ఉత్తర కాశీ సొరంగాన్ని ఇప్పుడేం చేస్తారు... పనులు కొనసాగించడంలో ఎదురయ్యే సవాళ్ళేంటి?

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
ఈ కార్మికుల ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని వైద్యులు చెప్పారు. కానీ, రిషికేశ్‌లో ప్రాథమిక చికిత్స తర్వాత, వీరిని ఎయిమ్స్‌కి తరలించారు.
వీరు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు చెప్పిన తర్వాత, కార్మికులను వారి ఇళ్లకు పంపించనున్నారు.
ప్రస్తుతం ఈ సొరంగ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటన్నది తెలుసుకునేందుకు దీంతో సంబంధం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను బీబీసీ సంప్రదించింది.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
చార్‌ధామ్ ప్రాజెక్ట్‌కు చెందిన ఈ సొరంగ పరిస్థితేంటి?
కేంద్ర ప్రభుత్వపు ప్రతిష్టాత్మక చార్‌ధామ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉత్తరకాశీలో ఈ సొరంగాన్ని నిర్మాణ పనులు చేపట్టారు. దీని ద్వారా, ప్రతి సీజన్‌లో యాత్రికులు యమునోత్రికి వెళ్లడానికి వీలుకలుగుతుంది.
సిల్క్యారా-బార్కోట్ మధ్యలో రాడి పర్వతానికి రంధ్రం చేయడం ద్వారా నాలుగున్నర కిలోమీటర్ల పొడవుతో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సొరంగంతో ధరాసు, యమునోత్రి మధ్యలో ప్రయాణ సమయంలో గంట తగ్గుతుంది. జాతీయ రహదారి 134 పైనున్న రెండు వరుసల రహదారి చార్‌ధామ్ ప్రాజెక్ట్‌కు ఎంతో ముఖ్యమైంది.

సొరంగాన్ని నిర్మించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) జనరల్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ చెప్పారు.
‘‘యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించనున్నాం. ఇదంత పెద్ద సమస్య కాదు. సొరంగం నిర్మించేందుకు అవసరమైన నిబంధనలను అనుసరిస్తూ దీన్ని చేపట్టనున్నాం. కేవలం 485 మీటర్లను మాత్రమే తవ్వాల్సి ఉంది. ఐదు నుంచి ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని అనుకుంటున్నాం’’ అని ఆయన తెలిపారు.
కానీ, సొరంగ నిర్మాణం చేపట్టేందుకు ఇంజనీర్లు ముందున్న తొలి సవాలు ఏంటంటే.. నవంబర్ 12న సొరంగం ప్రమాదం జరిగినప్పుడు కూలిన శిథిలాలను పూర్తిగా తొలగించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
శిథిలాలను ఎలా తొలగిస్తారు?
ఈ నాలుగున్నర కి.మీల పొడవైన సొరంగంలో ప్రమాదం జరిగినప్పుడు, 60 మీటర్ల ప్రాంతం వరకు శిథిలాలు కూలాయి. ఈ శిథిలాలలో పర్వతాల మట్టి, రాళ్లు, ఐరన్ రాడ్లు ఉన్నాయి.
ప్రస్తుతం సొరంగాన్ని నిర్మించేందుకు ఇంజినీర్లు శిథిలాలను పూర్తిగా తొలగించాల్సి ఉంది.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చూస్తున్న ప్రభుత్వ కంపెనీ జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ సందీప్ సుధేరాతో బీబీసీ మాట్లాడింది.
‘‘శిథిలాలు 60 మీటర్లకు పైగా విస్తరించాయి. తొలుత మేం సొరంగం కూలడం ద్వారా ఏర్పడిన ఖాళీని పూరించాల్సి ఉంది. దీనికొక నిర్దేశిత విధానం ఉంది. దానికింద పని చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. సొరంగ ప్రాంతాన్ని స్థిరంగా మార్చేందుకు పై నుంచి కిందకి శిథిలాలను తొలగిస్తూ మెల్లగా పనులు చేపట్టాల్సి ఉంటుంది’’ అని సుధేరా తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయి?
రెస్క్యూ ఆపరేషన్ ముగియడంతో, సొరంగం బయట అంతకుముందున్న హడావుడి ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రస్తుతం అక్కడికి వెళ్లే ప్రజల సంఖ్య బాగా తగ్గిపోతుంది. కేవలం ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్నవారు మాత్రమే అక్కడున్నారు.
ఈ సమయంలో సొరంగాన్ని నిర్మించే ఇంజనీర్లు శిథిలాల తొలగింపు ప్రక్రియను ఎప్పుడు చేపడతారనే ప్రశ్న వినిపిస్తోంది.
‘‘ఒక రోజు లేదా రెండు రోజులు బ్రేక్ తీసుకుంటాం. ఎందుకంటే గత 17 నుంచి 18 రోజులుగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన వారందరూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెండు రోజుల విరామం తర్వాత శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపడతాం’’ అని తెలిపారు.
అయితే, సొరంగ నిర్మాణంలో ముందస్తు జాగ్రత్తలు అన్ని తీసుకున్నారా లేదా? అనే ప్రశ్నలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
శిథిలాల తొలగింపుకు, తదుపరి నిర్మాణ పనులకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారని కల్నల్ సుధేరాను బీబీసీ ప్రశ్నించింది.
‘‘అన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే మేం తదుపరి పనులను చేపడతాం. తొలుత ఈ ప్రాంతంలో సమతుల్యతను కలిగి ఉండాలి. పర్వతం, సొరంగానికి సంబంధించిన ప్రతి దానిలో సమతుల్యతను పొందడం అత్యంత ముఖ్యం. ఆ తర్వాతనే తదుపరి పనులు ప్రారంభించాలి’’ అని కల్నల్ సుధేరా చెప్పారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
సొరంగం ఎప్పుడు పూర్తవుతుంది?
2018లో సిల్క్యారా-బార్కోట్ సొరంగం నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 111.69 కోట్లు అని వెల్లడించింది. నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తారని తెలిపింది.
సొరంగంలో 483 మీటర్ల ప్రాంతాన్ని తవ్వాల్సి ఉంది. తొలుత శిథిలాలను తొలగించాలి. ఆ తర్వాత మిగిలిన 483 మీటర్ల తవ్వకాల పనులను పూర్తి చేయాలి.
తవ్వకం పనులు పూర్తయిన తర్వాత, సొరంగంలో ఎలక్ట్రిక్ వైర్ల ఏర్పాటుతో పాటు లైనింగ్ వంటి పనులు జరుగుతాయి.
‘‘ప్రమాదం వల్ల సొరంగ పనులు ఆగిపోయాయి అన్నది నిజమే. ప్రస్తుతం మేం చాలా జాగ్రత్తతో ఈ పనులు చేపట్టనున్నాం. వచ్చే కొన్ని నెలల్లో సొరంగ తవ్వక పనులు పూర్తి చేయాల్సి ఉంది. సొరంగంలోకి కరెంట్ పంపిన తర్వాత, వెంటిలేషన్ ఫ్యాన్స్ వంటి మెషిన్లను ఏర్పాటు చేస్తాం. ప్రాజెక్టు వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నాం’’ అని కల్నల్ సుధేరా చెప్పారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
ఎమర్జెన్సీ డోర్లు పెడతారా?
సొరంగ నిర్మాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఉండాల్సిన ఎమర్జెన్సీ డోర్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఈ ప్రమాదం తర్వాత పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇదే విషయాన్ని కల్నల్ సుధేరాను బీబీసీ ప్రశ్నించింది. సొరంగ పనులు పూర్తయిన తర్వాతే ఎమర్జెన్సీ డోర్లను ఏర్పాటు చేస్తారని కల్నల్ సుధేరా చెప్పారు.
‘‘సొరంగంలో ఎమర్జెన్సీ డోర్లు అగ్నిప్రమాదం వంటి ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేస్తారు. సొరంగ తవ్వక పనులు పూర్తయిన తర్వాత ఈ డోర్లను పెడతారు. ఒక మార్గంలో అగ్నిప్రమాదం లాంటిది జరిగితే, గోడకు ఉన్న ఎమర్జెన్సీ డోర్ల ద్వారా ఇతర మార్గం గుండా సురక్షితంగా బయటికి రావొచ్చు’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- యానిమల్ రన్ టైమ్ 3.21 గంటలు... సినిమా చరిత్రలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలేంటి, ఇప్పుడీ ట్రెండ్‌కు కారణమేంటి?
- హెన్రీ కిసింజర్ (1923-2023): అమెరికా విదేశాంగ విధానంపై చెరగని ముద్ర వేసిన నేత
- దియా మీర్జా: ‘కొందరు మగ అహంకారులే పర్యావరణానికి అతిపెద్ద సమస్య’
- నవయుగ: హిమాచల్‌లో ప్రమాదం జరిగిన సొరంగాన్ని నిర్మిస్తోన్న ఈ హైదరాబాద్ కంపెనీపై వివాదాలేంటి?
- ఆంధ్రప్రదేశ్: ఇప్పటం గ్రామం ఇప్పుడెలా ఉంది, కూల్చేసిన చోట ఏం చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














