తండ్రికి అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుంటే.. 'ఆయన ఆటోలో నుంచి దిగి నడుచుకుంటూ వచ్చారు', కుటుంబ సభ్యులు షాక్

- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
తండ్రి చనిపోయాడనుకుని కుమారులు అంత్యక్రియలకు అంతా సిద్ధం చేశారు. ఇంతలో ఆ తండ్రి నడుచుకుంటూ ఎదురొచ్చిన ఘటన తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగింది.
దీంతో, దహన సంస్కారాల కోసం సిద్ధం చేసిన మృతదేహాన్ని కోయంబత్తూరులోని ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అప్పగించారు.
ఇద్దరూ దాదాపుగా ఒకేలా ఉండడంతో ఈ గందరగోళం తలెత్తిందని చనిపోయినట్లు భావిస్తున్న వ్యక్తి కుమారుడి కుటుంబ సభ్యులు చెప్పారు.
అయితే, దహన సంస్కారాలకు సిద్ధమైన ఆ మృతదేహం ఎవరిదన్నది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
ఇది కావాలని చేసింది కాదు కాబట్టి.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ఒకవేళ అంత్యక్రియలు జరిగి ఉంటే న్యాయసలహా మేరకు, చర్యలు తీసుకుని ఉండేవారమని కొత్తూరు ఇన్‌స్పెక్టర్ జగదీశన్ బీబీసీతో అన్నారు.

అసలేం జరిగిందంటే..
గత శనివారం నుంచి తన తండ్రి మరుదముత్తు కనిపించకుండా పోవడంతో పొల్లాచ్చిలోని పెత్తనాయకనూర్‌కు చెందిన కాళిదాస్ చాలాచోట్ల వెతికారు.
రోడ్డు పక్కన పడివున్న మరుదముత్తును కొంతమంది అంబులెన్స్‌లో పంపించారని, అయితే ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని కాళిదాస్‌కు సమాచారం తెలిసింది.
మరుదముత్తుకు కాళిదాస్‌తో సహా ముగ్గురు కుమారులు ఉన్నారు. కానీ, ఆయన ఎవరి వద్దా ఉండడంలేదు. కెంగంపాళ్యంలో ఒంటరిగా ఉండేవారని కాళిదాస్ కుటుంబ సభ్యులు తెలిపారు.
మరుదముత్తు తరచుగా కాళిదాస్ ఇంటికి వచ్చివెళ్తుండేవారు, ఆయన కనిపించకుండా పోవడంతో కుమారుడు కాళిదాస్ వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గత ఆదివారం కొత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి కాళిదాస్‌కి ఫోన్ కాల్ వచ్చింది.
స్టేషన్‌కు వెళ్లగా, కాళిదాస్‌కు ఒక ఫోటో చూపించిన పోలీసులు, ఆ ఫోటోలోని వ్యక్తి మరణించారని, ఆయన మృతదేహం కోయంబత్తూరు ఆసుపత్రి మార్చురీలో ఉందని చెప్పారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మరణిస్తే పోలీసులు వారి ఫోటో తీసి, వివిధ పోలీస్ స్టేషన్లకు పంపి, స్టేషన్‌కు వచ్చీపోయే వారికి కనిపించేలా నోటీస్ బోర్డులలో అతికించడం ఆనవాయితీ.
అలా, కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో అతికించిన ఫోటోను చూసిన కొందరు ఆ వ్యక్తి కెంగంపాళ్యంకు చెందిన మరుదముత్తు అని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆయన కుమారుడు కాళిదాస్‌ను పిలిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
మృతదేహాన్ని తీసుకోవడానికి అవసరమైన పత్రాలను పోలీసుల నుంచి తీసుకున్న కాళిదాస్ కుటుంబం, సోమవారం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది.
అక్కడ అన్ని పత్రాలను అప్పగించి, మృతదేహాన్ని నాయకనూర్‌కు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
"మా మావయ్య చనిపోయారని తెలిసి చివరిచూపు కోసం పొల్లాచ్చి నుంచి వస్తున్న మా బంధువొకరు.. సమత్తూర్ దగ్గర మా మామగారు నడుచుకుంటూ వెళుతుండడం చూసి షాకయ్యారు. ఆయన వెంటనే వీడియో తీసి మాకు పంపించారు. అది చూశాక కూడా మాకు నమ్మకం కలగలేదు. కానీ, ఆయన మా మామగారిని ఆటోలో ఇంటికి తీసుకొచ్చారు" అని కాళిదాస్ భార్య వైదేహి అన్నారు.
"అయన ఇంటికొచ్చే వరకు కూడా మేం మా బంధువు మాట నమ్మలేదు. ఆయన నడుచుకుంటూ రావడం చూసి మేం షాకయ్యాం. నిజానికి, నా భర్త కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. మా మామగారి ఫోటో ఇచ్చి కొత్తూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐస్‌బాక్స్‌లో ఉన్న మృతదేహాన్ని చూసినప్పుడు, చనిపోయి 3 రోజులు కావడం వల్ల ఆయన ముఖం మారిపోయిందని అన్నారు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా వేరేగా ఉన్నాయని అడిగినప్పుడు, మురికిగా ఉండడంతో మార్చేసి ఉంటారని చెప్పారు. దీంతో, నా భర్త నమ్మారు" అని వైదేహి చెప్పారు.
రోడ్డుపై పడిపోయిన మరుదముత్తును అంబులెన్స్‌లో తీసుకెళ్లి పొల్లాచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, కాస్త కుదుటపడిన తర్వాత ఆయన ఇంటికి రాకుండా బంధువుల ఇంటికి వెళ్లారు.
ఆయన దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్న విషయం ఆయనకు తెలియదని, ఆయన ఎక్కడున్నారనేది కుటుంబ సభ్యలకూ తెలియలేదని పోలీసులు తెలిపారు.
మరుదముత్తుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయనను సంప్రదించడం సాధ్యపడలేదు.
"నేను మానసికంగా ఒత్తిడిలో ఉన్నాను. నేనిప్పుడేమీ మాట్లాడలేను" అని ఆయన కుమారుడు కాళిదాస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మృతదేహాన్ని దహనం చేసి ఉంటే ఏమయ్యేది?
మరణించిన వ్యక్తి మరుదముత్తు కాదని తెలిసిన తర్వాత, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు బాడీని కోయంబత్తూరు ఈఎస్ఐ ఆసుపత్రికి అప్పగించారు.
"ఇందులో పోలీసుల తప్పేమీ లేదు. ఇది మా నాన్న మృతదేహమే అని ఆయన కుమారులు ధ్రువీకరించిన తర్వాతే మృతదేహాన్ని అప్పగించేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేశాం. అది వాళ్ల నాన్న మృతదేహం కాదని మాకు తెలియగానే, దానిని గుర్తుతెలియని మృతదేహంగా నమోదు చేసి తిరిగి ఆసుపత్రికి అప్పగించాం" అని కొత్తూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ జగదీశన్ బీబీసీతో చెప్పారు.
'ఈ బాడీని గుర్తుతెలియని వ్యక్తిదిగా నమోదు చేసి మార్చి 9వ తేదీ సాయంత్రం, 7 గంటల తర్వాత కొత్తూర్ పోలీసులు ఇక్కడికి పంపించారు. ఈరోజు పోస్ట్‌మార్టం జరిగింది. ఇలాంటి గుర్తుతెలియని మృతదేహాలను వారం లేదా రెండు వారాలు భద్రపరుస్తాం. తర్వాత పోస్ట్‌మార్టం చేసి పోలీసులకు అప్పగిస్తాం' అని కోయంబత్తూరులోని ఈఎస్ఐ హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ మణివన్నన్ తెలిపారు.
అయితే, ఆ మృతదేహం ఎవరిదన్నది ఇంకా తెలియలేదు. దీంతో రోడ్డుపక్కన జీవించే బిచ్చగాడి మృతదేహం అయిఉండొచ్చని పోలీసులు అంటున్నారు.
మరుదముత్తు కుటుంబం దానిని తమ తండ్రి శరీరమని భావించి దహనం చేసి ఉంటే, ఈ విషయంలో చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునేవారన్న ప్రశ్న తలెత్తింది.
"అదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే, పోలీసులు న్యాయ సలహా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుని ఉండేవారు. ఇద్దరూ ఒకేలా ఉండడం వల్ల ఈ గందరగోళం తలెత్తింది" అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ జగదీశన్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













