ఫ్యాషన్ డిజైనర్ కావడానికి ఏం చదవాలి? ఈ వృత్తిలో సంపాదన ఎలా ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
అది 2006 సంవత్సరం. బీహార్‌లోని ఛప్రా జిల్లా.
లక్షలమంది పిల్లల్లాగే గౌరవ్ గోవింద్ కూడా అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కలలుకన్నారు.
ఆయన మొదట క్రికెట్రర్ కావాలనుకున్నారు. కానీ జీవితం మాత్రం బ్యాట్ స్థానంలో ఆయన చేతిలో స్కెచ్ పెన్సిల్ పెట్టింది.
ర్యాంప్ మీద నడుస్తున్న మోడల్స్, మెరిసే లైట్లు, అందమైన డిజైన్లకు మార్మోగే చప్పట్లు… ఇలానే గౌరవ్‌కు ఫ్యాషన్ ప్రపంచంతో పరిచయం ఏర్పడింది.
తరువాత గౌరవ్ హిమాచల్ ప్రదేశ్, కాంగ్రాలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లో చదువుకున్నారు. ప్రఖ్యాత డిజైనర్లతో కలిసి పనిచేశారు. ఒక స్టార్టప్ మొదలుపెట్టారు.
ఇప్పుడు నిఫ్ట్ వారణాసి క్యాంపస్‌లో విద్యార్థులకు ఫ్యాషన్ పాఠాలు చెబుతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ఒక సంపూర్ణమైన, స్థిరమైన కెరీర్ మార్గమే అని ఆయన కథ చెప్తోంది.
మరి ఫాషన్ డిజైనర్ కావడం ఎలా, ఈ కెరీర్ ఎంచుకున్నవారి భవిష్యత్తు ఎలా ఉంటుంది?


ఫొటో సోర్స్, Getty Images
దేశానికి ఈ పరిశ్రమ ఎంత కీలకం?
ఈ రోజుల్లో గౌరవ్ గోవింద్‌లాంటి వేలమంది భారత్‌లో ఫ్యాషన్ రంగాన్ని తమ కెరీర్‌గా ఎంచుకుంటున్నారు.
దేశంలోని టెక్స్‌టైల్ & అపారెల్ ఇండస్ట్రీ సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించే రెండో అతిపెద్ద పరిశ్రమగా దీన్ని పరిగణిస్తున్నారు.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రంగంలో మహిళలు, గ్రామీణ నేపథ్యానికి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కలిగి ఉండటం.
భారతదేశ జీడీపీలో 2.3 శాతం, అలాగే దేశ మొత్తం ఎగుమతుల్లో 12 శాతం వాటా ఈ పరిశ్రమదే.
ప్రపంచంలో అయిదో అతిపెద్ద టెక్స్‌టైల్ మార్కెట్ భారతదేశం. వచ్చే అయిదేళ్లలో ఈ రంగాన్ని 15-20 శాతం వేగంతో వృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ విధానాలు, దేశీయ వినియోగం పెరగడం, ఇ-కామర్స్ విస్తరణ, ప్రపంచ డిమాండ్ ఇవన్నీ ఫ్యాషన్ వ్యాపారానికి కొత్త రూపాన్నిచ్చాయి. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీకి కేవలం డిజైన్ మాత్రమే కాదు, మేనేజ్‌మెంట్, బ్రాండింగ్, డేటా, స్ట్రాటజీపై అవగాహన ఉన్న ప్రొఫెషనల్స్ అవసరమయ్యారు.
ఈ రంగంలో ఎదగడానికి కావలసినవి ఏంటి?
"ఫ్యాషన్ డిజైనర్లు వారి సృజనాత్మక ఆలోచన, పరిశోధనలతో యాక్సెసరీస్, ఫ్యాషన్ ఉత్పత్తులను రూపొందించే నిపుణులు. వారు అందమైన దుస్తులను తయారు చేయడమేకాదు, ప్రతి డిజైన్ ద్వారా ఒక కథ, గుర్తింపు, ఆలోచనను అందిస్తారు. ఫ్యాషన్ డిజైనర్ పని దస్తులు ఎలా కనిపించాలి అన్నదానితోనే మొదలవదు. దానికి ముందు మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌ను అర్థం చేసుకుంటారు, ప్రజల అభిరుచులు, మార్కెట్ డిమాండ్‌ను అధ్యయనం చేస్తారు. ఫ్యాబ్రిక్, కలర్,టెక్స్చర్‌పై రీసెర్చ్ చేసి, ఆ తరువాత తమ ఆలోచనలను స్కెచ్‌లు, డిజైన్ల రూపంలోకి తీసుకొస్తారు" అని యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వైఎంసీఏ) లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును బోధించిన సునైనా ద్వారీ దాస్ వివరించారు.
"ఏ డిజైన్‌కు ఏ ఫ్యాబ్రిక్ సరిపోతుంది, దాని ప్యాటర్న్ ఎలా ఉండాలి, ధరించడానికి ఎంత సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉంటుందో కూడా ఫ్యాషన్ డిజైనర్లు నిర్ణయిస్తారు. ఈ రోజుల్లో ఫ్యాషన్ డిజైనర్ పాత్ర కేవలం క్రియేటివ్‌గా మాత్రమే కాకుండా స్ట్రాటజిక్‌గా కూడా మారింది. ట్రెండ్ అనాలిసిస్, బ్రాండ్ ఐడెంటిటీ, కస్టమర్ బిహేవియర్, ప్రొడక్షన్, మార్కెటింగ్‌పై అవగాహన కూడా తప్పనిసరి" అని సునైనా తెలిపారు.
"ఫ్యాషన్ డిజైనర్లు దుస్తుల ద్వారా ప్రజల గుర్తింపును సృష్టించి, ఫ్యాషన్‌ను కళ నుంచి వ్యాపారానికి అనుసంధానించడంలో కీలకపాత్ర పోషిస్తారు" అని గౌరవ్ గోవింద్ అన్నారు.

ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కేవలం టైలరింగ్ మాత్రమేనా?
"ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ప్రతి ఒక్క క్రియేటివ్ స్టూడెంట్‌కి తలుపులు తెరిచే ఉంటాయి. అపారెల్, టెక్స్టైల్, యాక్సెసరీస్ డిజైన్‌పై ఆసక్తి, పట్టుదల ఉన్నవారెవరికైనా ఇది సరైన కెరీర్. కామర్స్, ఆర్ట్స్ లేదా సైన్స్.. ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచైనా ఫ్యాషన్ డిజైనింగ్ చదవొచ్చు. కాకపోతే ఇంటర్ పాసై ఉండాలి" అని సునైనా చెప్పారు.
ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విద్యార్థులు తమ స్టోరీటెల్లింగ్ స్కిల్స్, సాంస్కృతిక అవగాహనతో ప్రత్యేకంగా నిలుస్తారు. సైన్స్ నేపథ్యం ఉన్నవారు టెక్నాలజీ, అనలిటిక్స్, సప్లై చైన్ రంగాల్లో ముందుకు సాగవచ్చు.
అదే విధంగా, కామర్స్ విద్యార్థులు బ్రాండింగ్, రిటైల్, ఫ్యాషన్ బిజినెస్‌లో తమ స్థానం సంపాదించుకోవచ్చు.
ఫ్యాషన్ డిజైనింగ్ మార్గం ప్రతి ఒక్కరికీ తెరిచే ఉన్నప్పటికీ, దీనికి కొన్ని నైపుణ్యాలు అవసరం అని జేడీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రతినిధి సృష్టి జైస్వాల్ అంటున్నారు.
అవి..
- క్రియేటివిటీ, కొత్త కొత్త ఐడియాలు
- బలమైన పరిశీలనాశక్తి(అబ్సర్వేషన్), విజువల్‌గా వ్యక్తపరచగల సామర్ధ్యం
- సహనం, ప్రతి నిమిషం డీటెయిల్స్‌పై శ్రద్ధ వహించే అలవాటు
- కొత్త ట్రెండ్స్, భిన్న సంస్కృతుల గురించి తెలుసుకునే ఆసక్తి
- ప్రతిరోజూ కొత్తదాన్ని నేర్చుకోవాలనే తపన
సాధారణంగా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కేవలం కుట్టుపని అనుకుంటారని, కానీ నిజం ఏంటంటే, ఫైబర్ నుంచి వస్త్రం ఎలా తయారవుతుంది, అది మార్కెట్‌కి ఎలా చేరుకుంటుందో అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని, ఇవన్నీ ఈ పనిలో భాగమేనని సునైనా చెప్పారు.
ఫ్యాషన్ డిజైనర్లు మారుతున్న ట్రెండ్స్‌పై ఫోకస్ పెట్టాలి. మార్కెట్‌ను పరిశీలించాలి. దుస్తులకు సంబంధించిన సాంస్కృతిక, చారిత్రక, సామాజిక ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలి. గంటల తరబడి స్కెచింగ్, ట్రయల్-ఎర్రర్స్, హార్డ్ వర్క్ ఇవన్నీ ఈ వృత్తిలో ఉంటాయని సునైనా తెలిపారు.
సృష్టి జైస్వాల్ మాట్లాడుతూ.. డిజైనర్లు ఇకపై బోటిక్‌లకు మాత్రమే పరిమితం కాదని, రిటైల్, మీడియా, తయారీ, ఎగుమతులు, వ్యవస్థాపకతలో కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఫ్యాషన్ డిజైనర్ అభ్యసించే వారికి అనేక అవకాశాలుంటాయి అని సృష్టి చెబుతున్నారు.
- ఫ్యాషన్ డిజైనర్
- ఫ్యాషన్ స్టైలిస్ట్
- అపారెల్ లేదా టెక్స్టైల్ డిజైనర్
- ఫ్యాషన్ బయ్యర్ / మర్చండైజర్
- ఇలస్ట్రేటర్
- కాస్ట్యూమ్ డిజైనర్
- ఫ్యాషన్ కంటెంట్ క్రియేటర్ లేదా కన్సల్టెంట్ మొదలైనవి.
ప్రారంభదశలో ఫ్యాషన్ డిజైనర్‌కు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు జీతం వస్తుందని చెప్పారు. కానీ సీనియర్ డిజైనర్లు, బ్రాండ్ యజమానులు, కన్సల్టెంట్లు అయిన వారు ఇంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది.
"నాలెడ్జ్, కొత్త ట్రెండ్స్‌ను గ్రహించే వేగం, వారి పని ఎలా ఉంది అనే దానిపై జీతం ఆధారపడి ఉంటుంది. అయితే, ఇది నెలకు రూ .30,000 నుంచి రూ .1 లక్ష మధ్య ఉండవచ్చు" అని గౌరవ్ గోవింద్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చదవాలి?
ఇంటర్ తర్వాత ఈ రంగంలోకి వెళ్లాలనుకుంటే ఫ్యాషన్ డిజైన్‌లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, డిప్లొమా చేయవచ్చని గౌరవ్ గోవింద్ చెప్పారు.
ఇది కాకుండా, ఫ్యాషన్ స్టైలింగ్, ప్యాటర్న్ మేకింగ్ లేదా బోటిక్ మేనేజ్మెంట్ వంటి కొన్ని ప్రత్యేక ప్రోగ్రామ్లకు సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయి, ఇవి మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తవుతాయి.
ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే, వారు మాస్టర్స్ ఆఫ్ డిజైన్ లేదా పీజీ డిప్లొమా చేయొచ్చు.
ఈ కోర్సుల సిలబస్‌లో ఉండే అంశాలేంటో ఆయన వివరించారు.
- ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ & స్కెచింగ్
- నమూనా తయారీ & వస్త్ర నిర్మాణం
- టెక్స్టైల్ సైన్స్ & ఫాబ్రిక్ నాలెడ్జ్
- కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (CAD)
- ఫ్యాషన్ మార్కెటింగ్, మర్చండైజింగ్ & పోర్ట్‌ఫోలియో డెవలప్‌మెంట్.

ఫొటో సోర్స్, Getty Images
ఇవీ కొన్ని ముఖ్యమైన ఇనిస్టిట్యూట్‌లు
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్): దిల్లీ, ముంబయి, బెంగళూరు సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 20 క్యాంపస్‌లున్నాయి. క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లతో కూడిన ఎంట్రన్స్ టెస్ట్ (నిఫ్టీఈ) ద్వారా ప్రవేశం ఉంటుంది. ఒక సెమిస్టర్ (6 నెలలు) ఫీజు సుమారు లక్షన్నర రూపాయలు.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ): అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఇక్కడ నేర్చుకోవచ్చు. దీనికి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులో క్యాంపస్‌లున్నాయి. ప్రవేశం కోసం ఎన్ ఐడీ ప్రత్యేక ప్రవేశ పరీక్షను కూడా నిర్వహిస్తుంది. ఒక సెమిస్టర్ (6 నెలలు) ఫీజు సుమారు రెండున్నర లక్షల రూపాయలు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్ టైల్స్ అండ్ మేనేజ్ మెంట్ (ఎస్‌వీపీఐటీఎమ్) : కోయంబత్తూరులోని ఈ ఇన్‌స్టిట్యూట్ టెక్స్ టైల్ ఫ్యాషన్, టెక్నికల్ టెక్స్ టైల్స్, టెక్స్ టైల్ డిజైన్‌లో బీఎస్సీ, టెక్స్‌టైల్ బిజినెస్ అనలిటిక్స్‌లో బీబీఏ వంటి కోర్సులను అందిస్తుంది. దీనితో పాటు టెక్స్ టైల్ మేనేజ్ మెంట్, అపెరల్ మేనేజ్ మెంట్, రిటైల్ మేనేజ్ మెంట్, టెక్స్ టైల్ బిజినెస్ అనలిటిక్స్‌లో ఎంబీఏ చేయొచ్చు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) స్కోరు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఫీజు విషయానికొస్తే, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు సుమారు రెండున్నర లక్షల రూపాయలు, ఎంబీఏ కోసం సుమారు మూడున్నర లక్షల రూపాయలు వరకు ఉంటుంది.
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (ఐఐఏడీ): ఇక్కడి నుంచి విద్యార్థులు ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్ మెంట్‌లో బీబీఏ, ఎంబీఏ చదువుకోవచ్చు.
ఇది కాకుండా, కొన్ని ప్రైవేట్ సంస్థలు బి.డెస్, బీబీఏతో పాటు ఎం.డెస్, ఎమ్‌బీఏ వంటి ఫుల్‌టైం కోర్సులు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, కమ్యూనికేషన్, లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ వంటి కొన్ని స్వల్పకాలిక ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నాయి.
వీటికి దిల్లీ, ముంబయి, జైపూర్, బెంగళూరు వంటి నగరాల్లో క్యాంపస్‌లున్నాయి. దీనిలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఒక సెమిస్టర్ ఫీజు సుమారు రూ .3 లక్షల 60 వేలు, మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు సెమిస్టర్‌కు సుమారు రూ .3 లక్షలు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














