భారత్: ‘ఇండియా’ అనే పేరుపై జిన్నా అప్పట్లో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తాబిందా కోకబ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హిందుస్థాన్, భారత్, ఇండియా.. ఈ మూడు పేర్లనూ మన దేశం కోసం ఉపయోగించడాన్ని తరచూ చూస్తుంటాం. అధికారికంగా ఇండియా, భారత్ అన్న పేర్లు రెండూ ఉన్నప్పటికీ, భారత్ అని మాత్రమే ఉండాలని కొందరు వాదిస్తున్నారు.
అయితే, భారత్‌గా పేరు మార్చాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఆవిర్భావానికి కారణమైన మహమ్మద్ అలీ జిన్నా ‘ఇండియా’ అనే పేరును వ్యతిరేకించారు. ఇది తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన అప్పట్లో అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఇండియా అనే పేరుపై మొదట్నుంచీ వివాదం ఉండేదని చరిత్రకారులు పుస్తకాల్లో రాసుకొచ్చారు. భారత ఉప ఖండం మొత్తానికి ఈ పేరును ఉపయోగించేవారు. దీంతో వలసవాదానికి ప్రతీకగా దీన్ని చెబుతూ.. భారత రాజ్యాంగ సభలో కొందరు కూడా వ్యతిరేకించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఏ దేశమూ బ్రిటిష్ పేరు పెట్టుకోదు’’
‘ఇండియా’ అనే పేరును ఎవరు పెట్టుకోవాలనే విషయంలో అప్పట్లో ఎలాంటి వివాదమూలేదని ‘ఇండియా: ఎ హిస్టరీ’ అనే పుస్తకంలో చరిత్రకారుడు జాన్ కీ రాసుకొచ్చారు. ఎందుకంటే తమ కొత్త ముస్లిం దేశానికి మహమ్మద్ అలీ జిన్నా ‘పాకిస్తాన్’ అనే ఇస్లామిక్ పేరును ఎంచుకున్నారు.
‘‘స్వాతంత్ర్య ఉద్యమం మొదట్లో భారత్‌ను ఒక మంచి పేరుగా చూసేవారు. ఎందుకంటే ఇండియా అనే పేరుపై వలసవాద ఛాయలు కనిపించేవి’’ అని జాన్ కీ వివరించారు.
అయితే, సాంస్కృతిక సాహిత్యంలో ఇండియా అనే పేరు ఎక్కడా లేదని, మరోవైపు బౌద్ధ, జైన సాహిత్యంలోనూ ఈ పేరును ఉపయోగించలేదని ఆయన చెప్పారు.
దక్షిణాసియాలోని ఇతర భాషల సాహిత్యాల్లోనూ ఈ పదం దాదాపుగా ఎక్కడా కనిపించదని జాన్ కీ రాసుకొచ్చారు.
‘‘బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన ఇండియా అనే పదాన్ని ఏ దేశమూ పెట్టుకోదని మహమ్మద్ అలీ జిన్నా కూడా భావించారు’’ అని ఆయన తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘తమ దేశానికి ఇండియా అనే పేరు పెట్టుకోవాలనే జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదనకు చివరి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆమోదం తెలపడంపై జిన్నా అభ్యంతరరం వ్యక్తంచేశారు.’’
‘‘ఈ విషయంపై జిన్నా చాలాసార్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందుకంటే ఇండియా అనే పేరు భారత ఉప ఖండంపై ఆధిపత్యాన్ని సూచిస్తుందని, దీన్ని పాకిస్తాన్ ఎప్పటికీ ఆమోదించబోదనే అభిప్రాయాన్ని కూడా ఆయన బయటపెట్టారు’’ అని జాన్ కీ తన పుస్తకంలో రాశారు.
‘‘మహమ్మద్ అలీ జిన్నా అభ్యంతరం వ్యక్తంచేయడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సింధూ (ఇండస్) నది చుట్టుపక్కల ప్రాంతాలకు మొదట ఇండియా అనే పేరు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలు చాలావరకు పాకిస్తాన్‌లోనే ఉన్నాయి. ఇది కూడా జిన్నా అభ్యంతరానికి ఒక కారణం’’ అని జాన్ కీ వివరించారు.
దేశ విభజన తర్వాత చాలా కాలంపాటు ఈ విషయంపై చర్చ జరిగేదని చరిత్రకారిణి ఆయేషా జలాల్ రాసుకొచ్చారు.
‘‘యూనియన్ ఆఫ్ ఇండియా పేరు విషయంలో పాక్ ఆందోళన చెందేది. తమను స్వతంత్రమైన కొత్త దేశంగా ఉండనిస్తారో లేదోనని పాక్ నాయకులు ఆందోళన చెందేవారు. యూనియన్ అనే పదం విషయంలోనూ ఇండియా పాలకులను వారు నమ్మేవారు కాదు. తమను కూడా దానిలో కలిపేసుకుంటారేమోనని వారు భయపడేవారు’’ అని జలాల్ వివరించారు.

ఫొటో సోర్స్, ANI
తప్పుదోవ పట్టించే పేరా?
ఈ విషయంలో సౌత్ ఏషియన్ లా ప్రొఫెసర్ మార్టిన్ లూ ‘ఇస్లాం అండ్ ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ పాకిస్తాన్’ పేరుతో ప్రచురించిన తన పరిశోధన పత్రంలో ఒక లేఖను ఉటంకించినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ లేఖను జిన్నా భారత తొలి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్‌కు రాశారు. దీనిలో ఇండియా అనే పేరు తప్పుదోవ పట్టించేదని, చాలా గందరగోళానికి కూడా కారణం అవుతుందని జిన్నా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
1947 సెప్టెంబరులో లండన్ ఇండియన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. దీనికి గౌరవ చైర్మన్‌గా ఉండాలని మహమ్మద్ అలీ జిన్నాను మౌంట్‌బాటన్ కోరారు.
అయితే, ఆ ఎగ్జిబిషన్‌లో ఇండియన్ అనే పేరు ఉండటంతో ఆ ప్రతిపాదనను జిన్నా తిరస్కరించారని మార్టిన్ లూ రాసుకొచ్చారు.
‘‘ఏదో నిగూఢ కారణాలతోనే ఇండియా అనే పేరును వారు ఎంచుకున్నారు. దీని వల్ల చాలా గందరగోళం నెలకొంటోంది’’ అని జిన్నా ఆ లేఖలో రాసినట్లు మార్టిన్ లూ వివరించారు.
దేశ విభజనకు ముందు కూడా ‘యూనియన్ ఆఫ్ ఇండియా’ అనే పేరును ముస్లిం లీగ్ వ్యతిరేకించింది. అయితే, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఎలాంటి కారణాలను వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
1949 సెప్టెంబరులో దేశ విభజనకు రెండేళ్ల తర్వాత రాజ్యాంగ సభ ముసాయిదాపై చర్చ సమయంలో హిందుస్తాన్ అనే పేరు చర్చకు వచ్చింది. అయితే, చర్చ అనంతరం ఈ పేరును తిరస్కరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇంగ్లిష్‌లో ఇండియా, హిందీలో భారత్ అనే పేర్లను ఉపయోగించారు.
నిన్నమొన్నటి వరకూ అందరూ ఇండియా అనే పేరును విస్తృతంగా ఉపయోగించేవారు. మీడియాలోనూ ఈ పేరే ఎక్కువగా కనిపించేది. అయితే, అప్పుడప్పుడు భారత్ అనే పేరును ఉపయోగించాలనే డిమాండ్ మాత్రం వినిపించేది.
ఇప్పుడు ఇండియా భారత్ అవుతుందా?
2020లోనూ దేశం పేరును ఇండియా నుంచి ‘భారత్’గా మార్చాలనే డిమాండ్ వచ్చింది. దీనిపై సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది.
ఇండియా అనే పదం గ్రీకు భాషలోని ‘ఇండిక్’ అనే పదం నుంచి వచ్చిందని, దీన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని ఆ పిటిషన్‌దారుడు కోరారు.
దీనికి అనుగుణంగా ఆర్టికల్-1లోని ఇండియా అనే పదాన్ని తొలగించి ‘భారత్’ అనే పేరునే ఉపయోగించాలని ఆయన సూచించారు.
అయితే, అతడి పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. భారత్ అనే పేరు కూడా రాజ్యంగంలో ఉందని ‘ఇండియా అంటే భారత్’ అనే పదాలను కోర్టు పునరుద్ఘాటించింది.
మళ్లీ ఇప్పుడు ఈ అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది. తాజా జీ20 సదస్సును పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పంపిన ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాయడంతో ఈ చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: అల్విన్ కాలనీ ధరణి నగర్లో అంత ఎత్తున నురగ ఎలా వచ్చింది... అది ఎంత ప్రమాదకరం?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















