు. ఆమె కంపెనీ చైనాలో ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ కేసులో పిటిషనర్, టెర్రీ ప్రెసిషన్ సైక్లింగ్ కంపెనీ సీఈవో నిక్ హోమ్ మాట్లాడుతూ, ఈ తీర్పు 'ఉపశమనం' కలిగించిందని అన్నారు.
"మా సరఫరా సాధారణ స్థితికి రావడానికి నెలలు పట్టవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లిస్తుందని ఆశిస్తున్నాం" అన్నారు నిక్.
భారత్‌పై ఎంత సుంకం?
భారత్, యూకే, యూరోపియన్ యూనియన్‌తో సహా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాలు - గతంలో చర్చించిన ప్రత్యేక తక్కువ రేట్లకు బదులుగా సెక్షన్ 122 కింద గ్లోబల్ టారిఫ్స్ చెల్లించాల్సి ఉంటుందని వైట్‌హౌస్ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు.
అయితే, ఆ దేశాలు ఇప్పటికీ తమ వాణిజ్య ఒప్పందాలలో చేసిన నిబద్ధతలను పాటిస్తాయని ట్రంప్ అధికారగణం భావిస్తోంది. సెక్షన్ 232, సెక్షన్ 301 వంటి ఇతర చట్టాలను కూడా వైట్‌హౌస్ ఉపయోగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టాలు జాతీయ భద్రతా కారణాల వల్ల లేదా అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు ప్రతిస్పందించడానికి సుంకాల విధింపును అనుమతిస్తాయి.
ట్రంప్ గతంలో ఈ చట్టాలను ఉపయోగించారు. వాటిలో ఉక్కు, అల్యూమినియం, కార్లపై సుంకాలు కూడా ఉన్నాయి. ఆ సుంకాలపై కోర్టు తీర్పు ఎలాంటి ప్రభావం చూపదు.
పరిస్థితి క్లిష్టంగా, గందరగోళంగా మారిందని వాషింగ్టన్ థింక్ ట్యాంక్‌లో సీనియర్ ఫెలో అయిన జెఫ్రీ గెర్ట్జ్ అన్నారు. సుప్రీం తీర్పుపై అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములు జాగ్రత్తగా స్పందించారు.
"అమెరికా సుప్రీంకోర్టు తీర్పును జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నాం" అని యూరోపియన్ కమిషన్ ప్రతినిధి ఓలోఫ్ గిల్ సోషల్ మీడియాలో తెలిపారు.
ఐఈఈపీఏ చట్టం ప్రకారం అమెరికా కనీసం 130 బిలియన్ డాలర్ల సుంకాలను వసూలు చేసింది. కాస్ట్‌కో, అల్కోవా, బంబుల్ బీతో సహా అనేక కంపెనీలు వాపసు పొందడానికి కోర్టును ఆశ్రయించాయి. వాపసు ఎలా జరుగుతుందో సుప్రీంకోర్టు స్పష్టంగా వివరించలేదు. ఆ నిర్ణయం ఇప్పుడు మరొక వాణిజ్య కోర్టుకు వెళ్లవచ్చు.
చట్టపరమైన కేసులు ఖరీదైనవి కావడం వల్ల చిన్న కంపెనీలు తమ డబ్బును తిరిగి పొందడం కష్టమని కేపీఎంజీ యూఎస్ చీఫ్ ఎకనామిస్ట్ డయాన్ స్వాంక్ అన్నారు.
కంపెనీలు వ్యాజ్యాలు దాఖలు చేయవలసిన అవసరం లేని రీఫండ్‌ల కోసం ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించడమే ఉత్తమ పరిష్కారం అని పిల్స్‌బరీ అనే లా కంపెనీ హెడ్ స్టీవ్ బెకర్ అన్నారు.
కంపెనీలు తమ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉందని, అయితే దానికి ఎంత సమయం పడుతుందనేది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











