ఆస్కార్స్ 2026: 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్‌'కు 'బెస్ట్ ఫిల్మ్' సహా 6 అవార్డులు

    • రచయిత, లీరె వెంటాస్
    • హోదా, బీబీసీ న్యూస్, లాస్ ఏంజలెస్ నుంచి
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల్లో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' సినిమా 'ఉత్తమ చిత్రం' సహా అరు కేటగిరీల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ విజయంతో దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ పేరు మరోసారి చర్చల్లో నిలిచింది.

ఉత్తమ చిత్రం అవార్డును ప్రకటించగానే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా నటులు టెయానా టేలర్, చేజ్ ఇన్ఫినిటీ ఆనందంతో గంతులేశారు.

అలాగే 'సిన్నర్స్' సినిమాకు నాలుగు అవార్డులు లభించాయి. ఈ సినిమా రికార్డు స్థాయిలో 16 కేటగిరీల్లో ఆస్కార్‌కు నామినేట్ అయింది.

'1975లో ఆస్కార్ బరిలో బ్యారీ లిండన్, డాగ్ డే ఆఫ్టర్‌నూన్, జాస్, నాష్‌విల్లే, వన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ సెస్ట్ సినిమాలు నిలిచాయి. వీటిలో ఏదీ తక్కువ కాదు. ఆ సమయంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడు మేం కూడా ఈ వేడుకలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది కూడా చాలా అద్భుతమైన సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి' అని దర్శకుడు అండర్సన్ వ్యాఖ్యానించారు.

'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' సినిమా మొత్తం 13 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఆరు అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ క్యాస్టింగ్, ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీల్లో ఈ సినిమా ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది.

అమెరికాలోని లాస్ ఏంజలెస్‌లో 98వ అకాడమీ అవార్డుల వేడుక జరుగుతోంది. సినిమా రంగానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రదర్శనలకు ఈ అవార్డును అందజేస్తారు.

అండ్ ది ఆస్కార్ అవార్డ్ గోస్ టు..

ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ డైరెక్టర్: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్ట్ అనదర్)

ఉత్తమ నటుడు: మైఖేల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)

ఉత్తమ సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్)

ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్)

ఉత్తమ యానిమేషన్ చిత్రం: కేపాప్ డేమాన్ హంటర్స్

ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్: ద గర్ల్ హూ క్రైడ్ పెరల్స్

ఉత్తమ క్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిన్నర్స్

ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెస్టీన్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్ నోబడీ అగెనెస్ట్ పుతిన్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ద ఎంప్టీ రూమ్స్

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వాల్యూ (నార్వే)

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్

ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకెస్టీన్

ఉత్తమ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్

ఉత్తమ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (కేపాప్ డేమాన్ హంటర్స్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెస్టీన్

ఉత్తమ సౌండ్: ఎఫ్‌1

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్

ఉత్తమ రైటింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ రైటింగ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: సిన్నర్స్

హోస్ట్‌గా ప్రియాంకా చోప్రా

నిరుడు ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాతగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కానన్ ఓబ్రియన్, ఈ ఏడాది కూడా ఆస్కార్ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

విజేతలకు అవార్డులను అందజేయడానికి పలువురు సినీ తారలను కూడా ఆహ్వానించారు.

ఈ ఏడాది పెద్ద సినిమాల్లో నటించి, వ్యక్తిగతంగా ఆస్కార్‌కు నామినేట్ కాని తారలు పాల్ మెస్కల్ (హామ్నెట్), చేజ్ ఇన్ఫినిటీ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), గ్వినేత్ పాల్‌త్రో (మార్టీ సుప్రీమ్)‌లతో పాటు నికోల్ కిడ్మాన్, ప్రియాంకా చోప్రా జోనస్, రాబర్ట్ డౌనీ జూనియర్, యెన్ హాథ్‌వే, క్రిస్ ఇవాన్స్ వంటి ప్రముఖ తారలను అవార్డులు అందించడానికి ఆహ్వానించారు.

సంప్రదాయం ప్రకారం, గతేడాది అవార్డులు గెలుచుకున్న నలుగురు నటులు అడ్రియన్ బ్రాడీ, మికీ మ్యాడిసన్, కీరన్ కల్కిన్, జో సల్డానా కూడా అవార్డులను అందించే వారి జాబితాలో ఉన్నారు.

ఆస్కార్ వేడుకల ఫోటోలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)