దేవాంగ పిల్లి: ‘చేతబడి’ కోసం ఈ జంతువును అంతం చేస్తున్నారా?

దేవాంగ పిల్లి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కె. శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

హెచ్చరిక: ఈ కథనంలో కలచివేసే అంశాలున్నాయి

తమిళనాడులోని మెట్టుపాళ్యం ప్రాంతంలో జనవరి 23న ఓ వృద్ధుడి ఇంటి నుంచి తమిళనాడు అటవీ, వన్యప్రాణి నేర నియంత్రణ సంస్థ (టీఎన్ఎఫ్‌డబ్ల్యుసీసీబీ) అధికారులు రెండు దేవాంగ పిల్లి పిల్లలను రక్షించారు.

ఈ పిల్లులను ''దేవాంగు శాస్త్రం'' అనే ఆచారం కోసం ఇంట్లో పెట్టుకున్నారని, ఈ పిల్లి కొరికిన తాడు ధరిస్తే అదృష్టం వరిస్తుందనే నమ్మకం ఉందని అధికారులు చెప్పారు. ఆ వృద్ధుడిని అరెస్ట్ చేసినట్టు అధికారులు చెప్పారు.

అటవీ విభాగం రక్షించిన దేవాంగ పిల్లి పిల్లలను అటవీప్రాంతంలో విడిచిపెట్టినట్టు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ అధికారి బీబీసీకి చెప్పారు.

దేవాంగ పిల్లుల వేటను నిరోధించేందుకు టీఎన్‌ఎఫ్‌డబ్ల్యుసీసీబీ అనేక చర్యలు తీసుకుందని తమిళనాడు పర్యావరణ, అటవీ విభాగ అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు బీబీసీకి చెప్పారు. ఈ ప్రాణులతో ముడిపడి ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

సుమారు 200 గ్రాముల బరువు వరకు పెరిగే ఈ చిన్నపాటి క్షీరదాలను అక్రమంగా ఎందుకు బంధిస్తున్నారు? అంతరించిపోయే దశలో ఉన్న ప్రాణులకు మూఢనమ్మకాల వల్ల ఎలాంటి ముప్పు పొంచి ఉంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దేవాంగపిల్లులు -క్షుద్రవిద్యలు

సంప్రదాయ ఔషధాలు, క్షుద్రవిద్యలలో వినియోగించడానికి వివిధ రకాల అటవీ జంతువులను తరచూ చట్టవిరుద్ధంగా వేటాడటం జంతువుల జనాభా తగ్గిపోవడానికి కారణం కావడంతోపాటు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తోందని బీబీసీతో వన్యప్రాణి ప్రేమికుడు సి.విమల్ రాజ్ చెప్పారు.

దేవాంగపిల్లి రాత్రివేళల్లో సంచరించే క్షీరదమని, ఇలా వేటకు గురయ్యేవాటిల్లో దేవాంగపిల్లులే ఎక్కువని ఆయన వెల్లడించారు.

‘‘లోతుగా పాతుకుపోయిన మూఢనమ్మకాల కారణంగా అటవీ జంతువులు తీవ్ర హింసకు గురవుతున్నాయి. ముఖ్యంగా దేవాంగ పిల్లులు ఉత్తరం వైపు మాత్రమే కూర్చుంటాయనీ, దుష్టశక్తులను తరిమికొట్టే శక్తి వీటికి ఉందనే మూఢ విశ్వాసం ప్రజల్లో ఉంది’’ అని విమల్ చెప్పారు.

ఈ నమ్మకాల ప్రభావాన్ని 2022 లో ప్రచురితమైన ఒక అధ్యయనం పరిశీలించింది. దేవాంగపిల్లులను ఔషధాలతోపాటు ఇలాంటి నమ్మకాల కోసం ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నారు.

బూడిద రంగు సన్నని దేవాంగపిల్లి ఎక్కువగా కనిపించే కేరళ, కర్ణాటక, తమిళనాడులోని 12 వేర్వేరు ఆవాసాలలో ఈ పరిశోధన జరిగింది. ఇది 'చేతబడి', ఇతర ఆచారాలలో బతికిఉన్న దేవాంగ పిల్లులను, వాటి శరీరభాగాలను కూడా ఉపయోగిస్తున్నారని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.

ఇలాంటి మూఢనమ్మకాల బారినపడిన తరువాత రక్షించిన 139 దేవాంగ పిల్లులను పరిశోధకులు పరిశీలించారు. వీటిలో 116 పిల్లులు మూఢాచారాల కారణంగా భౌతిక హింసకు గురైనట్లు ఆనవాళ్లనుబట్టి గుర్తించారు.

దేవాంగపిల్లి

ఫొటో సోర్స్, HANDOUT

‘ దేవాంగ పిల్లులపై అమానుష చర్యలు’

మెట్టు పాళ్యంలో ‘దేవాంగు శాస్త్రం’ అనే ఆచారం నిర్వహించారని దేవాంగ పిల్లుల రక్షణ చర్యల్లో పాల్గొన్న అధికారులు బీబీసీకి చెప్పారు.

ఈ ఆచారాల గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరోతో కలిసి పనిచేస్తున్న రహస్య సమాచార నెట్‌వర్క్‌లో భాగమైన వలంటీర్లతో బీబీసీ మాట్లాడింది.

క్షుద్రవిద్య సంబంధిత ఆచారాల్లో దేవాంగ పిల్లులను అత్యంత క్రూరంగా హింసిస్తున్నారని వారు వెల్లడించారు.

‘‘చేతబడిలో వీటిని బొమ్మల్లా ఉపయోగిస్తారు. ప్రాణంతో ఉన్న దేవాంగపిల్లులను ఈ ఆచారానికి వినియోగిస్తూ, వాటి శరీరాల్లో సూదులు గుచ్చడం వంటి హింసకు పాల్పడతారు’’ అని ఒక వలంటీర్ తెలిపారు.

2022లో వెలువడిన ఒక పరిశోధనా పత్రంలో దేవాంగపిల్లులను ‘చేతబడి’లో వినియోగించి వాటి శరీరాల్లో అనేకచోట్ల సూదులతో గుచ్చిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కళ్లలో, కాళ్లలో, గుండె ప్రాంతంలో ఇలాంటి గాయాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు.

ఈ రకమైన ఆచారాలు ఎక్కువగా అమావాస్య రాత్రుల్లో జరుగుతాయని, ఈ పరిశోధన బృంద సభ్యురాలు, బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట వన్యప్రాణి రక్షణ పునరావాస కేంద్రంలో సీనియర్ వెటర్నరీ డాక్టర్ రూపా సతీశ్ తెలిపారు.

‘‘దేవాంగపిల్లి శరీర ఆకృతి మనిషి శరీరాన్ని పోలి ఉంటుంది. అందుకే వీటిని చేతబడుల్లో ఉపయోగించే బొమ్మలా వాడుకుంటారు. ఈ ఆచారాల్లో శరీరంలోని వివిధ భాగాల్లో సూదులు గుచ్చుతారు. ఇలాంటి హింసకు గురైన దేవాంగ పిల్లులకు స్వయంగా చికిత్స చేశా’’ అని రూపా సతీశ్ తెలిపారు.

మొదట్లో ఈ గాయాలు ప్రమాదాలు లేదా ఇతర జంతువుల దాడుల వల్ల అయ్యుండొచ్చని వీటి రక్షణ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు భావించారని ఆమె చెప్పారు.

చాలా దేవాంగపిల్లుల్లో ఒకే రకమైన అవయవాల్లో, ఒకే విధమైన గాయాలు కనిపించడంతో ఇవి క్షుద్రవిద్య ఆచారాల వల్ల జరిగాయని అర్థమైందని డాక్టర్ రూపా తెలిపారు.

డబ్ల్యుసీసీబీతో రహస్యంగా సమాచారం పంచుకునే వలంటీర్లు బీబీసీతో మాట్లాడుతూ దేవాంగ పిల్లుల శరీర భాగాలలో ఔషధ గుణాలు ఉంటాయని కొంతమంది నమ్ముతారని తెలిపారు. వాటిని కంటి సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు నయం చేస్తాయంటూ మందులుగా వాడుతున్నారని వారు చెప్పారు.

అలాగే, కొంతమంది జ్యోతిష్యులు ప్రాణాలతో ఉన్న దేవాంగపిల్లులను ఉపయోగించి భవిష్యవాణి చెప్పడం, దుష్టశక్తులను తరిమివేయడం, వ్యాధులు నయం చేయడంలాంటి పనులు చేస్తున్నారనే సమాచారం ఉందని వలంటీర్లు తెలిపారు.

ఇలాంటి ఆచారాలు పూర్తయ్యాక, చాలామంది దేవాంగపిల్లులను అడవిలో వదిలేస్తారని నిపుణులు తెలిపారు.

కానీ, వాటి శరీరంలోని ముఖ్య అవయవాలకు ఏర్పడిన గాయలవల్ల అవి కొద్ది రోజుల్లోనే మృతి చెందుతున్నాయని డాక్టర్ రూపా సతీశ్ చెప్పారు.

దేవాంగపిల్లులు

ఫొటో సోర్స్, TNWCCB

దర్యాప్తులో దొరికిన మృతదేహాలు

దర్యాప్తు సమయంలో శరీర భాగాలను తొలగించి నిల్వ చేసిన దేవాంగపిల్లుల మృతదేహాలు కూడా బయటపడ్డాయని అధికారులు తెలిపారు.

"సంప్రదాయ వైద్యమని చెప్పుకుంటూ, మందులు తయారు చేయడానికి లేదా మంత్ర తంత్రాలకు అవసరమైన వస్తువులు సిద్ధం చేసేందుకు, ఈ శరీర భాగాలను తీసి ఉండొచ్చు'' అని డాక్టర్ రూపా చెప్పారు.

అయితే, ఈ నిల్వ చేసిన శరీరాలను చివరికి ఎలా ఉపయోగిస్తున్నారో స్పష్టత లేదని ఆమె చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలు పూర్తిగా రహస్యంగా జరుగుతుండటంతో, ఎక్కడ, ఎలా, ఎవరు ఈ ఆచారాలు పాటిస్తున్నారో గుర్తించడం చాలా కష్టంగా మారిందని డాక్టర్ రూపా తెలిపారు.

దేవాంగపిల్లి శరీరభాగాలను క్షుద్రవిద్యలలో వినియోగిస్తున్నారు

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, దేవాంగపిల్లి శరీరభాగాలను క్షుద్రవిద్యలలో వినియోగిస్తున్నారు

కాళ్లు కాలిన పిల్లి

దేవాంగ పిల్లులను హింసించడం అరుదైన విషయమేమీ కాదని డాక్టర్ రూపా సతీశ్ చెప్పారు. డిసెంబరులో జరిగిన ఒక ఉదంతాన్ని ఆమె వివరించారు.

‘‘తీవ్ర గాయాలతో ఉన్న ఓ దేవాంగపిల్లిని నా దగ్గరికి తీసుకొచ్చారు. దానినిని చూడగానే అది చేతబడి కారణంగా హింసకు గురైందని అర్థమైంది" అని ఆమె చెప్పారు.

ఆ జంతువును రక్షించడానికి వారం రోజుల ముందే అమావాస్య కూడా వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

"ఆ చిన్న జంతువు ఎంతటి క్రూరత్వాన్ని భరించిందో ఆ గాయాలే చూపిస్తున్నాయి. ఇది అత్యంత అమానుషమైన చర్య. మేం చికిత్స చేసి కోలుకునేలా ప్రయత్నించాం" అని డాక్టర్ రూపా చెప్పారు.

అయితే, కొన్నిరోజుల తర్వాత ఆ పిల్లి చనిపోయినట్లు ఆమె తెలిపారు.

"ఇలాంటి చర్యలు ఇప్పటికే అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ జాతి మనుగడకు తీవ్రమైన ముప్పుగా మారాయి. ఈ నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తప్పనిసరి" అని డాక్టర్ రూపా సతీశ్ హెచ్చరించారు.

ఓ ప్రమాదంలో తల్లిని పోగొట్టుకున్న ఈ దేవాంగపిల్లి పిల్లను రక్షించారు.

ఫొటో సోర్స్, N.Senthil Kumaran

ఫొటో క్యాప్షన్, ఓ ప్రమాదంలో తల్లిని పోగొట్టుకున్న ఈ దేవాంగపిల్లి పిల్లను రక్షించారు.

అటవీ శాఖ చర్యలు

దేవాంగపిల్లుల నివాస ప్రాంతాలను కాపాడేందుకు,తమిళనాడు ప్రభుత్వం 2022లో ‘కడవూరు స్లెండర్ లోరిస్ వైల్డ్‌లైఫ్ శాంక్చురి’ని ఏర్పాటు చేసింది.

ఈ చర్యలకు చొరవచూపిన తమిళనాడు పర్యావరణ అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు, వన్యప్రాణి నేర కేసులు ఇటీవల పెరిగినట్టు కనిపించడం నేరాలు పెరిగినట్టు కాదని స్పష్టం చేశారు.

"కేసులు నమోదు పెరగడం అంటే అనేది వన్యప్రాణి నేరాలు పెరిగినట్టు కాదు. అది మా గూఢచారి వ్యవస్థ బలపడినట్టూ, ప్రజల భాగస్వామ్యం మెరుగుపడినట్టూ సూచిస్తోంది" అని ఆమె బీబీసీకి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)