You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాల్పుల విరమణ తర్వాత హార్ముజ్‌లో పరిస్థితి ఏంటి, నౌకల రాకపోకలపై ఎంత ప్రభావం చూపుతుంది?
- రచయిత, టామ్ ఎడింగ్టన్, జోషువా చీతమ్, కేలిన్ డెవ్లిన్
- హోదా, బీబీసీ వెరిఫై
- చదివే సమయం: 5 నిమిషాలు
అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నించే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని గల్ఫ్ ప్రాంతంలోని నౌకలకు ఇరాన్ నేవీ హెచ్చరికలు జారీ చేసింది.
షిప్పింగ్ బ్రోకరేజ్ సంస్థ ఎస్ఎస్‌వై ఈ విషయాన్ని బీబీసీ వెరిఫైకి ధ్రువీకరించింది.
ఇరుకైన జలమార్గంలో నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వాలనే షరతుపై మంగళవారం సాయంత్రం రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించారు.
ఆ ఒప్పందం తర్వాత కూడా ఇప్పటివరకు చాలా తక్కువ నౌకలే ఆ మార్గంలో ప్రయాణించగలిగాయి.
హార్ముజ్ జలసంధి ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణకు కేంద్రంగా మారింది.
ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన దీన్ని ఇరాన్ ప్రభావవంతంగా అడ్డగించింది.
ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ సరఫరాలలో సుమారు 20 శాతం ఈ మార్గంలోనే వెళ్తుంది.
గడచిన ఐదు వారాలుగా హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసింది.
దీనివల్ల చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. అలాగే అంతర్జాతీయ సరఫరా గొలుసు ఈ జలసంధిపై ఎంతగా ఆధారపడి ఉందో కూడా స్పష్టమైంది.
ఎనర్జీతో పాటు, మైక్రోచిప్‌లు, మందులు, ఎరువులు వంటి ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే రసాయనాల రవాణాకూ ఈ మార్గం ముఖ్యమైంది.
షిప్పింగ్ నిపుణులు ఏమంటున్నారు
కాల్పుల విరమణ వార్త తర్వాత చమురు ధరలు తగ్గినప్పటికీ, ప్రస్తుతానికి ఈ మార్గంలో నౌకల రాకపోకలు చాలా పరిమితంగానే ఉంటాయని షిప్పింగ్ నిపుణులు చెబుతున్నారు.
"ఈ మార్గంలో ప్రయాణించడానికి ఉన్న షరతులు ఏంటి, వారికి ఎలాంటి భద్రతా హామీలు లభిస్తాయి అనే విషయాలు చాలా షిప్పింగ్ కంపెనీలు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాయి. కానీ ఈ సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు" అని వెస్పుచీ మారిటైమ్‌కు చెందిన లార్స్ జాన్సన్ బీబీసీ అన్నారు.
ఏప్రిల్ 8న భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు, కేవలం మూడు విమాన వాహక నౌకలు.. ఎన్జీ ఎర్త్, డేటోనా బీచ్, హై లాంగ్ 1 మాత్రమే హార్ముజ్ జలసంధిని దాటగలిగాయి.
మెరైన్ ట్రాఫిక్ షిప్ ట్రాకింగ్ డేటాను ఉపయోగించి బీబీసీ వెరిఫై చేసిన విశ్లేషణ ఆధారంగా ఈ సమాచారం తెలిసింది.
అయితే ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభం కావడానికి ఈ జలసంధి మీదుగా ప్రతిరోజూ సగటున 138 నౌకలు ప్రయాణించేవి.
బుధవారం ఇక్కడ నుంచి ఓడలు వెళ్లడంలో కాల్పుల విరమణ కీలక పాత్ర పోషించిందా లేదా అవి తమ ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకున్నాయా అనేది స్పష్టంగా తెలియదు.
"ఇది కాల్పుల విరమణ కారణంగా భారీస్థాయి రాకపోకలు పునఃప్రారంభం కావడానికి సంకేతమా లేక ఇప్పటికే మంజూరు చేసిన ఏదైనా ప్రత్యేక అనుమతి ఫలితమా అని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది" అని షిప్పింగ్ విశ్లేషణా సంస్థ క్లెప్లర్‌కు చెందిన అనా సుబాసిక్ అన్నారు.
"ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పేమీ రాలేదు. నౌకల సిబ్బంది ఉన్నామని సురక్షితంగా భావించడానికి సమయం పడుతుంది" అని నిపుణులు లార్స్ జెన్సన్ అన్నారు.
లాయిడ్స్ లిట్ ప్రధాన సంపాదకుడైన రిచర్డ్ మీడ్ కూడా ఈ అంచనాతో ఏకీభవిస్తున్నారు.
నౌకల యజమానులకు ఇది అత్యంత ప్రమాదకరమైన సమయమని, ఎందుకంటే వారు ఇప్పటికీ తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు.
‘హార్ముజ్ జలసంధి ఇప్పటికీ ప్రధానంగా ఇరాన్ నియంత్రణలో ఉంది. ఓడల యజమానులు ఇప్పటికీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది ఇంకా స్పష్టంగా లేదు’ అన్నారు.
ఆ మార్గాన్ని దాటిన మూడు నౌకలు ఇరాన్ తీరానికి సమీపంగా ఉన్న ఉత్తర మార్గంలో దాని ప్రాంతీయ జలాల్లోకి ప్రవేశించాయని బీబీసీ వెరిఫై విశ్లేషణలో తెలిసింది.
సాధారణంగా ఈ ఘర్షణలు ప్రారంభం కాకముందు, నౌకలు ఈ జలసంధి మధ్యలో ఉండే దక్షిణ మార్గంలో ప్రయాణించేవి.
'దాదాపు 800 నౌకలు చిక్కుకుపోయాయి'
హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా తిరిగి ప్రారంభమైతే, అప్పటికే అక్కడ చిక్కుకుపోయిన ట్యాంకర్లే మొదటగా బయలుదేరుతాయని రిచర్డ్ మీడ్ అంచనా వేస్తున్నారు.
"సుమారు 800 ఓడలు కొన్ని వారాలుగా అక్కడ చిక్కుకుపోయాయి. వీటిలో చాలా వరకు ఇప్పుడు సరకులతో ఉన్నాయి, కాబట్టి వాటిని బయటకు తీసుకురావడమే ప్రథమ ప్రాధాన్యం అవుతుంది" అని ఆయన అన్నారు.
రెండు వారాల యుద్ధ విరామం కూడా ఓడల విషయంలో అనిశ్చితిని సృష్టిస్తోంది అని
బిమ్కో షిప్పింగ్ విశ్లేషకుడైన నీల్స్ రాస్ముస్సెన్ అన్నారు.
"పెద్ద సంఖ్యలో ఓడలు గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశిస్తాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే రెండు వారాల గడువు ముగిసిన తర్వాత మళ్ళీ చిక్కుకుపోయే రిస్క్ తీసుకోవడానికి వారు ఇష్టపడరు" అని ఆయన అన్నారు.
సముద్రంలో మందుపాతరలు ఉండవచ్చనే భయం మరొక పెద్ద అనిశ్చితికి కారణమని అంతర్జాతీయ షిప్పింగ్ ఛాంబర్ సెక్రటరీ జనరల్ థామస్ కజాకోస్ అన్నారు.
"ఓడలు, నావికుల సురక్షిత రాకపోకలపై స్పష్టమైన ఒప్పందం ఉండేలా చూసుకోవాలి" అని ఆయన బీబీసీ వెరిఫైతో అన్నారు.
సుంకాల సమస్య, భారత్ సహా కొన్ని దేశాల ఏర్పాట్లు
ఈ ఆందోళనలకు తోడు, సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్‌కు డబ్బు చెల్లించాల్సి వస్తుందేమోనన్న అనిశ్చితిని కూడా ఓడలు ఎదుర్కొంటున్నాయి.
కాల్పుల విరమణ ఒప్పందంలో సుంకం విధించే నిబంధన ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.
"హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లడానికి సుంకం చెల్లించాల్సి ఉంటుందని ఇరాన్ సూచించింది. అయితే షిప్పింగ్ కంపెనీలు అటువంటి చెల్లింపులు చేయడానికి విముఖత చూపుతాయి" అని షిప్పింగ్ నిపుణుడు లార్స్ జెన్సెన్ అన్నారు.
ఇటీవలి వారాల్లో భారత్, మలేసియా, ఫిలిప్పీన్స్ వంటి కొన్ని దేశాలు తమ నౌకలకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
కానీ టోల్ చెల్లించడం అనేది ఇతర దేశాలకు, షిప్పింగ్ కంపెనీలకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టవచ్చు.
"ఈ చెల్లింపు ఇరాన్‌పై అమెరికా విధించిన కొన్ని ఆంక్షలను కూడా ఉల్లంఘించే అవకాశం ఉంది. ఇది షిప్పింగ్ కంపెనీలపై మరింత ప్రభావం చూపుతుంది" అని జెన్సన్ అంటున్నారు.
"వ్యక్తులు, కంపెనీలు, సంస్థలకు చేసే చెల్లింపులు నేరంగా పరిగణిస్తారు. ఆంక్షలు ఇలాగే పనిచేస్తాయి" అని క్వాడ్రంట్ ఛాంబర్స్‌లోని షిప్పింగ్ న్యాయవాది జేమ్స్ టర్నర్ అన్నారు.
"ఆంక్షల జాబితాలో ఉన్న వ్యక్తికి, కంపెనీకి లేదా సంస్థకు చెల్లింపులు చేసినప్పుడు, దానిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారని" అని ఆయన బీబీసీ వెరిఫైకి తెలిపారు.
కాబట్టి అమెరికా దీనికి ప్రత్యేక మినహాయింపు ఇస్తే తప్ప, వాటిపై టోల్ విధిస్తే అది ఆంక్షల ఉల్లంఘనే అవుతుంది.
రవాణా ఇంకా పునఃప్రారంభం కానప్పటికీ, కాల్పుల విరమణ జరిగిన గంటల వ్యవధిలోనే మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.
బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు 13% తగ్గి బ్యారెల్‌కు 94.80డాలర్లకు పడిపోయింది. అమెరికాలో విక్రయించే ముడి చమురు ధర 15% పైగా తగ్గి బ్యారెల్‌కు 95.75 డాలర్లకు చేరింది.
అయితే అంతా సవ్యంగా ఉందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని మీడ్ అంటున్నారు.
"చమురు ధరలు తగ్గడం సానుకూల సంకేతమే అయినప్పటికీ, ప్రపంచ ఇంధనంలో సుమారు 20 శాతం భాగం ప్రయాణించే ఈ మార్గం సాధారణ స్థాయికి చేరుకుంటుందని దీని అర్థం కాదు" అని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)