Credit Card: క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు ఎందుకంత ఎక్కువగా ఉంటాయి? వాటి నియంత్రణ సాధ్యమేనా?

క్రెడిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

భారత్‌లో క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయా?

క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి .

''భారత్‌లో క్రెడిట్ కార్డ్ బకాయిలపై 24% నుంచి 48% వరకు, కొన్నిచోట్ల 55 శాతానికి పైగా వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించడం సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోంది'' అంటూ నిర్మలా సీతారామన్‌కు అందించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

దీనికి నేపథ్యంగా అమెరికాను ప్రస్తావించారు. అమెరికాలో క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లపై 10 శాతం గరిష్ఠ పరిమితిని (క్యాప్) విధించే ప్రతిపాదనను డోనల్డ్ ట్రంప్ ఇటీవల తెరపైకి తీసుకువచ్చారు.

దీంతో, భారత్‌లోనూ క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లపై పరిమితి ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది.

భారత్‌లో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉందని పురందేశ్వరి చెబుతున్నారు.

అయితే, ఈ ప్రతిపాదనపై బ్యాంకింగ్ రంగ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

''వడ్డీ రేట్లను నియంత్రిస్తే వినియోగదారులకు ఇచ్చే కార్డుల సంఖ్యపై ప్రభావం పడుతుంది. వడ్డీ రేట్లపైనే కాదు, కార్డులకు ఇచ్చే నగదు గరిష్ఠ పరిమితులపైనా నియంత్రణ ఉండాలి'' అని యాక్సిస్ బ్యాంకు మాజీ అధికారి, బ్యాంకింగ్ రంగ నిపుణులుని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి?

క్రెడిట్ కార్డులను బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు జారీ చేస్తుంటాయి. ఈ కార్డులతో షాపింగ్ లేదా కొనుగోళ్లు చేసుకోవచ్చు. ఆ తర్వాత నిర్దేశిత కాల పరిమితిలోపు వడ్డీలేని చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంటాయి.

సాధారణంగా క్రెడిట్ కార్డులు వాడుకున్న తర్వాత తిరిగి చెల్లించేందుకు సుమారు 15 నుంచి 50 రోజుల సమయం ఉంటుంది. ఆలోగా పూర్తిగా చెల్లిస్తే వడ్డీ ఉండదు.

కార్డుల్లోని రకాలను బట్టి కొన్నింటిపై వార్షిక రుసుములు వసూలు చేస్తుండగా, మరికొన్నింటిపై వాడకాన్ని బట్టి వార్షిక రుసుములు రద్దు చేస్తున్నాయి.

కొన్ని జీవితకాలపు ఉచిత కార్డులుంటాయి.

నిర్దేశిత కాల పరిమితి దాటినా క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించకపోతే వడ్డీ రేట్లు విధిస్తుంటాయి.

యాన్యువల్ పర్సంటేజీ రేట్ (ఏపీఆర్)… ఇదే వార్షిక రుసుముగా ఉంటుంది.

నెలవారీ బకాయిలు పూర్తిగా చెల్లించకపోతే అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్స్‌పై కొన్ని బ్యాంకులు 24 నుంచి 40 శాతం వరకు ఏపీఆర్ విధిస్తున్నాయి.

కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు 48-50 శాతం వరకు విధిస్తున్నట్లుగా 'మనీ కంట్రోల్' చెబుతోంది.

క్రెడిట్ కార్డులు వాడుకుని నిర్దేశిత కాలపరిమితి (డ్యూ డేట్) లోపు చెల్లించకపోతే ఛార్జీలు అధికంగా వస్తుంటాయని హైదరాబాద్ ఆల్విన్ కాలనీకి చెందిన మధుసూదన్ రెడ్డి చెప్పారు.

''పోయినేడాది ఒకసారి క్రెడిట్ కార్డు వాడుకుని గడువులోపు చెల్లించలేకపోయా. తర్వాత వడ్డీ రేటు 36శాతం వేసి పంపించారు. అందుకు భయపడి అప్పు చేసి కట్టేశా'' అని చెప్పారాయన.

కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు ఎలా లెక్కిస్తారంటే..

ఏపీఆర్ అనేది సంవత్సరానికి ఉన్నప్పటికీ, వడ్డీ రేటు మాత్రం రోజువారీగా లెక్కిస్తాయి బ్యాంకులు.

ఏపీఆర్ రేటును 365తో భాగిస్తే రోజువారీ వడ్డీ రేటు వస్తుంది.

ఈ రేటును క్రెడిట్ కార్డు వినియోగదారుడు ఎంత మొత్తానికి, ఎన్ని రోజులకు చెల్లించలేదో చూసి గుణిస్తారు.

అప్పుడు రోజువారీగా చెల్లించాల్సిన వడ్డీ రేటు ద్వారా మొత్తం ఎంత వడ్డీ పడిందనేది వస్తుంది.

ఉదాహరణకు ఏపీఆర్ 48 శాతం అనుకుందాం. అప్పుడు నెలవారీ వడ్డీ రేటు 4 శాతం ఉంటుంది. దాని నుంచి రోజువారీ వడ్డీ 0.131శాతం అవుతుంది.

కార్డు పేమెంట్

ఫొటో సోర్స్, Getty Images

డ్యూ డేట్ లోపు కట్టకపోతేనే బ్యాంకులకు ప్రయోజనమా?

క్రెడిట్ కార్డులపై నిర్ణయం బ్యాంకులదే కావటం వల్ల కొన్ని కార్డులకు తక్కువ వడ్డీ రేట్లు ఎక్కువ వార్షిక రుసుములు ఉంటున్నాయి, మరికొన్ని ఎక్కువ వడ్డీ రేట్లు, తక్కువ వార్షిక ఛార్జీలతో ఉంటున్నాయి.

క్రెడిట్ కార్డు బకాయిలను నిర్దేశిత తేదీ (డ్యూ డేట్) లోపు కట్టకపోతే బ్యాంకులకే ప్రయోజనమని అంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు.

''అంతే కదా.. కార్డు వాడుకున్న తర్వాత 20 రోజులకో, 30 రోజులకో.. 45 రోజులకో చెల్లించాలనే నిబంధన ఉంటుంది. అలా కడితే బ్యాంకుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వినియోగదారుడు ఎంత వాడుకున్నాడో అంతే కడతాడు. అదే డ్యూ డేట్ దాటిన తర్వాత కడితే వడ్డీతో కలిపి వస్తుంది'' అని బ్యాంకింగ్ రంగ నిపుణులు సురేష్ బాబు చెప్పారు.

క్రెడిట్ కార్డు ఛార్జీలు

ఫొటో సోర్స్, Getty Images

అభ్యంతరాలేమిటి?

దేశంలో క్రెడిట్ కార్డులపై డబ్బు తీసుకున్నా లేక అవసరాలకు కార్డు వాడుకుని నిర్దేశిత కాలపరిమితి లోపు చెల్లింపులు చేయకపోయినా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటున్నాయనేది వినియోగదారులు చెబుతున్నమాట.

''అన్ని బ్యాంకులని చెప్పలేను. కానీ, క్రెడిట్ కార్డుల నుంచి డబ్బు లేదా షాపింగ్ చేసి తిరిగి కట్టకపోతే ఛార్జీల మోత మోగుతుంటుంది'' అని హైదరాబాద్ హబ్సీగూడకు చెందిన ఎన్.మహేశ్ చెప్పారు.

ఆయన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేస్తున్నారు.

''నా దగ్గర మూడు కార్డులున్నాయి. ఒక్కోసారి డబ్బులు అడ్జస్ట్ అవ్వకపోతే చెల్లింపులు ఆగిపోతుంటాయి. లేదంటే, ఒక కార్డు నుంచి మనీ తీసి మరో కార్డు బిల్లు కడుతుంటా. లేటైతే మాత్రం టెన్షన్ వస్తుంటుంది. ఒకసారి 36శాతం వడ్డీతో బిల్లు కట్టాల్సి వచ్చింది'' అని చెప్పారాయన.

క్రెడిట్ కార్డుల విషయంలో ప్రత్యేక వ్యవస్థ (మెకానిజం) ఉండాల్సిన అవసరం ఉందని సురేష్ బాబు అన్నారు.

వినియోగదారులు వేర్వేరు బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకుని, నగదు వాడుకోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు.

''వేర్వేరు బ్యాంకుల నుంచి తీసుకునే క్రెడిట్ కార్డుల నగదు గరిష్ఠ పరిమితి విషయంలో నిబంధనలు రావాలి. కొందరు వినియోగదారులు తమ ఆదాయానికి మించి క్రెడిట్ కార్డుల నగదు పరిమితిని పెంచి తీసుకుంటున్నారు. దీనివల్ల చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు'' అని చెప్పారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఇతర దేశాల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..

గృహ, వాహన, వ్యక్తిగత రుణాలతో పోల్చితే క్రెడిట్ కార్డుల ద్వారా వాడుకున్న నగదు విషయంలో భారత్‌లోనే కాకుండా వివిధ దేశాల్లోనూ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

అమెరికాలోనూ క్రెడిట్ కార్డులపై సగటున 20శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి.

యూకేలోనూ 24.9శాతం వరకు ఏపీఆర్ ఉంది.

సింగపూర్‌లో క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు 28శాతం వరకు ఉందని సింగపూర్‌లోని ఎస్బీఐ విభాగానికి సీఎఫ్ఓ ఫణి శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

"క్రెడిట్ కార్డు అనేది బ్యాంకులు వినియోగదారుడిపై ఉన్న నమ్మకంతో ఇచ్చేవి. కార్డులు ఇచ్చేందుకు ప్రతి బ్యాంకుకూ ప్రత్యేక విభాగాలు పనిచేస్తుంటాయి. ఇందులో బ్యాంకులకు దక్కే మార్జిన్ తక్కువగానే ఉంటుంది" అని చెప్పారాయన.

"వినియోగదారుడిపై నమ్మకంతో 15 నుంచి 45 రోజుల పాటు వడ్డీ కూడా లేకుండా డబ్బులు వాడుకునే వెసులుబాటును ఈ కార్డుల ద్వారా బ్యాంకులు కల్పిస్తున్నాయి. వినియోగదారులు కూడా బ్యాంకులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అలా చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అది జరగకపోతే బ్యాంకులు నష్టపోకుండా ఉండడానికే వడ్డీరేట్లు అంత ఎక్కువగా ఉంటాయి" అని ఫణి శ్రీనివాస్ వివరించారు.

క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లపై గరిష్ఠ పరిమితి (క్యాప్) విధిస్తే అది కార్డుల జారీపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు ఫణి శ్రీనివాస్.

"క్రెడిట్ కార్డులు తీసుకున్న వారు చాలా వరకు జాగ్రత్తగానే వాడుతుంటారు. ఎందుకంటే అది సిబిల్ స్కోర్‌తో లింకై ఉంటుంది. క్రెడిట్ కార్డు వాడుకుని బిల్లులు కట్టకపోతే సిబిల్‌పై ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో తీసుకునే రుణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే కాస్త జాగ్రత్తగానే వాడుతుంటారు" అని చెప్పారు.

క్రెడిట్ కార్డులు, ఆర్‌బీఐ, వడ్డీ రేట్లు

ఫొటో సోర్స్, Getty Images

వడ్డీ రేట్లపై 'పరిమితి' సాధ్యమేనా?

పార్లమెంట్‌లో చట్టం చేయడం లేదా ఆర్బీఐ ఆదేశాల మేరకు వడ్డీ రేట్లను బ్యాంకులు మార్చే వీలుంది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ -1949, సెక్షన్ 21ఏ మేరకు ఏ న్యాయస్థానం కూడా వడ్డీ రేట్లను నిర్దేశించే వీల్లేదు.

అలాగే 'అవాజ్ సంస్థ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో సుప్రీంకోర్టు వడ్డీ రేట్ల విషయంలో కీలక ఆదేశాలిచ్చింది.

క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లను సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూడాలని, ఇందుకు 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ సెక్షన్ 21, 35ఏ తోపాటు ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 45ఎల్ మేరకు నిర్ణయం తీసుకోవాలని రిజర్వ్ బ్యాంకుకు సూచించినట్లు మనీ కంట్రోల్ తన కథనంలో పేర్కొంది.

"మార్కెట్ పరిస్థితులకు తగినట్లుగా వడ్డీ వసూలు చేసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. అయితే, అవి దోపిడీ స్థాయిలో ఉండకూడదని.. ఈ విషయంలో న్యాయవ్యవస్థ పరిధిలో సంబంధిత నిపుణులు ఉండరు కాబట్టి, రిజర్వ్ బ్యాంకు తన అధికారాలను ఉపయోగించి ఈ వడ్డీలు తగిన స్థాయిలో ఉండేలా చూడాలని సూచించింది." అని మనీ కంట్రోల్ పేర్కొంది.

క్రెడిట్ కార్డుల వడ్డీరేట్లపై నియంత్రణ తీసుకురావాలని భావిస్తే కార్డుల సంఖ్యపై పరిమితి విధించేందుకు బ్యాంకులు ఆలోచన చేయవచ్చని సురేష్ బాబు అన్నారు.

అప్పుడు క్రెడిట్ కార్డులు ఇప్పుడు ఇస్తున్నంత సులువుగా కాకుండా కష్టతరం అవుతాయని అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)