మన ఇంటి పేర్లు ఎలా వచ్చాయి? అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా?

ఇంటిపేరు క్రమం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

కత్తి, కంచె, కడియం, గోరటి, భూక్యా, పాయం, మోత్కుపల్లి, మందుల, నారా, వైఎస్, కల్వకుంట్ల, కొణిదెల, అక్కినేని, దగ్గుబాటి... చాలామంది తెలుగువారికి తెలిసిన ఇంటిపేర్లు ఇవి.

మీ పేరేంటి అని అడగ్గానే కొందరు తమ ఇంటిపేరుతో సహా చెబుతుంటారు.

భారత్‌లో ఇంటిపేరు అనేది ఒక వ్యక్తి చరిత్ర, ప్రాంతం, వంశ క్రమానికి అధికారిక ముద్ర వంటిదని చరిత్రకారులు అంటున్నారు.

అసలు ఇంటిపేరు ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది? వ్యక్తి పేరు పక్కన ఎప్పుడు వచ్చి చేరింది? దీని వెనుక ఉన్న చారిత్రక, పరిపాలనా పరమైన కారణాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సర్ నేమ్ అంటే ఏంటి?

ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఉమ్మడిగా కలిగి ఉండే పేరునే ఇంటిపేరుగా పిలుస్తారని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ నిర్వచించింది. దీన్నే ఇంగ్లిష్‌లో సర్ నేమ్ లేదా ఫ్యామిలీ నేమ్ అని పిలుస్తారు.

ఒక వ్యక్తి అసలు పేరుకు అదనంగా పిలిచే పేరే సర్ నేమ్. ఇది ఆ వ్యక్తి కుటుంబాన్ని లేదా వంశాన్ని సూచిస్తుంది.

ఇంటిపేరు

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రాచీన కాలంలో గోత్రమే అసలైన గుర్తింపు’

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ప్రాచీన కాలంలో వ్యక్తుల గుర్తింపును గోత్రం, ప్రవరలతో గుర్తించేవారని టీటీడీ రిటైర్డ్ హెడ్మాస్టర్, చరిత్రకారులు ఎస్.కృష్ణారెడ్డి చెప్పారు.

మధ్యయుగ కాలంలో దిల్లీ సుల్తానులు, మొఘల్ వంటి రాజవంశాలు పరిపాలనా సౌలభ్యం కోసం వ్యక్తులకు వృత్తులను బట్టి గుర్తింపునిచ్చేవని ఆయన చెప్పారు.

'పూర్వం రుషులు, రాజులకు ఇంటిపేర్లు ఉండకపోయేవి. కానీ, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండేవి. వారు చేసిన గొప్ప పనులు, విశిష్ట గుణాలను, వారి కుటుంబ క్రమాన్ని తెలిపే పేర్లతో వాళ్లను పిలిచేవారు. ఇప్పటికీ మనం వాళ్లను అలాగే పిలుస్తుంటాం. తర్వాతి కాలాల్లో వృత్తులు, చేసే పనులను బట్టి కమ్మరి, కుమ్మరి, మజుందార్, పటేల్, దేశ్‌ముఖ్ వంటి ఇంటిపేర్లు వచ్చాయి' అని కృష్ణారెడ్డి అన్నారు.

తెలుగు వారికి ఎప్పుడు ఇంటిపేరు వచ్చింది?

తెలుగు ప్రజలకు 8, 9వ శతాబ్దాల నుంచే ఇంటిపేర్లు ఉన్నాయని ఆధారాలు ఉన్నప్పటికీ, అవి శాసనాల్లో (Inscriptions) మాత్రం 14వ శతాబ్దం వరకు కనిపించవని 'హిస్టరీ ఆఫ్ రెడ్డీ కింగ్‌డమ్స్' పుస్తకంలో రచయిత మల్లంపల్లి సోమశేఖర శర్మ పేర్కొన్నారు.

"ఇంటి పేర్లున్నప్పటికీ శాసనాలపై కేవలం గోత్రం, వేదం, తండ్రి పేరుతోనే రాసేవారు. కానీ, ముఖ్యంగా 14వ శతాబ్దం నాటికి, శాసనాల్లో 'ఇంటిపేరు' చేర్చడం ఒక పద్ధతిగా మారింది. ఆ కాలంలోని బ్రాహ్మణులకు వారు నివసించే గ్రామాల పేర్లే ఇంటిపేర్లుగా మారాయి" అని పుస్తకంలో ప్రస్తావించారు.

కాలక్రమంలో వ్యక్తులు నివసించే ప్రాంతంతో పాటు వృత్తి, బిరుదులు, హోదాలు వంటి ఇతర అంశాలు వ్యక్తి గుర్తింపుగా మారాయని, తర్వాత ఇవే ఇంటిపేరుగా మారాయని చరిత్రకారుడు కృష్ణారెడ్డి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో తండ్రి పేరును కూడా ఇంటిపేరుగా భావిస్తుంటారని చెప్పారు.

మరి అధికారిక గుర్తింపు పత్రాల్లో ఇంటిపేరు వాడటం ఎప్పటి నుంచి మొదలైంది?

ఇంటిపేర్లు మన సంస్కృతిలో భాగమైనప్పటికీ, వాటిని ఒక చట్టబద్ధమైన, పరిపాలనాపరమైన గుర్తింపుగా మార్చింది మాత్రం బ్రిటిష్ వారని హైదరాబాద్‌కు చెందిన చరిత్రకారుడు పరవస్తు లోకేశ్వర్ అభిప్రాయపడ్డారు.

ఇంటిపేరు చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

'సర్ నేమ్'‌గా అధికారిక గుర్తింపు...

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన పత్రాల్లో, విద్యా సంబంధిత డాక్యుమెంట్లలో ఫస్ట్ నేమ్ (వ్యక్తి పేరు), సర్ నేమ్ (ఇంటిపేరు) అనే కాలమ్స్ ఉంటాయి. చాలా చోట్లా ఈ రెండూ రాయాల్సి ఉంటుంది.

ఒకవేళ ఇంటిపేరు మార్చుకోవాలంటే అధికారికంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.

దేశంలో మనం ఇప్పుడు వాడుతున్న 'సర్ నేమ్'.. అంటే ఇంటిపేరు పద్ధతికి బలమైన పునాది వేసింది బ్రిటిష్ వారని 1871 నాటి మొదటి జనగణన చూపుతోంది.

దేశంలోని ప్రజల వయస్సు, కులం, మతం, వృత్తి, విద్య గణాంకాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగా 1871-72‌లో తొలి జనగణన నిర్వహించారు.

జనగణన సందర్భంగా ఒకే గ్రామంలో ఒకే కులం, ఒకే పేరు గల వ్యక్తుల నమోదులో గందరగోళం తలెత్తకుండా ఎన్యుమరేటర్లకు కొన్ని సూచనలు చేసినట్లు మెమురండమ్ ఆన్ ది సెన్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా 1871-72 నివేదికలో పేర్కొన్నారు.

"ఫారమ్‌లో 'నేమ్ కాలమ్‌'తో పాటు ఆ వ్యక్తిని గుర్తించే ఇతర వివరాలను సేకరించాలి. జనాభా గణన ఫార్మాట్ ప్రకారం, వ్యక్తుల పేర్లను రాసేటప్పుడు కేవలం పేరు రాయకుండా, వారిని ఇతరుల నుంచి వేరు చేసే Distinctive Title (ప్రత్యేక గుర్తింపు) ఉండాలని ఎన్యుమరేటర్లకు ఇచ్చిన సూచనల్లో పేర్కొన్నట్లు" ఆ నివేదికలో ప్రస్తావించారు.

'బ్రిటిష్ వారు ఇంటిపేర్లను సృష్టించలేదు. ప్రాచీన కాలం నుంచే ఇంటిపేర్లు మనుగడలో ఉన్నాయి. కానీ, మన వాడుకలో ఉన్న పేర్లకు.. జనాభా గణన, రెవెన్యూ పత్రాల ద్వారా ఒక చట్టబద్ధమైన, అధికారిక హోదాను కల్పించారు. ఆనాడు వారు రిజిస్టర్లలో ఏ పేరును సర్‌నేమ్‌ కాలమ్‌లో రాశారో నేడు అదే మన ఆధార్, పాస్‌పోర్ట్ వంటి పత్రాల్లో కొనసాగుతోంది' అని చరిత్రకారుడు రామోజు హరగోపాల్ అన్నారు.

మరో చరిత్రకారుడు పరవస్తు లోకేశ్వర్ కూడా ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.

'బ్రిటిషర్ల చర్యతో అప్పటివరకు మౌఖికంగా వాడుకలో ఉన్న ఇంటిపేర్లు కాస్తా, రికార్డుల్లోకి ఎక్కి శాశ్వత ఇంటిపేర్లుగా మారిపోయాయని' పరవస్తు లోకేశ్వర్ అంటున్నారు.

'మద్రాస్ ప్రెసిడెన్సీ (ఆంధ్ర ప్రాంతం)లో భూమి రికార్డులను నమోదు చేసేటప్పుడు, తండ్రి పేరుతో పాటు ఇంటిపేరు నమోదు చేయడం తప్పనిసరి చేశారు. ఇప్పటికీ అధికారిక రిజిస్టర్లలో ఈ పద్ధతిని మనం గమనించవచ్చు' అని కృష్ణారెడ్డి చెప్పారు.

తేళ్ల సత్యవతి రాసిన పుస్తకంలోని ఇంటిపేర్ల వర్గీకరణ

ఫొటో సోర్స్, Screenshot/archive.org

ఫొటో క్యాప్షన్, ఇంటిపేర్ల వర్గీకరణ చిత్రం

ఇనీషియల్ కథేంటి...

పాశ్చాత్య దేశాల్లో ఇంటిపేరు చివరన ఉంటుంది. అంటే, వ్యక్తి పేరు తర్వాత ఇంటిపేరు రాస్తారు.

తెలుగు సంప్రదాయంలో ఇంటిపేరు మొదట వస్తుంది. ఇంటిపేరులోని తొలి ఆంగ్ల అక్షరం ఇనీషియల్‌గా వాడుకలోకి వచ్చింది. మరి దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి ఇంటిపేర్లు ఉంటాయా?

'తమిళులకు సాధారణంగా ఇంటిపేర్లు కనిపించవు. వీరు తమ పేరు పక్కన తండ్రి పేరును రాసుకుంటారు. కేరళలో ఒకప్పుడు తల్లి ఇంటిపేరును వ్యక్తి పేరుకు ముందు పెట్టుకునే సంప్రదాయం ఉండేది' అని కృష్ణారెడ్డి చెప్పారు.

ఉత్తర భారతంలో ఇంటిపేర్లన్నీ దాదాపు వృత్తిపరమైనవేనని తెలుగువారి ఇంటి పేర్లు అనే పుస్తకంలో రచయిత తేళ్ల సత్యవతి పేర్కొన్నారు.

'తెలుగు సాహిత్యంలో కనిపించే ఇంటిపేర్లను 1. మూలపురుషుల పేర్లతో ఏర్పడినవి, 2. తల్లిదండ్రుల పేర్లతో సంబంధం ఉండేవి, 3. గ్రామ నామాలు, 4. బిరుదులు, 5. వృత్తులు, 6. జన విరుక్తులు, 7 మార్పులు అని ఏడు భాగాలుగా విభజించవచ్చు' అని పుస్తకంలో ఆమె పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)