తెలంగాణ: మంత్రులు వర్సెస్ మీడియా వివాదంలో ‘తెర వెనక ఎవరో ఉన్నారు’ అంటూ ఆరోపణలు

తెలంగాణ మంత్రులు, మీడియా, సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫొటో సోర్స్, Telangana CMO

  • చదివే సమయం: 4 నిమిషాలు

తెలంగాణ మంత్రిమండలి చుట్టూ గతంలో ఎన్నడూ లేనంతగా చర్చలు, వివాదాలు జరుగుతున్నాయి. ఒకేసారి ఇద్దరు మంత్రులపై రెండు ప్రముఖ మీడియా సంస్థలు రాసిన కథనాలే అందుకు కారణం.

నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి అంటూ పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యక్తిగత అంశంపై ఎన్టీవీ వార్త రాయడం (ఆ తర్వాత ఆ కథనంపై ఎన్టీవీ క్షమాపణలు చెప్పింది), దానిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించడం, ఇటు ఎన్టీవీ విలేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. ఆ వేడి చల్లారకముందే, ఆ వార్త వెనుక కారణం ఇదే అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక మరో వార్తతో ముందుకు రావడం సంచలనంగా మారింది.

ఎన్టీవీలా కాకుండా నేరుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరుపెట్టి, ‘‘ఆయన శాఖలో కాంట్రాక్టుల వ్యవహారం మీద జరిగిన గొడవే ఈ ఎన్టీవీ కథనానికి కారణం’’ అంటూ ఆ పత్రిక రాసింది.

దాన్ని ఖండిస్తూ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి, దీని వెనుక ఎవరున్నారో ఆ పత్రిక యజమానితోనే తేల్చుకుంటానని అన్నారు డిప్యూటీ సీఎం. తాను వైయస్సార్ మనిషిని కాబట్టే అలా రాసి ఉంటారంటూ మరో కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారాయన.

అటు ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ ఇంటికి గతంలో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా వెళ్లడాన్ని గుర్తు చేసిన బీఆర్ఎస్, ఈ కథనాల వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆరోపణలు చేస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ మంత్రులు, మీడియా, సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫొటో సోర్స్, https://www.facebook.com/

ఫొటో క్యాప్షన్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరోక్షంగా పేర్కొంటు ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

మొత్తంగా తెలంగాణ అధికార సర్కిళ్లలో ఇప్పుడిదే హాట్ టాపిక్.

గతంలో ఇటువంటి వివాదాలే సివిల్ సప్లైస్ శాఖలో ఉత్తమ్ పైనా, హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారంలో శ్రీధర్ పైనా, బొగ్గు ఆరోపణలు భట్టిపైనా, వ్యక్తిగత ఆరోపణలు కోమటిరెడ్డిపైనా వచ్చాయి.

ఇవన్నీ సాధారణంగా పత్రికలు రాసే వార్తలేనా లేక ప్రణాళికాబద్ధమా అన్నది తెలియదు.

తెలంగాణ మంత్రులు, మీడియా, సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫొటో సోర్స్, https://www.facebook.com/

ఫొటో క్యాప్షన్, మంత్రి మల్లు భట్టి విక్రమార్క

ఈ కథనాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.

ఆంధ్రజ్యోతి యాజమాన్యం ముఖ్యమంత్రి రేవంత్‌కి సన్నిహితం అనే ఆరోపణ చేస్తోంది బీఆర్ఎస్.

''డిప్యూటీ సీఎం స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి, దీని వెనుక ఎవరో ఉన్నారు అన్నారు. గతంలో దీపాదాస్ మున్షీ మీద, తరువాత మీనాక్షి నటరాజన్ మీద ఒక సెక్షన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రతిపక్షంపై మాట్లాడడం లేదంటూ గతంలో మంత్రుల మీద పత్రికల్లో కథనాలు వచ్చాయి. రేవంత్ రెడ్డి స్వయంగా రాధాకృష్ణగారి దగ్గరకు ప్రత్యేకంగా వెళ్లారు. అలాంటి రాధాకృష్ణ నుంచి ఉప ముఖ్యమంత్రిపై ఇటువంటి కథనం వస్తే, ముఖ్యమంత్రి బాధ్యత అదేనా? పంపకాల గొడవే దీనంతటికీ కారణం. తాజాగా ‘ఒక ఐఎఎస్ అధికారి నిద్రమాత్రలు మింగారు’ అని ఆంధ్రజ్యోతి రాసింది. దానిపై విచారణ చేస్తారా మరి?'' అని బీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్ ప్రశ్నించారు.

అయితే తమ మంత్రుల జోలికి రావద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను హెచ్చరించారు. ''మంత్రులపై ఏం రాసినా ముందు నన్ను సంప్రదించాలి'' అని ఆయన అన్నారు

అంతేకాదు, ''ఆంబోతుల పోరులో లేగదూడలు నలిగిపోతున్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఇలాంటి వివాదాలతో కాంగ్రెస్‌‌కు నష్టమేనని వ్యాఖ్యానించారు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి.

''తెలంగాణలో తెలుగుదేశం రాజకీయ ఆత్మహత్య చేసుకుంది. బీఆఎర్ఎస్‌ది కూడా ఒక రకంగా రాజకీయ ఆత్మహత్యే. ఇటువంటి ఘటనలతో ఇప్పడు కాంగ్రెస్ కూడా రాజకీయ ఆత్మహత్య చేసుకుంటోంది'' అన్నారు పాశం.

తెలంగాణ మంత్రులు, మీడియా, సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్‌లో ఇదంతా సాధారణ వ్యవహారమని రాజకీయ నిపుణులు అంటున్నారు.

అయితే, ఆ పార్టీలో ఇదంతా మామూలేనని ఓయూలో పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.

''కాంగ్రెస్‌లో రకరకాల గ్రూపులు ఉంటాయి. ఆ నాయకుల మధ్యగానీ, వారికి కావల్సిన, దక్కాల్సిన విషయాల మధ్యగానీ గొడవలు వచ్చినప్పుడు అవి బయటకు కనిపించేస్తాయి. మిగతా పార్టీల్లో అలా కాదు. ఇందిరా గాంధీ కాలంలో ఇక్కడ కాకుండా దిల్లీ వెళ్లి కొట్టుకునే వారు. కాబట్టి ఇదేమీ ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. కాకపోతే మొత్తం వ్యవహారంలోకి ఒక ఐఎఎస్ అధికారిని లాగడం సరికాదు. ఈ విషయంలో మీడియా తన విలువలను పాటించలేదు. నిజమైనా, అబద్ధమైనా వ్యక్తిగత అంశాలపై ఇష్టం వచ్చినట్టు రాసే అధికారం ఎవరికీ లేదు'' అన్నారు ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు.

అయితే ఈ మొత్తం వ్యవహారం టీ కప్పులో తుపానులా ముగిసిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు.

''ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలో దేశవ్యాప్తంగా చాలా చూశాం. కాకపోతే మధ్యలో అమాయక అధికారులు ఇబ్బందులు పడతారు'' అని వ్యాఖ్యానించారు పుల్లారావు.

దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయ మీడియా విభాగం స్పందించాల్సి ఉంది.

(2026 జనవరి 20న ప్రచురించిన ఈ కథనాన్ని బీబీసీ ఎడిటోరియల్ గైడ్‌లైన్స్‌ ప్రకారం కొన్ని మార్పులు చేసి, ఫిబ్రవరి 26న అప్‌డేట్ చేశాం.)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)