You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
గతవారం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కొడుకు, 56 ఏళ్ల మొజ్తబాకు అప్పగిస్తూ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' నిర్ణయం తీసుకుంది.
ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ నియామక ప్రక్రియలో 88 మంది సభ్యులతో కూడిన ధార్మిక సంస్థ మొజ్తబాను ఎన్నుకున్నట్టు ప్రభుత్వ మీడియా నివేదించింది.
ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక సుప్రీం లీడర్ తర్వాత ఆయన కుమారుడే ఆ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. 1979 విప్లవం ద్వారా అంతమొందించిన 'వారసత్వ పాలన' తిరిగి ఏర్పడకుండా గతంలో అలీ ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా తోసిపుచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆ పాలన తన మనుగడ కోసం పోరాడుతోంది. దీంతో, ఆయన కుమారుడినే సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారని బీబీసీ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ లీస్ డుసెట్ తెలిపారు.
మొజ్తబా ఖమేనీకి ఇరాన్ శక్తిమంతమైన పారామిలిటరీ దళం రివల్యూషనరీ గార్డ్స్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. బాధ్యతలు చేపట్టిన మొజ్తబా, తన నియామకాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, ఇజ్రాయెల్‌కు ధిక్కార సందేశాన్ని పంపారు.
మరోవైపు, అమెరికా ఆమోదం లేని నాయకత్వం ఎక్కువ కాలం కొనసాగలేదని డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తీవ్ర యుద్ధ ఉద్రిక్తతల మధ్య మొజ్తబా ఖమేనీ పదవీ స్వీకారం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
‘‘తెరవెనుక అసలైన శక్తి’’
తన తండ్రిలా కాకుండా.. మోజ్తాబా బయటికి పెద్దగా కనిపించేవారు కాదు. ఎలాంటి ప్రభుత్వ పదవీ నిర్వహించలేదు.
బహిరంగ ఉపన్యాసాలు లేదా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు.
ఆయన ఫోటోలు, వీడియోలు చాలా తక్కువగానే ప్రచురితమయ్యాయి.
వికీలీక్స్ 2000 చివరలో విడుదల చేసిన యూఎస్ డిప్లొమాటిక్ డాక్యుమెంట్లు ఆయనను ''తెరవెనుక అసలైన శక్తి''గా అభివర్ణించాయి. ప్రస్తుత నాయకత్వంలో ''సమర్థవంతమైన, దృఢమైన నాయకుడిగా'' పరిగణించాయని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది.
అలీ ఖమేనీ వ్యతిరేకించారా?
మోజ్తాబా ఖమేనీ ఎంపిక వివాదానికి దారితీయొచ్చు. రాచరిక వ్యవస్థను కూలగొట్టి 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ అవతరించింది.
సుప్రీం లీడర్ ఎంపిక వంశపారంపర్యంగా కాకుండా మతపరమైన విశ్వాసం, నాయకత్వ సమర్థత ఆధారంగా ఎంపిక చేయాలన్న సైద్ధాంతిక భావజాలంపై ఆధారపడి ఉంటుంది.
ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నడిపించే భవిష్యత్ నాయకుడిపై అలీ ఖమేనీ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల కిందట, ఎక్స్‌పర్ట్స్ ఆఫ్ అసెంబ్లీలోని ఒక సభ్యుడు మాట్లాడుతూ, తదుపరి ఇస్లామిక్ లీడర్ మోజ్తాబా అనే ఆలోచనను ఆయన వ్యతిరేకించారని అన్నారు.
అయితే, అలాంటి ఊహాగానాలపై మోజ్తాబా ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.
30 ఏళ్ల వయసులో మదర్సాకు
మోజ్తాబా ఖమేనీ ఈశాన్య ఇరాన్‌లోని మషద్ నగరంలో, 1969 సెప్టెంబర్ 8న పుట్టారు. అలీ ఖమేనీ ఆరుగురు సంతానంలో మోజ్తాబా రెండవ సంతానం. తెహ్రాన్‌లోని మతపరమైన 'అలావీ స్కూల్'లో పాఠశాల విద్య అభ్యసించారు.
ఇరాన్ - ఇరాక్ యుద్ధం జరిగే సమయంలో 17 ఏళ్ల వయసులోనే మోజ్తాబా ఆర్మీలో కొంతకాలం పనిచేశారని ఇరాన్ మీడియా చెప్పింది.
ఈ యుద్ధంలో పశ్చిమ దేశాలు బహిరంగంగా ఇరాక్‌కు మద్దతు ఇచ్చాయి. అప్పటి నుంచి అమెరికా, పశ్చిమ దేశాలపై ఇరాన్‌కున్న అపనమ్మకం మరింత పెరిగింది.
మోజ్తాబా 1999లో తన మతపరమైన అధ్యయనాలను కొనసాగించేందుకు షియా సిద్ధాంతాల అధ్యయనానికి ప్రధాన కేంద్రమైన, పవిత్ర నగరం ఖోమ్‌కు వెళ్లారు.
అప్పటి వరకు మోజ్తాబా మతపరమైన వస్త్రధారణ పాటించలేదు. ఆయన 30 ఏళ్ల వయసులో చదువుకోవడానికి మదర్సాకు ఎందుకు వెళ్లారో స్పష్టత లేదు. సాధారణంగా, ఈ విద్య చిన్నవయసులోనే ప్రారంభమవుతుంది.
ఇటీవల, కొన్ని మీడియా అవుట్‌లెట్లు, ఇరాన్ అధికారిక కేంద్రాలకు దగ్గరగా ఉండే అధికారులు మోజ్తాబా ఖమేనీని ''అయతొల్లా'' అని పిలవడం మొదలుపెట్టారు.
ఈ మార్పును ఆయన మతపరమైన స్థాయిని పెంచి, దేశ అత్యున్నత నాయకత్వానికి విశ్వసనీయ అభ్యర్థిగా చూపించే ప్రయత్నంగా కొంతమంది పరిశీలకులు చూస్తున్నారు.
మదర్సా వ్యవస్థలో ''అయతొల్లా'' బిరుదును పొందడం, పెద్దయెత్తున మతపరమైన బోధనలను చేపట్టడం ఒకరి పాండిత్యం, జ్ఞానానికి నిదర్శనంగా పరిగణిస్తుంటారు.
భవిష్యత్ నాయకుడికి అవసరమైన వాటిలో ఇవి కూడా ఒకటి.
కానీ, ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ ఉంది.
1989లో అలీ ఖమేనీ రెండో సుప్రీం లీడర్ అయినప్పుడు కూడా ''అయతొల్లా'' హోదా వెంటనే ఆయనను వరించింది.
వంశపారంపర్యం, అనుభవలేమి
మోజ్తాబా పేరు తొలిసారి 2005 అధ్యక్ష ఎన్నికల సమయంలో చర్చకు వచ్చింది. అప్పుడు, బలమైన నేత మహమూద్ అహ్మదీనేజాద్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.
సంస్కరణవాద (రీఫార్మిస్ట్) అభ్యర్థి మెహదీ కరౌబీ.. ఖమేనీపై ఆరోపణలు చేస్తూ రాసిన బహరింగ లేఖలో ఐఆర్‌జీసీ, బసీజ్ మిలిషియాకు చెందిన కొన్ని గ్రూపుల ద్వారా మోజ్తాబా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు.
అహ్మదీనేజాద్ గెలుపు కోసం ఈ గ్రూప్‌లు మతసంస్థలకు డబ్బులు పంపిణీ చేశాయని ఆరోపించారు.
నాలుగేళ్ల తర్వాత.. మోజ్తాబాపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
అహ్మదీనేజాద్ మరోసారి ఎన్నికైన అనంతరం భారీయెత్తున నిరసనలు చెలరేగాయి, దీనినే గ్రీన్ మూమెంట్‌గా వ్యవహరిస్తారు.
ఖమేనీ తర్వాత మోజ్తాబాను ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎంపిక చేయాలనే ఆలోచనను వ్యతిరేకిస్తూ కొంతమంది నిరసనకారులు నినాదాలు చేశారు.
అప్పటి డిప్యూటీ హోం మంత్రి మొస్తఫా తాజ్జాదే ఈ ఎన్నికల ఫలితాలను ''ఎలక్టోరల్ కూప్'' (ఎన్నికల తిరుగుబాటుగా) వర్ణించారు. ఆ తర్వాత ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. మోజ్తాబా వల్లే ఇలా జరిగిందని ఆయన అన్నారు.
2009 ఎన్నికల తర్వాత ఇద్దరు సంస్కరణవాద నాయకులు మీర్ హుసేన్ ముసావీ, మెహదీ కరౌబీలను గృహ నిర్బంధం చేశారు.
నిరసనలను ఆపేయాలని కోరేందుకు 2012 ఫిబ్రవరిలో ముసావీని మోజ్తాబా కలిసినట్లు ఇరానియన్ వర్గాలు బీబీసీ పర్షియన్‌కు తెలిపాయి.
ఒకవేళ మోజ్తాబా సుప్రీం లీడర్‌గా ఎంపికైతే, తన తండ్రి అనుసరించిన కఠినమైన విధానాలనే కొనసాగిస్తారని చాలామంది విశ్వసిస్తున్నారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తన తల్లిదండ్రులను, భార్యను కోల్పోయిన ఎవరైనా.. పశ్చిమ ప్రాంతాల ఒత్తిడికి తలొగ్గడం అసాధ్యమని మరికొందరు భావిస్తున్నారు.
కానీ, ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నడిపించడం, దేశాన్ని రాజకీయ, ఆర్థిక గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడేసి ముందుకు నడిపించగలిగే సరైన వ్యక్తిని తానేనని నిరూపించుకోవడం ఆయన ముందున్న అసలైన సవాల్.
అంతేకాకుండా, ఇప్పటివరకూ ఆయన ఏ పదవిలోనూ లేకపోవడం వల్ల నాయకత్వం ఎలా ఉంటుందో తెలియదు. అలాగే, ఇస్లామిక్ రిపబ్లిక్ వంశపారంపర్య వ్యవస్థగా మారుతోందన్న భావన కూడా ప్రజల్లో మరింత అసంతృప్తిని రేకెత్తించవచ్చు.
మరోపక్క తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నికైనందుకు మొజ్తాబా కూడా లక్ష్యంగా మారొచ్చు. ఎందుకంటే, వారసుడెవరైనా హతమారుస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇప్పటికే ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)