‘వైద్యురాలి హిజాబ్ లాగిన నితీశ్ కుమార్’.. ఏమిటీ వివాదం? పాకిస్తాన్‌లోనూ దీనిపై చర్చ ఎందుకు జరుగుతోంది?

ఫొటో సోర్స్, @NitishKumar
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక వివాదంలో చిక్కుకున్నారు.
కొత్తగా నియమితురాలైన ఆయుష్ డాక్టర్ హిజాబ్‌ను తొలగించేందుకు బిహార్ సీఎం నితీశ్ ప్రయత్నించారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆయనపై విమర్శలు చేస్తున్నాయి.
నితీశ్ కుమార్ ‘మానసికస్థితి బాగాలేదు’ అని ఆరోపిస్తున్నాయి.


ఫొటో సోర్స్, @NitishKumar
వీడియోలో ఏముంది?
ఒక ముస్లిం మహిళా ఆయుష్ డాక్టర్‌కు అపాయింట్‌మెంట్ లెటర్ అందజేస్తున్న సమయంలో ఆమె హిజాబ్‌ను నితీశ్ కుమార్ లాగుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నితీశ్ కుమార్ వెనుక నిలుచున్న బిహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ ముఖ్యమంత్రిని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది.
బిహార్ ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ దీపక్ కుమార్ ఆ సమయంలో నవ్వుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
కొత్తగా నియమితురాలైన డాక్టర్ తన అపాయింట్‌మెంట్ లెటర్‌ను స్వీకరించడానికి హిజాబ్ ధరించి వచ్చారు.
అప్పుడు, 75 ఏళ్ల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ "ఇదేంటి?" అని అడిగారు. వేదికపై నిలబడి ఉన్న నితీశ్ కుమార్ కొద్దిగా వంగి ఆమె హిజాబ్‌ను కిందికి లాగుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
ఆయుష్ వైద్యులకు నియామక లేఖల పంపిణీ కార్యక్రమం ఫోటోలను నితీశ్‌కుమార్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. "సచివాలయంలో ఉన్న 'సంవాద్'లో 1,283 మంది ఆయుష్ వైద్యులకు (ఆయుర్వేద, హోమియోపతి, యునాని) నియామక లేఖల పంపిణీ కార్యక్రమానికి నేను హాజరయ్యాను" అని ఆ ఫోటోలతో పాటు నితీశ్‌కుమార్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నితీశ్ కుమార్ రాజీనామా చేయాలి’
ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను షేర్ చేసి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ నితీశ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
''ఆయన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఆయన సిగ్గులేనితనాన్ని చూడండి. ఒక మహిళా డాక్టర్ తన అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నితీశ్ కుమార్ ఆమె హిజాబ్‌ను లాగారు" అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
"బిహార్‌లో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇక రాష్ట్రంలో మహిళలు ఎంత సురక్షితంగా ఉంటారో ఊహించుకోండి? ఈ చర్యకు పాల్పడినందుకు నితీశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. ఈ అసభ్యకర ప్రవర్తన క్షమించరానిది" అని కాంగ్రెస్ విమర్శించింది.
"నితీశ్ కుమార్‌కు ఏమైంది? ఆయన మానసిక స్థితి దయనీయ స్థితికి చేరుకుంది" అని బిహార్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ విమర్శించింది.
జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ ఇంగ్లిష్ వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని సమర్థించారు.
ప్రతిపక్ష పార్టీలు ఏ వీడియో క్లిప్‌నూ అనవసరంగా హైలైట్ చేయకూడదని నీరజ్ కుమార్ అన్నారు.
"బిహార్‌లో మహిళలు, మైనారిటీల సంక్షేమం కోసం నితీశ్ కుమార్ చాలా కృషి చేశారు" అని అన్నారు.
దేవ్‌బందీ మతాధికారి ఖారీ ఇషాక్ గోరా వార్తా సంస్థ పీటీఐతో దీనిపై మాట్లాడారు.
"ఇది నాకు మాత్రమే కాదు. మొత్తం దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నితీశ్‌కుమార్ ఓ కార్యక్రమంలో ఒక మహిళ హిజాబ్‌ను తీసివేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక వైపు మీరు మహిళల గౌరవం గురించి మాట్లాడుతుంటారు. మరోవైపు మీరు ఓ స్త్రీని అవమానిస్తున్నట్టు కనిపిస్తోంది. నితీశ్‌కుమార్ మొత్తం దేశంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి" అని ఇషాక్ గోరా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లోనూ చర్చ
పాకిస్తాన్ ప్రజలు కూడా సోషల్ మీడియాలో ఈ వీడియోపై స్పందిస్తున్నారు. పాకిస్తాన్ రాజకీయ విశ్లేషకుడు అమ్మార్ మసూద్ ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు.
"భారతదేశంలో ముస్లింలపై కనబరుస్తున్న దుష్ప్రవర్తనకు ఇది ఒక విచారకరమైన ఉదాహరణ. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక ముస్లిం మహిళా వైద్యురాలికి అపాయింట్‌మెంట్ లెటర్ అందజేస్తూ ఆమె ముసుగును బలవంతంగా లాగారు" అని రాశారు.
పాకిస్తానీ జర్నలిస్ట్ మోయిద్ పీర్జాదా ఎక్స్‌లో ఇలా రాశారు.
"ఇది చాలా ఆసక్తికరమైన వీడియో. ఇది పితృస్వామ్యానికి, ఆధునికతకు మధ్య అనేక స్థాయిల్లో సాంస్కృతిక ఘర్షణను చూపిస్తుంది. ముఖ్యమంత్రి మహిళ హిజాబ్‌ను తొలగించి తన పితృస్వామ్య మనస్తత్వంలో సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. ఆమె తన ముఖాన్ని చూపించి తన విజయాన్ని ప్రపంచంతో పంచుకోవాలని ప్రోత్సహిస్తున్నట్టు ఆయన భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమైంది ఒక మహిళ అవార్డు అందుకుంటున్నప్పుడు, ఆమె విజయాన్ని వేడుకగా చేసుకుంటున్నప్పుడు ఆమె గుర్తింపును ఎందుకు దాచాలి?" అని రాశారు.
"ఆయన ఆధునికత అన్ని నైతికతలను అవమానకరమైన రీతిలో ధిక్కరిస్తారు. ఒక మహిళ గోప్యతను బలవంతంగా తొలగిస్తారు. ఆమె గుర్తింపును బయటపెడతారు. ఈ కథ అంత తేలికైనది కాదు. ఆధునికత కూడా మహిళలు తమ ముఖాలను దాచుకోకూడదని కోరుతుంది. హిజాబ్ లేదా నిఖాబ్ కింద తమ ముఖాలను దాచుకునే స్త్రీలను పితృస్వామ్య అణచివేతకు నిస్సహాయ బాధితులుగా పరిగణిస్తారు" అని మోయిద్ పీర్జాదా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బిహార్ సీఎం ప్రవర్తనపై తరచూ వివాదాలు
ఇటీవల బహిరంగ సమావేశాల్లో, అసెంబ్లీలో నితీశ్ కుమార్ ప్రవర్తనపై అనేక విమర్శలొస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 21న మదర్సా కార్యక్రమంలో నితీశ్ కుమార్ క్యాప్ ధరించడానికి నిరాకరించిన వీడియో వైరల్ అయింది.
కొన్ని నెలల క్రితం నితీశ్ కుమార్ ఒక కార్యక్రమంలో ఒక ఐఏఎస్ అధికారి తలపై ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఉంచారు. ఈ ఏడాది జనవరిలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత నితీశ్ కుమార్ అకస్మాత్తుగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు.
మార్చిలో సీఎం నితీశ్ కుమార్ జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తన ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించారు.
గత ఏడాది దర్భంగాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకడానికి ప్రయత్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














