వైరల్ ఫుడ్స్: 'ఆవగింజంత' ప్రయోజనముంటే గుమ్మడికాయంత ప్రచారం చేస్తున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యాస్మిన్ రూఫో
- హోదా, బీబీసీ న్యూస్
- చదివే సమయం: 5 నిమిషాలు
గట్ హెల్త్, అంటే పేగు ఆరోగ్యం. ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన పదాలలో ఇదొకటి.
ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు నానబెట్టిన నీళ్లు తాగడం దగ్గరి నుంచి మొదలుపెడితే.. స్మూతీల్లో సముద్రపు నాచును కలపడం(సీ మాస్ జెల్), పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకంటూ ఎముకల రసం(బోన్ బ్రోత్) తాగడం వరకు..! ఇవి మన మూడ్‌ను మెరుగుపరుస్తాయి, శక్తిని పెంచుతాయి వంటి అనేక ప్రయోజనాలను ఆపాదించేస్తున్నారు.
అయితే, ఈ వైరల్ ఫుడ్స్ వెనుక వాస్తవం మాత్రం సంక్లిష్టమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, గట్ మైక్రోబయోమ్‌కు(పేగులో ఉండే సూక్ష్మజీవుల సమూహం) సంబంధించిన పరిశోధనలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉండటంతో, దాదాపు ప్రతిరోజూ కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పేగులలోని సూక్ష్మక్రిముల సముదాయం నిజంగానే కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, గట్ హెల్త్‌ను 'సరిచేస్తాయ'ని చెప్పే ఈ ఉత్పత్తులకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇప్పటికీ పరిమితమే.
అందువల్ల, ఆరోగ్యంగా ఉన్నవారు తమ జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆందోళనతో అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి?
గట్ అంటే నోటి నుంచి మలద్వారం వరకు విస్తరించి ఉన్న మొత్తం జీర్ణవ్యవస్థ అని బీబీసీ సైన్స్ బ్రాడ్‌క్యాస్టర్ కరోలిన్ స్టీల్ అభివర్ణించారు.
ఈ జీర్ణవ్యవస్థలోనే గట్ మైక్రోబయోమ్ ఉంటుంది. ఇది లక్షల కోట్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగీల సముదాయం. ఇవి మన శరీరం ఎలా పనిచేస్తుందో నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మన శారీరక, మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి.
''మన గట్ మైక్రోబయోమ్ మన వేలిముద్రకన్నా ప్రత్యేకమైనది'' అంటారు స్టీల్. ఆహారం నుంచి శక్తిని సమర్థవంతంగా గ్రహించడం, రక్తంలో చక్కెరస్థాయిలు నియంత్రణలో ఉండడం, రోగనిరోధకశక్తి వంటి విషయాలు ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్స్‌తో ముడిపడి ఉన్నాయని స్టీల్ చెప్పారు.
ఆందోళన తగ్గించడం, మూడ్‌ను మెరుగుపరచడంతో సహా మానసిక ఆరోగ్యానికి, ఆరోగ్యవంతమైన జీర్ణవ్యవస్థకూ సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వైరల్ ఫుడ్స్‌తో నిజంగా అంత ప్రభావం ఉంటుందా?
ట్రెండ్ అవుతున్న అనేక ఆహారాల్లో ''ఆవగింజంత నిజం'' ఉంటే, వాటిని అద్భుతమైన ఉత్పత్తులుగా ప్రచారం చేస్తున్నారని మైక్రోబయాలజిస్ట్ అలెన్ వాకర్, గట్ హెల్త్ సైంటిస్ట్ డాక్టర్ మేగన్ రోస్సీ చెప్పారు.
- చియా గింజల నీరు:
చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మంచి గట్ బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుందని, మలవిసర్జనను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుందని డాక్టర్ రోస్సీ చెబుతున్నారు.
అయితే, వేర్వేరు సూక్ష్మక్రిములకు వేర్వేరు రకాల ఫైబర్లు అవసరమవుతాయని వాకర్ వివరించారు. అందుకే ఒకేరకమైన ఆహారంపై ఆధారపడటంకంటే వివిధ రకాల ఫైబర్లు అందించే భిన్నమైన ఆహారం తీసుకోవడమే ముఖ్యమంటున్నారు వాకర్.
"చియా విత్తనాల నీళ్లు తాగడంలో ఎలాంటి హానీ లేదు. కానీ, దాని వల్ల మాత్రమే గణనీయమైన ప్రయోజనం ఉంటుందని చెప్పలేం" అని ఆయన స్పష్టం చేశారు.
- ఆలివ్ ఆయిల్ షాట్స్:
ఆలివ్ ఆయిల్‌కు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణాలు ఉన్నాయని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని వాకర్ చెప్పారు.
కానీ, దానిని నేరుగా షాట్‌లా తాగితే గట్ మైక్రోబయోమ్‌కు అదనపు లాభం ఉంటుందనేందుకు ఆధారాలు లేవని ఆయన తెలిపారు.
"ఆలివ్ ఆయిల్‌ను నేరుగా తాగడం, ఆహారంలో కలిపి తీసుకోవడం.. ఈ రెండింటి మధ్య గణనీయమైన తేడా కూడా ఏమీ లేదు" అని వాకర్ స్పష్టం చేశారు.
- సీ మాస్ జెల్
సముద్రపు నాచుతో తయారయ్యే సీ మాస్ జెల్‌లో ఫైబర్‌తో పాటు కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందువల్ల ఇది విస్తృత ప్రచారం పొందింది.
అయితే, గట్ మైక్రోబయోమ్ లేదా జీర్ణక్రియ మెరుగుపడటానికి ఇది సహాయపడుతుందన్న విషయానికి శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ రోస్సీ చెప్పారు.
ముఖ్యంగా, ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్నవారు దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవద్దని ఆమె హెచ్చరిస్తున్నారు.
సముద్రపు నాచులో భారీగా లోహాలు, అయోడిన్ ఉండే అవకాశం ఉందని, ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వాకర్ కూడా హెచ్చరిస్తున్నారు.
- బోన్ బ్రోత్
ప్రోటీన్లు, ఖనిజాల కోసం జంతువుల ఎముకలను వెనిగర్ వంటి రసాయనాలతో పాటు మూలికలు లేదా కూరగాయలతో కనీసం 24 గంటల పాటు నీటిలో మరిగించడం ద్వారా బోన్ బ్రోత్ తయారు చేస్తారు.
ఇది పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారమే అయినా, దానిలోని ఎక్కువ భాగం చిన్న పేగే గ్రహిస్తుందని వాకర్ తెలిపారు. అయితే, గట్ సూక్ష్మక్రిముల్లో ఎక్కువ భాగం పెద్ద పేగులో ఉంటాయి. అందువల్ల ఈ పోషకాలు వాటికి చేరే అవకాశం చాలా తక్కువ.
"బోన్ బ్రోత్ గట్ మైక్రోబయోమ్‌పై క్రమబద్ధమైన ప్రయోజనం కలిగిస్తుందన్న బలమైన ఆధారాలు లేవు" అంటారు వాకర్.
బోన్ బ్రోత్‌పై పైభాగంలో పేరుకునే సాచురేటెడ్ కొవ్వును తొలగించకపోతే కొలెస్ట్రాల్ స్థాయులపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముందని గమనించినట్టు డాక్టర్ రోస్సీ చెప్పారు.
- కొంబుచా
కొంబుచా అనేది పులియబెట్టిన తేనీరు. సంప్రదాయ కొంబుచా తనకు చాలా ఇష్టమని డాక్టర్ రోస్సీ అంటారు. ఇది పులిసే సమయంలో ఏర్పడే సహజ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆమె వివరించారు.
అయితే, కొంబుచా పానీయాలన్నీ ఒకేలా ఉండవని ఆమె హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు జాగ్రత్త పడాలి?
దీర్ఘకాలిక మలబద్ధకం, విరేచనాలు, ఎక్కువగా గ్యాస్ విడుదల కావడం, నిరంతర కడుపునొప్పి వంటి లక్షణాలు జీర్ణవ్యవస్థ సమస్యకు సంకేతాలు కావొచ్చని కరోలిన్ స్టీల్ చెబుతున్నారు.
అలాంటి సందర్భాల్లో, ఆహారానికి సంబంధించి ప్రయోగాలు చేయకుండా డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిదని ఆమె సూచిస్తున్నారు.
"జీర్ణక్రియ సమస్య ఉన్నప్పుడు బ్రెడ్ వంటి ఆహారాలను పూర్తిగా మానేయడం వల్ల మాత్రేమే అది నయం కాదు'' అని ఆమె స్పష్టం చేశారు.
చాలామందికి తీవ్రమైన ఆహార మార్పులు అవసరం ఉండవని, సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారు తమ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవాలనే భావన అవసరం లేదని ఆమె చెప్పారు.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే, ఈ ట్రెండీ ఫుడ్స్ పెద్దగా మార్పు కలిగించవని ఆమె అభిప్రాయపడ్డారు.
ట్రెండ్స్ వెనక పరుగెత్తడం కన్నా, ఎక్కువగా కాయగూరలు తినడం, ప్రాసెస్డ్ ఆహారాన్ని తగ్గించడం, ఫైబర్‌ను పెంచడం లాంటి సాధారణ అలవాట్లే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటానికి సరిపోతాయని స్టీల్ సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














