పంజాబ్‌‌ వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురు పాకిస్తాన్‌‌‌లో తేలారు, తర్వాత వారికి ఏమైందంటే..

పాకిస్తాన్, వరదలు, భారత్, ఖైదీలు

ఫొటో సోర్స్, KuldeepBrar/BBC

ఫొటో క్యాప్షన్, జోగిందర్ సింగ్, గుర్మెజ్‌ సింగ్ 30 నెలల తరువాత పాకిస్తాన్ నుంచి ఇంటికి తిరిగి రాగలిగారు
    • రచయిత, కుల్దీప్ సింగ్ బ్రార్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 5 నిమిషాలు

పంజాబ్‌లో 2023లో సంభవించిన వరదలలో సట్లెజ్ నదీతీరం వెంట ఉన్న ప్రాంతం మునిగిపోయింది. దీనివల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఫిరోజ్‌పూర్ జిల్లాలోని కిల్చే గ్రామానికి చెందిన జోగిందర్ సింగ్, గుర్మేజ్ సింగ్, చిందర్ సింగ్ వరదనీటిలో చిక్కుకుపోయిన తమ ట్రాక్టర్‌‌ను ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నంలో సట్లెజ్ నదీ ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు.

వీరేమైపోయారో ఆ కుటుంబాలకు తెలియలేదు. అయితే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లో తేలారని, ఆ దేశం నుంచి వచ్చిన కథనాల ద్వారా తెలిసింది.

దీనిపై బాధిత కుటుంబాలు స్థానిక నాయకులకు, అధికారులకు విజ్ఞప్తి చేసినా పరిష్కారం దొరకలేదు.

ఆపై రెండు దేశాల ఆమోదం తర్వాత, పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల ఈ ముగ్గురిని భారతదేశానికి అప్పగించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్, వరదలు, భారత్, ఖైదీలు

ఫొటో సోర్స్, KuldeepBrar/BBC

ఫొటో క్యాప్షన్, కుటుంబంతో గుర్మేజ్ సింగ్ (ఎడమ).

'తిరిగొస్తామని అనుకోలేదు'

"మా పొలం సరిహద్దుకు దగ్గరగా ఉంది. ట్రాక్టర్ నీటిలో చిక్కుకుపోయింది. దాన్ని బయటకు తీయడానికి వెళ్ళినప్పుడు ప్రవాహవేగానికి నదిలో కొట్టుకుపోయి, పాకిస్తాన్‌ చేరుకున్నాం’’ అని జోగిందర్ సింగ్ చెప్పారు.

"అక్కడ కొంతమంది మమ్మల్ని కూర్చోమని చెప్పి, పోలీసులను పిలిచారు. పోలీసులు మా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లారు. మొదటి నాలుగు-ఐదు రోజులు మమ్మల్ని కొట్టి, ఎవరైనా పాకిస్తాన్‌కు పంపారా అని అడిగారు" అని ఆయన చెప్పారు.

"మాకు అలాంటి ఉద్దేశం లేదని మేం వారికి చెప్పాం. సట్లెజ్ నదిలో కొట్టుకుపోయి మేం ఇక్కడికి వచ్చామని చెప్పాం. మేం చెప్పింది నమ్మిన తర్వాత కొట్టడం ఆపేశారు"

"మొదట మమ్మల్ని కసూర్ జైలుకి, తరువాత లాహోర్ జైలుకి పంపారు. విడివిడిగా ఉంచారు. అక్కడ చాలా ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీలు ఉన్నారు, కానీ మమ్మల్ని ఎవరితో కలవనివ్వలేదు"

"సుమారు 15 నెలల తర్వాత, న్యాయమూర్తి అనుమతితో, వారానికి ఒకసారి నా కుటుంబంతో మాట్లాడే అవకాశంలభించింది. అప్పుడే నా తండ్రి చనిపోయారని తెలిసింది" అని జోగిందర్ అన్నారు.

"భారతదేశానికి తిరిగి వస్తామన్న ఆశ మాకు లేదు, కానీ మీరు విడుదలవుతారని ఒక రోజు పాకిస్తాన్ అధికారులు చెప్పారు. ఆ మాట విని చాలా సంతోషించాం. మేం మా ఇంటికి తిరిగి రాగలిగినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు " అని ఆయన చెప్పారు.

పాకిస్తాన్, వరదలు, భారత్, ఖైదీలు

'బతికి ఉంటాడనే ఆశ లేదు'

జోగిందర్ సింగ్ భార్య సరోజ్ రాణి మాట్లాడుతూ, "జోగిందర్ సింగ్, ఆయన సోదరులు సట్లెజ్ నదిలో కొట్టుకుపోయి పాకిస్తాన్ చేరుకున్నారని 25 రోజుల తరువాత వార్తా కథనాల ద్వారా మాకు తెలిసింది. అంతకు ముందు వారు కనిపించడంలేదని ఫిర్యాదు చేశాం. ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాం. పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు, బడికి వెళ్లలేదు. కుటుంబంలో సంపాదిస్తున్నది జోగిందర్ సింగ్ మాత్రమే" అని చెప్పారు.

"జోగిందర్ సింగ్ పంట కోత యంత్రాలపై ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు సోదరులు, అందరూ కలిసి ఎనిమిది ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తారు. ముగ్గురు సోదరులు విడివిడిగా ఉంటున్నారు" అని ఆమె అన్నారు.

కుటుంబం ఇప్పటికే బతుకుదెరువు కోసం ఇబ్బంది పడుతోందని, వరదలకు భూమిలో కొంతభాగం నదిలో కలిసిపోయిందని, నాలుగు ఎకరాల గోధుమ పంట కూడా మునిగిపోయిందని సరోజ్ రాణి చెప్పారు.

పాకిస్తాన్, వరదలు, భారత్, ఖైదీలు

'ఆనందంతో రెండు రోజులు నిద్రపట్టలేదు'

"2023లో, మేం ట్రాక్టర్‌ను ఎత్తైన ప్రదేశానికి తీసుకెళదామని వెళ్ళాం, కానీ సట్లెజ్ నది బలమైన ప్రవాహానికి కొట్టుకుపోయి పాకిస్తాన్‌కు చేరుకున్నాం. అక్కడికి వెళ్లగానే, పాకిస్తాన్‌వాసులు మమ్మల్ని పట్టుకున్నారు" అని గుర్మేజ్ సింగ్ అన్నారు.

"అంతకుముందు భారత్‌కి తిరిగి వస్తామనే ఆశ లేదు. కానీ, మేం తిరిగి వెళ్తామనే వార్త తెలియగానే, ఆనందంతో రెండ్రోజులు నిద్రపట్టలేదు" అని ఆయన అన్నారు.

తాను తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని, ప్రతిరోజూ గురుద్వారాకు వెళ్లి ప్రార్థిస్తున్నానని, తాను లేకపోవడం వల్ల తన పిల్లల చదువుపై ప్రభావం పడి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారని ఆయన వివరించారు.

ఇప్పుడు, తన పిల్లలు , కుటుంబం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నానని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని గుర్మేజ్ సింగ్ చెప్పారు.

పాకిస్తాన్, వరదలు, భారత్, ఖైదీలు
ఫొటో క్యాప్షన్, న్యాయవాది మెహర్ సింగ్ మల్ల్

'దర్యాప్తుపై ఆధారపడి ఉంటుంది'

వరదల్లో కొట్టుకుపోయిన తర్వాత లేదా ఇతర కారణాల వల్ల సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించే వ్యక్తులను పాకిస్తాన్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేశాయని, తదుపరి భారత సరిహద్దు భద్రతాదళాలను సంప్రదించాయని న్యాయవాది మెహర్ సింగ్ మల్ల్ వివరించారు.

పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరినీ భారతదేశంలో విచారించాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. సరిహద్దు దాటడం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు.

"ఇది పాత కేసు కాబట్టి, దీనికి సంబంధించిన ఎటువంటి రికార్డులు మా వద్ద లేవు" అని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ దీప్ సింగ్ ఫోన్‌లో తెలిపారు.

"ఇప్పుడు వారు తిరిగి రావడం గురించి మాత్రమే మాకు సమాచారం ఉంది. ఇది తప్ప మా దగ్గర వేరే సమాచారం లేదు" అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)