'హిజాబ్ ధరించి రీల్స్ చేయకు’ - ఇంటర్‌నెట్‌లో పెరుగుతున్న ఇలాంటి బెదిరింపులపై బాధితులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
''నువ్వే రీల్స్ అయినా చేసుకో, కానీ, హిజాబ్ ధరించి డ్యాన్స్ చేయకు'' అని చెప్పడం నుంచి ‘‘ప్రాణహాని కలిగిస్తామనే’’ హెచ్చరికల వరకు ఎన్నో రకాల కామెంట్లు వహీదా బేగం అనే యువతికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, ఆమె ఇతర సోషల్ మీడియా పోస్టుల కింద కనిపిస్తున్నాయి.
ఈ కామెంట్లు చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.
హిజాబ్ ధరించి రీల్స్ పోస్టు చేసినందుకు, తనకు, తన కుటుంబానికి ప్రాణహాని కలిగిస్తామనే బెదిరింపులు వస్తున్నాయని ఇటీవల వహీదాబేగం తన ఇన్‌స్టాపేజీలో ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
వహీదా బేగం తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లాలోని కడయనల్లూర్‌కు చెందిన యువతి.
అయితే హిజాబ్ ధరించి వీడియోను పోస్టు చేసినందుకు విమర్శల పాలైన తొలి ముస్లిం మహిళ వహీదా బేగం మాత్రమే కాదు.
కేరళలోని మళప్పురం జిల్లాలో 2017లో హిజాబ్, జీన్స్ వేసుకుని ముగ్గురు మహిళలు ఓ వీధిలో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అయింది. దీనిపై ఆ ముగ్గురు మహిళలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. చాలామంది వారిని ఇస్లాం వ్యతిరేకులుగా ఆరోపించారు.
అయితే, ఈ మహిళలు రీల్స్ కోసం లేదా లైక్స్ కోసం ఆ వీడియో చేయలేదు. 'హెచ్ఐవీ అవగాహన ప్రచారం'లో భాగంగా ఆ ప్రదర్శన నిర్వహించారు.


ఫొటో సోర్స్, modestlyziba/Instagram
'నా గుర్తింపును మార్చాలనుకోవడం లేదు'
హిజాబ్ ధరించి సోషల్ మీడియాలో కనిపించడంవల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి ఇన్‌ఫ్లుయెన్సర్ జిబా షిరీన్ మాట్లాడారు. '' ఒక ముస్లిం మహిళ హిజాబ్ ధరించి వీడియోలు లేదా రీల్స్ పోస్టు చేస్తే ఎక్కువగా ముస్లిం సమాజం నుంచే విమర్శలు వస్తున్నాయి'' అన్నారు.
జిబా షిరీన్ ఓ టీవీ సిరీస్‌లోనూ నటించారు.
''మొదట నా కుటుంబం నుంచి నాకు మద్దతు లభించలేదు. మరోవైపు నేను హిజాబ్ ధరిస్తాను కాబట్టి నా పని, కంటెంట్ ప్రజల్లోకి తప్పుగా వెళ్తుందేమోనని ఇస్లాం సమాజం ఆందోళన చెందింది. వారి ఆందోళన నన్ను ఆపాలని కాదు. ఇస్లాం సమాజ విలువలను, ప్రతిష్ఠను కాపాడాలన్నదే వారి ఉద్దేశం'' అన్నారు జిబా షిరీన్.
సోషల్ మీడియాలో చాలామందికి తమకు అప్పటికే ఉన్న కొన్ని అభిప్రాయాలతో తనను సంప్రదించారని తెలిపారు.
''నేను హిజాబ్ ధరిస్తాను కాబట్టి, నా కంటెంట్ కేవలం మత బోధనలు చేయడం లేదా మత మార్పిడి చేయడం అని చాలామంది అనుకునేవారు'' అని చెప్పారు.
''పెద్ద బ్రాండ్లు ముఖ్యంగా జట్టు సంరక్షణకు చెందిన బ్రాండ్లు నీతో పనిచేయడానికి ఇష్టపడవని నామొఖం మీదే చెప్పేశారు. దయచేసి, మీ హిజాబ్ తొలగించండి అన్నారు. మీ అవకాశాలను మీరు వదులుకుంటున్నారు. మీకు భవిష్యత్ ఉండదన్నారు'' అని తెలిపారు.
సోషల్ మీడియాలో తన గుర్తింపును మార్చుకోవాలనుకోవడం లేదని జిబా తెలిపారు.
''హిజాబ్ వేసుకుని టీవీ సిరీస్‌లు కూడా చేశాను. అది నా గుర్తింపుగా చూశాను. ఇప్పుడు నా కుటుంబం కూడా నాకు మద్దతు ఇస్తోంది. చాలా బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్నా. ఇదే సమయంలో, అవకాశాల కోసం నా ఆత్మగౌరవాన్ని, విమర్శల కారణంతో నా గుర్తింపును వదులుకోవాలనుకోవడం లేదు'' అని జిబా స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, GETTYIMAGES/ROLLINGEARTH
‘‘సామాజిక నిఘా పెరుగుతోంది’’
''ఇస్లాం సమాజంలో మహిళలను తరచూ నైతికతకు, సామాజిక హోదాకు స్పష్టమైన ప్రతినిధులుగా చూస్తారు. కానీ, పురుషులను ఇస్లాంకు ప్రతినిధులుగా పరిగణించకపోతుండటంతో వారు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛను అనుభవిస్తుంటారు’’అని పరిశోధకురాలు నిషా (పేరు మార్చాం) చెప్పారు.
''మహిళలు డ్యాన్స్ చేయడం, బహిరంగంగా మాట్లాడటం లేదా డిజిటల్ వేదికపై తమకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకోవడం.. మహిళలు మౌనంగా, అణకువుగా, సామాజిక కట్టుబాట్లకు తగ్గట్లు ఉండాలనే పాతకాలపు ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే, మహిళల వ్యక్తిగత ఎంపికలను మతానికి ముప్పుగా చూస్తున్నారు'' అని నిషా పేర్కొన్నారు.
''కడయనల్లూర్ లాంటి సంఘటనల్లో, ఇస్లాం సమాజం నుంచే అత్యంత తీవ్రమైన స్పందనలు వస్తున్నాయి. మతపరమైన సిద్ధాంతాల కంటే సామాజిక నిఘా పెరుగుతోందనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. వాస్తవానికి, మహిళలపై తమ నియంత్రణ కోల్పోతామని భయపడే పితృస్వామ్య సమాజం నుంచే ఈ విమర్శలు వస్తున్నాయి'' అని నిషా అన్నారు.
గతేడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో ఒక ఫిర్యాదు దాఖలైంది. హిజాబ్ ధరించి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోస్టు చేయడంతో తన బంధువులతో పాటు పలువురు పురుషుల నుంచి లైంగిక వేధింపులు, ప్రాణహాని హెచ్చరికలు వచ్చినట్లు ఓ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముస్లిం యువతులు ఈ విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో వారికి బెదిరింపులు వస్తున్నాయని నిషా తెలిపారు.
''ఈ కామెంట్ల వల్ల భయం, ఆందోళన పెరిగి, ఆత్మ నూన్యతకు గురవుతారు. బహిరంగ ప్రజా జీవితానికి వారు దూరమై, తిరిగి ఇళ్లకే పరిమితమవుతారు'' అని నిషా ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
''కేవలం మతం పరంగానే కాకుండా.. దేశం, జాతి, భాష వంటి అన్ని కోణాల్లోనూ మహిళలనే కేంద్రంగా చూస్తున్నారు. అయితే, ముస్లిం మహిళలు తమ మతానికి వెలుపల, బయట తమపై ఉండే నిఘాకు వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తోంది. అందుకే, వారు మరింత లక్ష్యంగా మారుతున్నారు'' అని జర్నలిస్ట్, రీసెర్చ్ స్టూడెంట్ అబ్దుల్లా తెలిపారు.
కర్ణాటకలో 2022లో విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై ఏర్పడిన వివాదాలను అబ్దుల్లా ప్రస్తావిస్తూ ‘‘హిజాబ్ వివాదం ముస్లిం మహిళలకు విద్యపొందే చట్టబద్దమైన హక్కుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనగా మారింది. ఆధునిక రాజకీయ చర్చల్లో ముస్లిం మహిళలు ఎందుకు లక్ష్యంగా మారుతున్నారంటే..వారిపట్ల సమాజానికి ఉన్న చింత వల్ల కాదు. అటు మతపరమైన భావజాలం ఉన్నవారు, ఇటు ఆధునిక భావాజలం ఉన్న ఇద్దరూ ముస్లిం మహిళలపై చూపుతున్న హింసే దీనికి కారణం’’ అన్నారు.
''నిజ జీవితంలో తమకు ఎవరో తెలియని మహిళలకు వారి వ్యక్తిగత ఎంపికల గురించి సలహాలు ఇవ్వడం, సంస్కృతికి సంబంధించి పాఠాలు బోధించడం ఒక పురుషుడికి సాధ్యం కాదు. కానీ, సోషల్ మీడియా అకౌంట్లు ఆ వ్యక్తులకు ఈ అధికారాన్ని కల్పిస్తున్నాయి'' అని అబ్దుల్లా తెలిపారు.
''ముస్లిం మహిళలు బలమైన భాగస్వామ్యం, వారి స్థిరత్వం, దృఢమైన చర్యల వల్ల ఇలాంటి వాటిని తిప్పికొట్టవచ్చు. ముస్లిం కమ్యూనిటీ మహిళల పక్షాన గట్టి మద్దతుగా నిలవాలి. ఒకే మత విశ్వాసం కింద ఉంటూ.. భిన్నమైన అభిప్రాయాలను తెలియజేసే వారి గొంతుకలను నొక్కాలని చూసే చర్యలను ఖండించడమే సమాజం చేయాల్సిన మొదటి పని'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'చాలా మతాల్లో ఈ సమస్య ఉంది'
''హిజాబ్ ధరించాలా? వద్దా? అన్నది మహిళల ఎంపిక. కానీ, హిజాబ్ ధరించు లేదా వద్దు అని మాత్రమే సమాజం ఆమెకు చెబుతుందే తప్ప, అసలు మీకు హిజాబ్ ధరించాలని ఉందా? లేదా? అని అడగదు. ఇది కేవలం ఇస్లాంలోనే కాదు. చాలా మతాల్లో ఇలానే ఉంది. మతపరమైన చిహ్నాలను, విలువలను మహిళలపై రుద్దుతున్నారు'' అని కర్ణాటకకు చెందిన రచయిత కే. షరీఫా అన్నారు.
''దేశానికి ఒక మహిళ సేవలందిస్తున్నట్లుగానో, ఇంటి పనులు చేస్తున్నట్లు గానీ, లేదా పిల్లల్ని చూసుకుంటున్నట్లు గానీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అభినందిస్తారు. కానీ, అదే మహిళ డ్యాన్స్ చేసిన రీల్ పోస్టు చేస్తే, వాటిని అశ్లీలమైనవిగా చూస్తారు'' అని షరీఫా అన్నారు.
''ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది ఆ మహిళ నిర్ణయం. అయితే, మహిళల చుట్టూ నెలకొన్న సామజిక దృక్పథాలు ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నాయి. సమాజంలో ఉన్న వాస్తవికత సోషల్ మీడియాలో కూడా ప్రతిబింబిస్తోందనిపిస్తోంది'' అని షరీఫా చెప్పారు.
''ఆమె హద్దులేంటన్నది నిర్ణయించుకోవాల్సింది ఆ మహిళలే. వారిపై అనవసరమైన ఒత్తిళ్లు పెట్టకుండా సోషల్ మీడియాను స్వేచ్ఛగా మహిళలు వాడుకునే వాతావరణాన్ని కల్పించడమే దీనికొక సరైన పరిష్కారం'' అని రచయిత షరీఫా సూచిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













