‘ఆయిల్, గ్యాస్, బంగారం, రాగి, బొగ్గు, గ్రానైట్‌ సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్‌లో సగం జనాభాకు కరెంట్ సౌకర్యం లేదు’.. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తోందా?

పాకిస్తాన్, బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రోనక్ భైరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 8 నిమిషాలు

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జరిగిన వరుస దాడుల్లో 31 మంది సామాన్య పౌరులతో పాటు 17 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు.

దాదాపు 40 గంటల పాటు సాగిన కాల్పుల్లో దాడులకు పాల్పడిన 145 మందిని భద్రతా దళాలు కాల్చి చంపినట్లు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫ్‌రాజ్ బుగ్తీ చెప్పారు.

ఈ దాడులు చేసింది తామేనని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించుకుంది. ఈ దాడుల్లో డజన్ల మంది సైనికులు మరణించినట్లు పేర్కొంది.

సైనిక దళాలపై ఆపరేషన్ 'హెరోఫ్ 2.0' లేదా 'బ్లాక్ స్టార్మ్' చేపట్టినట్లు బీఎల్ఏ తెలిపింది.

భద్రతా సిబ్బందికి చెందిన 84 మందిని హతమార్చినట్లు, మరో 18 మందిని కిడ్నాప్ చేసినట్లు కూడా పేర్కొంది.

వీటిని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ అతిపెద్ద రాష్ట్రం, దేశ భూభాగంలో దాదాపు 44 శాతం బలూచిస్తాన్ పరిధిలోనే ఉంటుంది.

ఈ ప్రాంతం అఫ్గానిస్తాన్, ఇరాన్‌లతో సరిహద్దులు పంచుకుంటోంది. కొంతభాగం అరేబియా మహాసముద్ర తీరప్రాంతం కూడా ఉంది.

పాకిస్తాన్‌ జనాభా 24 కోట్లలో సుమారు 5 శాతం ఈ ప్రాంతంలోనే ఉంది.

స్థానికులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించకుండా ఇక్కడి విలువైన ఖనిజ సంపదను పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటోందని బీఎల్ఏ ఆరోపిస్తోంది.

ఈ ప్రావిన్స్‌లో సహజవాయువు, ఖనిజాలు వంటి సహజవనరులు పుష్కలంగా ఉన్నాయి. ఈ కారణంగానే, ఈ ప్రాంతంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు ప్రపంచంలోని శక్తిమంతమైన అమెరికా, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బలూచిస్తాన్‌పై అమెరికా, చైనా దృష్టి ఎందుకు?

బలూచిస్తాన్ అపారమైన సహజవనరులకు నిలయం. సింధ్ యూనివర్సిటీ ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం.. ఇక్కడ సహజ వాయువు, చమురు, రాగి, బంగారం, ఇనుము, జింక్, క్రోమైట్, జిప్సం, బొగ్గు, పాలరాయి, గ్రానైట్‌తో సహా అనేక ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఒక్క రెకో దిక్‌లోనే ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం, రాగి నిల్వలు ఉన్నట్లు చెబుతున్నారు.

కొన్ని ప్రచురితమైన విశ్లేషణల ప్రకారం, బలూచిస్తాన్ దాదాపు 2,280 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కానీ, బలూచిస్తాన్‌కు దక్కేది కేవలం 700 నుంచి 800 మెగావాట్లు. ఇప్పటికీ ఈ ప్రావిన్స్‌లోని సుమారు 56 శాతం జనాభాకు విద్యుత్ సౌకర్యం లేదు.

సింధ్ యూనివర్సిటీ పేర్కొన్న వివరాల ప్రకారం.. బలూచిస్తాన్‌‌లోని డెరా బుగ్తీ జిల్లాలోని సుయీ పట్టణం నుంచి 70 ఏళ్లుగా సహజ వాయువును వెలికితీసి పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.

అయినప్పటికీ, ఈ ప్రాంతంలో చాలా కుటుంబాలు ఇప్పటికీ సంప్రదాయ పొయ్యిలపైనే వంట చేసుకుంటున్నాయి.

పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 158 ప్రకారం, గ్యాస్ ఉత్పత్తయ్యే ప్రాంతానికి ముందుగా గ్యాస్ సరఫరా చేయాలి. కానీ, ఇక్కడ అలా జరగడం లేదు.

బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌, చగాయ్ జిల్లాలోని రెకో దిక్‌లో ప్రపంచంలోనే అత్యంత భారీస్థాయిలో ముడి బంగారం, ముడి రాగి నిల్వల తవ్వకాల కోసం కీలకమైన ప్రాజెక్ట్ నడుస్తోంది.

అయితే, వాటి నుంచి వచ్చే ప్రయోజనాల్లో ఈ ప్రావిన్స్‌కు దక్కుతోంది మాత్రం చాలా తక్కువే. అలాగే, ముడి బంగారం, ముడి రాగి మైనింగ్ ప్రాజెక్టులో 20 శాతం సంపద బలూచిస్తాన్ ప్రజలకే కేటాయిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ, అవి నెరవేరలేదు.

బలూచిస్తాన్ ప్రావిన్స్

ఫొటో సోర్స్, Getty Images

బలూచిస్తాన్ ఎంతో సంపదను ఉత్పత్తి చేస్తోంది, కానీ అక్కడి కేంద్ర ప్రభుత్వం దానిని ఎగుమతి చేస్తోంది. ఈ ప్రావిన్స్‌‌లో అభివృద్ధీ అంతంతమాత్రమే.

ఇక గ్యాస్, విద్యుత్, నిధులు, హక్కుల పరంగానూ బలూచిస్తాన్ వాటా చాలా తక్కువ. ఇదే ఆ ప్రాంతంలో ఆందోళనలకు, హింసాత్మక తిరుగుబాట్లకు దారితీస్తోంది.

పాకిస్తాన్ సైన్యం తమ ప్రావిన్స్‌లో కిడ్నాప్‌లు, చిత్రహింసలు, హత్యలకు పాల్పడుతోందని బలూచ్ యాక్టివిస్టులు ఆరోపిస్తున్నారు. ఇది పాకిస్తాన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకతకు దారితీసింది.

జేఎన్‌యూలో సౌత్ ఏసియన్ స్టడీస్ ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్ మాట్లాడుతూ, "ఇది సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతం కాబట్టే పాకిస్తాన్ ఇందులో బాహ్యశక్తుల జోక్యం కోరుకుంటోంది. తద్వారా పాకిస్తాన్‌ ఆర్థికపరమైన ప్రయోజనాలే కాకుండా వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా ఆశిస్తోంది. కానీ, అదే సమయంలో బలూచ్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు, వాటిని పరిష్కరించే ప్రయత్నాలూ జరగడం లేదు. అందువల్ల ఈ సంఘర్షణ ఇంకా తీవ్రమవుతోంది. ఇది పాకిస్తాన్‌కు కూడా ఆందోళన కలిగించే అంశమే" అని అన్నారు.

పాకిస్తానీ రచయిత్రి, రక్షణ వ్యవహారాల నిపుణురాలు ఆయేషా సిద్దిఖా మాట్లాడుతూ, "బలూచిస్తాన్‌ దాడులను ఒక హెచ్చరికగా చూడొచ్చు. విదేశీ పెట్టుబడులను అక్కడి ప్రజలు స్వాగతించడం లేదు. మరోవైపు, పాకిస్తాన్ అక్కడి ఉద్రిక్తతలను తగ్గించి, ఆ ప్రాంతంపై నియంత్రణ కొనసాగించాలని అమెరికా కోరుకుంటోంది" అన్నారు.

బలూచిస్తాన్‌ను నియంత్రించడంలో పాకిస్తాన్ సైన్యం విఫలమైందా? అని అడిగినప్పుడు, ఆయేషా సిద్ధిఖా స్పందిస్తూ.. పాకిస్తాన్ ఇంకా తన పూర్తి సైన్యాన్ని అటువైపు మోహరించలేదు. కాబట్టి పాకిస్తాన్ నియంత్రణ నుంచి బలూచిస్తాన్ చేజారిపోబోతోందని చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు.

బలూచిస్తాన్ ప్రావిన్స్, దాడులు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ ఆరోపణలు.. స్పందించిన భారత్

బలూచిస్తాన్‌లో హింసాత్మక వాతావరణంలో భారత ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. జనవరి 31న క్వెట్టాలో బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫ్‌రాజ్ బుగ్తీతో కలిసి పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

''ఈ దాడుల వెనుక భారత హస్తం ఉంది. ఈ టెర్రరిస్టులతో కలిసి ఈ దాడులకు భారత్‌నే ప్రణాళికలు రచించిందని నేను గట్టి నమ్మకంతో చెప్పగలను'' అని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నఖ్వీ అన్నారు.

''టెర్రరిజానికి వెనుకాలనున్న ప్రధాన దేశం భారత్ అని ఈ సమయంలో ప్రపంచం తెలుసుకోవడం చాలా ముఖ్యం. టెర్రరిస్టులకు కేవలం ఆర్థిక సాయం చేయడమే కాదు, వారి ప్రణాళికలు, వ్యూహాల్లో కూడా మద్దతు ఇస్తుంది'' అని నఖ్వీ ఆరోపించారు.

ఈ దాడులను '' ఇండియన్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్'' (భారత్ మద్దతుతో నడిచే సంస్థ) చేపట్టిందని పాకిస్తాన్ సాయుధ దళాలకు చెందిన అధికారిక మీడియా, పబ్లిక్ రిలేషన్స్ వింగ్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) ఆరోపించింది. పాకిస్తాన్ సైన్యం దీన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని పిలుస్తుందని పేర్కొంది.

పాకిస్తాన్ ఆరోపణలను భారత్ కొట్టివేసింది. తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే పాకిస్తాన్ దీర్ఘకాలికంగా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.

''హింసాత్మక ఘటనలు జరిగిన ప్రతిసారీ ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు చేయడానికి బదులుగా, ఆ ప్రాంతంలో ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చడంపై దృష్టిపెట్టాలి. ఆ ప్రాంతంలో అణచివేత, క్రూరత్వం, మానవ హక్కుల ఉల్లంఘన చరిత్ర అందరికీ తెలిసిందే'' అని పేర్కొన్నారు.

చైనా, బలూచిస్తాన్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బలూచిస్తాన్‌

చైనాకు బలూచిస్తాన్ ఎందుకంత ముఖ్యం?

పాకిస్తాన్‌కు పొరుగు దేశమైన చైనా, బలూచిస్తాన్‌పై చాలా కాలంగా ఆసక్తి చూపుతోంది. అక్కడ చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపడుతోంది.

చైనా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)పై బలూచిస్తాన్‌లో తరచూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

గణనీయమైన లాభాలను ఆర్జించే మైనింగ్ ప్రాజెక్టులను అక్కడ చైనా చేపట్టింది.

ఇటాలియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ పొలిటికల్ స్టడీస్ (ఐఎస్‌పీఐ) వెల్లడించిన వివరాల్లో.. ''పదేళ్ల క్రితమే సీపీఈసీ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్‌లో 62 బిలియన్ డాలర్లను (సుమారు రూ.5,60,678 కోట్లు) చైనా పెట్టుబడిగా పెట్టింది. కానీ, బలూచిస్తాన్‌లో అస్థిరత్వం పెరగడం చైనాకు ఆందోళకర అంశంగా మారింది'' అని పేర్కొంది.

''పాకిస్తాన్‌పై తన పట్టును పెంచుకోవడం కోసం ఇటీవల కాలంలో సీపీఈసీ ద్వారా గణనీయమైన పెట్టుబడులను పెట్టింది చైనా. బలూచిస్తాన్‌లో గ్వాదర్ పోర్టు ద్వారా అరేబియా సముద్రానికి నేరుగా యాక్సస్ పొందడమే చైనా ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా, రోడ్లు, నౌకాశ్రయాలు, ఇతర ప్రాజెక్టులను నిర్మించి.. అక్కడ సరకులను తేలికగా రవాణా చేయాలని భావిస్తుంది'' అని ఈ రిపోర్టు పేర్కొంది.

తన అతిపెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు (బీఆర్‌ఐకు) దీన్ని అనుసంధానించాలని చైనా కోరుకుంటోంది. దీని ద్వారా పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్‌లో కూడా గనుల తవ్వకం, రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ప్రారంభించాలని చూస్తోంది.

అఫ్గానిస్తాన్ మీదుగా సీపీఈసీని మరింత విస్తరించడం కుదురుతుందని, దీని ద్వారా కనెక్టివిటీ మెరుగవుతోందని, భవిష్యత్‌లో ఖనిజ వనరులను అన్వేషించేందుకు వీలవుతుందని చైనా భావిస్తుంది.

3 వేల కిలోమీటర్ల రోడ్డు,రైల్వేలను నిర్మించాలని సీపీఈసీ భావించింది. అయితే, ఆసియా టైమ్స్ కథనం ప్రకారం.. 2025 నాటికి అంచనావేసిన ప్రాజెక్టులో 40 శాతమే పూర్తవుతుందని తెలిసింది.

మిగిలిన పనులు చాలా నిదానంగా సాగుతున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ముఖ్యమైన ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీనిలో గ్వాదర్ ఈస్ట్ బే ఎక్స్‌ప్రెస్ వే, 1,320 మెగావాట్ల హబ్ కోల్ పవర్ ప్రాజెక్టు ఉన్నాయి.

''బలూచిస్తాన్‌లో పదేపదే బీఎల్‌ఏ దాడులు జరుగుతుండటంతో.. ప్రధాన సీపీఈసీ ప్రాజెక్టుల పురోగతికి ఆటంకం కలుగుతోంది. సీపీఈసీ అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు గ్వాదర్ పోర్టు దీనివల్ల ఎక్కువగా ప్రభావితమవుతోంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారడంతో, సీపీఈసీ నిధులతో నిర్మించిన గ్వాదర్‌లో కొత్త విమానాశ్రయం ప్రారంభోత్సవం ఆన్‌లైన్‌లో జరిగింది. ప్రాణపాయం ఉండటంతో కనీసం సీనియర్ అధికారులు కూడా అక్కడికి వెళ్లేందుకు సాహసించలేదు'' అని ఐఎస్‌పీఐ రిపోర్టు పేర్కొంది.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన బ్లాగ్‌లో, ''బలూచిస్తాన్‌లో పెరుగుతోన్న ఉద్రిక్తతలు, యాంటీ-చైనా సెంటిమెంట్‌తో.. ఈ విషయంపై పాకిస్తాన్, చైనాలు చాలా వివేకంతో వ్యూహరచన చేయాల్సి ఉంది. సైన్యాన్ని ప్రయోగించడం పరిష్కారం కాదు. బదులుగా, స్థానిక ప్రజలతో చర్చలు జరపాలి. వారి సమస్యలేంటో వినాలి, వాటిని నిజాయితీగా పరిష్కరించాలి. ఈ అభివృద్ధి నుంచి ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలి'' అని సూచించింది.

''ఒకవేళ అలా జరగకపోతే, ఇది ఇరు దేశాల అభివృద్ధికి ప్రతీకగా కాకుండా.. సంఘర్షణలు, వివాదాలకు కేంద్ర బిందువుగా సీపీఈసీ నిలుస్తుంది. పాకిస్తాన్-చైనా సంబంధాలను ఇది దెబ్బతీస్తుంది'' అని రాసింది.

అమెరికా, చైనా, బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

బలూచిస్తాన్‌పై అమెరికాకు ఎందుకు ఆసక్తి?

బలూచిస్తాన్‌లో ఆందోళనలు చెలరేగడం అమెరికాకు కూడా ఆందోళనకరంగా మారింది. ఇటీవల కాలంలో, బలూచిస్తాన్‌లోని ఖనిజాలపై అమెరికాకు కూడా ఆసక్తి పెరిగింది.

2025 సెప్టెంబర్‌లో ప్రచురితమైన రిస్క్ ఇంటెలిజెన్స్ రిపోర్టులో.. ''బలూచిస్తాన్‌పై అమెరికాకు ఆసక్తి పెరిగింది. యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ అనే అమెరికా కంపెనీకి పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కింద బలూచిస్తాన్ క్రిటికల్ మినరల్స్‌లో అమెరికా 500 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది'' అని పేర్కొంది.

ఈ ఒప్పందం కింద 2025 అక్టోబర్‌లో మినరల్స్ తొలి షిప్‌మెంట్‌ అమెరికాకు పంపారు. ఈ ఖనిజాల ఎగుమతుల కోసం.. బలూచిస్తాన్‌లో పాస్ని పోర్టును అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ ప్రతిపాదించింది.

ఖనిజాల ఎగుమతి కోసం ఈ పోర్టు ఒక ప్రత్యేక మార్గాన్ని అందించగలదు. పాకిస్తాన్‌తో కలిసి బలూచిస్తాన్ నుంచి విలువైన ఖనిజాలను వెలికితీస్తూ తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది అమెరికా.

2025 డిసెంబర్‌లో బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌, చగాయ్ జిల్లాలోని రెకో డిక్‌లో గనుల తవ్వకాల ప్రాజెక్టుల కోసం 1.25 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్లు అమెరికా ప్రకటించింది.

''ఈ నిధులు రాబోయే సంవత్సరాల్లో అమెరికా నుంచి 2 బిలియన్ డాలర్ల (రూ.18,096 కోట్ల) విలువైన అత్యంత నాణ్యతతో కూడిన మైనింగ్ మెషినరీని, సర్వీసులను తెప్పించుకునేందుకు సాయపడుతుంది. దీనివల్ల అమెరికాలో కొత్తగా 6 వేల ఉద్యోగాలు, బలూచిస్తాన్‌లో కొత్తగా 7,500 ఉద్యోగాలు వస్తాయి'' అని ఇస్లామాబాద్‌లో అమెరికా చార్జ్ డీ-అఫైర్స్ నటాలీ బేకర్ తెలిపారు.

''ఇటీవల జరుగుతున్న దాడుల సమయాన్ని లోతుగా విశ్లేషించాలి. పాకిస్తాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకుంది. ఇరాన్ కూడా ఈ సమయంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్‌కు చెందిన కొంతభాగం ఇరాన్‌లో కూడా ఉందని బీఎల్ఏ కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకే, కావాలని ఈ సమయాన్ని ఎంపిక చేసుకుని ఉండొచ్చు'' అని ఓపీ జిందాల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అఫైర్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రబనా బారువా చెప్పారు.

''పాకిస్తాన్‌లోని అపారమైన ఖనిజ సంపదపై కన్నేసి పెట్టుబడులు పెడుతున్న అమెరికాలోని వైట్‌హౌస్ అధికారులతో సహా అందరికీ బలూచిస్తాన్‌లో జరుగుతోన్న దాడులు ఒక హెచ్చరిక. ఈ నిక్షేపాల్లో చాలా వరకు బలూచిస్తాన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే దాడులు జరుగుతున్నాయి'' అని వాషింగ్టన్ డీసీకి చెందిన విల్సన్ సెంటర్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మాన్ అన్నారు.

''అమెరికా కంపెనీలకు బలూచిస్తాన్ మంచి మైనింగ్ ప్రాంతమని ట్రంప్‌కు పాకిస్తాన్ తెలిపింది. కానీ, ఇది అబద్ధం. కేవలం చెప్పడం వల్ల అక్కడ శాంతి రాదు, శాంతిని స్థాపించాలి. ఒక పెద్ద మైనింగ్ ప్రాజెక్టును చేపట్టేందుకు పెద్ద ఎత్తున సైన్యం, అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నియంత్రణ మార్గాలు, రాజకీయ హామీలు కావాలి. అవన్నీ పాకిస్తాన్ ప్రభుత్వం అందించలేదు'' అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

''మరోవైపు, ఖనిజాలకు సంపదగా బలూచిస్తాన్‌ను చూపిస్తూ పాకిస్తాన్ దాన్ని అమ్మేస్తోంది. ఆర్మీ ద్వారా నియంత్రిస్తోంది. దీనొక వలస ప్రాంతంగా, ఇంటర్నల్ కాలనీగా పాలిస్తోంది. దీనివల్ల తిరుగుబాటు మరింత పెరుగుతుంది. తాజా దాడులే దీన్ని నిరూపిస్తున్నాయి'' అని బ్రహ్మ చెల్లానీ హెచ్చరించారు.

బలూచిస్తాన్‌పై అమెరికాకు ఉన్న ఆసక్తిని మరో కోణంలో వివరించారు ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్. బలూచిస్తాన్‌లో పెరుగుతోన్న దాడుల వల్ల, అమెరికాకు, చైనాకు ఆర్థిక ఎదురుదెబ్బలు కావొచ్చని అన్నారు.

''ఈ ప్రాంతంలో ఆర్థిక ప్రయోజనాలకు మించి అమెరికా చూస్తోంది. సంఘర్షణ ప్రాంతాల్లో తన ఉనికిని చాటాలని నిరంతరం చూస్తుంది. బలూచిస్తాన్‌లో చైనా పూర్తిగా ఎలాంటి జోక్యం చేసుకోకుండా చూస్తోంది'' అని వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)