You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిమంత బిశ్వ శర్మ భార్యకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపణ.. అస్సాం సీఎం ఏమన్నారు?
అస్సాం ముఖ్యమంత్రి, ఆయన భార్యపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. భారత్‌లో ఒక ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై చేసిన అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఇవని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య వద్ద మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు.
ఇదేసమయంలో, కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి శర్మ, ఆయన భార్య ఖండించారు.
పవన్ ఖేరాపై పరువు నష్టం కేసును దాఖలు చేస్తామని హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ చూపించిన డాక్యుమెంట్ ఫోటోషాప్ చేసిందని ఆయన భార్య అన్నారు.
పవన్ ఖేరా ఆరోపణలు ఏంటి?
ఆదివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పవన్ ఖేరా, ''మా మద్దతుదారుల్లో కొంతమంది విదేశాల నుంచి కొన్ని అత్యంత సున్నితమైన పత్రాలను పంపారు. ఒక ముఖ్యమంత్రికి, ఆయన భార్యకు వ్యతిరేకంగా ఒక పెద్ద విషయాన్ని ఈ పత్రాలు వెలుగులోకి తెస్తాయని నేనసలు ఊహించలేదు'' అని అన్నారు.
''ఇది జరుగుతుందా అని మేం కూడా ఆశ్చర్యపోయాం'' అని అన్నారు.
''అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ గురించి ఆశ్చర్యం కలిగించే విషయం బయటికి వచ్చింది. ఆమెకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయి. ఆ మూడు పాస్‌పోర్టులు వేలిడ్‌గానే ఉన్నాయి. అవింకా ఎక్స్‌పైరీ కాలేదు'' అని పేర్కొన్నారు.
రినికి భుయాన్ శర్మ వద్ద యూఏఈ, యాంటిగ్వా అండ్ బార్బుడా, ఈజిప్ట్‌లకు చెందిన పాస్‌పోర్టులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారంగా కొన్ని పత్రాల కాపీలను చూపించారు.
ఈ డాక్యుమెంట్లను బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు.
ఈ పాస్‌పోర్టులు హిమంత బిశ్వ శర్మ భార్యవా? కావా? అనే విషయాన్ని అమిత్ షా చెప్పాలని పవన్ ఖేరా అన్నారు.
''అత్యంత సున్నితమైన సరిహద్దు రాష్ట్రమైన అస్సాం ముఖ్యమంత్రి భార్య భారతీయ పౌరురాలు కాదు. ఒకవేళ ఆమె భారతీయ పౌరురాలై.. ఈ పాస్‌పోర్టులన్నీ నిజమైనవి అయితే.. ఇవన్నీ చట్టవిరుద్ధం. ఈ పాస్‌పోర్టులు నిజమైనవా? కావా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అమిత్ షా విచారణకు ఆదేశించాలి'' అని పవన్ ఖేరా డిమాండ్ చేశారు.
''ఈ రోజే పాస్‌పోర్టులపై విచారణకు ఆదేశించాలి. ఈ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. అస్సాంలో వీరు దొంగల ప్రభుత్వం. పారిపోవడానికి వాళ్లు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓడితే, వారు దేశం విడిచి వెళ్లిపోతారు. ఎవరికి మూడు పాస్‌పోర్టులు ఉంటాయి? హిమంత వద్ద ఎన్ని పాస్‌పోర్టులు ఉన్నాయో మనకు తెలియదు. అతని దగ్గర కూడా ఇంకా ఉండొచ్చు'' అని చెప్పారు.
''మరెవరైనా రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నారో చెప్పండి. విదేశాల్లో ఆయనకు ఆస్తులున్నాయి. మూడు పాస్‌పోర్టులు ఎలా, ఎందుకు? మూడు పాస్‌పోర్టులు అవసరమయ్యే నేరస్తులా మీరేంటి?'' అని పవన్ ఖేరా ప్రశ్నించారు.
హిమంత, ఆయన భార్య స్పందన ఏమిటి?
పవన్ ఖేరా ఆరోపణలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియాలో స్పందించారు.
''పవన్ ఖేరా ప్రెస్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తిని, ఆందోళనను ప్రతిబింబిస్తోంది. అస్సాం చారిత్రాత్మక తీర్పు దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో.. ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు వారి బలహీనతను బయటపెడుతుంది'' అని శర్మ అన్నారు.
''నాపై ఆయన చేసిన ప్రతి ఆరోపణను ఖండిస్తున్నా. ఇవి అస్సాం ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో చేసిన దురుద్దేశపూరిత, కల్పిత, రాజకీయ ప్రేరేపిత అవాస్తవాలు'' అని పేర్కొన్నారు.
''48 గంటల్లోగా పవన్ ఖేరాపై నా భార్య, నేను క్రిమినల్, సివిల్ పరువు నష్టం కేసులు వేస్తాం'' అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.
హిమంత బిశ్వ శర్మ మరో పోస్టు కూడా పెట్టారు. ''సర్క్యులేట్ చేస్తున్న పత్రంలో అనేక స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. డిజిటల్ మానిపులేషన్ ద్వారా చాలా చెత్తగా, పేలవంగా చేసిన ప్రయత్నం ఇది. అధికారికంగా ఇంటి పేరును 'శర్మ'కు బదులుగా 'సర్మ'గా మార్చారు'' అని రాశారు.
పవన్ ఖేరా ఆరోపణలను పలు వాదనల ఆధారంగా హిమంత బిశ్వ శర్మ తోసిపుచ్చారు. ఖేరాకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.
''మీరు మీ ప్రయత్నంలోనే కాదు, ఏఐ జనరేషన్, ఫోటోషాపింగ్‌లో కూడా విఫలమయ్యారు'' అని హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
''ఒక జాతీయ పార్టీకి అధికార ప్రతినిధిగా అవసరమైన కనీస జాగ్రత్తలు తీసుకుని.. నకిలీ పాస్‌పోర్టులను, నాసిరకంగా రూపొందించిన పత్రాల ఇమేజీలను వ్యాప్తి చేయరని నేను భావించాను. ఇకపై చట్టం తన పని తాను చేస్తుంది. క్రిమినల్ అభియోగాలు నమోదు చేస్తున్నాను. ఇక ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటాం'' అని పేర్కొన్నారు.
‘శిక్ష ఖాయం’
హిమంత బిశ్వ శర్మపై పవన్ ఖేరా చేసిన తీవ్రమైన ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
''హిమంత బిశ్వ శర్మ అత్యంత అవినీతిపరుడు. అత్యంత మతతత్వవాది. అస్సాం ప్రజలను హిమంత బిశ్వ శర్మ తప్పుదోవ పట్టిస్తూ.. మోసం చేస్తున్నారు. ప్రజల ముందుకు వచ్చిన ఆధారమే ఇది. ఆయన అవినీతిని అస్సాం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. శిక్ష ఖాయం'' అని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో రాశారు.
పవన్ ఖేరా ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కూడా స్పందించారు. ''హిమంత బిశ్వ శర్మకు సంబంధించి షాకింగ్ ఆరోపణలు వచ్చాయి. ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్టులు ఉండటం, ఆస్తులను వివరాలను వెల్లడించకపోవడం తీవ్రమైన, నేరపూరిత అంశం'' అని అన్నారు.
''అస్సాం నుంచి విదేశాల్లోని తన బ్యాంకు అకౌంట్లకు ఎంత డబ్బులు పంపారు? ఈ విషయంపై మరింత దర్యాప్తు జరగాలి. హిమంత బిశ్వ శర్మ అస్సాం రాష్ట్రానికి, దేశానికి అవమానకరంగా మారారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. తన నేరాలకు పర్యవసానాలను ఎదుర్కోవాలి'' అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)