‘‘సెక్స్ అంటే పాపమని నా కమ్యూనిటీ నేర్పించింది..’’

ఎఫ్‌జీఎం, మహిళలు, సున్తీ, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇవా ఆంటివెరోస్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • చదివే సమయం: 4 నిమిషాలు

ప్రపంచ జనాభాలో ప్రతి 20 మంది మహిళల్లో (బాలికలు సహా) ఒకరు 'సున్తీ' అనే ఆచారానికి బాధితులేనని ఐక్యరాజ్య సమితి అంచనా.

'సున్తీ' చేయడం అంటే మహిళల జననేంద్రియంలో క్లైటోరిస్ అనే భాగాన్ని కత్తిరించడం. దీన్నే ఆంగ్లంలో 'ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్' (ఎఫ్‌జీఎం)గా వ్యవహరిస్తున్నారు.

ఈ ఆచారాన్ని పాటించే కుటుంబాల్లో చాలావరకు ఊహ తెలియని వయసులోనే (ఆరు, ఏడేళ్లప్పుడే) బాలికలకు 'సున్తీ' చేస్తారు. కొందరికి యుక్త వయసొచ్చాక చేస్తారు.

శారీరకంగా, మానసికంగా మహిళల్లో జీవితాంతం అది ప్రభావం చూపుతుంది. వారి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది.

''స్త్రీ జననేంద్రియం భాగాన్ని కోసివేయడం లేదా చర్మాన్ని తొలగించడాన్ని ఎఫ్‌జీఎంగా వ్యవహరించాలి'' అని ఐక్యరాజ్య సమితి నిర్వచించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అలా చేయడాన్ని మానవ హక్కుల ఉల్లంఘన చర్యగా ఐక్యరాజ్యసమితి పరిగణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌జీఎం పద్ధతికి ముగింపు పలుకుతూ, 2012 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది.

దానిని పూర్తిగా నిర్మూలించేందుకు, అందుకోసం ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు యేటా ఫిబ్రవరి 6ను 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టోలరన్స్ ఫర్ ఎఫ్‌జీఎం'గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.

ఎఫ్‌జీఎం, మహిళలు, సున్తీ, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

స్త్రీ జననేంద్రియ భాగాల్ని తొలగించడం...

''స్త్రీ జననేంద్రియంలో వెలుపలి భాగాన్ని కోసివేయడం లేదా చర్మాన్ని తొలగించడాన్ని 'ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్' (ఎఫ్‌జీఎం)గా వ్యవహరించాలి'' అని ఐక్యరాజ్యసమితి నిర్వచించింది.

యోని శీర్షం వెలుపలి భాగాన్ని కోసి వేయడం, లేదా అక్కడి చర్మాన్ని తొలగించడం 'సున్తీ' లో భాగమే. 'సున్తీ' చేస్తున్నప్పుడు కనీసం మత్తు మందు కూడా ఇవ్వరు. పూర్తి స్పృహలో ఉన్నప్పుడే అమ్మాయిలు తీవ్రమైన నొప్పిని భరించాల్సి ఉంటుంది.

బ్లేడ్, కత్తి ఉపయోగించి నాటు పద్ధతిలో 'సున్తీ' చేస్తుంటారు. ఆ తర్వాత నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు పసుపు, వేడి నీళ్లు, సాధారణ పైపూత మందును వాడుతారు.

ఎఫ్‌జీఎం అనేది చాలా బాధాకరమైన విషయమని, ఈజిప్ట్‌‌కు చెందిన సినీ నిర్మాత, బ్లాగర్ ఒమ్నియా ఇబ్రహీం అన్నారు.

"ఒక ఐస్ ముక్కలా మారిపోతాం. ఎలాంటి భావాలూ ఉండవు. ప్రేమ అనే అనుభూతి ఉండదు. అన్నీ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది" అని ఈజిప్టుకు చెందిన సినీ నిర్మాత ఓమ్నియా ఇబ్రహీం చెప్పారు. ఓమ్నియా కూడా ఎఫ్‌జీఎం బాధితురాలే.

"అది జరిగిన తర్వాత మానసికంగా ఎంతగానో కుంగిపోయాను. లైంగికంగా కోరికలు నశించిపోయాయి. దాంతో, ఇక నేను సెక్స్‌కి పనికిరానేమో అని అనుకునేదాన్ని. ఆ బాధ నుంచి బయటపడేందుకు నాకు ఎన్నో ఏళ్లు పట్టింది" అని ఓమ్నియా వివరించారు.

మహిళల యుక్త వయసు మొత్తంపై కూడా ఇది మానసికంగా ప్రభావాన్ని చూపుతుందని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఒమ్నియా చెప్పారు.

''శరీరమంటే సెక్స్, ఆ సెక్స్ అనేది పాపం అని నా కమ్యూనిటీ నేర్పించింది. మనసులో నా శరీరం ఒక శాపంగా మారిపోయింది'' అని ఒమ్నియా చెప్పారు.

చాలా దేశాల్లో సున్తీ చేయడం చట్టవిరుద్దం అయినప్పటికీ, ఆఫ్రికా, ఆసియా, మధ్య ప్రాచ్యలో చాలా ప్రాంతాల్లో దీన్ని చేపడుతూనే ఉన్నారు. సున్తీ చేయడం మామూలు విషయమేనని ఇంకా ఈ దేశాలు భావిస్తున్నాయి. కొన్ని దేశాలు దీనిని నేరంగా పరిగణిస్తున్నాయి.

ఎఫ్‌జీఎం, మహిళలు, సున్తీ, ఆరోగ్యం

సున్తీ(ఎఫ్‌జీఎం) ఎన్ని రకాలు?

సున్తీల్లో నాలుగు రకాలు ఉంటాయి.

టైప్ 1 : క్లిటోరిడెక్టమీ – సున్నితమైన క్లిటోరిస్‌ను, దాని చుట్టూ ఉన్న చర్మాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించడం.

టైప్ 2: ఎక్సిషన్ – క్లిటోరిస్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించడంతో పాటు, జననేంద్రియ లోపలి ముడుతల్లాంటి భాగాలను కూడా తొలగిస్తారు.

టైప్ 3: ఇన్‌ఫిబ్యులేషన్ – జననేంద్రియం లోపలి భాగంతో పాటు వెలుపలి భాగాన్ని కూడా పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించి కుట్లు వేస్తారు. కుట్లు వేసేటప్పుడు చిన్న గ్యాప్‌ను మాత్రమే ఉంచుతారు.

ఈ విధానం తీవ్ర వేదనను, బాధను మిగల్చడమే కాకుండా, వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. చిన్న గ్యాప్‌తో యోనిని, మూత్రాశ్రయాన్ని మూసివేయడంతో, దాని నుంచే రుతుస్రావం, మూత్రం బయటికి వెళ్తుంది.

కొన్నిసార్లు ఇది చాలా చిన్నగా ఉండటం వల్ల, లైంగికంగా పాల్గొనేటప్పుడు లేదా పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు దాన్ని కోయాల్సి వస్తుంది. ఇది తల్లికి, బిడ్డకు ప్రమాదకరంగా మారుతుంది.

టైప్ 4: ఈ విధానం చాలా ప్రమాదకరం. జననేంద్రియాన్ని పొడవడం, కత్తిరించడం, గీరడం లాంటివి చేస్తారు. సున్తీ వల్ల లైంగికానందం ఉండదు. ఇన్‌ఫెక్షన్, వంధ్యత్వం వస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)