You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NCERT వివాదం: ఇకపై కోర్టులను విమర్శించడం కూడా కష్టమేనా?
- రచయిత, ఉమంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్టీ) 8వ తరగతి సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు రెండు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ఈ పుస్తకంలో 'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్' అనే ఒక అధ్యాయం ఉంది. అందులో ఒక విభాగం శీర్షిక "న్యాయవ్యవస్థలో అవినీతి". ఆ భాగంలో న్యాయవ్యవస్థలో వివిధ స్థాయిలలో ప్రజలు అవినీతిని ఎదుర్కొంటారని పేర్కొన్నారు.
ఈ పుస్తకం గురించి ఇంగ్లిష్ వార్తా పత్రిక 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో ఒక కథనం ప్రచురితమైంది.
సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మాల్య బాగ్చి, విపుల్ ఎం.పంచోలి బెంచ్ ముందు ప్రస్తావించారు.
కపిల్ సిబల్ మాట్లాడుతూ, "మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు న్యాయవ్యవస్థ అవినీతిమయమని బోధిస్తున్నారు" అని అన్నారు.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది? ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది?
సుప్రీంకోర్టు ఈ విషయాన్నిసుయో మోటోగా స్వీకరించి, కొన్నిరోజుల్లోనే రెండు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 26న ఇచ్చిన మొదటి ఆదేశం ప్రకారం, ఆ పుస్తకాన్ని నిషేధించి, అప్పటి వరకు ప్రచురితమైన అన్ని ప్రతులను ఉపసంహరించుకోవాలని సూచించింది.
దేశవ్యాప్తంగా ఉన్న మిడిల్ స్కూళ్లలోని పాఠ్యాంశాల్లో ‘సందర్భోచితం కాని’ ఇటువంటి విషయాలను ప్రస్తావించడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇది సమతుల విద్యా వ్యవస్థ భద్రతలను దెబ్బతీస్తుందని తెలిపింది.
"ఈ ధోరణి కొనసాగితే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం మొత్తంలో, చివరకు వచ్చే తరంలో కూడా న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం క్రమంగా దెబ్బతింటుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది.
అలాగే, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌తో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మార్చి 11న ఇచ్చిన తదుపరి ఆదేశంలో, ఈ అధ్యాయాన్ని రాసిన ముగ్గురు వ్యక్తులపై కూడా కోర్టు ఆంక్షలు విధించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ నిధులు పొందే విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఏవీ కూడా ఈ ముగ్గురితో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించకూడదని సూచించింది.
‘‘వారికి భారత న్యాయ వ్యవస్థపై సరైన అవగాహన లేదనుకోవాలి. లేదంటే, వారు ఉద్దేశపూర్వకంగా, పూర్తి తెలివిడితోనే భారత న్యాయవ్యవస్థ గురించిన వాస్తవాలను ఎనిమిదో తరగతి విద్యార్ధులకు వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేశారు’’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్ పేర్కొంది.
అయితే, ఈ ముగ్గురూ కోర్టులో హాజరై తమ వాదనలు వినిపించవచ్చని కూడా తెలిపింది. ఆ తరువాత నిర్ణయం మార్చాలా లేదా అన్నది పరిశీలిస్తామని తెలిపింది.
అదే సమయంలో, ఫిబ్రవరి 26న ఇచ్చిన తీర్పుపై సోషల్ మీడియాలో కొందరు ‘బాధ్యతారహితం’గా చర్చలు జరుపుతున్నారని కోర్టు అన్నది. అలాంటి వెబ్‌సైట్లు, ఖాతాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అయితే ఈ విషయంలో ‘బాధ్యతరహితం’ అనే పదానికి కోర్టు స్పష్టమైన నిర్వచనాన్ని ఇవ్వలేదు.
అంతే కాకుండా ఈ అధ్యాయాన్ని తిరిగి రాయడానికి కూడా కొన్ని షరతులను కోర్టు విధించింది. ఇప్పుడీ రెండు తీర్పులను న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అణచివేతకు దారి తీసే ప్రమాదం ఉందా?
విమర్శలను అణచివేయాలనే ఉద్దేశం తమకు లేదని ఫిబ్రవరి 26న ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు తెలిపింది. అయితే, పిల్లలకు వన్-సైడెడ్ సమాచారాన్ని అందిస్తే, న్యాయ వ్యవస్థపై జీవితాంతం తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది.
ఈ వాదనను పలువురు సీనియర్ న్యాయవాదులు సమర్థించగా, కొంతమంది న్యాయ నిపుణులు పూర్తిగా ఏకీభవించట్లేదు.
ఈ తీర్పువల్ల, ముఖ్యంగా అవినీతి అంశాలపై న్యాయ వ్యవస్థను ప్రశ్నించడానికి ప్రజలు వెనుకడుగు వేస్తారని వారు అంటున్నారు. ఇప్పటికే న్యాయ వ్యవస్థపై బహిరంగంగా విమర్శలు చేసే వారి సంఖ్య తక్కువగా ఉందని, ఈ నిర్ణయం ఆ సంఖ్యను మరింత తగ్గిస్తుందని వారు భావిస్తున్నారు.
ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్‌లో న్యాయశాస్త్రం బోధిస్తున్న ప్రొఫెసర్ శుభ్‌కర్ ధామ్, న్యాయ వ్యవస్థలో అవినీతిపై పలు అధ్యయనాలు చేశారు.
"ఈ నిర్ణయం వల్ల, ముఖ్యంగా భారత్‌లో నివసిస్తూ పనిచేసే వారు న్యాయవ్యవస్థపై మాట్లాడటానికి భయపడతారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు" అని బీబీసీతో అన్నారు.
తాను విదేశాల్లో ఉండటం వల్ల ఈ నిర్ణయం తనపై ప్రభావం చూపదని ఆయన చెప్పారు.
"ఇప్పటికీ అనేకమంది జర్నలిస్టులు, విద్యావేత్తలు న్యాయ వ్యవస్థపై రాయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పుడు భారత్‌లో ఏ విశ్వవిద్యాలయమైన తన అధ్యాపకులకు ఈ అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేయడానికి అనుమతిస్తుందో లేదో నాకు తెలియదు" అని ఆయన అన్నారు.
విశ్వవిద్యాలయాల కార్యకలాపాల్లో న్యాయమూర్తుల పాత్ర కీలకంగా ఉండటం కూడా దీనికి ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఇప్పటి పుస్తకాలు లేదా వ్యాసాలను పరిశీలిస్తే, న్యాయ వ్యవస్థలో అవినీతి పై లోతుగా విశ్లేషించే రచనలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ అంశంపై మాట్లాడితే ఏమవుతుందో ప్రజలకు తెలుసు" అని ఆయన పేర్కొన్నారు.
తాను భారత్‌లో ఉంటే ఇప్పటివరకు తాను చేసిన పరిశోధనలు చేయలేకపోయేవాడినేమో అన్న అనుమానం ఉందని కూడా ఆయన అన్నారు.
న్యాయ పరిశోధకుడు ప్రశాంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన భారతలో కింది కోర్టులపై "తారీఖ్ పే జస్టిస్" అనే పుస్తకాన్ని రాశారు.
"కోర్టు ధిక్కరణ చట్టం దుర్వినియోగం వల్ల, ఇప్పటికే అనేకమంది సంపాదకులు, వార్తా సంస్థలు న్యాయ వ్యవస్థ గురించి రాయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ తీర్పు వారి భయాన్ని మరింత పెంచుతుంది" అన్నారు.
"గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థలో 'దుర్వినియోగం', 'అవినీతి' వంటి అంశాలపై వచ్చిన వార్తలు లేదా కాలమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి" అని ఆయన అన్నారు.
ఈ తరహా తీర్పుల తర్వాత, ఇలాంటి విషయాలపై రాయడాన్ని ప్రజలు తామే నియంత్రించుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారు.
ఇకపై సుప్రీం కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని, హైకోర్టులు కూడా కోర్టు ధిక్కరణ అంశంలో కఠిన ఆదేశాలు ఇవ్వవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయంపై నిపుణులు ఇంకా ఏమంటున్నారు?
ఈ రెండు తీర్పుల చట్టనిబద్ధతపై కూడా పలువురు న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాజ్యాంగ నిపుణులు గౌతం భాటియా ఈ తీర్పుల అనంతరం రెండు వ్యాసాలు రాశారు.
ఆయన అభిప్రాయం ప్రకారం, పుస్తకాలు లేదా వ్యక్తులపై నిషేధం విధించడం కోర్టు పరిధిని మించిన చర్య.
ఏదైనా ప్రాథమిక హక్కుల విషయంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమా కాదా అన్నదే కోర్టు పరిశీలించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఒక వ్యక్తి ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయడం అతని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని ఆయన అన్నారు. అంతేకాకుండా, వారు ఏ చట్టాన్ని ఉల్లంఘించారో స్పష్టత లేదని తెలిపారు. ఈ ఆదేశం ఇవ్వడానికి ముందు కోర్టు సరైన విచారణ కూడా జరపలేదని, తగిన కారణాలు కూడా వెల్లడించలేదని ఆయన విమర్శించారు.
ఇదే విషయంపై ప్రొఫెసర్ శుభాంకర్ కూడా స్పందించారు. ముగ్గురు వ్యక్తులను భవిష్యత్తులో పనిచేయకుండా నిరోధించిన నిర్ణయం ‘చట్టవిరుద్ధం’ అని ఆయన అన్నారు.
‘‘ఇలాంటి నిర్ణయాన్ని సమర్థించే చట్టపరమైన నిబంధన ఉందో లేదో నాకు తెలియదు. ముఖ్యంగా, ఎదుటివారి వాదనలు వినకుండా తీసుకున్న నిర్ణయం ఇది’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఆ అధ్యాయంలో తప్పేమీ నాకు కనిపించలేదు. అందులో ఉన్న విషయాలు తప్పుగా లేవు. మొత్తం అధ్యాయాన్ని చదివితే, అది న్యాయ వ్యవస్థను చెడుగా చూపిస్తున్నట్లు ఉండదు’’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మరోవైపు, మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మదన్ బి లోకుర్ ఈ నిర్ణయంపై స్పందిస్తూ, ‘‘ముగ్గురు ఉపాధ్యాయులను అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి దూరం చేయడం చాలా కఠినమైన ఆదేశమనడంలో సందేహం లేదు’’ అన్నారు
అయితే, ఈ తీర్పువల్ల న్యాయ వ్యవస్థపై విమర్శలు పూర్తిగా ఆగిపోతాయని తాను భావించడం లేదని లోకుర్ అభిప్రాయపడ్డారు.
‘‘ కోర్టు దృష్టి అంత పిన్న వయసులో ఉన్న విద్యార్థులతో అవినీతి అంశంపై ఎటువంటి చర్చ జరగాలి అన్నదానిపై ఉంది’’ అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)