You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వాడిపడేసే డైపర్ల సమస్యకు ప్లాస్టిక్‌ను తినే శిలీంధ్రాలే సమాధానమా? ఈ దేశాల్లో ఏం చేస్తున్నారు?
- రచయిత, సుజానె బియర్న్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
- చదివే సమయం: 6 నిమిషాలు
మూడేళ్ల కిందట ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన లీలా గ్రీన్, తల్లి కావడానికి ముందు తన పిల్లలకు రీయూజబుల్ డైపర్లను వాడాలని అనుకునేవారు.
''కానీ పిల్లలు పుట్టిన తర్వాత, అది నా వల్ల కాదని అర్థమైంది. ఆ ముగ్గురినీ చూసుకోవడానికే నాకు సమయం సరిపోయేది కాదు. అందుకే నేనొక సులభమైన మార్గం 'డిస్పోజబుల్ డైపర్లు'నే ఎంచుకున్నాను'' అని ఆమె చెప్పారు.
బ్రిటన్‌లో కెంట్‌లోని బ్రాడ్‌స్టెయిర్స్‌లో నివసిస్తున్న ఆమె, మాతృత్వ సమస్యలపై ఆన్‌లైన్ కమ్యూనిటీని నడుపుతున్నారు.
''మేం మొదట్లో రోజుకు 25 డైపర్లను వాడేవాళ్లం. వాస్తవానికి పర్యావరణ హితమైనవే వాడాలని తల్లులందరికీ ఉంటుంది. కానీ, వారు రోజువారీ జీవితంలో చాలా బిజీగా ఉంటారు. పైగా, ఆ ప్రత్యామ్నాయ డైపర్లు తక్కువ ధరలో అందుబాటులో ఉండాలి'' అని లీలా గ్రీన్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి సగటున సుమారు 3 లక్షల డిస్పోజబుల్ డైపర్లు భూమిలో పూడ్చిపెట్టడమో లేదా తగులబెట్టడమో చేస్తున్నారు. సాధారణంగా వీటిలో ఉండే ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలు మట్టిలో కలిసిపోవడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుంది. ఇది తీవ్రమైన పర్యావరణ సమస్యలకు దారితీస్తోంది.
ఉతికి శుభ్రం చేసుకొని పునర్వినియోగానికి ఉపయోగపడే డైపర్లు వంటి పర్యావరణ అనుకూలమైనవి ఉన్నప్పటికీ, వాటికయ్యే శ్రమ, ఖర్చు కారణంగా వినియోగం పరిమితంగానే ఉంది.
పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు...
గత కొన్నేళ్లుగా అనేక స్టార్టప్‌లు డిస్పోజబుల్ డైపర్లు వంటి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను మార్కెట్లోకి తెచ్చాయి.
టెక్సస్‌కు చెందిన హిరో టెక్నాలజీస్ అనే సంస్థ, బ్లీచింగ్ చేయని డిస్పోజబుల్ డైపర్లను తయారుచేసింది. దీనితో పాటు శిలీంధ్రాలు ఉన్న ఒక ప్యాకెట్ కూడా ఇస్తారు. డైపర్‌ను వాడిపారేసే సమయంలో ఈ ప్యాకెట్‌ను దానికి జోడించాలి.
తన కుమారుడికి వాడుతున్న డైపర్లను చూసిన మికి అగర్వా ఈ బ్రాండ్‌ను స్థాపించారు. కాలక్రమేణా ఈ డైపర్‌లను శిలీంధ్రాలు పూర్తిగా మట్టిలో కుళ్లేలా చేయగలవని ఆమె చెబుతున్నారు.
అయితే ఈ శిలీంధ్రాలు ఎంత త్వరగా పనిచేస్తాయనే విషయంలో నిర్దిష్టమైన సమయాన్ని చెప్పడం కష్టమని అగర్వా అంటున్నారు.
"ప్రతిచోటా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఈ శిలీంధ్రాలు కొన్ని రకాల వాతావరణాల్లో ఇతర ప్రాంతాల కంటే మెరుగ్గా పనిచేస్తాయి. అందుకే దీనికి సంబంధించి ఒక ఖచ్చితమైన సమయాన్ని చెప్పలేం'' అని అగర్వా చెప్పారు.
"మేం చెప్పగలిగేదల్లా ఒక్కటే... అనుకూలమైన పరిస్థితుల్లో ఈ శిలీంధ్రాలు లేని డైపర్ల కంటే ఇవి చాలా రెట్లు వేగంగా విచ్ఛిన్నమవుతాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా, ఏమీ లేకపోవడం కంటే ఇవి ఎంతో మేలు'' అని అన్నారు.
ఈ డైపర్లకు నెలవారీగా అయ్యే ఖర్చు 136 డాలర్లు (సుమారు రూ.12,585 ). సాధారణ డిస్పోజబుల్ డైపర్లయితే నెలకు 70 డాలర్లు (సుమారు రూ.6,478 ) అవుతుంది.
మరి ఈ ధర సామాన్య కుటుంబాల్లో తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుందా? అంటే,
''లగ్జరీ డైపర్ల ధర కంటే మా డైపర్ల ధర తక్కువే" అని అగర్వా బదులిచ్చారు.
''బిడ్డ ఆరోగ్యానికి, వారు పెరిగే భూమికి ఏది మేలో, అటువంటి డైపర్ కోసం ఇది మంచి ధర అని నేను భావిస్తున్నాను.
అంతేకాకుండా, ఈ డైపర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ఆమె చెప్పారు.
తయారీ వ్యయం ఎక్కువే...
పర్యావరణహితమైన డైపర్ల తయారీలో పురోగతి చాలా నెమ్మదిగా, అస్థిరంగా ఉంది. దీనికి అధిక ఉత్పత్తి ఖర్చులు, సప్లై చెయిన్‌లో ఆటంకాలు వంటి అనేక కారణాలు ఉన్నాయని యూరోమానిటర్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సోనాలి జగ్‌దేవ్ అభిప్రాయపడ్డారు.
''సంప్రదాయ ప్లాస్టిక్ కంటే బయో ఆధారిత పాలిమర్లు, వెదురు పీచు, ఆర్గానిక్ కాటన్ వంటి ముడి పదార్థాల సేకరణ, ప్రాసెసింగ్ ఖర్చులు చాలా ఎక్కువ. అంతేకాకుండా, ఈ పర్యావరణహిత వనరుల సరఫరా వ్యవస్థలు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదు. దీనివల్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా బ్రాండ్లు వీటిని రూపొందించడం సవాలుగా మారింది," అని ఆమె వివరించారు.
చిన్న స్థాయి కంపెనీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని సోనాలి జగదేవ్ అభిప్రాయపడ్డారు.
''పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడిపదార్థాల అధిక ధరలే గాకుండా, మార్కెటింగ్ కోసం భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండటంతో ఈ కంపెనీల ఉత్పత్తులు పర్యావరణానికి ఎంత మేలు చేసేవైనప్పటికీ, మార్కెట్‌లో నిలదొక్కుకోవడం వారికి కష్టంగా మారుతోంది'' అని వివరించారు.
కంపోస్టింగ్ కోసం సౌకర్యాలు తక్కువే..
వ్యర్థాలను ఎరువుగా మార్చేందుకు కంపోస్టింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం మరొక పెద్ద సవాలు.
"చాలా ప్రాంతాల్లో పారిశ్రామిక కంపోస్టింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి లేదా అసలు అందుబాటులో లేవు. దీనివల్ల బయోడీగ్రేడబుల్ డైపర్లు కూడా చివరకు చెత్తకుప్పలకే చేరుతున్నాయి" అని సోనాలి జగ్‌దేవ్ చెప్పారు.
అంతేకాకుండా, వినియోగదారుల ప్రాధాన్యతలు కూడా ముఖ్యమైనవి. ''తల్లిదండ్రులు పర్యావరణ హితం కంటే డైపర్ల పనితీరు, పరిశుభ్రత, సౌకర్యానికే ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి, ఈ ప్రాథమిక అంశాలలో ఏ ఒక్క దానితోనైనా రాజీ పడితే, పర్యావరణ అనుకూల పరిష్కారాలను అందించే బ్రాండ్‌లు మార్కెట్‌లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని ఆమె వివరించారు.
అదే బాటలో మరికొన్ని సంస్థలు
బెల్జియంలో, ఈ ఆటంకాలను అధిగమించడానికి వూష్ అనే మరొక స్టార్టప్ ప్రయత్నిస్తోంది.
తాము తయారుచేసే డైపర్‌లు వివిధ రకాల పదార్థాల కలయికతో కాకుండా, కేవలం కొన్ని పరిమిత పదార్థాలతో తయారవుతాయని, అందుకే వీటిని రీసైకిల్ చేయడం సులభమని వూష్ సంస్థ చెబుతోంది.
ఒక నిర్దిష్ట రకమైన ప్లాస్టిక్‌ను ఉపయోగించడంపైనే తాము దృష్టి సారించామని ఆ సంస్థ సహ-వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆల్బీ రోజ్‌వేర్ చెప్పారు.
''మీరు వేర్వేరు ప్లాస్టిక్‌లను ఉపయోగిస్తే, రీసైక్లింగ్ చేసేటప్పుడు వాటిని వేరు చేయడం అత్యంత కష్టమైన పని'' అని ఆయన వివరించారు.
ఈ కంపెనీ డే-కేర్ సెంటర్లతో కలిసి పనిచేస్తోంది. అక్కడ పిల్లలకు అవసరమైన డైపర్లను సరఫరా చేయడంతో పాటు, వాడిన వాటిని తిరిగి సేకరిస్తుంది. ఈ సేకరించిన డైపర్లను వారి సొంత రీసైక్లింగ్ కేంద్రంలో ప్రాసెస్ చేసి, కొన్ని పదార్థాలను తిరిగి వినియోగిస్తారు.
''మేం సరైన పదార్థాలను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలనుకున్నాం. తద్వారా రీసైక్లింగ్ తర్వాత మళ్లీ సరైన పదార్థాలనే పొందవచ్చు. మన వ్యర్థాలను తిరిగి తీసుకునే బాధ్యత మనమే తీసుకోనంతవరకు, మరెవరికీ దీనిపై ఆసక్తి ఉండదు'' అని రోజ్‌వేర్ చెప్పారు.
''పెద్ద బ్రాండ్లు కేవలం ఖర్చులను తగ్గించుకోవడానికే మొగ్గు చూపిస్తాయి. కానీ చాలా సందర్భాలలో, డైపర్ల రీసైక్లింగ్ సామర్థ్యంపై దృష్టి పెట్టడానికి ఆ బ్రాండ్‌లకు ఎటువంటి ప్రోత్సాహకం ఉండదు'' అని అన్నారు.
ప్రస్తుతం వూష్ సంస్థ బెల్జియం దేశవ్యాప్తంగా 1,400కి పైగా డే-కేర్ సెంటర్లతో కలిసి పనిచేస్తోంది. ప్రతిరోజూ 30వేల మందికి పైగా పిల్లలు వూష్ డైపర్లను ధరిస్తున్నారని ఆ సంస్థ చెబుతోంది.
న్యాపీ, వైప్స్ బ్రాండ్ పురా కూడా రీసైక్లింగ్‌పైనే దృష్టి సారించింది.
వేల్స్ ప్రభుత్వ మద్దతుతో ఈ సంస్థ ఏటా అక్కడ 6 కోట్ల న్యాపీలను రీసైకిల్ చేస్తోంది.
వాడేసిన న్యాపీలను నివాస ప్రాంతాల నుంచే సేకరించి, సౌత్ వేల్స్‌లోని న్యాపీసైకిల్ ప్లాంట్‌లో ప్రాసెస్ చేస్తారు. అక్కడ 'ఫ్రిక్షన్ వాషింగ్' అనే విధానంలో ఈ న్యాపీలను ఒక మిశ్రమ పదార్థంగా మారుస్తారు. ఈ పదార్థాన్ని రోడ్ల తయారీ నుంచి పార్కుల్లో కూర్చునే బెంచీల వరకు రకరకాల పనుల కోసం ఉపయోగిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)