భారత్‌లోనూ పిల్లల 'సోషల్ మీడియా నిషేధం'పై చర్చ.. సాధ్యమేనా?

సోషల్ మీడియా, చిన్నారులు, సోషల్ మీడియాపై నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభిషేక్ డే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పదహారేళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తూ ఆస్ట్రేలియా ఇటీవల ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్లు భారత్‌లోని పలు రాష్ట్రాల మంత్రులు చెబుతుండటంతో.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలనే చర్చ దేశంలో కూడా ఊపందుకుంది.

పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచడంలో ఈ నిషేధం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో పరిశీలిస్తున్నట్లు దక్షిణాదిలోని రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఇటీవల తెలిపారు.

బడ్జెట్‌కు ముందు, గతవారం విడుదలైన ఆర్థిక సర్వేలోనూ.. పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం వయోపరిమితుల విధింపును పరిశీలించాలని ప్రతిపాదించింది.

అయితే, సర్వే ప్రతిపాదనలను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని లేదు కానీ, విధానపరమైన నిర్ణయాలకు ఇవి మార్గదర్శకాలు కాగలవు.

అయితే, భారత్‌లో ఈ తరహా నిషేధం అంత తేలిక కాదని, దీనివల్ల చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు యూజర్ల వయస్సును వెరిఫై చేయడం తప్పనిసరి చేసింది. అలాగే, మైనర్ల అకౌంట్లను నిలిపివేయాలి.

ఈ పాలసీ ప్రకారం, యూజర్ల వయస్సు 16 సంవత్సరాలు దాటినట్లు నిర్ధరించేందుకు ఆయా కంపెనీలు సహేతుకమైన చర్యలు చేపట్టాలి.

అలా చేయడంలో కంపెనీలు విఫలమైతే దాదాపు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ. 295 కోట్లు) వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆస్ట్రేలియా ఇంటర్నెట్ రెగ్యులేటర్ గత నెలలో బీబీసీతో మాట్లాడుతూ, కంపెనీలు ఈ నిర్ణయాన్ని అయిష్టంగానే అంగీకరించాయని పేర్కొంది.

15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వకుండా నిషేధించే బిల్లుకు గత వారం ఫ్రాన్స్‌లోని దిగువ సభ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ బిల్లును సెనేట్ ఆమోదించాల్సి ఉంది.

యూకే కూడా నిషేధాన్ని పరిశీలిస్తోంది.

భారత్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు.

16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించాలని కోరుతూ గతవారం ఒక బిల్లును ప్రతిపాదించారు.

ఇది ప్రైవేట్ మెంబర్ బిల్లు అవ్వడంతో, ఈ ప్రతిపాదన ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించదు. చట్టంగా మారే అవకాశం లేదు. కానీ, పార్లమెంట్‌లో చర్చలను ఇది ప్రభావితం చేయవచ్చు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంత్రణ వ్యవస్థలను (గ్లోబల్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్) అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

మెటా, ఎక్స్, గూగుల్, షేర్‌చాట్ వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లను కూడా వీటిపై చర్చల కోసం ఆహ్వానించింది. అయితే, ఈ ఆహ్వానాలపై కంపెనీలు ఇంకా స్పందించలేదు.

సోషల్ మీడియా, నిషేధం, భారత్, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Sri Krishna Devarayalu Lavu/Facebook

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ, "పిల్లలు సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు. దీనివల్ల వీరి ఏకాగ్రత, చదువులు దెబ్బతింటున్నాయి. మహిళలు కూడా తరచూ ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కొంటున్నారు" అని అన్నారు.

''సోషల్ మీడియాను సురక్షితంగా మార్చేందుకు, ముఖ్యంగా మహిళలపై, చిన్నారులపై దీని ప్రభావం తగ్గించేందుకు మేం కృషి చేస్తాం'' అని రాశారు.

ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలపై ఆసక్తి చూపుతున్నాయి.

ఈ నిషేధం అమలు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని గోవా టూరిజం, ఐటీ మంత్రి రోహన్ ఖౌంటే తెలిపారు.

కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే కూడా దీనిపై స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవడంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆయన అసెంబ్లీకి తెలిపారు. లక్ష మంది టీచర్లు, 3 లక్షల మంది విద్యార్థులు భాగస్వాములయ్యేలా మెటా భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ''డిజిటల్ డీటాక్స్'' ప్రోగ్రామ్‌ను ఆయన ప్రస్తావించారు.

అయితే, ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఏ వయస్సుల వారికి ఇది వర్తిస్తుందనే విషయాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

రాష్ట్రవ్యాప్తంగా నిషేధాలు విధించడం కష్టమని డిజిటల్ హక్కుల కార్యకర్త నిఖిల్ పాహ్వా తెలిపారు. ''ఐపీ అడ్రెస్‌ల ద్వారా యూజర్ల లొకేషన్లను తెలుసుకోవచ్చు. అయితే, ఈ వ్యవస్థలు తరచూ కచ్చితమైన ఫలితాలను ఇవ్వవు. రాష్ట్రాల సరిహద్దులు దగ్గరగా ఉన్నప్పుడు.. ఒక రాష్ట్రం సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించి, మరో రాష్ట్రం విధించకపోతే అది గందరగోళ పరిస్థితులకు దారితీయవచ్చు'' అని నిఖిల్ పాహ్వా చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

వయస్సు నిర్ధరణ చుట్టూ ఉన్న ఇబ్బందులను ఎత్తిచూపుతూ.. ఈ సమస్య కేవలం భారత్‌కే పరిమితమైనది కాదని అన్నారు.

''వయసు ధ్రువీకరణ అంత తేలిక కాదు. ఈ నిషేధాలు అమలు చేయాలంటే.. ఇంటర్నెట్‌లో ప్రతి సర్వీసును వాడుతున్న ప్రతి వ్యక్తి వయస్సును కంపెనీలు ధ్రువీకరించాలి'' అని పాహ్వా బీబీసీతో అన్నారు.

ఆస్ట్రేలియాలో ఈ నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత.. కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకునేందుకు నకిలీ పుట్టిన తేదీలను వినియోగించినట్లు బీబీసీకి తెలిపారు.

ఈ నిషేధాల అమలు ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా ఇంటర్‌మీడియరీల సహకారంపై కూడా ఆధారపడి ఉంటుందని పబ్లిక్ పాలసీ నిపుణులు, టెక్ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ప్రోగ్రామ్‌ల హెడ్ ప్రతీక్ వాఘ్రే చెప్పారు.

''ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు లేదా టెక్నాలజీ కంపెనీలు ఐపీ అడ్రస్‌ల ద్వారా లొకేషన్‌ను గుర్తించవచ్చు. అయితే, ఇలాంటి యాప్‌లను నిర్వహిస్తోన్న కంపెనీలు ఈ ఆదేశాలకు కట్టుబడి ఉంటాయా? కోర్టుల్లో ఈ ఆదేశాలను సవాలు చేస్తాయా? అన్నదానిపై స్పష్టత లేదు'' అని తెలిపారు.

దీనిని చట్టసభ సభ్యులు అసలు సమస్యగా గుర్తించినప్పటికీ, ఈ నిషేధం దానికి తగిన పరిష్కారంగా అనిపించడం లేదని నిపుణులు అంటున్నారు.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, BBC/Jessica Hromas

ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ 1,277 మంది భారతీయ టీనేజర్లపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారతీయ డిజిటల్ వ్యవస్థలో వయస్సు ఆధారిత ఆంక్షలు, ధ్రువీకరణ వ్యవస్థలకు అదనపు అడ్డంకులు ఎదురయ్యే అవకాశముంది.

చాలా అకౌంట్లను కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల సహకారంతో తెరుస్తున్నారని తెలిపింది. ఈ అకౌంట్లకు వారి వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్‌లను కూడా అనుసంధానించడం లేదు. దీనివల్ల, వయస్సు ధ్రువీకరణ వ్యవస్థలకు ఆధారమైన ఆ ఖాతా ఈ వ్యక్తిదే అని చెప్పడం కష్టమవుతుంది.

భారత్‌లో పిల్లలకు ఆన్‌లైన్ నిషేధాన్ని కొంతమంది తల్లిదండ్రులు స్వాగతిస్తున్నప్పటికీ, అందులోని సమస్యలను ఎత్తిచూపుతున్నారు.

''తల్లిదండ్రులే వారి పిల్లలకు సరైన సమయాన్ని ఇవ్వడం లేదు. ఆ సమయంలో వారికి ఫోన్లు ఇస్తున్నారు. అక్కడే సమస్య ప్రారంభమవుతుంది'' అని ఇద్దరు పిల్లల తండ్రి, దిల్లీవాసి జితేందర్ యాదవ్ అన్నారు.

''సోషల్ మీడియా నిషేధం సాయం చేస్తుందని నాకనిపించడం లేదు. ఎందుకంటే, తల్లిదండ్రులు పిల్లలకు సరైన సమయం ఇవ్వకపోతే లేదా పిల్లలు ఏదైనా సృజనాత్మక పనుల్లో నిమగ్నం కాకపోతే, ఇలాంటి నిషేధాలను అధిగమించే మార్గాలను వారు వెతుక్కుంటారు'' అని ఆయన అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)