బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన 45 ఏళ్ల నితిన్ నబీన్ ఎవరు?

నితిన్ నబీన్, బీజేపీ, బిహార్

ఫొటో సోర్స్, BJP/X

చదివే సమయం: 4 నిమిషాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్‌ బాధ్యతలు స్వీకరించారు.

నితిన్ నబీన్‌కు బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. లక్ష్మణ్ ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ అభినందనలు తెలిపారు.

నితిన్ నబీన్‌ను అభినందిస్తూ మోదీ.. పార్టీలో తాను ఒక కార్యకర్తనని, నితిన్ నబీన్ తన బాస్ అని అన్నారు.

బీజేపీకి 12వ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించడం చరిత్రాత్మక సందర్భమని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నితిన్ నబీన్, బీజేపీ, బిహార్

ఫొటో సోర్స్, @NitinNabin

ఫొటో క్యాప్షన్, నితిన్ నబీన్

బీజేపీ ఆవిర్భవించిన రెండు నెలల తర్వాత పుట్టిన నితిన్ నబీన్

1968లో అటల్ బిహారీ వాజపేయీ భారతీయ జన్‌సంఘ్ అధ్యక్షుడైనప్పుడు ఆయన వయసు 44 సంవత్సరాలు.

ఎల్‌కే అడ్వాణీ కూడా 1973లో 46 ఏళ్ల వయసులో జన్‌సంఘ్ అధ్యక్షుడయ్యారు.

1977లో భారతీయ జన్‌సంఘ్ జనతా పార్టీలో విలీనం అయింది. అయితే ఈ విలీనం మూడేళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగలేదు.

ఏప్రిల్ 6, 1980న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. దాని మొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజపేయీ ఉన్నారు.

బీజేపీ ఆ సమయంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రయత్నిస్తోంది. 1984 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

ఇప్పుడు బీజేపీ పగ్గాలు నితిన్ నబిన్ చేతిలో ఉన్నాయి.

నితిన్ నబిన్ మే 23, 1980న జన్మించారు.

అంటే బీజేపీ పుట్టిన రెండు నెలల తర్వాత ఆయన జన్మించారు.

నితిన్ నబీన్, బీజేపీ, బిహార్

ఫొటో సోర్స్, @NitinNabin

ఫొటో క్యాప్షన్, నితిన్ నబీన్ తొలిసారి 2006లో ఎమ్మెల్యే అయ్యారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందు నితిన్ నబీన్ బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి (నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్)గా నియమితులయ్యారు.

అంతకుముందు ఆయన బిహార్ ప్రభుత్వంలో రహదారుల శాఖ మంత్రిగా, ఛత్తీస్‌గఢ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పనిచేశారు.

నితిన్ నబీన్ తొలిసారి 2006లో పట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

2010 నుంచి 2025 వరకు వరుసగా బంకీపుర్ స్థానం నుంచి విజయం సాధించారు.

నితిన్ నబీన్ , బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, బిహార్ మంత్రి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, తండ్రి ఫోటో ముందు నితిన్

నితిన్ నబీన్ ఎవరు?

నితిన్ నబీన్ 1980లో ఝార్ఖండ్‌లోని రాంచీలో జన్మించారు.

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆయన తండ్రి పేరు నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా. పట్నాలోని టేలర్ రోడ్‌లో నివాసం.

తానొక సామాజిక కార్యకర్తనని, తాను ఏ క్రిమినల్ కేసులోనూ దోషిగా తేలలేదని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు నితిన్.

నితిన్‌ నబీన్ 1996లో పట్నాలోని సెయింట్ మైకేల్స్ హైస్కూల్ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.

1998లో దిల్లీలోని సీఎస్‌కేఎం పబ్లిక్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదివారు.

"నితిన్ నబీన్ 2006లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. దానిని ఆయన వారసత్వంగా పొందారని చెప్పొచ్చు. ఆయన తండ్రి నబీన్ కిశోర్ సిన్హా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి మరణం తర్వాత ఆయన ఆ స్థానం నుంచి గెలుస్తున్నారు" అని సీనియర్ జర్నలిస్ట్ నచికేత నారాయణ్ చెప్పారు.

నితిన్ నబీన్ 2016 నుంచి 2019 వరకు బీజేపీ యువ మోర్చా బిహార్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2021లో తొలిసారి నితీశ్ కమార్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

"నరేంద్రమోదీ గురించి జాతీయ రాజకీయాల్లో పెద్దగా చర్చ లేని సమయంలోనూ ఆయన మోదీకి అనుకూలంగానే ఉన్నారు" అని ఆయన అన్నారు.

నితిన్ నబీన్ , బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, బిహార్ మంత్రి

ఫొటో సోర్స్, @NitinNabin

2010లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు పట్నా వచ్చారు.

ఆ సమయంలో వార్తా పత్రికల్లో ప్రచురించిన ఒక ప్రకటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ ప్రకటనలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్ చేతులు పట్టుకున్నట్లుగా ఉంది. వరదల సమయంలో గుజరాత్ ప్రభుత్వం బిహార్‌కు సాయం చేసినట్లుగా అందులో వివరణ ఉంది.

ఈ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన నితీశ్ కుమార్, తన అనుమతి లేకుండా ఆ యాడ్ ప్రచురించారని అన్నారు.

అంతేకాకుండా, బీజేపీ నాయకుతలతో విందు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

విందు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న ఫోటోలు పత్రికల్లో వచ్చాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)