‘ఆ నాలుగు విష సర్పాలకే భారత్‌లో విరుగుడు మందు’.. ప్రపంచంలోని ప్రతి రెండు పాము కాటు మరణాలలో ఒకటి ఇండియాలోనే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షెరిలాన్ మొలాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
దేవేంద్ర... ఆయనొక సాధారణ రైతు. మల్బరీ ఆకులు కోస్తున్నప్పుడు ఆయన్ను పాము కాటేసింది. తన కాలును పోగొట్టుకోవడానికి కారణమైన ఆ సంఘటన ఆయన ఇప్పటికీ మర్చిపోలేరు.
''పాము కరిచిన నాలుగు రోజుల తర్వాత, నొప్పి భరించలేనంతగా వస్తుండటంతో ఆసుపత్రికి వెళ్లాను. కానీ ఆ ఆలస్యం వల్ల నేను నా కాలును కోల్పోవాల్సి వచ్చింది" అని 'గ్లోబల్ స్నేక్‌బైట్ టాస్క్‌ఫోర్స్' (జీఎస్‌టీ) విడుదల చేసిన ఒక లఘు చిత్రంలో ఆయన తన బాధను వివరించారు.
కానీ, ప్రాణాలతో బయటపడిన కొద్దిమంది అదృష్టవంతులలో దేవేంద్ర ఒకరు.
ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఏటా సుమారు 50 వేల మంది పాముకాటు వల్ల మరణిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాముకాటు మరణాలలో దాదాపు సగం. అయితే కొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు.
2020లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం, 2000 నుంచి 2019 మధ్య కాలంలో సుమారు 12 లక్షల మరణాలు సంభవించి ఉండవచ్చని అంచనా. అంటే సగటున ఏడాదికి 58 వేల మంది మంది ప్రాణాలు కోల్పోయారు.
జీఎస్‌టీ తాజా నివేదిక ప్రకారం.. దేశంలో 99 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు యాంటీ వీనమ్‌ను (పాము విషానికి విరుగుడు) బాధితులకు అందించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారని తేలింది.


ఫొటో సోర్స్, Strike Out Snakebite
ఎక్కువ మంది పాముపాటు బాధితులు వారే...
పాముకాటు ప్రభావం ఎక్కువగా ఉన్న భారతదేశం, బ్రెజిల్, ఇండోనేసియా, నైజీరియా దేశాల్లోని 904 మంది వైద్య నిపుణులతో పరిశోధకులు సర్వే చేశారు.
మౌలిక సదుపాయాల కొరత, యాంటీవీనమ్ అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య కార్యకర్తలకు సరైన శిక్షణ లేకపోవడం వంటి సమస్యలు అన్నిచోట్లా ఒకేలా ఉన్నాయని వారు గుర్తించారు.
చికిత్స చేయించుకోవడంలో జరిగిన ఆలస్యం కారణంగా కాలు లేదా చేయి కోల్పోవడం, లేదా జీవితాంతం కదల్లేని స్థితికి చేరుకోవడం వంటి తీవ్రమైన సమస్యలను పాముకాటు బాధితులు ఎదుర్కొంటున్నారని దాదాపు సగం మంది వైద్య నిపుణులు తెలిపారు.
ఇలా అధిక సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నందున పాముకాటును 'హయ్యెస్ట్ ప్రయారిటీ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2017లో అధికారికంగా గుర్తించింది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 54 లక్షల మంది పాముకాటుకు గురవుతుండగా, లక్ష మందికి పైగా మరణిస్తున్నారు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నిరుపేద గ్రామీణ వర్గాలపైనే పాముకాటు ప్రభావం ఎక్కువగా ఉందని కూడా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
భారతదేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలలో పాముకాటు మరణాలు, గాయాలు ఎక్కువగా నమోదవుతున్నాయని జీఎస్‌టీ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ యోగేష్ జైన్ చెప్పారు.
ముఖ్యంగా పేద, గిరిజన వర్గాలకు చెందినవారు, పొలాల్లో పనిచేసేవారే ఎక్కువగా పాముకాటుకు గురవుతున్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'పాముకాటు కేవలం పేదల సమస్యగానే చూస్తారు'
పాముకాటు మరణాలను 2030 నాటికల్లా సగానికి తగ్గించాలనే లక్ష్యంతో 2024లో కేంద్ర ప్రభుత్వం 'నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్‌బైట్ ఎన్వీనమింగ్' (ఎన్ఏపీఎస్ఈ)ను ప్రారంభించింది.
మెరుగైన నిఘా, యాంటీవీనమ్ లభ్యతను పెంచడం, పరిశోధనలు, వైద్య సదుపాయాల మెరుగుదల, ప్రజలలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇది సరైన దిశలో వేసిన అడుగేనని నిపుణులు అంగీకరిస్తున్నప్పటికీ, దీని అమలు మాత్రం అన్నిచోట్లా ఒకేలా జరగడం లేదు.
''భారతదేశంలో పాముకాటును కేవలం పేదల సమస్యగానే చూస్తారు'' అని డాక్టర్ యోగేష్ జైన్ విమర్శించారు.
''పూర్తిగా నివారించదగ్గ ఈ మరణాలపై తగినంత సీరియస్‌నెస్ గానీ, స్పందన గానీ కనిపించడం లేదు. పాముకాటు చికిత్సలో ప్రతి సెకను విలువైందే. పాముకాటు వేసిన తరువాత నిమిషాల్లోనే దాని విషం బాధితుల రక్తప్రవాహంలోకి చేరుతుంది. పాము రకాన్ని బట్టి విషం.. నాడులు, కణాలు, రక్త ప్రసరణ వ్యవస్థపై దాడి చేస్తుంది'' అని ఆయన వివరించారు.
యాంటీ వీనమ్ ఇవ్వడంలో ఆలస్యమైతే శ్వాసకోశ వైఫల్యం, పక్షవాతం, శాశ్వత కణజాల నష్టం లేదా అవయవ వైఫల్యానికి దారితీయవచ్చు.
అయినప్పటికీ, గ్రామీణ భారతదేశంలో ఆసుపత్రికి వెళ్లడానికి ఆలస్యం చేస్తుండటం సర్వసాధారణం.
నిరుడు సెప్టెంబర్‌లో గుజరాత్ రాష్ట్రంలో ఒక గర్భిణిని తీసుకెళ్లడానికి వాహనం వచ్చే వీలులేకపోవడంతో కుటుంబసభ్యులు ఆమెను మోసుకుంటూ 5 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా బాధితురాలు మార్గమధ్యంలోనే మరణించారు.
కొన్ని రాష్ట్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవీనమ్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాయని జైన్ చెప్పారు.
అయితే దానిని సరిగ్గా అందించడమే అతిపెద్ద సవాలుగా మారింది.
చాలామంది ఆరోగ్య కార్యకర్తలు శిక్షణ పొందిన నిపుణులు కాదు.
యాంటీవీనమ్ ఇచ్చినప్పుడు రోగులలో దుష్ప్రభావాలు వస్తాయని భయపడి వారు యాంటీవీనమ్ ఇవ్వడానికి వెనుకాడుతున్నారు.
''యాంటీవీనమ్‌ను సెలైన్‌లో కలిపి ఒక గంట పాటు సిరల ద్వారా శరీరంలోకి పంపిస్తారు, కానీ ఆ సమయంలో వచ్చే దుష్ప్రభావాలను తగ్గించే సామర్థ్యం చాలా కేంద్రాల్లో లేదు" అని జైన్ వివరించారు.
మరో ప్రధాన సమస్య ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ ‘మంత్రగాళ్లు’ లేదా నాటు వైద్యంపై ఆధారపడుతున్నారు. పరిస్థితి విషమించిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. అప్పటికే బాధితులకు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

ఫొటో సోర్స్, The Liana Trust
'నాణ్యమైన యాంటీవీనమ్ అందుబాటులో లేదు'
కర్ణాటక రాష్ట్రంలో మానవులు-పాముల సంఘర్షణలను తగ్గించడానికి కృషి చేస్తున్న 'ది లియానా ట్రస్ట్' సహ వ్యవస్థాపకుడు జెరీ మార్టిన్ మాట్లాడుతూ, నాణ్యమైన యాంటీవీనమ్ అందుబాటులో లేకపోవడం మరో ప్రధాన అడ్డంకి అన్నారు.
ప్రస్తుతం, దేశంలో లభించే యాంటీవీనమ్ కేవలం 'బిగ్ ఫోర్' అని పిలిచే నాగుపాము(కోబ్రా), కట్ల పాము(కామన్ క్రైట్), రక్త పింజరి(రసెల్స్ వైపర్), పొడ పింజరి(సా స్కేల్డ్ వైపర్) అనే నాలుగు రకాల పాముల నుంచి మాత్రమే రక్షణనిస్తుంది. అత్యధిక శాతం పాముకాటు మరణాలకు ఇవే కారణమని భావిస్తారు.
ఈ పాముల విషాన్ని గుర్రాలలోకి ఎక్కించి, వాటిలో తయారైన 'యాంటీబాడీలను' మనుషుల చికిత్స కోసం ఉపయోగిస్తారని మార్టిన్ వివరించారు.
కానీ, హిమాచల్‌ప్రదేశ్‌లో కనిపించే 'గ్రీన్ పిట్ వైపర్', దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే 'మలబార్ పిట్ వైపర్', 'హంప్-నోస్డ్ పిట్ వైపర్', ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్నిరకాల పాములు, ఇలా దేశంలో ఇంకా ఇతర విషపూరిత పాము జాతులు పదుల సంఖ్యలో ఉన్నాయి. అవి కాటు వేస్తే వాటి విషానికి విరుగుడుగా పనిచేసే నిర్దిష్టమైన యాంటీవీనమ్ లేదు.
గత ఏడాది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎయిమ్స్ నిర్వహించిన ఒక అధ్యయనం ఈ సమస్యను ప్రస్తావించింది.
సా స్కేల్డ్ వైపర్ కాటుకు ఉపయోగించే యాంటీవీనమ్‌ను 105 మంది బాధితులకు (ఏ పాము కరిచిందో తెలియనప్పుడు) ఇచ్చినప్పుడు, అందులో మూడింట రెండు వంతుల మంది శరీరం చికిత్సకు సరిగ్గా స్పందించలేదు.
పశ్చిమ భారతదేశంలో 'ప్రాంతీయ అవసరాలకు తగ్గట్టుగా ఉండే యాంటీవీనమ్' అత్యవసరమని ఆ అధ్యయనం తేల్చింది.
గత ఐదేళ్లుగా, 'ది లియానా ట్రస్ట్' ఆ 'బిగ్ ఫోర్' కాకుండా ఇతర పాము జాతుల విషంపై పరిశోధన చేస్తూ, వాటి విషానికి విరుగుడును అభివృద్ధి చేసే పనిలో ఉంది.
అయితే ఈ ప్రక్రియకు ఎక్కువ శ్రమ, సమయం అవసరమని, అందుకే పురోగతి నెమ్మదిగా ఉందని మార్టిన్ చెప్పారు.
పాముకాటు మరణాల నమోదులో ఉన్న లోపాలను సరిదిద్దడానికి 2024లో కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని ఆయన కోరారు.
కర్ణాటక ప్రభుత్వం పాముకాటును 'నోటిఫైబుల్ డిసీజ్'గా గుర్తించింది, అంటే ఆరోగ్య కార్యకర్తలు ప్రతి పాముకాటు కేసును ఉన్నతాధికారులకు ఖచ్చితంగా నివేదించాలి.
''రాజకీయ సంకల్పం ఎక్కడైతే ఉండదో, పాముకాటు మరణాలు మొదలవుతాయి. పేద ప్రజలకు నాసిరకం కాకుండా మెరుగైన ఆరోగ్య వ్యవస్థలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మెరుగైన చికిత్సకు వారూ అర్హులే" అని డాక్టర్ జైన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














