చంద్రుడి మీద ప్లాట్లు అమ్మి కోట్ల డాలర్లు సంపాదించిన అమెరికన్, అది ఎలా సాధ్యమైందంటే..

    • రచయిత, అలీసియా హెర్నాండెజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఒక్కసారి ఇది ఊహించుకోండి

మీరు ఇప్పుడే విడాకులు తీసుకున్నారు. చేతిలో పైసా లేదు. ఏదైనా ఆస్తి ఉంటే దాన్ని అమ్ముకుని డబ్బులు సంపాదించవచ్చని ఆలోచిస్తున్నారు.

అప్పుడే కిటికీలోంచి బయటకు చూశారు. చంద్రుడు కనిపించాడు. వెంటనే మీరు "యురేకా...నేను చంద్రుడిని అమ్మేస్తా" అని అరవొచ్చు.

వినడానికి నమ్మశక్యంగా లేదు కదా? సరిగ్గా ఇదే ఆలోచన 1980లో డెన్నిస్ హోప్ అనే అమెరికన్‌కు వచ్చింది. ఆ క్షణంలో కలిగిన ఆలోచనతో చంద్రుడిపై ప్లాట్లు అమ్మి ఏకంగా కోటీశ్వరుడయ్యారు.

ఇంతకీ, ఆయన ఇదెలా చేశారు? అంతర్జాతీయ ఒప్పందాల్లోని ‘‘చట్టపరమైన లొసుగులను’’ హోప్ ఎలా ఉపయోగించుకున్నారు?

ఆలోచన రావడంతోనే లైబ్రరీకి పరుగు..

పెద్ద ఐడియా వచ్చాక, దాని గురించి సమాచారం వెతకాలని హోప్ నిర్ణయించుకున్నారు. కొన్ని సంవత్సరాల కిందట 'వైస్' అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను లైబ్రరీకి వెళ్లి 1967 నాటి 'ఔటర్ స్పేస్ ట్రీటీ' గురించి వెతికినట్లు ఆయన తెలిపారు.

ఐక్యరాజ్యసమితికి చెందిన ఈ పత్రం ఏం చెబుతోంది? ఔటర్ స్పేస్ అనేది అంతర్జాతీయ ఉమ్మడి ఆస్తి అని, అది "మొత్తం మానవాళికి చెందినది" అని పేర్కొంటుంది. అందువల్ల, ఏ దేశం కూడా దానిపై ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని క్లెయిమ్ చేయకూడదని చెబుతుంది.

ముఖ్యంగా, ఆర్టికల్ నంబర్ 2 ప్రకారం "చంద్రుడు, ఇతర ఖగోళ వస్తువులు ఏ దేశ సార్వభౌమాధికారానికి లోబడి ఉండవు; వినియోగం, ఆక్రమణ లేదా ఇతర మార్గాల ద్వారా వాటిని ఎవరూ సొంతం చేసుకోకూడదు" అని ఉంది.

హోప్ దీనిని ఇలా అర్థం చేసుకున్నారు: అది అందరిదీ అయితే, ఎవరిదీ కాదని అర్థం. ఒక దేశం దానిని క్లెయిమ్ చేయలేకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి ఎందుకు చేయకూడదు?

"అది యజమాని లేని భూమి" అని బీబీసీ ఇంటర్వ్యూలో హోప్ చెప్పారు.

అందుకే, "యూరప్ నుంచి మన పూర్వీకులు కొత్త ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలాగైతే భూములను ఆక్రమించుకున్నారో", ఆయన కూడా చంద్రుడిని అలాగే సొంతం చేసుకున్నారు.

చంద్రుడిని ఎలా "కొనుగోలు" చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. దీంతో, హోప్ ఒక చట్టపరమైన శూన్యతను లేదా సమాధానం లేని పరిస్థితిని ఆసరాగా చేసుకున్నారు.

చంద్రుడు, మిగిలిన ఎనిమిది గ్రహాలు, వాటి ఉపగ్రహాలపై యాజమాన్య హక్కులను కోరుతూ ఐక్యరాజ్యసమితికి ఒక క్లెయిమ్ పంపారు.

ఆ ఆస్తిని చిన్న భాగాలుగా విభజించి, కావాల్సిన వారికి అమ్మాలన్నదే తన ఆలోచన అని అందులో వివరించారు. ఒకవేళ వారికి ఏవైనా చట్టపరమైన అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కూడా కోరారు.

కానీ, ఆయనకు ఎవరూ సమాధానం ఇవ్వలేదు.

ఎకరం నుంచి అమ్మకం మొదలు

అప్పటి నుంచి ఆయన చంద్రుడిపై ఎకరాల కొద్దీ ప్లాట్లు అమ్ముతున్నారు. కేవలం భూమి ఉపగ్రహం మాత్రమే కాకుండా అంగారకుడు, శుక్రుడు, బుధుడు గ్రహాలపై కూడా భూములను విక్రయించారు.

ఈయన దగ్గర భూములు కొన్నవారిలో హాలీవుడ్ తారలు, దివంగత అమెరికా మాజీ అధ్యక్షులు రోనాల్డ్ రీగన్, జిమ్మీ కార్టర్ వంటి ప్రముఖులతో పాటు హిల్‌టన్, మారియట్ వంటి పెద్ద హోటల్ నెట్‌వర్క్‌లు కూడా ఉన్నాయి. జార్జ్ డబ్ల్యూ బుష్‌కు కూడా చంద్రుడిపై స్థలం ఉందని చెబుతుంటారు.

తాను రోజుకు సగటున 1,500 ఆస్తులను విక్రయిస్తున్నట్లు హోప్ 2007లో బీబీసీతో చెప్పారు. చంద్రుడి మ్యాప్‌పై కళ్లు మూసుకుని, చూపుడు వేలితో ఒక పాయింట్‌ను సూచించడం ద్వారా ప్లాట్లను ఎంపిక చేస్తానని ఆయన వివరించారు.

"ఇది పెద్ద శాస్త్రీయమైన పద్ధతి కాదు, కానీ సరదాగా ఉంటుంది" అని హోప్ అన్నారు.

ఈ పని ద్వారా ఆయన దాదాపు 12 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.111 కోట్లు) సంపాదించినట్లు సమాచారం. 1995 నుంచి ఆయన చేస్తున్న ఒకేఒక పని ఇదేనని చెబుతున్నారు.

"ఎకరం నుంచి అమ్మకం మొదలవుతుంది. మేం విక్రయించే అతి పెద్ద ఆస్తిని 'ఖండం పరిమాణం'గా పిలుస్తాం. ఇది 53,32,740 ఎకరాలు ఉంటుంది. దీని ధర 1,33,31,000 డాలర్లు" అని హోప్ వైస్ పత్రికకు తెలిపారు.

"మేం ఇంకా అటువంటి పెద్ద ఆస్తులేవీ అమ్మలేదుగానీ, 1,800 నుంచి 2,000 ఎకరాల ప్లాట్లను చాలానే విక్రయించాం. ప్రపంచవ్యాప్తంగా 1,800 పెద్ద సంస్థలు నిర్దిష్ట ప్రయోజనాల కోసం మా దగ్గర ఆస్తులను కొనుగోలు చేశాయి. ఇందులో హిల్‌టన్, మారియట్ హోటల్ గ్రూపులు కూడా ఉన్నాయి" అని ఆయన వెల్లడించారు.

గెలాక్సీ ప్రభుత్వం

మీరు ఇక్కడి వరకు చదివారంటే, ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ భూ యజమానుల ఆస్తులను ఎవరూ స్వాధీనం చేసుకోరనే గ్యారెంటీ ఏంటి? అని కచ్చితంగా ఆలోచిస్తుంటారు. హోప్, మిగిలిన యజమానులు కూడా అదే ఆలోచించి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు.

హోప్ వివరణ ప్రకారం, వారు "గెలాక్సీ ప్రభుత్వం" అనే ప్రజాస్వామ్య గణతంత్రాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు.

"రాజ్యాంగాన్ని రూపొందించడానికి మాకు మూడేళ్లు పట్టింది. మార్చి 2004లో దీనిని ఆన్‌లైన్‌లో ప్రచురించాం. అప్పటికి మాకు 37 లక్షల మంది యజమానులు ఉండగా, 1,73,562 ఓట్లతో రాజ్యాంగం ఆమోదం పొందింది. కాబట్టి ఇప్పుడు మాది పూర్తిగా ఆమోదం పొందిన రాజ్యాంగం ఉన్న ఒక సార్వభౌమ రాజ్యం" అని హోప్ చెప్పారు.

"ప్రస్తుతం మేం భూమిపై ఉన్న 30 ప్రభుత్వాలతో దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మంది మమ్మల్ని గుర్తించేలా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్య నిధిలో చేరడమే మా ఉద్దేశం" అని ఆయన తెలిపారు.

అయితే, హోప్ చేసిన ఈ వాదనలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.

చంద్రుడి యాజమాన్య హక్కులు

మనిషి చంద్రుడిపై అడుగు పెట్టే అవకాశం ఉందని ఊహించడానికంటే చాలాకాలం ముందే, ఖగోళ వస్తువుల యాజమాన్యం గురించి చర్చలు జరిగాయి. 1936లో డీన్ లిండ్సే అనే వ్యక్తి చంద్రుడినే కాకుండా, అన్ని గ్రహాంతర వస్తువులపై యాజమాన్య హక్కులను కోరారు. ఆ సమయంలో ఆయనకు కొన్ని కొనుగోలు ప్రతిపాదనలు కూడా వచ్చాయి.

జెనారో గజార్డో వెరా కూడా ఇదే పని చేశారు. 1919లో చిలీలో జన్మించిన ఈ న్యాయవాది, 1954 సెప్టెంబర్ 25న చంద్రుడిపై స్వాధీన హక్కులు పొందినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి నోటరీ సంతకం చేసిన అధికారిక పత్రాల్లో ఆయన "చంద్రుడి యజమాని" అని నమోదై ఉంది.

చిలీ రాజధానికి 255 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాల్కా అనే నగరంలోని నోటరీ కార్యాలయం ఈ పత్రాన్ని జారీ చేసింది. ప్రస్తుతం దీని రికార్డులు శాంటియాగోలోని జ్యుడీషియల్ ఆర్కైవ్స్‌లో ఉన్నాయి. ఆ పత్రంలో ఇలా ఉంది:

"న్యాయవాది జెనారో గజార్డో వెరా, 1857 కంటే ముందు నుంచే తన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వంతో కలిపి, భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం, 3,475 కిలోమీటర్ల వ్యాసం కలిగిన 'చంద్రుడు' అనే ఖగోళ వస్తువుకు యజమాని. ఇది గోళాకారం కాబట్టి దీని సరిహద్దులు: ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిశల్లో అంతరిక్షం. ఆయన నివాసం 1 ఓరియంటే 1,270 స్ట్రీట్, వివాహ స్థితి: అవివాహితుడు. జెనారో గజార్డో వెరా. కార్డ్ నంబర్ 1.487.45-K. న్యూనోవా. టల్కా, 25 సెప్టెంబర్ 1954".

అయితే, జెనారో చేసిన ఈ పని కేవలం ఒక వినోదం కోసం మాత్రమే. 1969లో 'ది ఈవినింగ్ ఇండిపెండెంట్' అనే అమెరికన్ పత్రికకు ఆయన చెప్పిన దాని ప్రకారం, టల్కా సోషల్ క్లబ్‌లో సభ్యత్వం పొందడం కోసమే ఆయన చంద్రుడిని కొన్నారు. ఆ క్లబ్ నిబంధనల ప్రకారం సభ్యులు ఏదైనా ఆస్తిని కలిగి ఉండాలి. ధనవంతులు ఉండే ఆ క్లబ్‌లో చేరడానికి ఆస్తి లేకపోవడంతో, ఆయనకు చంద్రుడిని కొనాలనే ఆలోచన వచ్చింది. దీనికోసం ఆయనకు ఖర్చయింది 1 డాలర్ మాత్రమే.

ఊహాత్మక వ్యాపారం

హోప్ తన అంతరిక్ష స్థిరాస్తి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం చంద్రుడు ఎవరికీ సొంతం కాదు. కనీసం చట్టబద్ధంగానైనా అది సాధ్యం కాదు. 1967 నాటి అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం, అంతరిక్ష అన్వేషణ, వినియోగం అన్ని దేశాల ప్రయోజనాల కోసం ఉండాలి.

మరి ఎవరైనా వ్యక్తిగతంగా చంద్రుడికి యజమానిగా ప్రకటించుకోవచ్చా?

"లేదు" అని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ క్లైర్ ఫింకెల్‌స్టెయిన్ 2019లో స్పష్టంగా చెప్పారు. అయితే, అంతరిక్షంలో ఖనిజాల వెలికితీత వంటి వాణిజ్య కార్యకలాపాల విషయంలో చట్టం అంత స్పష్టంగా లేదు.

"అంతరిక్షంలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్ సంస్థల విషయంలో అంతర్జాతీయ చట్టం అస్పష్టంగా ఉంది" అని లండన్ బిర్బెక్ కాలేజీ ప్రొఫెసర్ ఇయాన్ క్రాఫోర్డ్ 2016లో బీబీసీతో అన్నారు.

"ఔటర్ స్పేస్ ట్రీటీని సమీక్షించి, దానిని అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

అప్పటివరకు, ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం చంద్రుడు ఎవరికీ సొంతం కాదు, అందరికీ చెందిన ఆస్తి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)